భారతమ్మ - గంగాధర్.వడ్లమన్నాటి .

bharatamma

తన కొడుకు ప్రయాణానికి కావాల్సినవన్నీ ఆదరా బాదరాగా సర్ది వరండాలో పెడుతోంది భారతమ్మ.ఆమెనీ, ఆమె హడావుడినీ గమనించిన ఇరుగు పొరుగు వారికి కాస్తంత ఆశ్చర్యం కలగక మానలేదు.అలాగే ఆమె ఇంటి ముందు నుండి నడిచి వెళ్ళే వారు కూడా, భారతమ్మకి గుండె ధైర్యం ఎక్కువే.పేరుకి తగ్గట్టుగా దేశబక్తి మెండే, అనుకుంటూ ముందుకు సాగారు వారు.భారతమ్మ ఎదురింట్లో ఉండే జగదాంబ, ఓ సారి బయటికి వచ్చి ,అక్కడ జరుగుతున్నదంతా తీరికగా చూసి, భర్త దగ్గరికి వెళ్ళి,చూసారా చోద్యం.ఆ భారతమ్మ ఏం చేస్తోందో?ఆశ్చర్యంగా భర్తకి ఎదురిల్లు చూపిస్తూ అంది.

ఆవిడ చేస్తోంది గర్వించదగ్గ విషయమేగా.అంటూ చదువుతున్న పత్రికలోంచి తల బయట పెట్టి,అయినా అప్పుడెప్పుడో ఆర్మీలో చేరిన ఆమె పెద్దకొడుకు, సరిహద్దు కాల్పుల్లో పోయాడని ,ఎప్పుడూ అదే జరుగుతుందా?అయినా ఈ కాలంలో కూడా పేగుబంధం కన్నా దేశబక్తికి విలువనిచ్చే ఇలాంటి నిశ్వార్ద భారతమ్మలు ఎంతమంది ఉంటారే.చెప్పాడు సుబ్బారావ్ .

ఏడ్చినట్టే ఉంది మీ వాదన.ఆమె పెద్ద బిడ్డని దేశం కోసం ,భర్తకిచ్చిన మాట అంటూ మిలట్రీకి పంపి పోగొట్టుకుంది సరే.కానీ రెండో కొడుకుని కూడా ఎందుకూ అని! అసలీమెకి కడుపు తీపి ఉందో లేదో అనే సందేహం కలుగుతుంది నాకు. అందుకే కాబోలు ఆవిడ ఆఖరి కొడుక్కి పుట్టుకతోనే కురచ కాలు ఇచ్చాడు దేవుడు. దాంతో వాడికి ఈ గొడవ తప్పింది.లేదంటే వాడ్ని కూడా చిన్నప్పటి నుండీ ఆర్మీకి ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి ,వాడ్ని కూడా సాగనంపేసేది.పాపం ఆ ఆఖరివాడు తిలక్ కి వాళ్ళ అన్నయ్య సుభాష్ అంటే ఎంతో ఇష్టం.అతను ఇలా సడన్ గా ఆర్మీ ట్రైనింగ్ కి వెళ్లిపోతుండడంతో బాగా డల్ అయిపోయాడు. స్కూల్కి కూడా సరిగా వెళ్లట్లేదని విన్నాను.అలాగే నేనూ ఓ నాల్రోజుల నుండి చూస్తున్నానుగా.ఇదివరకటి హుషారే లేదు వాడిలో.చెప్పిందామె.

చాల్లేవే చెప్పొచ్చావ్. ఇదిగో తోక అంటే అదిగో పులి అంటావ్.నిన్ను మార్చలేo అంటూ మళ్ళీ వార పత్రికలో దూరిపోయాడు. కొద్ది సేపటికి, స్టేషన్ కి వెళ్లడానికి గాను ,నెట్ లో బుక్ చేయబడిన ఓ అద్దె టాక్సీ వచ్చి ఆగింది భారతమ్మ ఇంటి ముందు.ఆ కేబ్ ని చూస్తూనే, అమ్మా ,అన్నయ్య బయలుదేరాల్సిన టాక్సీ వచ్చేసింది చెప్పాడు తిలక్, ఆ కారు వద్దకు నడిచి వెళుతూ.ఆ కేక విన్న సుభాష్,భారతమ్మలు ,చేతిలో పెద్ద,పెద్ద బ్యాగులతో బయటకు వచ్చారు.సుభాష్ ,ఇరుగు,పొరుగు వారికి వెళ్ళి వస్తానని చెప్పి ,కార్ ఎక్కాడు.అతనితో పాటు ,అతని స్నేహితుడూ, తల్లి,తమ్ముడు తిలక్ లు కూడా కార్ లో బయలుదేరారు.కారులో సుబాష్ తో అందరూ మాట్లాడుతున్నా ,తిలక్ మాత్రం చాలా మౌనంగా ఉండిపోవడం భారతమ్మకి ఎంతో ఆశ్చర్యం కలిగించింది.సరిగ్గా పదిహేను నిమిషాల్లో కార్ రైల్వే స్టేషన్ లో ఆగింది.అప్పటికే ట్రైన్ వచ్చినట్టుగా అనౌన్సుమెంట్ అవుతుండడంతో ,గబ,గబా, ఫ్లాట్ఫారమ్ మీదకి వచ్చి,తన రిసెర్వెడ్ బోగీలో ఎక్కి,అమ్మా వస్తాను. చెప్పాడతను. ప్రేమ నిండిన కళ్ళతో.భారతమ్మ కూడా నెమ్మదిగా బోగీకి దగ్గరగా నడిచి వస్తూ ,తిలక్ వంక చూసింది.అతనిలో ఏదో ప్రస్పుటమైన మార్పుని స్పష్టంగా గమనించిందామె.పోయిన సారి వాళ్ళ పెద్దన్నయ ఆర్మీ లో చేరడానికి వెళ్తున్నపుడు కూడా తిలక్ వచ్చాడు.

కానీ అప్పుడు అతనిలో ఉన్న ఉత్సాహం,ఆ చిరు నవ్వు,ప్రశాంతత ఇప్పుడతనిలో మచ్చుకైనా లేవు. అతని చూపులు, పెద్దన్నయని కూడా ఇలానే ఆర్మీలోకి పంపి పోగుట్టుకున్నాం, మళ్ళీ చిన్నన్నయని కూడా మళ్ళీ అదే ఆర్మీ లోకి పంపాలా అమ్మా అని అడిగినట్టు తోచిందామెకు.దాంతో ఆమెకి తన గతం జ్ఞప్తికి రాసాగింది.అవును, అప్పుడు నా పెద్ద కొడుకు ఆర్మీ లో చేరతాననగానే తల్లిగా చాలా సంతోష పడ్డాను.చిన్నప్పటినుండి దేశానికి సేవ చేయడం కన్నా గొప్ప పని మరోటి లేదని చెప్పిన మాటలు,వాళ్ళ నాన్నగారు ఆర్మీ లో సాదించిన విజయాల్ని కథలుగా నా కొడుక్కి నూరిపోసేదాన్ని.అవి వంటబట్టినందుకు సంతసించాను.ఆర్మీ లో చనిపోయిన నా భర్తకిచ్చిన మాటని నెరవేరుస్తున్నందుకు ఈ దేశ ఆడపడచుగా గర్వపడ్డాను.కానీ ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో జరిగిన నిరంతర కాల్పుల్లో నా పెద్ద బిడ్డని పోగొట్టుకున్నాను.

నవ్వుతూ వెళ్ళిన నా కొడుకు చెక్క పెట్టెలో కట్టెముక్కలా పరుండి రావడం నా కన్న పేగుకి కష్టమనిపించినా,దేశ భద్రతకీ,శత్రు నాశనానికీ ప్రాణమొడ్డిన వీర జవాన్ ని కన్నానన్న ఆత్మ సంతృప్తి కలిగింది నాకు.అప్పుడు కూడా తిలక్ చాలా నిబ్బరం గా ఉన్నాడు.భగత్ అమర్ రహే అంటున్న వాళ్ళతో తను కూడా గొంతు కలిపాడు.అప్పుడు అనిపించింది నా బిడ్డలు వీరులు అని.కానీ అప్పుడు అతనిలో ఉన్న ఆ నిబ్బరం ఇప్పుడేమైంది.చిన్నన్నయని కూడా ఆర్మీకి పంపుతున్నానని నా పై కోపం గాని వచ్చిందా.లేదా తనకి ఉన్న ఒకే ఒక తోడు అన్నయ్య. తమ్ముడూ,తమ్ముడూ అంటూ పిలుస్తూ, సరదాగా కబుర్లు చెప్పే అన్నయ్య. సాయంత్రం వేళల్లో ,రా తమ్ముడు అని సినిమాకో షికారుకో తీసుకెళ్లే అన్నయ్య.స్కూల్ కి సైకిల్ పై దిగబెట్టే అన్నయ్య.అలాంటి అన్నయని తనకి దూరం చేశానని భాధ పడుతున్నాడా.అనే సందిగ్ధం లో ఆమె ఆలోచిస్తుండగానే, సిగ్నల్ పడ్డట్టుగా రైలు కూత పెట్టడంతో,ఒక్కసారిగా ఆలోచనల్లోంచి తేరుకుని ,రైలు బోగీ లో ఉన్న కొడుకు సుభాష్ దగ్గరకి వెళ్ళి,వేళకి బోంచెయ్యి నాయనా.ఆరోగ్యం జాగ్రత్త.దేశ రక్షణకి వెళ్తున్నావ్.నాకు చాలా గర్వంగా ఉంది నాయనా. వీలైతే ఫోన్ చేస్తుండు.చెప్పిందామె .

అలాగేనమ్మా.నీ ఆరోగ్యం జాగ్రత్త.డాక్టర్ గారు చెప్పిన మందులు క్రమం తప్పక వేసుకో.ఒరేయ్ గోపి, వస్తాను.మన ఫ్రెండ్స్ అందరినీ అడిగానని చెప్పు.తమ్ముడూ బా చదువు.సెవెన్త్ పరీక్షలు బాగా రాయి.అని అతను చెప్తుండగానే బండి కదిలి స్పీడందుకుంది.
తిలక్ మాత్రం ఇంకా బండి వెళ్ళిన వైపే మౌనంగా చూస్తున్నాడు.అతన్ని గమనించిన తల్లి భారతమ్మ, అతని బుజo పై చేయి వేసి,నాన్నా తిలక్ ఏం ఆలోచిస్తున్నావ్.మీ పెద్దన్నయని నీకు దూరం చేసింది చాలక,ఇప్పుడు ఈ అన్నయని కూడా ఇలా ఆర్మీ లోకి పంపుతున్నానని నాపై కోపంగా ఉందా నాన్నా.అడిగిందామె.అతని కళ్లలోకి చూస్తూ.

లేదమ్మా.నాకు ఈ కాలు కురచ కాకపోయుంటే ,నేను కూడా ,అన్నయ్యల్లా మిలట్రీ లో చేరి ,నీకు రెట్టింపు ఆనందం కలిగించేవాడ్ని.అలాగే, నువ్వు నాన్నకిచ్చిన మాట కూడా పూర్తిగా నెరవేరేది కదా అని ఆలోచిస్తున్నానమ్మా.చెప్పాడు తిలక్, తన చిన్నపుడు ,ఇద్దరన్నయ్యలతో పాటు ,తనకి కూడా చేతిపై వేయించిన జై జవాన్ అనే పచ్చబొట్టు వంక ధీర్ఘంగా చూస్తూ.దాంతో ఆమె కళ్ళు,ఒక్కసారిగా చెమర్చాయి.అతన్ని గుండెలకి హత్తుకుంది .చాలా గర్వంగా ఉంది నాన్నా అని చెబుదామన్నా గొంతు పెగల్లేదు. గుండె బరువుగా అనిపించింది. తన పెంపకం తప్పుకాలేదన్న సంతోషం ఒక పక్క.తన పెంపకంలో పెరిగిన బిడ్డని ఇలా తప్పుగా అర్దం చేసుకున్నానే అనే బాధ మరో పక్క.దాంతో ఆమె గొంతు మూగబోయింది. అతని చేతిపై గల జై జవాన్ పచ్చబొట్టుని ప్రేమగా ముద్దాడింది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు