రెడ్డమ్మ - వారణాసి భానుమూర్తి రావు

reddamma

''రెడ్డమ్మా! బాగున్నావా?''

పేరు పెట్టి పిలిచింది ఎవరా అని వెనక్కి తిరిగి చూసింది రెడ్డమ్మ .

''నువ్వా ... బాగున్నావా బావా ? ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి ... ''

''దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది కదా ? '' అన్నాను నేను .

''అవును ''.. ఆమె కళ్ళల్లో కన్నీరు ... దాచడానికి ప్రయత్నిస్తోంది.

నాకు గూడా ఆమెను చూసిన వెంటనే మనసంతా బాధగా ఉంది .

''మోహన్ ... పిల్లలు ఎలా ఉన్నారు ?''

''అంతా బాగానే ఉన్నారు .. ఎప్పడు వచ్చావు నువ్వు హైదరాబాద్ నుండి ? ''

తిరుపతికి పని మీద వచ్చాను . అలాగే స్వామి దర్శనం చేసుకొని , నువ్వు ఎలా ఉన్నావో అని చూసి పోవడానికి వచ్చాను.

''భోజనం చేసి వెళ్ళాలి. ఆయన గూడా కొంత సేపట్లో వస్తారు . పిల్లలు స్కూల్ కె వెళ్లారు ''

''ఆబ్బే .. పరవా లేదు. . ''

రెడ్డమ్మ నాకు మేనత్త కూతురే అవుతుంది . మా నాన్న చెల్లెలి కూతురు. వరసకి మరదలు. మేమంతా చిన్నప్పుడు మా పల్లెలో పక్క పక్క ఇళ్లల్లో ఉండే వాళ్ళం , రోజంతా స్కూల్ కి వెళ్లడం , సాయంకాలం ఆడు కోవడం , పొలాల వెంబడి గంతు లెయ్యడం ,చెట్లు ఎక్కి కోతి కొమ్మచ్చి ఆడడం .. ఇలా మా బాల్యం గడచి పోయింది .

రెడ్డమ్మ ఎంత అందంగా ఉండేది అంటే .. పల్లెలోని వాళ్లంతా ఆమెను నిలబడి చూసే వాళ్ళు. ఒక సారైనా ఆమెతో మాట్లాడాలని ఉవ్విళ్లూరే వారు. ముఖంలో తరగని చిరు నవ్వు, మెరిసే విశాల మైన కళ్ళు, చక్కటి గుండ్రని ముఖం. ఏ దేవతో తప్పయి ఈ పల్లెలో పుట్టిందా అనిపించేది. నా మరదలు అయినందుకు ఊర్లో వాళ్ళు నన్ను గేలి పట్టిచ్చే వారు. ''నీకేమోయ్ .. రంభ లాంటి పెళ్ళాం రెడీ గా ఉంది అనే వాళ్ళు''. నేను గూడా రెడ్డమ్మ ను పెళ్లి చేసు కోవాలని కలలు కనే వాడిని. కానీ ఏనాడూ హద్దు మీరి ప్రవర్తించింది లేదు . స్కూల్ కి వెళ్లి ఇంటికి వచ్చేంత వరకు ఆమెకు బాడీ గార్డ్ గా ఉండే వాడిని.

రెడ్డమ్మ ఇపుడు కృశించి పోయిన ముఖం తో చాలా అనారోగ్యంగా ఉంది . ఆమె ముఖంలో ఆ కళ లేదు. కళ్ళు తేలి పోయి నట్లు నిర్జీవంగా ఉన్నాయి. ముఖంలో న్యుమోనియా రోగం వచ్చినట్లు పాలిపోయింది. సరయిన ఆహారం , విశ్రాంతి లేనందు వలనో, లేదా కుటుంబ పరిస్థితుల వల్లనేమో ఆమె అనారోగ్యంగా ఉంది .

ఇల్లు చాలా ఇరుకిరుగా ఉంది. ఒక హాల్ , ఒక కిచెన్ తప్ప ఏమి లేదు. అంత పెద్ద భూస్వామి కొడుక్కిచ్చి పెళ్లి చేసాడు మా మామయ్య . వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి చలించి పొయ్యాను.

''ఎందు కిలా అయి పోయావు ? ఎంత చక్కగా ఉండే దానివి ?''

రెడ్డమ్మ పద్మావతి ఉమెన్స్ కాలేజ్ లో బి ఏ లో చేరినపుడు , నేను బీకామ్ లో చేరాను శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో .ఆక్కడే సరదాగా అప్పుడప్పుడు కలిసే వాళ్ళం .

రెడ్డమ్మ నాన్న గారు పెద్ద భూస్వామి. దాదాపు నూరు ఎకరాలు భూములు ఉండేవి . ఇల్లంతా సందడిగా ఉండేది. ఎక్కడ చూసినా పాడి పంటలే వాళ్ళ ఇంట్లో .

రెడ్డమ్మ ఐఏఎస్ చదివి కలేక్టర్ గావాలని ఉవ్విళ్లూరేది. నేను గూడా చాలా ఎంకరేజ్ చేసే వాడ్ని. దానికి తగ్గట్లే అన్ని విషయాల్లోనూ చాలా చురుగ్గా ఉండేది . మార్కుల్లో క్లాసులో ఫస్ట్ వచ్చేది .

ఒక రోజు రెడ్డమ్మ నా దగ్గరికి వచ్చింది.

ఆమె ముఖంలో ఏదో టెన్షన్ ప్రస్ఫుట మవుతోంది .

''బావా ....''నన్ను చూడ గానే ఏడ్చేసింది .

''ఏమయింది ''అన్నాను నేను .

నాన్న నాకు పెళ్లి సంబంధం ఖాయం చేశారు . నేను పెళ్లి చేసుకోను అంటే గూడా ఒప్పు కోలేదు . అధికార పార్టీ ఎం ఎల్ ఏ గారి చెల్లెలి కొడుకంట.. నాకేమో బి ఏ తరువాత ఐఏఎస్ చేయాలని ఉంది .

ఇటీవల మా మామయ్య విల్లెజ్ సర్పంచ్ అయిన కాడ్నుంచి ఆయన తీరే మారి పోయింది . ఆయన మాటల్లో దర్పం పెరిగింది . నాకు చాలా బాధ వేసింది. ఇద్దరం సెటిల్ ఆయిన్ తర్వాత నేనే రెడ్డమ్మ ను పెళ్లి చేసు కోవాలను కొన్నా . గ్రాడ్యు యేషన్ ఆయిన తర్వాత నేను సి ఏ లోనూ , తాను ఐఏఎస్ చేయాలని అను కొన్నాము .

''మరి నేను మాట్లాడనా ? ''

''మాట్లాడు ''

సరే నని , మొబైల్ తీసు కొని వాళ్ళ నాన్నతో మాట్లాడాను. నాకు కళ్ళు తిరిగి బైర్లు కమ్మి నట్లయింది ఆయన మాటలు విన్నాక .''ఒరేయ్ రామ్ నారాయణ .. రెడ్డమ్మ ను నీ కెపుడు ఇస్తామని అనుకోలేదు. అసలు నువ్వెంత .. నీ స్థాయి ఎంత .. పోనీ నీ కాడ అన్ని ఆస్తులు ,అంతస్తులు ఉన్నాయా .. నువ్వు రేపో మాపో ఏదో క్లర్క్ అయిన తరువాత నీ చేతుల్లో పెడితే మా అమ్మి సుఖ పడుతుందా . రెడ్డమ్మ సంగతి మరచిపో .. లేదంటే మీ అమ్మ నాన్న కు మూడు తుంది నా దగ్గర ..'' అన్నాడు ఆయన కటువు గానే. అయన గర్వాన్ని , ఆ మాటల్లో ఉన్న హేళన విన్న రెడ్డమ్మ కన్నీరు మున్నీరుగ ఏడ్చింది .

''ఇప్పుడెట్లా బావ .. నాన్న కర్ణ కఠోరకుడు .. ఆయన ఒకడు చెప్పింది వినడు గదా. .?''

''ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసు కొందామా బావా ? ఎక్కడి కయినా పారి పోదామా ? నేను నిన్ను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను బావా !'' అని నా చేతుల్ని పట్టుకొని చిన్న పిల్ల లా ఏడ్చింది .

నా కంత దైర్యం లేదు . పారి పోయి పెళ్లి చేసుకొంటే మా శవాలను చూసే దాకా మా మామ నిద్ర పోడు . ఆయన సంగతి నాకు తెలుసు . రెడ్డమ్మ కు ధైర్యం చెప్పినాను. జరిగేది జరగక మానదు అని చెప్పాను .

రెడ్డమ్మకు ఇష్టం లేక పోయినా , ఆమె ఆ ఎమ్మెల్యే సంబంధం కట్ట బెట్టాడు వాళ్ళ నాన్న. అలా రెడ్డమ్మ కన్న కలల్ని వాళ్ళ నాన్న మంకు తనం వాళ్ళ కల్లలయి పొయ్యాయి.

మా మామయ్య చని పోయిన తర్వాత రెడ్డమ్మ సంసారం బాగానే గడిచింది కొన్ని రోజులు . గానీ మోహన్ పేకాట , హార్స్ రేస్ లలో చాలా డబ్బు పోగొట్టు కొన్నాడని రెడ్డమ్మ చెప్పింది. ఆస్తులన్నీ కరిగి పొయ్యాక, ఉన్న పొలాల్లో అంత ఫలసాయం రాక పోవడం వల్ల , ఏదో కాంట్రాక్టర్ దగ్గర చిన్న ఉద్యోగం వెలగ బెడుతున్నాడు మోహన్ తిరుపతిలో .

నేను మా మామయ్య చేసిన అవమానంతో కసిగా చదివి బీకామ్ తర్వాత సి ఏ లో చేరి అన్ని ఫస్ట్ అట్టెంప్ట్ లో పాస్ అయి , అకౌంటెంట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను . నేను ఆర్థికంగా బాగా సంపాయిస్తు బాగా సెటిల్ అయ్యాను హైదరాబాద్ లో .
మోహన్ వచ్చాక ఇద్దరం లంచ్ చేసాము. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడ లేక పోతున్నాడు మోహన్ . ఏదో అన్యాయం చేసినట్లుగా ఫీల్ అయి పోతున్నాడు .

''మోహన్ .. అంతా ఓకే గదా. .''

''అసలేం బాగా లేదు రామ్ . తెలిసి తెలిసి జీవితాన్ని నాశనం చేసుకొన్నాను . అంతే గాకుండా రెడ్డమ్మ జీవితాన్ని నాశనం చేసాను. ఆడ పిల్లల జీవితాలతో ఆడు కోగూడదు రామ్ '' అన్నాడు మోహన్ .

''నువ్వేం తప్పు చెయ్యలేదు .. అది వాళ్ళ నాన్న చేసిన తప్పు. '' అన్నాను నేను .

''అవును రామ్ . అడ పిల్ల తల్లి తండ్రులు పెళ్లి పెళ్లి అని వాళ్ళ జీవితాల్ని నాశనం చెయ్య గూడదు . వాళ్ళను బాగా చదివించి , వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు పెళ్లి ప్రస్తావన తేగూడదు . ఈ పితృ స్వామ్య వ్యవస్థలో ఆడపిల్ల ల జీవితాల్ని మనం నాశనం చేస్తున్నాము . లక్షణంగా చదివి ఐఏఎస్ కావలసిన రెడ్డమ్మను ఇలా చేసాను. ''అన్నాడు మోహన్ .

''అవును. నా ఇద్దరు ఆడ పిల్లల్ని నేను అలాగే పెంచుతాను. వాళ్ళను బాగా చదివించి వాళ్లు ఆర్థికంగా నిలబడిన తరువాతే పెళ్లి. అది గూడా వాళ్లకు నచ్చిన పిల్లవాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను. '' అన్నాడు మోహన్ మళ్ళీ .

''అవును .. మోహన్ మనం తప్పని సరిగా మారాలి. మన పెద్ద వాళ్ళు చేసిన తప్పులే మనం చెయ్యగూడదు . ఆడపిల్లల జీవితాలను తల్లి తండ్రులుగా మనమే నాశనం చెయ్య కూడదు.మన తరంలో ఆయినా ఆడ పిల్లలు , మగ పిల్లలు అనే తేడా లేకుండా వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించాలి. వాళ్ళ ఆశల్ని , ఆశయాల్ని తెలుసు కొని దానికి తగ్గట్లుగా తల్లి తండ్రులు బాధ్యతగా ప్రవర్తించాలి. ఆడ పిల్లలు సంఘంలో తలెత్తుకు తిరిగేలా వాళ్ళను తీర్చి దిద్దాలి.'' అన్నాను నేను మోహన్ భుజం తడుతూ . బరువైన హృదయంతో లేచి బయలు దేరాను.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు