బైక్ సర్వీసింగ్ కి ఇవ్వడంతో, ఆటోలో ఇంటికి బయలుదేరాడు శంతన్.ఇంటికెళ్తున్నాడనే మాటేగానీ అతని మనసంతా కూరగాయల సంతలా చాలా హడావుడిగా ఉంది.చేతులు నలుపుకుంటూ,మా మావగారు మా ఇంటికి వచ్చేసుంటారా?లలిత ఆయనతో పాటు పుట్టింటికి వెళ్లిపోయుంటుందా.?దేవుడా నువ్వే దిక్కు, అని అనుకుంటుండగానే, ఇల్లు వచ్చేసింది.అ, ఆ .ఇక్కడే ఆపు.అంటూ ఆటొ దిగి,ఆటొ అతనికి డబ్బులిచ్చి ,ఇంట్లోకి నడిచాడు.అనుకున్న విధంగానే అనుకున్నదంతా అయింది.అప్పటికే అతని మావగారు,దివానీ కాట్ పై యాంగ్రి క్యాట్లా కూర్చుని ఉన్నాడు.లలిత కూడా అతని పక్కనే ఇంకా కోపంగా కూర్చుని ఉంది.తినేసేలా ఒక చూపు చూసి తల తిప్పేసింది.ఆమె పక్కనే బట్టలు సర్దేసిన ట్రావెల్స్ బ్యాగ్ కూడా ఉంది.శంతన్, ఓ గుటక మింగి ఎప్పుడొచ్చారు మావయ్య.అంతా కులాసానా,అడిగాడు పలకరింపుగా.
ఏం కులాసా,అంతా లాసే అల్లుడూ నా వ్యాపారంలో.ఇంతకీ నేను వచ్చిన విషయమేంటంటే ,మా అమ్మాయి నాకు ఫోన్ చేసి అర్జెంట్ గా వచ్చి తనని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్లమంది.నీతో వేగలేను,ఉడకలేను అంటోంది.ఇక నీకు వండిపెట్టడం,నీతో ఉండిపెట్టడం తన వల్ల కాదంటోంది.నీతో తెగదెంపులు కావాలంటోంది.కానీ మీ మధ్య ఈ రణానికి కారణం మాత్రం చెప్పలేదు. అల్లుడు తిడుతున్నాడా అంటే లేదంది.కొడుతున్నాడా అంటే కాదంది.పోనీ వ్యసనాలేమైనా అంటే లేవంది.మరి ఎంటమ్మా అంటే చెప్పదూ. అంటూ ధీర్ఘo తీస్తూ లలిత వంక చూశారు మూర్తిగారు.
అబ్బా,నాన్నా అలా చూడకు. అలాంటివేం కాదు.పైగా ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు.కాకపోతే ఆయనికి శకునాల పిచ్చి.ఆ పిచ్చితోనే ఆయన నాకు పిచ్చి కోపం తెప్పిస్తున్నారు.అందుకే ఇక ఆయన శకునాల పైత్యం భరించడం నా వల్ల కాదు.ఆఖరికి, ఆయన్ని ఎవరో షార్ట్ గా శకుని అని పిలిచినపుడు, ఆయనకి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ వచ్చిందని, ఆయన పేరు శంతన్ కుమార్ నివాస్ ని శకునిగా షార్ట్ చేసుకున్నారు. చెప్పిందామె,అసహనంగా.
అది విన్న మూర్తి గారు, తేలిగ్గా ఓ నవ్వు నవ్వి, ఓర్నీ,దీనికామ్మా నువ్వు ఇంతలా ఇదైపోయింది.ఇంకా నేను అనవసరంగా ఆతృత పడ్డాను.చెప్పాడాయన నిదానపడుతూ.
అదేంటి నాన్నా! నేను ఇంత భారంగా చెప్తుంటే ,నువ్వు అంత తేలికగా తీసేస్తావ్.అయినా వింటే ఏం తెలుస్తుందీ,కంటే కదా పురిటి నొప్పి తెలిసేదీ అని.నీకు చెప్పి వృధా చెప్పిందామె,ఉక్రోషంగా.
అంతేలేమ్మా.భూదేవంత ఓర్పూ ,బూందీ అంత మెత్తని మనసు ఉన్న నీ సహనాన్నే పరీక్షించిన ఆ శకునాల సంగతేంటో నాకూ చెప్పమ్మా.అసలు,తప్పు నీదో ,అల్లుడితో ఇట్టే తేల్చేస్తాను.చెప్పాడాయన నిక్కచ్చిగా.
అయితే నేను చక,చకా చెప్తాను.నువ్వు టక,టకా విన్నాన్నా.ఓ నెల్రోజుల క్రితం,ఏవండీ చిట్టీ పాడండీ.నాలుగు రూపాయల వడ్డీ అప్పు తీర్చేద్దాo.అనవసరంగా నెలకి ఊరికే బోలెడు వడ్డీ పోతోందని నేను అనగానే,ఆయన దేభ్యపు మొహంతో ,సందేహంగా శూన్యంలోకి చూస్తూ,ఇప్పుడు చిట్ పాడాలంటావా,అవసరమా అని అంటుండగానే ఆయన ఎడమ కన్ను టప,టపా,టప ,టపా అదిరిందట.దాంతో అపశకునం,అపశకునం ఇప్పుడు పాడకూడదు.ఎడం కన్ను అదిరింది.అని గుడ్డిగా ఆ శకునం నమ్మి ,మడ్డిగా ,ఎడ్డిగా ఇంకా వడ్డీనే కడుతున్నారు.సరేలే.అని సరిపెట్టుకున్నాను.మరో రోజు కాకి ఇంటి ముందు అరిచిందనీ,కనుక చుట్టాలు చుట్టలుగా వచ్చి పడతారనీ ,అలా వస్తే తొందరగా పోరనే శకునం నమ్మి ఇంటి బయట తాళం పెట్టి ,వెనుక వైపు నుండి ఇంట్లోకి వచ్చారు.దరిద్రం ఏంటంటే ,ఆ రోజు నిజంగానే దూరపు చుట్టాలు వచ్చి ,తాళం చూసి వెనుదిరిగారు.దాంతో ఈయన గుడ్డి శకునాల నమ్మకం అడ్డూ అదుపూ లేకుండా ఇంకా బలపడింది.చెప్పిందామె,భారంగా.
అవునా.పెద్ద ఆశ్చర్యం ప్రకటించారు మూర్తిగారు.
అవున్నాన్నా.ఇదే కాక,మొన్నామధ్య దూరపు చుట్టరికం గల శాంతమ్మ పిన్నివాళ్ళమ్మాయి ఇక్కడికి ఓ ముఖ్యమైన ఇంటర్వ్యూ కోసం వచ్చింది.ఈయనే రైల్వే స్టేషన్ కి వెళ్ళి తీసుకొచ్చారు.నేను ఉన్న దాన్ని ఉండకుండా ఆటొలో ఎందుకూ?బావగారు నిన్ను ఇంటర్వ్యూ జరిగే చోట భద్రంగా దించుతారు అన్నాను.ఈయన కూడా అలాగే అన్నారు.తర్వాత కరెక్ట్ గా వీళ్ళు బయలుదేరే సమయానికి, ఓ నల్ల పిల్లి గుమ్మానికి ఎదురుగా వచ్చి కూర్చుంది.అంతే ,గుమ్మం దాటి వెళ్లబోతూ,ఏదో పెద్ద పులిని చూసినట్టు, వామ్మో అని పెద్ద రాకాసి కేకేసి ఓ గెంతు గెంతి ,వెనక్కి వచ్చేశారు.అపశకునం ,ఆ పిల్లి అక్కడినుండి వెళితే కానీ బయటకి అడుగు పెట్టనని ఇంట్లోకొచ్చేశారు.దాంతో నేనూ, ఆ అమ్మాయి ఎంత చెప్పినా, ఏం చెప్పినా వినలేదు.దాంతో ఆమె కోపగించుకొని ,రుస,రుసలాడిపోతూ ఆటొ ఎక్కి ఇంటర్వ్యూకి వెళ్లిపోయింది.అయితే ఇంతకు మునుపు ,ఆ పిల్లి నేను ఎంత బెదిరించినా ,కొంచెం కూడా కదలక పోవడానికి కారణం ,దాని కాలుపై ఏదో దెబ్బతగిలింది మరి.అందుకే కదల్లేదు.చెప్పిందామె నీరసంగా.
అయ్యో!అలాగా?ఇంతకీ ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి టైమ్ కి వెళ్ళిందామ్మా.అడిగారు మూర్తిగారు ఆశక్తిగా.
ఆ.ఆ.వెళ్లింది నాన్నా.కానీ ఇంటర్వ్యూకి మాత్రమే కాదు.అట్నుండి అటు అలాగే చెప్పా పెట్టకుండా వాళ్ళ ఊరు వెళ్లిపోయింది.తర్వాత నేను , ఓ భందువుల పెళ్ళిలో ఆమెని చూసి, పలకరించాలని ఎంత ప్రయత్నించినా,కనీసం ఆమె నా వంక చూడను కూడా చూడలేదు.నాకు ఎంతో అవమానం అనిపించిందంటే నమ్ము.అది నాన్నా ఈయన ఘనకార్యం.చిట పటలాడిపోయింది.
నువ్వు చెప్తుంటే అర్ధమయిందమ్మా.అల్లుడి పైత్యం ఎంతగా ముదిరిందో.అయినా ఇలాంటివి చూసీ ,చూడనట్టుంటే సరిపోయేదిగామ్మా. మధ్యలో నువ్వు ఎందుకు నీ కాపురం నాశనం చేసుకోవడం.నశ్చ చెప్పే ప్రయత్నం చేశాడాయన.అప్పటి నుండి ఇప్పటివరుకు అలాగే అనుకుంటూ వచ్చాన్నాన్నా ,కానీ ఆయన ఈ మధ్య మరీ అన్యాయమైపోతున్నారు.ఓ పక్షం రోజుల క్రితం,ఆయన ఆఫీసుకు వెళ్తుంటే,ఏదో శవం(ఊరేగింపు) ఎదొరిచ్చిందట.తర్వాత ఆయన ఆఫీసుకు వెళ్ళగానే ప్రమోషన్ రాబోతోందని చెప్పారట.దాంతో ఆయనకి ఆ శకునంపై బాగా గురి కుదిరి,ఇప్పుడు ఈ ఇల్లు ఏకంగా శ్మశానానికి దగ్గరగా తీసుకున్నారు.ఖర్మ.రోజూ డప్పు మోతలూ,ఏడుపులూ,పెడబొబ్బలూ వినలేక చస్తున్నానంటే నమ్ము నాన్నా.చెప్పిందామె,భయంగా గుటకలు మింగుతూ,తండ్రికి కొంచెం దగ్గరగా జరిగి కూర్చుని, ఇంకా వింటే ముక్కున వేలేసుకుంటావ్ .
ఆ తర్వాత, శవం ఎదురు రాని రోజు ఆఫీసుకు వెళ్ళేవారు కాదు.పోయిన వారం ఓ రోజు, బైక్ సడన్ గా ఆగి పోయిందట. దానికి కారణం,అంతకు ముందు ఆయన చూసుకోకుండా కాలితో తొక్కిన దిష్టి నిమ్మకాయ మూలంగానే అని నమ్మి, శాంతి పూజలు అని అయుదు వేలు తగలేశారు.అని లలిత చిత్రంగా తండ్రికి చెప్తుండగానే శంతన్ అడ్డుపడి, -అబ్బా లలితా.నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే.ఈ శకునాలూ అవీ ,ఇవీ అంతా ఉత్తిదేనని నేనూ ఈ మధ్యే తెలుసుకున్నాను.మదర్ ప్రోమిస్సు.అంటూ తలపై చేయి పెట్టుకున్నాడు.
అతని వంక కాసింత అనుమానంగా చూస్తూ,నేను నమ్మను.చందమామ నల్లగా,బొగ్గు తెల్లగా మారుతుందంటే నమ్ముతానేమోగానీ,మీరు శకునాలు నమ్మడం మానేశారని, మసి పూసి మారేడుకాయ మాటలు చెప్తే మాత్రం నేను నమ్మను.భహుశా నేను పుట్టింటికి పోతే,మీ వంట పనికో ,ఇంటి పనికో ఇబ్బంది అవుతుందేమోనని,ఇలా శకునాలు నమ్మడం మానేశానని అబద్దం చెబుతున్నారు.అంతేనా.అడిగిందామె.
నేను చెప్పేది నిజమే లలితా.అనుభవపూర్వకంగా తెలిసింది.కానీ నీతో చెప్పలేదు. రోజుకి ఒకటికి రెండు శవాలు ఎదురు చూసుకుని మరీ ఆఫీసుకు ఆలస్యంగా వెళ్తుండడంతో,వచ్చే ప్రమోషన్ ఆగిపోయింది.ఇక నా ఎడమ కన్ను అదిరిందని ,నీ మాటలు పక్కన పెట్టి చిట్ పాడటం వాయిదా వేశాను.దాంతో నెల జీతం పెద్దగా మిగలట్లేదు.పోయిన నెల వడ్డీ కూడా కట్టలేకపోయాను.దానికి గాను వాడితో నానా మాటలూ పడాల్సి వచ్చింది.అలాగే కాకి అరుపు విని ఎప్పటిలానే వీది తలుపుకి తాళం వేశాను.దాంతో నాకు వచ్చిన ఇంపోర్టెంట్ కొరిఎర్ మిస్ అయ్యాను.ఆ కారణంగా,అకారణంగా ఆఫీసు ఫారిన్ టూర్ ఛాన్స్ మిస్సయింది.కనుక ఇక నుండి ఆ శకునాల పిచ్చి నమ్మకానికి స్వస్తి చెప్పాను.నా బుద్ది లోపం సరిచేసుకుంటాను.ఇది నిజం.నువ్వు నన్ను మనస్ఫూర్తిగా నమ్మాలనే,ఇప్పటివరకూ నీ దగ్గర దాచినవన్నీ నీకు వివరంగా చెప్పాను.ఫాదర్ ప్రామిస్సు.చెప్పాడు శంతన్ చాలా నిజాయితీ గల స్వరంతో.
దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది లలిత. మూర్తి గారు కూడా సంతోషిస్తూ,బావుందల్లుడుగారూ,మూడత్వానికి పోయి,శకునాలు పాటిస్తే అదృష్టం వరిస్తుందనీ, పేరు మారిస్తేనో,ఊరు మారిస్తేనో ఏదో కలిసొస్తుందనీ,మన జీవితాల్లో ఏదో జరుగుతుందనీ గుడ్డిగా మూడ విధానాలకి లోబడి సంసారాలు ,జీవితాలు గుల్ల చేసుకునేవారు, మీలాగే మార్పు తెచ్చుకుoటే ఎంత బావుంటుంది చెప్పండి.అన్నాడాయన మధు ,లలితల బుజాలపై చేతులేసి,సంతోషంగా వారిని దగ్గరకి తీసుకుంటూ.