“ ఎవరూ చూడట్లేదు కదా ” అనుకుంటూ బెరుకు బెరుకుగా అటూ యిటూ రెండు మార్లు తల త్రిప్పి చూసి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత శీను చేతిలో ఏదో కవర్ ని పెట్టేసి వడి వడిగా అక్కడినుండి వెళ్ళిపోయింది సీతాలు.
అయితే యిదంతా ఎవరి కళ్ళల్లో పడకూడదని ఆమె కోరుకుందో ఆ మనిషి కంట పడనే పడింది.
సీతాలు భర్త రాముడు ఆ ప్రక్క వీధిలో వున్న ప్యాసింజర్ ని ఆటోలో ఎక్కించుకుని రోడ్డెక్కుతూ ఈ వ్యవహారమంతా చూడనే చూసాడు. వెంటనే ఆటో దిగి “ ఎవడే ఆడు “ అంటూ భార్యని నిలదీయాలనిపించినా ఆటోలో ప్యాసింజర్ కూర్చుని వుండడం మూలాన కోపాన్ని ఆపుకున్నాడు.
***
రాముడూ సీతాలుది ప్రేమ వివాహం. వారిరువురి కుటుంబాలూ రాజమండ్రి దగ్గరే వున్న ఒక ఊరిలో ప్రక్క ప్రక్క యిళ్ళల్లో వుండేవి. మొదట్లో బాగానే కలిసి వున్నా ఆ తరువాత ఆ రెండిళ్ళ మధ్యన వున్న కాంపౌండ్ గోడ విషయంలోనూ, దానికి ఆనుకుని వుండే మునిసిపాలిటి వారి నీటి కుళాయి విషయంలోనూ వచ్చిన చిన్న చిన్న తగాదాలే చిలికి చిలికి గాలి వానలా మారడంతో రెండు కుటుంబాలు ఒకరికొకరు బద్ధ శత్రువులైపోయారు.
అయితే కుటుంబాల మధ్యన వున్న వైరానికి అతీతంగా సీతాలు, రాముడు మాత్రం ఒకరినొకరు బాగా యిష్టపడ్డారు. ఆ యిష్టమే మెల్లిగా ప్రేమలోకి దిగడంతో ఒకరిని చూడకుండా మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. వీరిద్దరి ప్రేమవ్యవహారం తెలుస్తూనే పూనకమొచ్చినట్లుగా ఆవేశంతో ఊగిపోయిన వారి పెద్దలు వీళ్లిద్దరినీ విడదీసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు.
పెద్దల ఆగ్రహావేశాలకి తమ ప్రేమ ఎక్కడ బలవుతుందోనని భయపడిన రాముడు, సీతాలు వెంటనే ఊరవతల వున్న కోదండ రాముని గుళ్ళో మనువాడేసి ఆ తరువాత ఆశీర్వాదంకోసం పెద్దల ముందు మోకరిల్లారు.
మెళ్ళో దండలతో తమ ఎదురుగా నిలబడిన ఈ ప్రేమ జంటని చూసిన రెండు కుటుంబాలవారూ నిర్ఘాంతపోయారు. ఆ మరుక్షణమే ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే ఆవేశంతో రాముడి ని వంగదీసి అతని వీపు మీద తన పిడిగుద్దులు గుద్దసాగాడు సీతాలు అన్న వెంకటేశు.
మరో ప్రక్క సీతాలు ని జుట్టు పట్టుకుని లాగి వాతలు తేలేటట్టుగా ఆమె చెంపలని వాయించసాగింది రాముడి తల్లి రాజమ్మ. అది చూస్తూనే రాముడి రక్తం సలసలా మరిగిపోగా బావమరిది ముష్టిఘాతాల నుండి ఎలాగో తప్పించుకుని , పరిగెత్తుకుని వెళ్లి తన తల్లి చేతుల నుండి సీతాలుని విడిపించాడు.
***
అంత అవమానం జరిగిన తరువాత యిక ఆ ఊళ్ళో ఉండడానికి మనసొప్పక వాళ్ళిద్దరూ రాజమండ్రికి వచ్చేసి చిన్న యింటిని అద్దెకి తీసుకుని కాపురముండసాగారు. రాముడు ఆటోని అద్దెకి తీసుకుని నడుపుతుండగా , చుట్టుప్రక్కల వాళ్లకి కుట్టుమిషన్ మీద బట్టలు కుట్టసాగింది సీతాలు. అలా యిద్దరి సంపాదనతో వారికి రోజులు సుఖంగానే గడిచిపోతున్నాయి. అప్పుడప్పుడూ రాత్రుళ్ళు రాముడు ఒక చుక్క నోట్లో వేసుకుని యింటికి రావడం మినహాయిస్తే చిలకా గోరింకల్లాగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు ఆ ఆలుమగలు.
తనకి ఊహ రాకముందే తల్లిదండ్రులు చనిపోగా స్వంత కూతురికిమల్లే తనని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన అన్నావదినలు కళ్ళల్లో మెదులుతున్నా కూడా, తన అన్న చేతుల్లో జరిగిన పరాభవాన్ని రాముడు దాదాపు సంవత్సరం కావోస్తున్నా యింకా మర్చిపోకపోవడంతో మొగుడి ముందు తన వాళ్ళ ప్రస్తావనని తీసుకురావడానికే భయపడేది సీతాలు.
***
ప్రక్కింటి చిట్టి కి పరికిణి, జాకెట్టు కుట్టమని వాళ్ళ అమ్మ ప్రక్కింటి పార్వతి యిచ్చిన సిల్కు బట్టకి మ్యాచింగ్ లేసులని కొనితేవడానికని రోడ్డు మీద వున్న ఫాన్సీషాప్ కి బయలుదేరింది సీతాలు. యింటినుండి నాలుగడుగులు వేసిందో లేదో ప్రక్కసందులోని పాడుబడిన యింటి ముందర మొగుడి ఆటో కనబడడంతోటే హుషారుగా అటుకేసి నడిచింది.
అక్కడ ఆటోకి అటువేపున నిలబడ్డ రాముడి భుజం మీద చేయేసి యిరగబడి నవ్వుతున్న ఆడమనిషిని చూసి అవాక్కయింది సీతాలు. కాళ్ళకి హై హీల్స్, స్లీవ్ లెస్ జాకెట్టు ని ధరించి ఆధునికంగా వున్న ఆ ఆడది తన మొగుడితో అంత చనువుగా వుండడం ఆమె మనసులో ఏదో తెలీని గుబులుని కలిగించింది.
పరాయిఆడదానితో రాసుకుపూసుకుని మాట్లాడుతున్న మొగుడిని చూస్తూనే ‘ రాముడి గురించి పూర్తిగా తెలీకుండానే అయినోళ్ళందరినీ కాదని ఆడిని మనువాడి ఆడితోటి వొచ్చేసి తప్పు చేసానా ‘ అనిపించింది సీతాలుకి ఒక్క క్షణం. అంతలోనే మళ్ళీ ‘ ఛ ఛ , నా రాముడు అట్టాంటోడు కాదు. ఆడు బంగారం ‘ అంటూ తనకి తానే సర్ది చెప్పుకుంది.
“ నువ్వు మా యింటికాడకి రావొద్దే పిల్లా. సీతాలుకి అనుమానమొత్తాది. మళ్ళా ఈడే కలుద్దాం “ అంటూ ఆ ఆడదాని చేతుల్లో డబ్బులని పెడుతున్న మొగుడి మాటలని వింటూనే ఆమె కళ్ళు ఎరుపెక్కాయి. మొగుడే సర్వస్వం అనుకుని అందరినీ వదిలేసి వచ్చిన తనని అతనే మోసం చేస్తుండేటప్పటికి తనని గారాబంగా , కంటిపాపలా చూసుకున్న అన్నావదినలు గుర్తుకురాగా ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. నీళ్ళతో నిండిన ఆమె కళ్ళకి ఆ ఆడమనిషిని ఆటో లో ఎక్కించుకుని వెళ్తున్న రాముడి ఆటో మసకమసకగా కనిపిస్తుంటే చేష్టలుడిగినట్లుగా నిలబడిపోయింది.
ఆ రాత్రి కి ఆలస్యంగా యింటికి చేరుకున్న మొగుడి చేయి తన నడుంమీద పడగానే గట్టిగా విదిలించికొట్టింది సీతాలు.
“దీని సిగతరగ, ఏటయ్యింది దీనికియ్యాల? ఆడినెవడినో తగులుకుందిగా. యింకాడు తప్ప దీని కళ్ళకి నేనానను కామోసు “ అనుకున్న రాముడికి మనసంతా చేదు తిన్నట్లుగా అవడంతో ముసుగేసుకుని పడుకున్నాడు. ఉదయం నుండి రాత్రి దాకా ఆటో ని నడిపి బాగా అలిసిపోయాడేమో క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు.
“ ఆ టిప్పుటాపు షోకిల్లాకి మరిగాడుగా. యింక నాతో ఏం పని? అందుకే మరి ఒళ్ళెరక్కుండా తొంగున్నాడు “ అనుకుంటూ కోపంగా అటు తిరిగి పడుకుంది సీతాలు.
***
ఉదయం లేచి పనికి వెళ్ళడానికి తయారవుతున్న రాముడికి వంటింట్లో నుండి ఎత్తెత్తి పడేస్తున్నట్లుగా గిన్నెల శబ్దం పెద్దగా వినిపిస్తుంటే “ సీతాలుకి ముక్కు మీదే వుంటాది కోపం. కానీ దాని కోపం తాటాకు మంటల్లే ఎంటనే సల్లారిపోతాదే . మరీ తడవ ఏటైందో దీనికి “ అనుకున్నాడు మనసులో.
అంతలోనే సీతాలు నిన్న వేరే మగోడితో చనువుగా మసలడం గుర్తుకి రాగా “ ఒసేయ్ సీతాలూ “ అంటూ పెళ్ళాన్ని నిలదీయబోయేంతలోనే “ ఏరా రాముడూ , ఏటి ఆలస్యం ? బేగి రా. బేరం తెచ్చా “ అంటూ ప్రక్కింటి వీరేశం కేకేయడంతో బైటకెళ్ళిపోయాడు.
“ అయ్యో , రేతిరి కూడా బువ్వ పెట్టలేదాడికి. యిప్పుడు నాస్తా అయినా పెట్లేదే “ అనుకుంది సీతాలు.
మళ్ళా వెంటనే మొగుడు నిన్న వేరే ఆడదానితో సరసాలాడుతున్న దృశ్యం కళ్ళల్లో కదలడంతో “ ఆడు ఏరేదానితో కులుకుతూ ఖుషీ చూసుకుంటుంటే నేనేనా ఏడుస్తూ యింట్లో కూకునేది “ అనుకుంటూ గబగబా తయారై రోషంగా తనూ బైటకెళ్ళిపోయింది.
***
మిట్టమద్యాహ్నం వేళ పగలబడి నవ్వుకుంటూ శీనుతో కలిసి పెద్ద బజార్లో వున్న ఫోటో స్టూడియోలోకి వెళ్తున్న సీతాలుని చూసిన రాముడు ‘ నాయాల ఈ రోజు దీని సంగతి తేల్చేయాలి ‘ అనుకుంటూ ఆటో ని మార్కెట్ కి ఒక ప్రక్కగా ఆపి కోపంగా స్టూడియో వేపు రెండడుగులు వేసాడో లేదో “ ఏరా రాముడూ , చాన్నాళ్ళైందిరా నిన్ను సూసి. బాగున్నవురా ? చెల్లెమ్మ ఎట్లుంది? నన్ను కూసింత కొత్తగా కడుతున్న ఆ బిల్డింగ్ కాడ దింపరా “ అంటూ స్నేహితుడు కొండడు ఎదురవడంతో అతనితో పాటు ఆటోని పార్క్ చేసిన చోటికి నడిచాడు రాముడు.
***
బ్యాంకు నుండి బైటకొస్తున్నసీతాలుకి అప్పుడే బ్యాంకు ముందాగిన రాముడి ఆటోని, అందులోనుండి దిగుతున్న ఆడదాన్నీ చూస్తూనే కడుపు మండిపోయి వాళ్ళిద్దరినీ అలాగే చూస్తుండిపోయింది.
తనని చూసి పట్టుబడిపోయినట్లుగా ఉలుకూపలుకూ లేకుండా బ్యాంకు మెట్లమీదే నిలబడిపోయిన సీతాలునీ, దాని ప్రక్కనే వున్న మగోడినీ చూస్తూనే అరికాలి మంట నెత్తికెక్కింది రాముడికి.
అంతే , పట్టలేని ఆవేశంతో సీతాలుని జుట్టు పట్టుకుని లాగాడు.
“ ఎవడే ఆడు ? ఎంతకాలం నుండీ సాగుతోందీ యవ్వారం “ అంటూ సీతాలుని ఎడాపెడా కాళ్ళతో తంతూ అందిన చోటల్లా కొట్టసాగాడు. మధ్యలో అడ్డొచ్చిన శీనుకి కూడా కొన్ని దెబ్బలు తగిలాయి.
ఎలాగో రాముడి దెబ్బల నుండి అతికష్టం మీద తప్పించుకుంది సీతాలు.
“ ఆడు నా పెద్దమ్మ కొడుకు, శీను. పోయిన్నెలే దుబాయినుండి వొచ్చిండు. ఆడి కాడ బోల్డు దుడ్లున్నై. దుడ్లెట్టా కూడబెట్టాలో, ఆటిని ఎట్టా దాచాలో ఆడికి బాగా ఎరిక. నేను దుడ్లని యాడ దాచినా సరే ఎతుక్కుని తీసుకెళ్ళి త్రాగుడికి తగలేస్తావాయే నువ్వు. అందుకే బ్యాంకి లో దాసుకోమని నా చేత బ్యాంకి లో అకౌంట్ తెరిపిచ్చిండు మా అన్న. దుడ్లని ఎట్టాగో జమ చేసి మన పెళ్లి రోజుకల్లా నీకు సిల్కు జుబ్బా కొనాలని నేనేదో తంటాలడుతుంటే నీ గోలేందిరా మధ్యన? జబ్బలమీదికి జాకెట్టు ఏసుకుని , మొహానికి రంగేసుకుని టిప్పుటాపుగా తిరిగే ఈ సిగ్గూశరం లేనిదానితో యవ్వారం నడుపుతున్నది నువ్వు కాదూ, థూ నీ జిమ్మడ “ మొగుడిని ఛీత్కరించింది సీతాలు.
“ ఛీ ఛీ , ఏం నోరే నీది. అన్నాచెల్లెళ్ళకి రంకు అంటగడుతున్నవు . అది మా చిన్నాన్న బిడ్డ శాంత. బోల్డు సదువుకుని ఈ నడమే మునిసిపల్ ఆఫీసులో కొలువుకి చేరిందది “
“ అట్టయితే మరారోజు దానిచేతిల దుడ్లెడుతూ ‘ సీతాలుకి తెలీకుండా ఈడే కలుద్దాం ‘ అని దానికెందుకు చెప్పినవ్?” సీతాలు మాటలకి క్షణకాలం నివ్వెరపోయిన రాముడు పెద్దగా నవ్వేసాడు.
“ పిచ్చి మొద్దూ, నీకు చెంకీల చీర అంటే పిచ్చి మోజు కదే. మూడు దినాల్లో వస్తున్న మన పెళ్లి రోజుకి నీకట్టాంటి చీరని కొని తెమ్మని చెప్పి శాంత చేతికి డబ్బులిచ్చిన, ఆడోళ్ళ చీరెలు దానికైతే బాగా తెలుస్తయని “
మొగుడిని అనవసరంగా అనుమానించినందుకుగాను సిగ్గుపడింది సీతాలు. సీతమ్మలాంటి తన పెళ్ళాన్ని తప్పుగా అర్థంచేసుకోవడమే కాకుండా ఆమె మీద చేయి కూడా చేసుకున్నందుకు బాధపడ్డాడు రాముడు.
“ ఏమిటిది సీతాలూ, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని అనుమానించడం తప్పుకాదూ “ అంటూ హితవు చెప్పబోయిన చెల్లిని మధ్యలోనే అడ్డుకున్నాడు రాముడు.
“ సీతాలునొక్క మాటన్నా నేనొల్లను శాంతా. దాని తప్పేం లేదు. అసొంటి పరిస్థితుల్లో ఏ పెళ్లామైనా సరే అట్టాగే అనుకుంటాదిలే “ అన్నాడు పెళ్ళాంని వెనకేసుకునొస్తూ.
“ రాముడూ , కోపాన్ని అదుపులో పెట్టుకోవాలే గానీ ముందూ వెనకా ఆలోచించకుండా పెళ్ళాన్నలా గొడ్డుని బాదినట్లుగా బాదేస్తే తగలరాని చోట దెబ్బ తగిలిందంటే ప్రాణాలకే ప్రమాదం కదూ “ అని అంటున్న శీనుని ఆపేసింది సీతాలు.
“ ఊరుకో అన్నా, ఆడు నా మొగుడు. నన్ను కొడతాడు , సంపుతాడు, అది ఆడిష్టం . మా ఆలుమగల యవ్వారంలో నువ్వెందుకు తలదూరుస్తవ్? అయినా ఈళ్ళతో మనకేంటి రాముడూ , మనం పోదాం పా “ అంది సీతాలు.
వీళ్ళ మానానికి వీళ్ళని వదిలేసి చెట్టాపట్టాలేసుకుని చిలకాగోరింకలకిమల్లే ముచ్చట్లాడుకుంటూ వెళ్తున్న ఆ ఆలుమగలని చూసి ముక్కున వేలేసుకున్నారు శీను, శాంత.