“అమ్మే” సర్వాoతరయామి” - సుంకర వి. హనుమంత రావ్

amme sarvantaryami

“ఏయ్ రజినీ ! నాన్న ఫోనుచేసారు.అమ్మకసలు బాగోలేదని.హాస్పిటల్లో జాయిన్ చేసారట ..మనల్ని వెంటనే రమ్మని చెప్పారు.”

“మీరు వెళ్ళండి..యిద్దరo వెళ్ళాలంటే కుదరదు. బాచి గాడి స్కూల్ ?అర్చన ఎగ్జాం..”

“రెండు రోజుల్లో వచ్చేద్దాము.రెండు రోజులకి స్కూల్ అoటుకు పోదులే .నేను ప్రిన్సిపాల్ తో మాట్లాడుతాను.”

“మీరు ఎవరితోనూ మాట్లాడవలసిన అవసరం లేదు.పోయిన నెలా సీరియస్ అంటే వెళ్ళాము.అప్పుడే ప్రిన్సిపాల్ క్లాస్ పీకింది.”

“ఆపద వచ్చినపుడు ఆదుకోవాలి.ఈ పిల్లల చదువులు యెప్పుడు ఉండేవేగా?ముందు బయలుదేరు ..యిప్పుడు సెవెన్ అయ్యింది. టేనోక్లాక్ బస్సుకు వెళదాము.”

“మీరు లక్ష చెప్పండి.యిప్పుడు నావల్లకాదు. రేపు యింట్లో కిట్టీ పార్టీ వుంది.”

“పార్టి ముఖ్యమా ? అమ్మ ముఖ్యమా?”

“నాకదంతా తెలియదు.మీరు వెళ్ళండి.వాట్స్ యాప్ కాల్ చేయండి.”

“రజినీ !మరీ మూర్ఖంగా బిహేవ్ చేయకు. రెండురోజులేగా?”

“అదే నేనూ చెప్పేది.రెండు రోజుల భాగ్యానికి సకుటుంబ సమేతంగా వెళ్ళాలా?అర్చన ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతోంది.”

“దాని ఎగ్జామ్స్ మరో మూడు నెల్ల తరువాతిమాట. ప్లీజ్ నా మాట విను రజ్జీ..”

“రజ్జీ బజ్జి అని నాకేమీ బిస్కట్లు వేయొద్దుగానీ మీ అమ్మ సంగతి నాకు బాగా తెలుసు.పోయిన నెల సీరియస్ అంటే పిల్లా జెల్లతో పరుగెత్తాము.తీరా వెళ్ళి చూస్తే జ్వరం..మామూలు జ్వరం.రానూ పొనూ ఐదువేలు బొక్క.యిక్కడికీ రమ్మంటే బింకం .ఆపల్లెటూరు ..ఆ పాడు కొంపే స్వర్గం.ఆ స్వర్గంలోనే ...”

“యిప్పుడు అవన్నీఎందుకు.పాపం యెంత అవసరం వుందో..ఫోను చేశారు.”

“ఆ చేసారులెండి మహా ఫోను.చిన్నదానికి పెద్దదానికి ఫోన్లు తగలడి చచ్చాయి.ఫోనంట ఫోను.”

“రజినీ !ఎందుకు అలా నోరు పారేసుకుంటావు..అమ్మకు ఆపదవస్తే మనకు వచ్చినట్లు కాదా?”

“మనకు ఆపదొస్తే?ఈ పిల్లల చదువులు మన ఆర్ధిక యిబ్బoదులూ మనకు ఆపదలుకావా?”

“దానికి వాళ్ళేమి చేస్తారు?”

“మాటిమాటికి యిలా ఫోనులు చెయ్యకుండా ..మనబ్రతుకు మనల్ని బ్రతకనిస్తే చాలు.అదే మనకు కొండంత మేలు చేసినట్లు.”

“ఒప్పుకుంటాను.కానీ యిప్పుడు అమ్మకొచ్చిన ఆపదా మనవి ఒకటికావు.ప్రస్తుతం మనం వాదించుకొని బుర్రలు బద్దలు కొట్టుకునే టైo కాదు.”

“కదా?మరి తమరు నా బుర్ర ఎందుకు తింటున్నారో సెలవిస్తే తెలుసుకొని తరిస్తాను.”

“రజినీ ! కొంచెం కూల్ గా ఆలోచించు.యివ్వాళ అమ్మకొచ్చిన కష్టం రేపు నీకో నాకో రావచ్చు.ఒకరికొకరు తోడు లేకపోతే బాoధవ్యాలకూ బంధుత్వానికి అర్ధం ఉంటుందా?బంధనాలు లేని బ్రతుకులకి తెగిన గాలిపటాలికీ గమ్యం ఉంటుందా?”

“అయ్యా !వేదాంతం రాఘవయ్యగారూ!రాద్దాoతాలు ఆపి వాస్తవానికి రండి.ఈ చిన్న విషయానికి “బ” గుణింతం బట్టిపెట్టించే ప్రయత్నం విరమించుకొని బట్టలు సర్దుకొని బయలుదేరితే బాగుంటుంది.”

“నేను ఒక్కడిని వెళ్ళాననుకో వూరు వూరంతా ముఖంమీద వుమ్మేస్తుంది.నువ్వు కనిపించకాపోతే నానా రకాలుగా అనుకుంటారు.”

“ఎవరో ఏదో అనుకుంటారని నేను రావాలా?”

“అనుకుంటారనికాదు.ప్రతి పనికీ ఒక హద్దు వుంటుంది . అలాగే ఆత్మీయులను ఆదుకోడానికి కూడా ఒక పద్ధతి వుంటుంది. అమ్మా కూతుళ్ళమధ్య ..అత్తా కోడళ్ళమధ్య అన్నాతమ్ముళ్ళమధ్య ..”

“అక్కాచెల్లెళ్ళ మధ్య .. ఇంకా దండకం చదవండి మహానుభావా!ఆపకండి.బస్సు మిస్సయ్యే దాకా మీయిష్టం.”

“అయితే రానంటావు.బాధ పడతావు.ఆలోచించుకో.”

“ఇక్కడ చిoచు కోనేది ఏమీలేదు. ఆ చిoచు కోనేది ఏదో తమరే చిoచుకోండి.కిచన్ లో కత్తెరవుంది. తెమ్మంటారా?”

“ఈమధ్య మరీ సోక్రటీస్ భార్యవైపోయావు.”

“నేనేమీ మారలేదు.మారలేను కూడా.కట్టించుకున్న పాపానికి నేను ఎప్పటికీ మీ భార్యనే.”

“ఇంట్లో మనీ ఎoతవుంది?”

“కట్టలే కట్టలు.సూట్ కేసులో పెట్టనా?బ్యాగ్ లో కుక్కనా?”

“మరీ అంత వెటకారం వద్దు.అవసరానికి చేతిలో వుoటుoదని అడిగాను.”

“కిరాణాకొట్టులో యివ్వవలసిన పదివేలు వున్నాయి .మొత్తం వూడ్చేస్తారా?మాకేమైనా?”

“మీరు రేపు బ్యాంకు లో తీసుకోండి.”

“ధన్యోస్మి ఉచిత సలహాల రావుగారూ.ముందు తమరు భోజనం చేయండి.బస్సు మిస్సయితే నన్ను ఆడిపోసుకుంటారు.”

“తినాలనిలేదు.”

“ఎందుకుంటుంది ..మధ్యలో బస్సాగిన చోట బిర్యానీయో ..

తందూరి చికెనో లాగించేయ వచ్చు.నాకు తెలియని ట్రిక్కులా?”

“ఒకప్రక్క అమ్మకు బాగోలేదని ఫోను.ఏమయ్యిoదోనన్న ఆందోళన.అందుకే ఆకలిగా లేదు.అంతేకానీ అయినా ఇది బిర్యాని తినే సమయమా?కొంచెం ఆలోచించి మాట్లాడు.”

“అయ్యా తప్పయిపోయింది.తమరిక బయలు దేరితే ఇల్లు సర్దుకుంటాను. రేపు కిట్టీ పార్టీ కూడా వుంది.నేను వెళ్ళి బాచి గాడిని తీసుకురావాలి.మీ ముద్దులకూతుర్ని వెళ్ళమన్నా వెళ్ళదు. స్మార్ట్ ఫోను వద్దని యెంత మొత్తుకున్నా వినకుండా ముద్దులకూతురికి కొనివ్వడమే కాకుండా జియో సిమ్ కూడా వేయిoచారుగా. అప్పటినుంచి చదువు చంకనాకి పోయింది. అది వుంటే తిండీ తిప్పలు చదువూ సంధ్యలు కూడా గుర్తు రావు.అంతా నా ఖర్మ.”

“సరే ఆఖరుసారిగా అడుగుతున్నాను.ఇదే నీ ఆఖరి నిర్ణయమా?”

“ఆఖరినిర్ణయం కాదు అదే నా అంతిమ నిర్ణయం.”

“ఓకే రజినీ !నేను వూరు చేరగానే ఫోను చేస్తాను. కిరాణా వాడికి కూడా నేను వచ్చాక పే చేస్తానని చెపుతాను.పిల్లలూ
నువ్వూ జాగ్రత్తగా ఉండండి.”

*****

బస్ స్టేoడులో ఫోనులో మాట్లాడుతున్న రమేష్ బాబు..ఇద్దరు పిల్లలతో ఏడుపు ముఖం తో తలదించుకొని వస్తున్న భార్యను చూస్తూనే ఎదురు వెళ్లి చేతిలోని బ్యాగ్ తీసుకొని దగ్గరకు తీసుకొని నెమ్మదిగా నడిపించు కొచ్చి కూర్చోబెట్టి వాటర్ బాటిలు అందించాడు.

“రజినీ !అమ్మకు ఏమీ కాదు.నువ్వు బాధ పడకు ప్లీజ్ ..” అనునయిoచబోయాడు రమేష్ బాబు.

అది పబ్లిక్ ప్లేసనికూడా చూడకుండా ఒక్కసారిగా బరస్ట్ అయిపోయింది రజిని.

“నన్ను క్షమించండి.పిచ్చిదాన్లా ప్రవర్తించాను.”

“కూల్ డౌన్ మై డియర్ రజినీ.యిప్పుడు ఏమయ్యిందని యింతగా యిదైపోతున్నావు. నాదే తప్పు.నన్ను నువ్వే క్షమించాలి.”

“దయచేసి ఇంకా మాటలతో చంపకండి.సంస్కారం లేకుండా వాగాను.అర్చన పరీక్షలు ముందుపెట్టుకొని చెత్త ఫోనుతో టైం వేస్ట్ చేస్తుంటే చూడలేక దానితో గొడవపడి మనసు పాడు చేసుకున్నాను. సరిగా అదే టైo లో మీరు వచ్చారు.కనీసం ఎలావుందని అడగాలన్న ఇoగిత జ్ఞానాన్ని కూడా కోల్పోయి ప్రవర్తించాను.”

“అయిపోయినదానికి అనవర సంజాయిషీలు వద్దు. అయినా మీరెందుకొచ్చారు? నేను వెళ్ళి అమ్మను అంబులెన్స్ లో హైదరాబాద్ తీసుకొచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. నిన్న ఫోన్ చేసిన నాన్నగారితో అప్పుడే చెప్పాను. నా ఫ్రెండ్ బోసు ఏర్పాట్లన్నీ చూస్తున్నాడు.”
“మీ కాళ్ళు పట్టుకొని ఏడ్చేయాలనుంది.”

“ఆపని మాత్రం చేయకు.ఈ మధ్య ఎర్రగడ్డ ఖాళీగా వుందని విన్నాను.హెల్త్ వాలెంటీర్లు చూసారoటే యిద్దరి బ్రతుకులూ కేరాఫ్ పిచ్చాసుపత్రి అయిపోతే పిల్లలు అన్యాయమైపోతారు. అయినా నాన్నగారితో చెప్పాను నీకు చెప్పవద్దని. అయినా?”

“ఆయన్ను యేమీ అనకండి.ఈ స్మార్ట్ ఫోన్ పిచ్చిదానికి బావ గారి అమ్మాయి వాట్స్ యాప్ లో ఫోటో పెట్టింది.ఆ రచనా దీనిలాగే ఫోను పిచ్చిది.”

“ఆహా నెట్ వచ్చాక ప్రపంచమే నెట్ లో పడిపోయింది.ప్రైవసీలేదు సీక్రసీ లేదు.”

“ఆ మెసేజ్ పెట్టిన తల్లి ఓగంట ముందు పెడితే ఇoత రాద్ధాoతం జరిగేదికాదు.”

“ అసలు ఇoతకీ జరిగి పోయిన రాద్దాంతమేమిటో..నువ్వు ఏమంటున్నావో నాకు ఒక్కముక్క అర్ధం కావడం లేదు.అమ్మను హాస్పిటల్లో జాయిన్చేసారని చెప్పాను.యిప్పుడు కూడా అదే అంటాను.

వాట్స్ యాప్లో రచన పెట్టిన ఫోటో అయితే మా అమ్మది లేదంటే మీ అమ్మది.దీంట్లో తేడా ఏముంది?ఎవరైనా అమ్మేగా?”
“చచ్చిన పామును ఇంకా చంపాలoటే మీ యిష్టం.”

“అది కాదురా ..యిదంతా చేసింది నీకొసమే.మీ అమ్మగారు అనుంటే అప్పుడే రాగాలు తీసే దానివి. సీను తారుమారయ్యేది.అయినా మీ అమ్మకీ మా అమ్మకీ తేడా ఏమిటి?అమ్మ అమ్మే కదా?నాకు అత్తగారు నీకు అమ్మగారు. నీకు అమ్మగారు నాకు అత్తగారు.మొత్తానికి యిద్దరూ అమ్మలే. అమ్మ కాని స్త్రీ అత్త యెలా అవుతుంది?యివ్వాళ నువ్వు అమ్మవి..రేపు?అంటే అమ్మ అత్త అవగానే మనిషిలో అంత మార్పు వస్తుందా? మౌనం సమాధానం కాదు భావి అత్తగారు!

అయినా పోస్ట్ గ్రాడ్యుయేటివి. అయినా బుర్ర ఇంకా బీసీ లెవెల్లోనే ఫ్రీజ్ అయిపోయినట్లుంది.అసలు అమ్మాయిలంతా యింతేనా?నువ్వు మాత్రమేనా?దీనికి అంతం లేదా?”

“వదిలేయండి డాడీ..యిదంతా నామూలoగానే జరిగింది.ఈదెబ్బతో నా ఫోను పిచ్చి సగం వదిలిపోయింది.”

“సగంకాదుతల్లీ! పూర్తిగా వదలాలి.అమ్మ చెప్పినా నేను చెప్పినా నీ మంచికోసమే కదా?ముందు చదువు..తర్వాతే ఏదైనా?చదువు వెంట వుంటే సమస్తమూ నీ వెంటే. నేను మీ అమ్మకు అబద్దం చెప్పిందీ తన కోసమే.నన్ను తిట్టి అలిసిపోయి నువ్వు ఫోటో చూపించాక అoదరికీ ఫోన్లు చేసి సీరియస్ కాదని కన్ఫర్మ్ చేసుకుని వుంటుంది.అది అప్పుడే నేను చెప్పి వుంటే బాగా ఏడ్చేసి తను అప్ సెట్ అయిపోయి మనల్ని కూడా టెన్షన్ పెట్టేసేది.ఫోన్లో తాతయ్యగారు అమ్మమ్మకు అంత సీరియస్ కాదని చేప్పారుకాబట్టే నేను చిన్న డ్రామా ఆడాను. నువ్వు రియలైజ్ అయ్యావు అమ్మ అత్తగారిమీదున్న చెత్త అభిప్రాయాన్ని మార్చుకుంది.నేను వూరెళ్ళాక మీ అమ్మకు ఫోన్లో నిజం చెప్పి క్షమాపణ అడుగుదామనుకున్నాను.యింతలో నువ్వు”

“సారీ డాడ్..మీరు పొరపాటు పడి వుంటారేమోనని చెప్పాను.అప్పటికీ ఫోటో మీకు ఫార్వర్డ్ చేస్తానంటే అమ్మ ఫోను లాక్కుంది.హడావుడిగా తయారై వచ్చేసాము.”

ఏది ఏమైనా అంతా మన మంచికే జరిగింది.

“సారీరా రజ్జీ..ఇది బిస్కెట్ కాదు ..”

“డాడీ !అమ్మ బుగ్గలు చూడండి..నేనో గులాబీ కోసి జడలో పెట్టుకోనా?”

“టు సే యస్ ఐ హేవ్ టు టేక్ పర్మిషన్ ఫ్రo యువర్ మాం..మై బాస్.”

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు