సత్యం ఏవిటో - రాజీవ్ కొసనం

satyamevito

"హర్షూ!"

"ఊఁ"

"నిద్రోస్తుందా?"

"ఊఁ"

"ప్లీజ్ హర్షూ"

"వద్దు దీపూ! ఇప్పుడస్సలు మూడ్ లేదు, ఓపిక అంతకన్నా లేదు"

"రెండు నిమిషాల్లో అయిపోతుంది హర్షు, ప్లీజ్"

"సరే కానీ", తన మాట ఎలానో నెగ్గదని తెలిసి ఒప్పుకున్నాడు హర్ష.

"మా ఆయన బంగారం", అని మొదలుపెట్టింది దీపిక.

"మరేమో ఎదురింటి సరితకు ఒక ఫ్రెండ్ ఉందిట, వాళ్ళాయన తనని ఎంతో బాగా చూసుకునేవాడంట, ఒకరోజు ఇద్దరు కలిసి సినిమాకి వెళితే అక్కడ ఎవరో ఒకావిడ కనిపించిందిట, ఆవిడని చూసి మొదట షాకయినా వెంటనే తేరుకొని ఆవిడ తన క్లాస్మేటని పరిచయం చేసాడట, ఆ తరువాత నుంచి ఆయనలో వచ్చిన మార్పులు గమనించి ఏమిటి విషయం అని ఆరాతీస్తే ఆ థియేటర్లో కనిపించినావిడ, ఈయన కాలేజీలో ప్రేమించుకున్నారట, అంతకన్నా ఘోరమైన విషయమేంటంటే వాళ్లిద్దరూ ఇప్పుడు కూడా వాళ్ళ బంధాన్ని కొనసాగిస్తున్నారుట", గుక్క తిప్పుకోకుండా, ఫులుస్టాప్ లు పెట్టకుండా చెప్పాలనుకున్నది చెప్పేసింది.

ఇరుగుపొరుగు వాళ్ళ ఇళ్లలో కబుర్లు, ఎక్కడో ఎప్పుడో చదివిన కధలు, నేరాలు ఘోరాలు వంటి ధారావాహికలు... విని, చదివి, చూసి, అవన్నీ హర్షకి చెప్పడం అలవాటుగా మారిపోయింది దీపికకి. పిల్లలు పుట్టకముందు హర్ష ఆఫీస్ నుంచి రాగానే భోజనం పెట్టి 'కధాగోష్ఠి' మొదలుపెట్టేసేది. ఇప్పుడు భోజనాలు అయ్యాక పిల్లలతో హోంవర్క్ చేయించి, వాళ్ళతో ఆటలాడి, వాళ్ళని పడుకోబెట్టే సరికే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. అందుకే ఇలా హర్షని పడుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టవలసి వస్తుంది, లేకపోతే అవన్నీ కడుపులో దాచుకోలేక తను ఇబ్బంది పడవలసి వస్తుంది.

ఆ కథ విన్న హర్ష "దీన్ని బట్టి ఏమర్ధమయ్యింది? భర్త తన క్లాస్ మేట్స్ ని పరిచయం చేస్తే వాళ్ళిద్దరిమధ్యా ఏముందని ఆరాలు తీయకూడదు, తీస్తే ఇలానే బాధపడవలసి వస్తుందని. అంతేగా? ", వ్యంగ్యంగా అన్నాడు హర్ష.

"అదేంటి హర్షు అలా అంటావ్"

"లేకపోతే ఏంటి దీపూ! వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి, మనం ఇలా నిద్రలు ఆపుకొని వాళ్ళ గురించి, అది కూడా నెగటివ్ గా, మాట్లాడుకోవడం అవసరమా?""అదీ కరెక్టే అనుకో..." అని ఏదో చెప్పబోయింది.

"ఇంక పడుకో దీపూ, రేపు పిల్లల్ని జూకి తీసుకువెళ్లాలి, అక్కడ తిరగడానికి ఓపిక కావాలి కదా", అని ఆవులించాడు హర్ష.

ఏ కళనుందో దీపిక కూడా మారు మాట్లాడకుండా పడుకుంది.

మర్నాడు ఉదయం పిల్లలే ముందుగా లేచి దీపిక, హర్షలని నిద్రలేపారు. వాళ్ళ కళ్ళలోని మెరుపే చెబుతుంది జూకి వెళ్తునందుకు వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారోనని.

అందరూ రెడీ అయ్యి టిఫిన్లు తింటుండగా...

"అమ్మా! చూడమ్మా అన్నయ్య, జూకి నేను వస్తే నన్ను కూడా కోతుల బోనులో వేసేస్తారు అంటున్నాడు", అని బుంగమూతి పెట్టి ఫిర్యాదు చేసింది చిన్నారి.

"ఏంకాదమ్మా! చిన్నారే 'జూలో కొత్త జంతువులకు ప్లేస్ లేదండీ' అని నన్ను లోనికి రానివ్వరు అంటుంది", అని చింటూ ఫిర్యాదు.
అన్నాచెల్లెళ్లు ఉన్న ఇళ్లలో ఈ గిల్లికజ్జాలు తప్పవేమో అనుకోని నవ్వుకుంది దీపిక.

"మీరిలాగే గొడవలు పడుతుంటే మిమ్మల్ని ఇంట్లోనే వదిలేసి అమ్మా నేను వెళ్ళిపోతాం జూకి, తరువాత మీ ఇష్టం" అన్న తన తండ్రి మాటలు పూర్తికాక ముందే తన చేతిలోని ఇడ్లి ముక్కని చెల్లెలికి తినిపిస్తూ "చెల్లి! బంగారు తల్లి!" అన్నాడు చింటూ. ఎదురుచూడని ఆ సంఘటనకు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారా తల్లితండ్రులు.

అందరు రెడీ అయ్యి పది గంటల ప్రాంతంలో జూకి చేరుకున్నారు.చలికాలం కావడం వలన ఎండ తీవ్రత అంతగా లేదు.

జూలో జీవం లేకుండా తిరుగుతున్న జంతువులని చూసి కూడా కేరింతలు కొడుతున్నారు పిల్లలు. అదిగో ఎలుగుబంటి ఇదిగో చిరుతపులి అంటూ జూ మొత్తం కలయతిరిగేస్తున్నారు అన్నాచెల్లెళ్ళిద్దరు. పరుగులాంటి నడకతో వాళ్ళని అనుసరించడం, ఫోటోలు తీయడంతోనే సరిపోయింది పెద్దవాళ్ళకి.

మధ్యాహ్నం జూలోనే ఉన్న రెస్టారెంట్లో భోజనాలు ముగించి మళ్ళి తిరగనారంభించారు. అలా నాలుగు గంటల వరకు తిరిగిన తరువాత ఇంక తిరిగే ఓపిక లేదంటూ అక్కడే లాన్ లో కూర్చుండిపోయింది దీపిక. తన పక్కనే హర్ష కూడాను. పిల్లలు కూడా అలసిపోయారేమో కాసేపు అమ్మానాన్నల వడిలో కూర్చొని కబుర్లాడుకోసాగారు.

ఇంతలో ఐస్క్రీమ్ తినాలన్న కోరిక కలిగింది చిన్నారికి, కలగడం ఆలస్యం "నాన్నా ఐస్క్రీమ్, నాన్న ఐస్క్రీమ్" అని గొడవ చేయసాగింది. ఇక కొనేవరకు ఆపదని అర్ధమయ్యి పిల్లలకి ఐస్క్రీమ్ కొనిపెట్టడానికి బయలుదేరాడు. దీపిక మాత్రం రాలేనని అక్కడే కూర్చుండిపోయింది.
వాళ్ళు ఆలా వెళ్ళగానే తనకి కొంత దూరంలో కూర్చున్న స్త్రీని చూసి ఆవిడ దగ్గరకు వెళ్లి "నువ్వు శిరీషవే కదూ?" అని అడిగింది.
దీపికని పోల్చుకోవడానికి ఒక క్షణం పట్టింది శిరీషకి.

"దీపూ నువ్వా! ఎన్నాళ్ళయిందే చూసి, ఎంత మారిపోయావు?" అంటూ పలకరించింది.

స్నేహితురాళ్ళు ఇద్దరూ ఆలా కబుర్లలో ఉండగానే ఒక చేతితో ఐస్క్రీమ్ పట్టుకొని చీకుతున్న పిల్లల రెండో చేయి పట్టుకొని అక్కడకు వచ్చాడు హర్ష.

"హర్షూ! ఇది శిరీష అని నా స్కూల్ ఫ్రెండ్, పదవ తరగతి అయిపోయాక మళ్ళి ఇప్పుడే కలుసుకున్నాం" అంటూ శిరీషని పరిచయం చేసింది.
పలకరింపు కోసమని శిరీష వైపు తిరిగిన హర్ష స్థాణువైపోయాడు. ఆమె కూడా రెప్పవేయకుండా అతనినే చూడసాగింది. ఉలుకు పలుకు లేకుండా అలాగే ఒకరిని ఒకరు చూసుకోసాగారు. ఇద్దరి కళ్ళలో గతస్మృతులు కదలాడాయి.

దీపిక తన చేయి పట్టుకొని ఊపడంతో ఈలోకంలోకి వచ్చిన హర్ష పిల్లల చేతులు పట్టుకొని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గేట్ వైపు వెళ్ళిపోయాడు.

శిరీష కూడా దీపికకు చెప్పా పెట్టకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. దీపికకు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. కారులో ఇంటికి వెళుతున్నంత సేపు దీపికతో ఏమి మాట్లాడలేదతను. ఎప్పుడు సరదాగా తనని ఆటపట్టించే హర్ష అలా గంభీరంగా, మాట్లాడకుండా ఉండడం వింతగా తోచిందామెకు.

ఇంటికి వెళ్లి స్నానం చేసి లాప్టాప్ లో ఆఫీస్ పనేదో చూసుకొని, భోజనం కూడ చేయకుండా పడుకుండిపోయాడు.

మర్నాడు కూడా ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత ముభావంగా ఉండడం గమనించి "ఏమయ్యింది హర్షూ? నిన్న శిరీషని చూసిన దగ్గర నుండి ఎందుకు అదోలా ఉంటున్నావు?" అని అడిగింది దీపిక.

"ప్లీజ్ దీపూ! నా మనసేం బాలేదు, రెండు రోజులు నన్ను మాట్లాడించకు", అని మాత్రం అన్నాడు.

శిరీషకి, హర్షకి ముందే పరిచయం ఉంది అని అర్ధమవుతున్నది, ఒకరికి ఒకరు ఎదురుపడలేనంతగా ఇద్దరి మధ్యన ఏదో జరిగిందని కూడా అర్ధం అవుతుంది. కానీ ఏం జరిగిందో మాత్రం తెలియడం లేదు. హర్ష ఆ విషయం గురించి మాట్లాడడానికే ఇష్టపడడం లేదు. శిరీషని అడుగుదామంటే హడావిడిలో తన ఫోన్ నెంబర్ కానీ ఇంటి అడ్రస్ కానీ అడగడం మర్చిపోయింది తను. ఒకవేళ కాలేజీ రోజుల్లో ఇద్దరూ ప్రేమించుకున్నారేమో అన్న ఊహ వచ్చింది. కానీ హర్ష గురించి తెలిసిన తన మనసు మాత్రం ఆ ఊహ తప్పని చెబుతుంది.
ఆలోచించగా ఆలోచించగా... శిరీష తన భర్త 'కుందన్ టెక్సటైల్స్' కి అధిపతి అని చెప్పడం గుర్తొచ్చింది. మర్నాడు హర్ష ఆఫీసుకి, పిల్లలు స్కూలుకి వెళ్ళగానే తను కూడా రెడీ అయ్యి కుందన్ టెక్సటైల్స్ కి బయలుదేరింది.

అక్కడ మేనేజర్ని కలుసుకొని తాను శిరీష స్నేహితురాలినని పరిచయం చేసుకొని శిరీష అడ్రస్ అడిగింది.

"శిరీష మేడం కొంతసేపటి క్రితమే ఇక్కడికి వచ్చారు, పైన గదిలో ఉన్నారు, మీరు వెళ్ళి కలవొచ్చు" అని దారి చూపించాడు మేనేజర్.
డోర్ నాక్ చేసి లోపలికి వచ్చిన దీపికను చూసి కుర్చీలో అసహనంగా కదిలింది శిరీష.

"సిరీ! నేను ఇక్కడ ఎందుకు వచ్చానో ఊహించగలవనే అనుకుంటున్నాను. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలనుంది" అన్నది.

"అది తెలుసుకోవడానికి ఇంత దూరం రావడం ఎందుకు, ఇంట్లో ఉండే నీ భర్తనే అడగవలసింది" అంటూ వ్యంగ్యంగా జవాబిచ్చింది.
"హర్ష ఆ విషయం గురించి మాట్లాడడానికే ఇష్టపడడం లేదు"

"హుఁ! ఎలా మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు, చేసిన తప్పుకు ప్రత్యక్ష సాక్ష్యం కళ్ళ ముందు కనబడేసరికి మాట పడిపోయి ఉంటుంది".

"ప్లీజ్ సిరీ! తను చేసిన తప్పేమిటో చెప్పకుండా నా భర్తని నువ్వలా తూలనాడుతుంటే నేను తట్టుకోలేను"

"సరే జరిగింది అంతా వివరంగా చెబుతాను విను. కాలేజీ రోజులలో నీ భర్త, సాగర్ మంచి ఫ్రెండ్స్", అంటూ చెప్పనారంభించింది.
సాగర్ అన్న పేరు వినగానే రెండు రోజులనుండి హర్ష ఎందుకు అలా ఉంటున్నాడో కొంత అర్ధమయ్యింది దీపికకి.

"సాగర్ నేను ప్రేమించుకున్నాం. మేమిద్దరం ఏకాంతంగా గడపడానికి ఏ సినిమాకో,షికారుకో వెళితే హర్ష కూడా మాతోపాటు వచ్చేవాడు. అతని చూపులు, చేష్టలు చాలా వెకిలిగా అనిపించేవి నాకు. అతనలా మాతో రావడం నాకు ఇష్టం కూడా ఉండేది కాదు. ఒకరోజు సాగర్ నాతొ ఏదో మాట్లాడాలి అంటున్నాడని, అర్జెంటుగా రూముకి తీసుకురమ్మన్నాడని చెప్పాడు హర్ష. అతనితోపాటు రూముకి వెళ్లిన నాకు అక్కడ సాగర్ కనిపించలేదు. ఏమిటిదని అడిగేలోపే తలుపుకు గొళ్లెంపెట్టి నన్ను బలాత్కరించబోయాడు. అప్పుడర్ధమయ్యింది నాకు హర్ష మాతో ఎందుకు వచ్చేవాడో, అతని చూపుల వెనుక చేష్టల వెనుక ఉన్న మర్మమేమిటో. దేవుడి దయ వలన సమయానికి గోపాల్ వచ్చి తలుపు తట్టడంతో ఆరోజు అతని చేతులలో నుంచి తప్పించుకోగలిగాను. మర్నాడు సాగర్ ని కలిసి విషయం చెబితే 'హర్ష అలాంటివాడు కాదే? ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది' అని తన మిత్రుడి తరుపున మాట్లాడేసరికి నాకు సాగర్ మీద అసహ్యం వేసింది. అతని మీదున్న నమ్మకం పోయింది. 'నేను చెబుతున్నా నమ్మకుండా నువ్వు హర్షనే సమర్ధిస్తున్నావన్నమాట, నమ్మకం లేని చోట ప్రేమ ఉండలేదు సాగర్. రేపు మనిద్దరికీ పెళ్ళయిన తరువాత అతనొచ్చి నన్ను ఏదన్నా చేసినా తప్పు నాదే అనేలా ఉన్నావు. నీలాంటి వాడితో జీవితాంతం ఉండాలనుకోవడం నాదే తప్పు, ఇంకెప్పుడు నన్ను కలవాలని ప్రయత్నించకు' అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఆలా వెళ్ళిపోయిన రెండు నెలల తరువాత కుందన్ తో నా పెళ్లి జరిగింది. పెళ్లి అయిన రెండోరోజు తెలిసింది నాకు, నా విషయం గురించి సాగర్, హర్షలు గొడవపడ్డారని దాని పర్యవసానంగా సాగర్ ఆత్మహత్య చేసుకున్నాడని" అని ముగించింది.

ఇదంతా విన్న దీపికకి ఆ ఏసి రూములో కూడా చెమటలు పట్టేసాయి. తన బెస్ట్ ఫ్రెండ్ సాగర్ ఆత్మహత్య చేసుకున్నాడు అని ఎన్నోసార్లు చెప్పిన హర్ష, దానికి కారణమేమిటో ఒక్క సారి కూడా చెప్పలేదు.

ఏమి మాట్లాడలేని స్థితిలో వెనుతిరిగి వెళుతున్న దీపికని ఉద్దేశించి "అలాంటి దుర్మార్గుడిని పెళ్లి చేసుకున్నందుకు... ఐ రియల్లీ పిటీ యు!", అంది కర్కశంగా.

శిరీష చెబుతున్నప్పుడు ఏమి మాట్లాడలేకపోయింది కానీ ఇంటికి తిరిగి వెళుతూ ఆలోచిస్తుంటే తన భర్త ఆలా చేసి ఉండడని అనిపించసాగింది. హర్షని కూడా అడిగి అతను చెప్పింది వినేవరకు ఒక నిర్ధారణకు రాకూడదు అనుకుంది.

ఆ రాత్రి పిల్లలు పడుకున్న తరువాత హర్ష దగ్గరకు వచ్చి "నేను శిరీషని కలిసాను" అంది దీపిక. నిర్లిప్తంగా చూసాడతను.
"తను నీ గురించి ఏదేదో చెబుతుంటే విని తట్టుకోలేకపోయాను"

"తన మాటలు నువ్వు నమ్ముతున్నావా?", మొదటిసారిగా ఈ విషయం గురించి స్పందించాడు.

"నేను నమ్మడం ముఖ్యం కాదు.....", అని ఏదో చెప్పబోతున్న దీపికని మధ్యలోనే ఆపి

"అదే ముఖ్యం దీపూ! నువ్వు తను చెప్పినది నమ్మినట్టయితే నేను ఏమి చెప్పినా నమ్మే స్థితిలో ఉండవు", స్థిరంగా అన్నాడు.

"ఇన్నేళ్లు నీతో కాపురం చేసిన దానిగా నువ్వెంటో నాకు తెలుసు. కానీ తను నీ మీద పడ్డ నింద అబద్ధం అని తెలిస్తే కానీ నా మనసుకు కుదురు ఉండదు"

"సరే! జరిగింది ఏమిటో చెబుతా విను", అని చెప్పడం మొదలుపెట్టాడు.

"మేము ఫైనలియర్ లో ఉండగా ఒకరోజు సాగర్, శిరీషల ప్రేమ సంగతి సాగర్ వాళ్ళ నాన్నకు తెలిసి చాలా కోప్పడ్డారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే కాలేజీ మానిపించేస్తామన్నారు. అందుకే చదువయిపోయి ఉద్యోగం వచ్చేవరకు శిరీషని కలుసుకోకూడదు అనుకున్నాడు. ఆ విషయం చెప్పడానికి తనని రూముకు తీసుకురమ్మన్నాడు. కానీ నేను శిరీషని తీసుకువచ్చేసరికి సాగర్ రూములో లేడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. మూడు గంటల తరువాత, ఎవరో ఒక ఫ్రెండ్ కి ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ తీసుకువెళ్లాడని గోపాల్ వచ్చి చెప్పాడు. ఆ తరువాత శిరీషని పంపించేసి నేను, గోపాల్ హాస్పిటల్ వెళ్లాము. ఇది జరిగిన రెండు రోజుల తరువాత నుండి నాతొ ఎక్కువ మాట్లాడే వాడు కాదు సాగర్, ఏమయ్యిందని ఎన్ని సార్లు అడిగినా సమాధానం ఉండేది కాదు. శిరీషతో మాట్లాడలేక పోతున్నందుకు బాధపడుతున్నాడేమో అనిపించింది. ఇదిలా ఉండగా ఒకరోజు గోపాల్ వచ్చి శిరీషకి రెండు రోజులలో పెళ్లి జరగబోతుంది అని చెప్పాడు. అది విని సాగర్ నేను షాకయ్యాము. కొంతసేపు మౌనంగా ఉన్న సాగర్, ఇదంతా నావల్లే జరిగింది అని, నేను ఆరోజు శిరీష మీద అఘాయిత్యం చేయకపోయి ఉన్నట్టయితే శిరీష తనకే దక్కేదని ఏవేవో నిందలు వేసాడు. అది విని అదిరిపడ్డాను నేను, గోపాల్ కూడా ఉలిక్కిపడి చూసాడు. నేను శిరీష మీద అఘాయిత్యం చేశానని ఎవరు చెప్పారని అడగగా శిరీషే చెప్పిందన్నాడు. వాడు ఇన్నిరోజులు నాతొ సరిగా మాట్లాడకపోవడానికి కారణం అప్పుడర్ధమయ్యింది నాకు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని నేను వెళ్లి శిరీషతో మాట్లాడి వస్తానని సాగర్ కి చెప్పి గోపాల్ ని తీసుకొని శిరీష వాళ్ళ ఊరు వెళ్ళాను. మర్నాడే పెళ్లి కావడంతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. శిరీష కోసం వెతుకుతున్న మాకు పక్క రూంలో నుండి మాటలు లీలగా వినిపించసాగాయి. 'సాగర్ ని వదిలించుకోవడానికి ఆ విధంగా హర్షని ఉపయోగించుకున్నాను...' అని ఎవరికో చెప్పి నవ్వుతుంది శిరీష. అది విన్న గోపాల్ కి, నాకు ఇక శిరీషతో మాట్లాడడం అనవసరం అనిపించింది. సాగర్ కీ విషయం ఎలా చెప్పాలా అని నేను ఆలోచిస్తున్నంతలోనే గోపాల్ జరిగినదంతా సాగర్ కి ఫోన్ లో చెప్పేసాడు. అలాంటి అమ్మాయిని ప్రేమించానన్న పశ్చాత్తాపంతోనో, లేక అలంటి అమ్మాయికోసం ప్రాణస్నేహితుడనైనా నాతొ గోడవ పడ్డానన్న బాధతోనో తెలియదు కానీ మేము వెళ్లేసరికి సాగర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ అమ్మానాన్నా మాత్రం వీడి ప్రేమని కాదన్నందుకు బాధతో చనిపోయాడు అనుకున్నారు. శిరీష మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్న నన్ను గోపాల్ నిలువరించాడు. కొత్తగా పెళ్ళయిన ఆడపిల్ల పోలీసులని, కోర్టులని తిరుగుతుంటే ఆ పిల్ల తల్లితందులు తట్టుకోలేరని, ఆ అబ్బాయి కుటుంబానికి కూడా తలవంపులని, తనను ఏమి చేసినా పోయిన వాడు తిరిగి రాడనీ బ్రతిమలాడి, బలవంతంచేసి నన్ను ఆపాడు. అలా నా ప్రాణస్నేహితుడి చావుకు కారణమైన ఆ కర్కసిని ఇన్నాళ్ల తరువాత చూసేసరికి జ్ఞాపకాల అలజడి నా మనసును స్థిమితంగా ఉండనీయడం లేదు. ఈ రెండు రోజుల నుండి నాలో జరుగుతున్నా మానసిక సంఘర్షణ ఎవరికీ చెప్పుకోలేక, నాలోనే దిగమింగుకోలేక నరకం అనుభవిస్తున్నాను", అంటూ ముగించాడు.

ఆ తరువాత అతనేమీ మాట్లాడలేదు. దీపిక కూడా ఏమి అడగలేదు, కానీ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. ఇద్దరూ చెప్పిన కథ ఒకటే కానీ ఎవరికి వారు పక్కవాళ్ళని దోషులుగా చిత్రిస్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళిద్దరి మధ్యా జరిగినది ఏమిటో తెలుసుకుంటేనే కానీ కుదురు ఉండదు అనుకుంది, కానీ తెలుసుకున్న తరువాత మరింత సందిగ్ధత ఏర్పడింది. ఈ చిక్కుముడి వీడేదెలా అని ఆలోచిస్తుండగా హర్ష ఫ్రెండ్ గోపాల్ గుర్తొచ్చాడు. అతనిని కలిసి అతని తరపు కథ కూడా వింటే ఎవరిది తప్పో ఎవరు ఒప్పో తెలిసిపోతుంది అనుకున్న తరువాత మనసు తేలికపడి కునుకుపట్టింది.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న