నిర్ణయం - గంజాం భ్రమరాంబ

nirnayam

మనిషి తను సమాజానికి బయపడుతున్నట్లు పైకి కనిపించినా తనకు నచ్చిన పనే తాను చేస్తాడు. తనకిష్టమైన నిర్ణయం తీసుకుంటాడు దానిని సమాజం ఒప్పుకునేలా లౌక్యంగా రంగులు పులుముతాడు. కొందరు స్వార్థం కోసం... మరికొందరు తమవారి క్షేమం కోసం...

*****************************

సంతోషంగా గడిచిపోతున్న మా జీవితంలో జరిగిన ఆ సంఘటన ఒక సునామీ అలలా వచ్చి మా ఆనందాన్ని లాక్కొని వెళ్లిపోయింది. పట్టణ శివార్లకు దగ్గరగా ఉండే పల్లెటూరు మాది.

అమ్మానాన్నా..ముందుచూపుతో తక్కువ ధరకు కొన్న స్థలాలు ఇప్పుడు కోట్లరూపాయల స్థిరాస్తిగా మారిపోయాయి.

నన్నూ తమ్ముడినీ చాలా అపురూపంగా కష్టం అనేది దరిదాపుల్లో కనపడకుండా పెంచారు అమ్మానాన్నా...

నేను ఇంజనీరింగ్ పూర్తిచేసి అమ్మకోరినట్లు మేనమామ కూతురు "ప్రభ" ను పెళ్ళి చేసుకున్నాను.

మంచికంపెనీలో.. పెద్దజీతంతో మంచి ఉద్యోగం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. రెండో సంవత్సరంలో మా పాప నవ్వులు మా ఇంటవిరబూసాయి.

మా పాప భావన ఇప్పుడు ఐదోతరగతి చదువుతోంది.

మా తమ్ముడు రూపేష్ ఇంజనీరింగ్ చదివేరోజుల్లోనే తన క్లాస్ మేట్ జాస్మిన్ ను ప్రేమించి ఇంకా ఆఖరి సంవత్సరం పరీక్షలు అవకముందే మతాంతర వివాహం చేసుకొని నేరుగా ఇంటికి తీసుకొచ్చాడు.

జాస్మిన్ వాళ్లింట్లో తనకు పెళ్లినిశ్చయం చేయడంతో విధిలేక ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పాడు.

తమ్ముడి పెళ్లి గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న అమ్మ ,వాడు చేసిన పనిని సమర్థించలేక అటు కన్నకొడుకుని దూరం చేసుకోలేక కుమిలిపోయింది.

తరువాత నాన్నా,నేనూ అమ్మకు సర్థిచెప్పడానికి చాలా రోజులు పట్టింది.

లోకంతోపాటు కాలంతోపాటు మారకతప్పదని అర్థం అయ్యాక కాస్త సర్దుబాటు చేసుకుంది.

మనసుని కుదుటపరుచుకుంది.

కానీ జాస్మిన్ వాళ్ల తల్లిదండ్రులు..

అసలు మాకు కూతురే పుట్టలేదు అనుకుంటాము ఇక జన్మలో మా ఇంటి గడప తొక్కవద్దని తేగేసి చెప్పారు.

"హరీష్....చిన్నోడు ఇలా చేసాడెందుకు "అని సంవత్సరం దాకా సణుగుతూనే ఉండేది అమ్మ.

ఇంతలో జాస్మిన్ నిండుజాబిల్లి లాంటి మగబిడ్డకి జన్మనివ్వడంతో..

అమ్మ అసంతృప్తి కాస్త తగ్గి, మనవడిని ముద్దులాడేనెపంతో వారికి కాస్త దగ్గరయ్యింది.

ఒకరోజు రూపేష్,తన స్నేహితుడు రాజాతో మోటార్ సైకిల్ పై పట్టణం వెళ్లి తన పరీక్షలకు ఫీజుకట్టి వస్తుంటే

బ్రేకులు ఫెయిల్ అయిన లారీ ఎదురుగా వస్తున్న బస్సును తప్పించి వీరు వస్తున్న బైకును బలంగా ఢీకొట్టింది.

రూపేష్, రాజా తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మరణించారు.

ఇద్దరూ మిత్రులూ ఒకే ఊరు వారుకావడంతో ఊరు ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయింది.స్థానిక ఎమ్మెల్యే, నలుగురు ప్రతిపక్ష నాయకులు వచ్చి, మీడియా ముందు ఇదే సాకుగా ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకోవడం..పోటీలు పడి ఎక్స్ గ్రేషియా ప్రకటించి వెళ్లిపోయారు. మీడియా ఆ వార్తలోని తాజాదనం తగ్గేవరకూ మార్చిమార్చి చూపించి..

షాక్లో ఉన్న కుటుంబ సభ్యులనుంచి

ఏవేవో ఫైల్ ఫోటోలు తీసుకుని.. విషయాన్ని మూడొందల అరవై డిగ్రీల కోణాల్లో విశ్లేషించి.. విశదీకరించి హోరెత్తించాయి.

అమ్మను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.

"రూపేషా..నా బిడ్డా..నన్ను అన్యాయం జేసి పోయినావు కదరా..

నా తండ్రి.. నీ భార్యా బిడ్డలతో నైనా ఒకసారి మాట్లాడురా..

దేవుడా ముసిలోళ్లను మమ్మల్ని మరిచిపోయావా..నా కోడుకును ఎందుకు పిల్చుకున్నావయ్యా..."

అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే..ఆ తల్లిరోదనను చూడలేక,ఆపే సాహసం చేయలేక అక్కడున్న ప్రతి గుండె కదిలిపోయింది.

*********************

ఆ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు గడిచిపోయినా ఆ గాయం చేసిన వేదన పచ్చిపుండులా మనసును తొలుస్తూనే ఉంది.

అమ్మా,నాన్న, జాస్మిన్.. ప్రాణమున్న శవాలుగా మాత్రమే మిగిలారు.

ఈ సమయంలో కూడా జాస్మిన్ వాళ్ల పుట్టింటి వాళ్లు కనీసం పలకరించడానికి కూడా రాలేదు.

వాళ్లు అంత కఠినంగా ఉండటం చాలా ఆశ్చర్యపరచింది.

********

ఆరోజు స్నానం చేసాక..పంచకట్టుతో ..దేవుడి రూమ్ లోనికి వెళ్లి నాలుగు శ్లోకాలు జపించి అగరవత్తులు వెలిగిస్తుంటే...పక్కనే ఉన్న వంటిట్లో నుంచి అమ్మా, నా భార్య ప్రభ గుసగుసగా మాట్లాడుకోవడం నా చెవిలో పడింది.

"అత్తా ,మనకెందుకు ఈ తలనొప్పి.. వాళ్ల అమ్మగారింటికి పంపించెయ్యండి .జీవితాంతం వీళ్ల మంచీ చెడ్డలూ చూడటం మా వల్లకాదు" అని ప్రభ కోపంగా అంటోంది.

"ఉష్..చిన్నగా.. ఎవరైనా వింటారు.

ఇప్పుడు నీకొచ్చిన కష్టం ఏమిటి.. జీతం లేని పనిమనిషిలా ఉంది కదా.

నీ పెత్తనానికి ఏమి అడ్దం వచ్చింది.

ఇంకా ఇన్షూరెన్స్ కోర్టులోనే ఉంది.

అది వచ్చేస్తే..ఆ నాలుగు రూపాయలు దాని చేతిలో పెట్టి పంపవచ్చు.

ఇప్పుడు అయితే.. మన ఆస్థిలో భాగం పంచాలి.

కొన్నిరోజులు ఓపిక పడితే..ఆస్థి మొత్తం మన "భావన"కే వస్తుందే పిచ్చిమొద్దు.

అంతవరకూ లోకం దృష్టిలో మనకు ఎంతో మంచిపేరుకూడా వస్తుంది.

నువ్వు అనవసరమైన ఆలోచనలు కట్టిపెట్టి..ముందు పనిచూడు.." అంటోంది అమ్మ.

రూపేష్ దూరమైనాక..

ఆ చేదు జ్ఞాపకాలు కాస్త మసకబారినాక

రూపేష్ కుటుంబం అమ్మకు ఇప్పుడు పరాయిదిగా అనిపిస్తోందా ఏమో..

దేవుడి రూమ్ లో గంటచప్పుడు వినగానే మాటలు ఆపేసారు.

దేవుడు రూమ్ లో గోడకు ఉన్న రూపేష్ ఫోటో ఎందుకో దిగులుగా కదిలింది.

****************************

కోర్టులో ఇన్షూరెన్స్ గురించిన కేసు కొలిక్కివచ్చి మరణించిన వారి రెండు కుటుంబాలకూ చెరొక ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసింది.

రాజా కుటుంబానికి కూడా ఆ విషయం చెప్పమని నాకే పురమాయించాడు లాయర్.

ఇక తప్పక వెళ్లాల్సివచ్చింది

వాళ్లిల్లు వెతుక్కుంటూ వెళ్లాను.

ఊరికి కాస్త దూరంలో ఉన్న కాలనీలో ఒక చిన్న మిద్దె ఇల్లు వాళ్లది.

కారు వీధి చివరలోనే పార్క్ చేసాను.

ఒక పది అడుగుల నడకకే సూర్యుడి ప్రతాపం తాలూకు వేడి చుర్రుమని తగులుతోంది.

గేటు తీసే ఉండటంతో

ఇంటిముందుకు వెళ్ళి తలుపు తడుదామనుకున్నాను.

లోపలనుంచి సన్నగా మాటలు వినపడుతున్నాయి.

రాజా తల్లి ఏడుపు గొంతుతో.. కోడలికి ఏదో చెబుతోంది.

"కమలా..నువ్వు నా కడుపున పుట్టిన బిడ్డ కాకున్నా నా కూతురు లాంటి దానివే. నా కొడుకుతో సంతోషంగా కాపురం చేసుకుంటూ పుట్టిన చిట్టితల్లితో హాయిగా గడుపుతుంటే విధికి కళ్లుకుట్టింది. రాజాని లాక్కొని పోయింది.

నిన్ను ఈ ఇంటికి పనిమనిషిని చేసింది.

పదిరోజుల క్రితం మా దూరపు బంధువు సుబ్బమ్మ పట్టణం నుంచి వచ్చినప్పుడు చెప్పలేక చెప్పినట్లు ఒక విషయం చెప్పింది.

వాళ్ల తమ్ముడు భార్య మాయదారి జ్వరం వచ్చి చనిపోయి సంవత్సరం అయ్యింది కదా ..

నిన్ను వాళ్ల తమ్ముడికి ఇచ్చి పెళ్లిచేయమనింది.

నాకు కోపం వచ్చి నాలుగు తిట్టి బయటకు పొమ్మన్నా..

మళ్లా చాలా సేపు ఆలోచించాక ఆమె చెప్పింది సబబుగా తోచింది.

పసివయసులోనే తోడును కోల్పోయిన నీకు ఒకతోడు ఏర్పరచాలి అని అనిపించింది.

నీ పాపను కూడా వాళ్లు బాగా చూసుకుంటామన్నారు.

రాజా కూడా ఎక్కడున్నా.. మంచి పని చేసావమ్మా అంటాడు.

నువ్వు ఈలోకం ఏమంటుందా అని ఆలోచించకూ..

నువ్వు తప్పు పని చేయడం లేదు.

నీలాంటి పరిస్థితిలో ఉన్న ఇంకొకరి పరిస్థితిని అర్థం చేసుకొని ఒక కొత్త కుటుంబం ఏర్పరచుకుంటున్నావు.

ఇంట్లో వాళ్లకు కూడా నేను సర్దిచెబుతాను.

నువ్వు వేరే ఆలోచనలు ఏమీ పెట్టుకోకు‌.

కోర్టులో.. ఇన్ష్యూరెన్స్ సొమ్ము ఈరోజు కాకున్నా రేపైనా వస్తుంది.

రాకున్నా కూడా పోనీ..మన ఆస్థిలో నీ భాగం ఎప్పటికీ నీదే.

మనవరాలిపైన ఫిక్స్డ్ డిపాజిట్ వేసేద్దాం.

తన చదువుకూ..పెళ్లికి ఇబ్బంది రాకుండా...".అని అంటోంది.

రాజా భార్య.." అత్తా..ఇన్నిరోజులూ దేవుడు నాకు అన్యాయం చేసాడనుకున్నాను.నా గురించి ఇంతగా ఆలోచించే అత్తమ్మను దేవతలా అందించాడు " అంటూ కాళ్లపైన వాలిపోయింది.

వాళ్ల అనుబంధాన్ని అర్థం చేసుకొని నా కళ్లలో నీళ్లుచిమ్మాయి.

వారి మాటలు నేను విన్నానని వారికి తెలియకుండా బయటకు వచ్చేసాను.

గేట్ బయటకు వచ్చి..గేటు చప్పుడుచేసి పిలిచాను.

బయటకు వచ్చిన రాజా వాళ్లమ్మకు ఇరవైలక్షలు ఇన్ష్యూరెన్స్ వస్తుందన్న విషయం తెలియజేసాను.

"రాబాబూ లోపలికి కాస్త మజ్జిగ తాగి వెళ్లు" అని ఆదరంగా పిలిచింది.


"లేదమ్మా. ఇప్పుడు ఒక ముఖ్య మైన పని మీద వెళుతున్నాను.మా తమ్ముడి భార్య కి ఒక మంచి ఉద్యోగం చూడాలి.తను గౌరవం గా బ్రతికే ఏర్పాట్లు చేయాలి.ఇంకొకసారి తప్పకుండా వస్తాను."అని చెప్పి వచ్చేసాను.

ఇక మీదట జాస్మిన్ నాకు చెల్లెలు.తనకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడం నా ప్రథమ కర్తవ్యం.అని నిర్ణయించుకున్నాను.

రూపేష్ నవ్వు ముఖం కళ్ళముందు కదలాడింది.

ఇప్పుడు మండుటెండ కూడా చల్లగా అనిపిస్తోంది.

పగలే వెన్నెల కురుస్తోంది.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న