గది నిండా చీకట్లు ముసిరాయి.వారము నుండి ధరణి ఏడుస్తూనే ఉంది.స్వర్గం లాంటి గృహసీమ నరకాన్ని తలపిస్తుంది.తనను ఎవరు పట్టించుకోలేదనే బాధ కంటే వారు తీసుకున్న నిర్ణయం మనసును తీవ్రంగా కలిచివేసింది.
“అమ్మా”
పిలుపు విని ఉలిక్కిపడి చూసింది.గదిలో ఎవరు లేరు. ఆనంద వదనంతో ఉదరంపై అప్యాయతగా నిమిరింది.
“అమ్మా,
ఈ బాహ్య ప్రపంచంలోనికి ఎప్పుడెప్పుడు వస్తానా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను.నా రాకతో నీ జన్మ సార్థకమవుతుందని నీ ఆనందాన్ని బట్టి తెలుస్తూనే ఉంది. నీ ఒడిలో ఆడుకోవాలని,చందమామను చూస్తూ నీ చేతి గోరు ముద్దలు తినాలని,బామ్మ చెప్పిన కథలు వింటూ తాతయ్యతో గెంతులేయాలని,నాన్న వీపుపై గుర్రమాట ఆడాలని ఎన్నెన్నో ఆశలు మదిలో కలుగుతున్నాయి.
అప్పుడప్పుడు నువ్వు ముభావంగా కూర్చొని దిగులుగా ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉందమ్మా,అది నా గురించే నని అర్థమవుతుంది. వారము క్రితం ఆసుపత్రి కెళ్ళివచ్చినప్పటి నుండి మన ఇంట్లో వాతావరణమే మారిపోయింది. ఆడపిల్ల వద్దని, ఆపరేషన్ చేయించుకొమ్మని నాన్న బలవంతం చేస్తున్నాడు కదమ్మా!తన మాట వినడం లేదని రోజూ మీ ఇద్దరి మధ్య జరుగుచున్న గొడవ చూస్తున్న నాకు ఏడుపొస్తుందమ్మా!
నేనేమి నేరం చేసానమ్మా, నన్ను చంపాలని చూస్తున్నారు. ఆడపిల్ల ఇంటికి కళ అంటారు కదా,మరి భౄణహత్యలు చేసి ఇల్లును స్మశానంగా మార్చే మనుషుల మధ్య నీలాంటి సాత్వికురాలు ఎలా బతకగలదమ్మా? నువ్వు ధైర్యంగా పోరాడు,నన్ను రానివ్వు, నే వచ్చిన తర్వాత నీ కన్నీళ్ళను తుడుస్తాను.ఆడపిల్లలు మగపిల్లల తో పోల్చిచూస్తే ఎందులోనూ తీసిపోరు.మొన్నటి ఒలంపిక్ క్రీడల్లో రెండు పతకాలు తెచ్చి మన దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినది ఆడపిల్లలేనని మరిచారా?
ఈ మనుషులకు జన్మనివ్వడానికి తల్లి కావాలి పెళ్ళి చేసుకోవడానికి భార్య కావాలి కాని కూతురు ఎందుకు ఉండకూడదు? ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చనిపోయేవరకు అనుక్షణం నరకయాతన అనుభవిస్తూనే ఉంది. కుటుంబం, సమాజం, రాజకీయం ఉద్యోగరంగాల్లో ప్రతి చోట ఏదో ఒక రకమైన వివక్షను ఎదుర్కొంటూ కూడ విజయాలు సాధించి స్త్రీల ఔన్నత్యాన్ని ప్రపంచానికి పలుమార్లు చాటిచెప్పింది.
సాంకేతికతను నీచ ప్రయోగాలకు ఉపయోగించుకునే దుర్మార్గులున్న సమాజానికి రావడం ఇష్టం లేకున్నా,ఆడపిల్లలను చిన్న చూపు చూసే మూర్ఖులకు సరైన సమాధానం చెప్పడానికై రావాలనుకుంటున్నాను.ఆడది అబల కాదని, ప్రోత్సాహామిస్తే ఏదైనా సాధించగలదు.బంధాలను మరిచి అనుబంధాలను అమ్ముకునే కుసంస్కృతిని రూపుమాపడానికి నేను వస్తున్నాను.
వీలైతే నాన్నకు నచ్చచెప్పి చూడు,విననిచో ఎదురు తిరుగు.పసి బిడ్డ ను చంపే హక్కు ఎవరికి లేదు.నీ కంఠంలో ఊపిరున్నంత వరకు నా రాకకై పొరాడు.ఎలాగైనా నన్ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించమ్మా! “
ధరణి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆత్మవిశ్వాసం తో అడుగులు ముందుకు వేసింది. గదినిండా కోటి దీప కాంతులు వెలిగాయి.