ఏది జరిగినా మంచికే - గంగాధర్.వడ్లమన్నాటి .

edi jariginaa mana manchike

ఓ ఆడపిల్ల పెళ్లి పందిట్లో ఆగిపోతే అంతా ఏమనుకుంటారు.అపుడు ఎమౌతుంది లాంటివి సినిమాల్లోనూ ,సీరియల్స్ లోనూ చూడటమే తప్ప,నిజంగా ఏం జరుగుతుందో నాకూ తెలీదు.కానీ అలాంటి సంఘటన ఇప్పుడు నా జీవితంలోనూ జరిగింది.మాకు మీ సంబంధం వద్దు,మీ అమ్మాయిని అనుకోగానే మా వ్యాపారం పూర్తిగా దెబ్బతింది.మా నాన్నగారు పోయారు.ఇప్పుడు ఈ పచ్చని పందిట్లో మా అమ్మకి గుండెపోటు వచ్చింది.కనుక ఇక్కడితో ఆపేద్దాo.అని వారు వెళ్లిపోయారు.అమ్మ కన్నీటి ధారగా ఏడుస్తోంది.అన్నయ కూడా చాలా భాడపడిపోయాడు.

కానీ అంతా ఆ తరువాతి అరగంటలో తలక్రిందులైపోయింది.మా అన్నయ్య స్నేహితుడు శేఖర్ ,అన్నయ్యని ఒప్పించి,అదే ముహుర్తానికి నా మెడలో తాళి కట్టాడు.చాలా సంతోషం అనిపించింది.అమ్మ కన్నీరు ఆనందబాష్పాలుగా మారాయి.అన్నయ్య కూడా స్తిమిత పడ్డాడు. ప్రస్తుతం పక్కన పెడితే, పెళ్లి ఆగినపుడు నేను బాగా కృంగిపోయాను.అంతా శూన్యంగా తోచింది.అంత వెలుగులోనూ నా కళ్ళకి చీకటి పొర కమ్మింది. మరుక్షణంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను.కానీ,మా నాన్న చెప్పిన మాటలు,అవును మా నాన్న చెప్పిన మాటలే నాకు మరీ, మరీ, గుర్తుకు వచ్చాయి.

ఆయనెప్పుడూ, ఏది జరిగినా అది మన మంచికే అనేవారు.నాకు పెన్ను కొన్నా,పుస్తకం కొన్నా ఆ వాక్యమే రాయించేవారు.ఆయన పోయాక కూడా అలా పుస్తకాల్లో రాసుకోవడం నాకు అలవాటుగా మారింది.అది అలా నా మనసులో నాటుకుపోయింది.ఇప్పుడు కూడా అదే నమ్మి ధైర్యంగా నిలబడ్డాను. అంతా కుదుట పడింది.కానీ ఇంకా నాలో ఎన్నో సందేహాలు మాత్రం ఉన్నాయి. శేఖర్ నన్ను పెళ్లి చేసుకున్నాడు.కానీ త్యాగం చేశాడు కనుక,రేపు తనకి నేను ఋణపడి ఉండాలంటాడా?ఏమో.నేను ఎప్పుడూ నన్ను నన్నుగా ఇష్టపడి పెళ్లాడే వాడే కావాలనుకున్నాను.కానీ స్నేహితుడి పరువు బరువు తగ్గకూడదనే శేఖర్ నన్ను పెళ్లాడాడా.ఏమో.కానీ ఏం జరిగినా ముందడుగే వేస్తాను.

ఎందుకంటే ,నాన్న అన్నట్టు ఏది జరిగినా మన మంచికే. అని ఆమె ఆలొచిస్తుండగానే,బస్సు పెద్ద బ్రేకుతో ఆగడంతో,ఆలోచనల్లోంచి బయటకు వచ్చింది లలిత.తన పక్కనే ఉన్న శేఖరాన్ని చూసింది.సెల్ ఫోన్ చూస్తున్నాడు.లలిత చూడటం గమనించి,ఏంటి లలితా ఇది మరీ కాకపోతే, పెళ్ళయిన వెంటనే అన్నవరంలో వ్రతం చేయించాలా.ఎంటో మీ అన్నయ్య. నీకు బడలికగా ఏమైనా ఉందా.అడిగాడు.
అబ్బే లేదండీ.అయామ్ ఓకే .

లలిత చేయి తన చేతిలోకి తీసుకుంటూ,లలితా, నేను నిన్ను జాలిపడో, మీ అన్నయ్య నాకు గత అయిదేళ్లుగా స్నేహితుడు కనుకనో పెళ్లి చేసుకున్నానని ఎప్పుడూ అనుకోవద్దు.కాకపోతే ఇక్కడ నేను నీకు నచ్చానా లేదా,నీ అభిప్రాయం ఏంటి అని అడక్కుండా మేమే నిర్ణయాలు తీసుకున్నాం.అదే నాకు కొంచెం మింగుడు పడలేదు.కానీ ఆ సంధర్భం అటువంటిది.చెప్పాడు.

లలిత ముఖం కొంచెం విప్పారింది.హమ్మయ్య.త్యాగం చేశాను.అదీ ఇదీ అని మబ్బుల్లో ఉంటాడనుకున్నాను. కాదు. మంచి మనిషే. కానీ అన్నవరం వ్రతం తర్వాత, నన్ను నేరుగా వారి తల్లిదండ్రులకి పరిచయం చేస్తానంటున్నాడు.అదే కొంచెం భయంగా ఉంది.వారేమంటారో ఏమో.కట్నం లేదు.గిట్నం లేదు.లా౦చనాలు లేవు.వీడే వెళ్ళి పెళ్లి చేసుకు వచ్చాడు.తల్లిదండ్రుల అనుమతి అక్కర్లేదా.మేం చచ్చావనుకున్నావా అని ఏం గొడవ చేస్తారో ఏమో. అనుకుంది మనసులో.

లలితా, ఏం ఆలోచిస్తున్నావ్.పెళ్లి ఇలా నాతో జరగడం.?అంటూ ఆపాడు.

అబ్బే అదేం లేదు.ఏదో పరధ్యానం.అయినా మీరు కొత్త వ్యక్తి కాదు కదా.మిమ్మల్ని గత అయిదేళ్లుగా ఎరుగుదును .అలాగే మీ గురించి అన్నయ్య మంచిగా చెప్పడం చాలా సార్లు విన్నాను.కనుక అమ్మ,అన్నయ్యల నిర్ణయం పై నాకు నమ్మకం ఉంది. చెప్పింది లలిత సర్దిచెబుతూ.

నీ నోటి నుండి ఈ మాట విన్నాక నాకు చాలా తేలికగా అనిపిస్తోందిపుడు.అలాగే నిన్ను పెళ్లి చేసుకున్న వేళా విశేషం, సేలరీ హైక్ ఈ నెల నుండి కలుస్తుందని ఇప్పుడే మెసేజ్ వచ్చింది. అని మళ్ళీ తన ఫోన్ లో మునిగిపోయాడు శేఖరం.

తర్వాత వ్రతం ముగించుకుని ,శేఖర్ లలితతో కలిసి తన ఇల్లు చేరాడు.లలిత గుండె ధడ,ధడలాడింది.

పనిమనిషి వచ్చి ఇద్దరికీ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి ,హారతిచ్చింది.ఇద్దరూ లోపలికి వెళ్లారు.తర్వాత శేఖర్ తండ్రి మూర్తి గారు ,తన భార్యతో కలిసి బెడ్రూం లోంచి హాల్లోకి వస్తూ ,ఇద్దరినీ చూసి ,అరె ?వాటే సర్ప్రైస్.మాకు పూర్తిగా శ్రమ తగ్గించేసారే.కానీ మొత్తానికి అనుకున్నది సాధించావ్.ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడావ్.అని లలిత వంక చూస్తూ,వీడికి నువ్వంటే చాలా ఇష్టవమ్మా. మీ అన్నయ్య వంకెట్టుకుని మీ ఇంటికి ఒకటికి రెండు సార్లు వచ్చేవాడు.కానీ గడిచిన అయిదేళ్లలో నీకు వాడి ప్రేమ విషయం చెప్పే ధైర్యం మాత్రం చేయలేకపోయాడు.ఇక మీ అన్నయ్యకి కోపం జాస్తి కదా.ఈ విషయం అడిగితే, నా స్నేహం అడ్డు పెట్టుకుని నా చెల్లెలిపై కన్నేస్తావా అని అంటాడేమో అని భయపడి,మాతో గౌరవంగా అడిగించాలనుకున్నాడు.

అయితే ఉద్యోగం సద్యోగం లేకుండా పిల్లనిమ్మని ఏం అడుగుతాం.కనుక ముందు జాబ్ తెచ్చుకుంటాను.అని మమ్మల్ని ఆపేశాడు. అన్నట్టుగానే మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ సంపాదించాడు.దాని ట్రైనింగ్ కోసం రెండు నెలలు డిల్లీ వెళ్ళాడు.ఈలోపు నీ నిశ్చిత్తార్థం జరిగి,పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని ,శుభలేఖలు వేశాక మీ అన్నయ్య వీడికి విషయం ఫోన్ లో చెప్పాడు.అంతే.వీడు మూడు రోజులు అన్నం తినలేదు.తర్వాత మేం చెప్పగా చెప్పగా తేరుకున్నాడు.మీ అన్నయ్య కూడా ఒకటికి పది సార్లు వీడిని నీ పెళ్ళికి రావాలని పిలవడంతో, తప్పక,అయిష్టంగానే నీ పెళ్ళికి వచ్చాడు.ఆఖరికి వీడి మొర భగవంతుడు ఆలకించాడు.నిన్ను వీడికి దగ్గర చేశాడు.చాలా సంతోషం.ఇంతకీ వీడు మీ అన్నయ్యకి ఏం చెప్పి ఒప్పించాడు.ఆ పెళ్లిని ఎలా తప్పించాడు.అడిగాడాయన ఆశక్తిగా.

ఆ మాటకి లలితా,శేఖర్లిద్దరూ ఒకేసారి గట్టిగా నవ్వేశారు.

విషయం అర్దం కానీ మూర్తిగారు,ఇద్దరి వంకా చిత్రంగా చూస్తుండిపోయారు.

ఇప్పుడు లలిత మనసు పూర్తిగా తేలిక పడింది.అన్ని సందేహాలూ ముక్కలయ్యాయి.నేను అనుకున్నట్టే నన్ను నన్నుగా ఇష్టపడే శేఖర్ పెళ్లాడాడు.అవును,నాన్న చెప్పిందే నిజం.ఏది జరిగినా మన మంచికే.థాంక్స్ నాన్నా అనుకుందామె మనసులో.


మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు