యాభై ఏళ్ల పెళ్లానికి ప్రేమలేఖ! - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

yabhai ella pellaaniki premalekha

రాజీ! ఈ వయసులో నేను ప్రేమలేఖ రాయడం..నువ్వు అందుకుని చదవడం విచిత్రంగా ఉంది కదూ. మరేం చేస్తామోయ్, మనదేమో పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఇన్నాళ్ల జీవితంలో ప్రేమలేఖ రాయాలని అనిపించినా, సిగ్గూ, బిడియంతో, పని ఒత్తిళ్లతో కలం కాగితం మీద పెట్టలేకపోయాను. ఎప్పుడో ఒకసారి ‘అది బావుంది, ఇది బావుంది’ అని ప్రశంసించడం తప్ప..కాగితం మీద మనసును పరచలేకపోయాను.
పెళ్లిలో అప్పగింతలవంగానే, పసుపు బట్టల్తో మా ఇంటి గుమ్మం తొక్కి మమ్మల్ని నీ కలుపుగోలుతనంతో, పనితనంతో నీవాళ్లను చేసుకున్నావు. ముఖ్యంగా నన్ను. ఎంతలా అంటే, మా ఇంట్లో పుట్టాల్సిన నువ్వు పొరబాట్న మీ ఇంట్లో పుట్టావేమో అన్నంతగా. ఆడదానికి పుట్టింటి మీద అపేక్ష ఉండడం సహజం. కాని నువ్వు లేకపోతే నేనెక్కడ ఇబ్బంది పడతానో అని పుట్టింటి ధ్యాస, ఇంటిపేరుతో సహా పూర్తిగా వదిలేశావు. సుఖం సంగతేమో కాని కష్టాల్లో మాత్రం నువ్వు తోడుగా లేకపోతే నేనేమయిపోయేవాణ్నో(తల్చుకుంటే ఇప్పటికీ గుండె జారిపోతుంది).

ఇంటికి దీపం ఇల్లాలంటారు. అది నూటికి నూరుపాళ్లు నిజం. నీ దీపకాంతిలోనే నేనూ, పిల్లలం లక్ష్యాల్ని చేరుకోగలిగాం. అందరూ సంపాదనా పరుణ్ని గౌరవిస్తారు కాని నిజానికి మొదటి నమస్కారం మీకే చెందుకుతుంది. ఇల్లు గుట్టుగా, గుంభనంగా నడుస్తోందంటే ఇంటి ఇల్లాలే కారణం. తెల్లవారు ఝామున లేచింది మొదలు తిరగలి రాయిలా గిర గిర తిరిగి మా అవసరాలు తీర్చకపోతే నా ఉద్యోగం, పిల్లల చదువులూ సవ్యంగా సాగేవా?

ఏంటి? ప్రేమలేఖ అంటూ సంసార రామాయణం రాస్తున్నాడు అనుకుంటున్నావా? వయసు అలా రాయించింది..ఎంతైనా కుర్ర వయసు కాదుకదా, చక చక అందమైన కవితలతో ఉత్తరం అదరగొట్టేయడానికి! ఇహ లాభం లేదు మన్మథా వాహయామి... మన్మథా వాహయామి.. ఆఁ.. నా మనసిప్పుడు రసికత్వంతో నిండింది. ఇహ చూడు..ఏంటి బుగ్గలు ఎర్రబడుతున్నాయి..ఇంకా రాయడం మొదలెట్టందే..
మన పెళ్లయిన కొత్తలో నాకొచ్చిన మొదటి జీతంతో నీకు చిలకాకుపచ్చ చీర కొనుక్కొచ్చాను గుర్తుందా? నువ్వు పదే పదే దాన్ని చుట్టుకుని, భుజంమీద జార్చుకుని ఎన్ని సార్లు అద్దంలో చూసుకున్నావో నేను దాపునుండి చూసిన విషయం నీకు ఇప్పటిదాకా తెలియదు కదూ(అలాంటివి పంచుకోవడానికే ఈ ప్రేమలేఖ) ఆరోజు నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను. ఎందుకంటే అప్పటిదాకా నేను ఆడవాళ్లకు బట్టలు కొనలేదు. బట్టల విషయంలో వాళ్ల అభిరుచులూ ఒంటికి నప్పడాలూ కూడా తెలియదు. పైగా నాకు అక్కచెల్లెల్లు లేరు. అయినా నేను తెచ్చింది నీకు నచ్చే సరికి నా మనసు హిమవత్పర్వతాన్నధిరోహించింది. తర్వాత చీర కట్టుకున్న నిన్ను చూసి ఇంద్రలోకం నుంచి జాలువారిన యక్ష కన్యవనుకున్నాను(నిజ్జం).

నేను నగలు, చీరలు కొనిపెట్టడం తప్ప నీకుగా నువ్వేదీ అడిగిన గుర్తులేదు. భార్యలు ఇలా కూడా ఉంటారా?

నేను ఆఫీసు పనిమీద క్యాంపుకెళ్లేరోజొచ్చేదాకా బెంగ అనే పదానికి నాకు అర్థం తెలీదు. ఆరోజు నాకిప్పటికీ గుర్తే! మన పెళ్లై తొమ్మిది నెలలనుకుంటా..

నేను సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చి మరుసటిరోజు అర్జెంట్ పనిమీద బెంగుళూరు క్యాంప్ కెళ్లాలనీ, తిరిగి రావడానికి వారం పడుతుందనీ చెప్పాను. అంతే..

ఎప్పుడూ వెలిగించిన మతాబులా వెలుగుతూండే నీ మోము ఒక్కసారిగా ముడుచుకుపోయింది.

ఆ రాత్రంతా నేను ఎంత సముదాయిస్తున్నా నువ్వు ఏడుస్తూనే ఉన్నావు. మరుసటిరోజు బెంగుళూరు వెళ్లిపోయాను. ఇప్పుడైతే సెల్ ఫోన్లలో మాట్లాడుకోవడం మామూలైపోయింది కాని అప్పుడు మనిద్దరి మధ్యా మాటలు కరువై ఎంత బాధ పడ్డాం? వారం రోజుల తర్వాత ఇంటికొచ్చి గేటి తీసిన నన్ను, నువ్వు కన్నీళ్లతో చుట్టుకుపోయి ఎంతకీ వదల్లేదు. రాత్రంతా మధురానుభూతులను మనసు గంపలో పేర్చుకుంటూనే ఉన్నాను. మరుసటిరోజు నేను ఆఫీసుకు కూడా వెళ్లలేకపోయాను. అప్పుడే కాదు ఇప్పటికీ అది తడి ఆరని మధుర స్మృతి అది.
ఒకసారి ఆఫీసు నుంచి ఇంటికొస్తుంటే ఎవరిదో కార్ గుద్దేసింది. అది విన్న నీ హృదయం బద్దలైంది. పెద్ద ప్రమాదం జరగలేదు కాని హాస్పిటల్లో రెండు రోజులుండాల్సొచ్చింది. కంటికి రెప్పలా చూసుకున్నావు. ఆ సమయంలో పొత్తిళ్లలో పిల్లాణ్ని చూసుకునే అమ్మవయ్యావురా నువ్వు!
కడుపుతో ఉన్నప్పుడు కూడా తొమ్మిదో నెలదాకా పుట్టింటి వాళ్లు పురిటికి పిలుస్తున్నా కాదని నాతోటే ఉండి, వేరెవ్వరు చేసినా నాకు అన్నం సహించదని, ఇంటి పని చేసుకోలేనని.. ఓపిక లేకపోయినా నాకు చేసి పెట్టిన నీ ఔదార్యానికి అప్పుడూ ఇప్పుడూ చేతులెత్తి దణ్నం పెట్టాల్సిందే. నీ రెండు డెలివరీలకీ నువ్వేమైపోతావోనని నేనెంత కంగారు పడ్డానో, కృంగిపోయానో. మొత్తానికి దేవుడు చల్లగా చూశాడు. పండంటి పిల్లల్ని ఇచ్చాడు. వాళ్లని నేను పని ఒత్తిడితో పట్టించుకోపోయినా చక్కగా తీర్చి దిద్దావు. వాళ్లలో అమ్మానాన్నల పట్ల గౌరవం ఉట్టిపడేలా చేశావు. ఇప్పుడు వాళ్లు ఉద్యోగరిత్యా విదేశాల్లో ఉన్నా, మనిద్దరికోసం తల్లడిల్లిపోతుంటారు. మనకు కాస్త నలతగా ఉంటే ఇహ వాళ్ల నుంచి ఆందోళనతో ఒకటే ఫోన్లు, వచ్చిచూస్తామని వేడికోలు. ఎంతమందికుంటారు చెప్పు ఇలాంటి రత్నాల్లాంటి పిల్లలు? దీనికి కారణం నువ్వు కాదూ..

మనసులో ఎన్నో ఊహలు కలగాపులగంగా మెదుల్తున్నాయి. అవన్నీ ఒక్క కాగితంలో పెట్టలేను. నా మనసు అక్షరాల్లో కొంత కనిపిస్తుంది. వాక్యాల మధ్య ఉన్న ఖాళీల్లో మరెంతో అర్థమవుతుంది.

ప్రారంభించడం ప్రేమలేఖ అని ప్రారంభించినా ఇది నీపట్ల నేను వ్యక్తం చేసే కృతజ్ఞతాలేఖగానే మారిపోయింది. బాధ్యతలతో కూడిన ప్రేమ ప్రస్ఫుటమవుతోంది. నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకోలేకపోయినా, నా వల్ల నీ కంట కన్నీరు కారకుండా, మనసు గాయపడకుండా చూసుకునే ప్రయత్నం చేశాను. ఎంతవరకూ సఫలీకృతుడనయ్యానో నువ్వే చెప్పాలి. నేనెంత చేసినా నీ ఓపిక, శ్రద్ధల ముందు మాత్రం దిగదుడుపే!

అయిదవతనంతో భర్త చేతుల్లో పోవాలని స్త్రీలందరూ కోరుకుంటారు. దయచేసి నువ్వలా కోరుకోకు ఎందుకంటే..ఎందుకంటే..నువ్వు లేకపోతే నేను జీవచ్ఛవాణ్ని. ఎంతమంది ఉన్నా, ఎన్ని సంపదలున్నా నేను నేనుగా ఉండను. ఉండలేను. నేను ముందెళ్లి భగవంతుణ్ని నీకు అఖండ పుణ్యం ప్రసాదించమని వేడుకుంటాను. ఈ ఒక్క విషయంలో నాతొ వ్యతిరేకించినా దయచేసి సహకరించు..

ఏంటీ కళ్లు తుడుచుకుంటన్నావా? పిచ్చీ..నీలాంటి భార్య దొరికిన నా జీవితం పరిపూర్ణమయింది. మీ భార్యల్లాగా వ్రతాలు చేయలేదు, నోములూ నోచలేదు. ప్రతిక్షణం నువ్వే నా భార్యవు కావాలని భగవంతుణ్ని మౌన ప్రార్థనలు చేశాను. నాకు తెలుసు ఆయన నాకు వరమిస్తాడు. నిన్ను చల్లగా చూస్తాడు. ఉంటాను

నీ
..............

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు