ధరణి - వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాస మూర్తి

Dharani Telugu Story

"ఏమిటి ధరణి నువ్వు చెప్పేది. నీకేమైనా బుద్ధుంధా? నలుగురికీ తెలిస్తే నవ్విపోతారు. దానితో పోతుందా ఏమిటి. తెల్లారిలేస్తే వీధిలో తిరగగలమా? నలుగురికీ మొహం చూపించుకోగలమా. ఏదో నీ కర్మ కాలి నీ మొగుడు ఆ ఏక్సిడెంట్‌ లో పోపోతే నీకీ ఖర్మ పట్టేది కాదు కదా. పూర్తిగా నాలుగు సంవత్సరాలు కూడా నిండని కూతురు, దానికి ఇప్పుడిప్పుడే జ్నానం వస్తోందని చెప్పాలి. ఈ విషయం తెలిస్తే దాని చిన్న గుండెలో ఎన్ని అలజడలు మొదలవుతాయో ఏమైనా గ్రహించావా. అంతగా ఆగలేకపోతే ఎవడ్నో ఒకడ్ని తెచ్చి ముడిపెట్టేవాళ్ళం కదా! ఇదేం పని, ఇదేం చోద్యం." ఆపకుండా భానుమతి తిట్టిపోస్తోంది కూతుర్ని.

కళ్ళనించి కారుతున్న నీరు తప్ప ఒక్కముక్క కూడా రావడం లేదు ధరణి నోటినుంచి.

*****

గదిలో మంచం మీద పడివున్న తండ్రికి మందులందిస్తోంది ధరణి. 'ఏంటమ్మా... అలా వున్నావ్‌?' అన్నట్టు చూసాడు. నోట మాట రాలేదు ధరణికి. పుట్టెడు దుఖాన్ని గొంతులోనే మింగేసింది. ఇంతలో బయటనుంచి వచ్చిన తల్లి విసురుగా కూతురు చేతిలోని మందుసీసాని లాక్కుంది.

"నీ నిర్వాకం చూస్తూ వూరుకోలేం. ఈ వయస్సులో ఈ క్షోభని తట్టుకొనే శక్తి నాకు లేదు. వీలైతే కడుపు తీయించుకో, లేకపోతే తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వేరే ఎక్కడైనా వుండి నీ పాట్లు నువ్వు పడు." తీవ్రంగా చెప్పింది తల్లి.

అక్కడ వుండాలనిపించలేదు ధరణికి. భారం గా అడుగులు వేసుకుంటూ బయటికి నడుచుకుంటూ వెళ్ళింది.

తన చిన్ననాటి స్నేహితురాలు దమయంతికి ఫోన్‌ చేసింది. జరిగిన విషయాన్నంతా దాచకుండా చెప్పింది. దమయంతికి ఒకింత మనసులో ఆందోళన గానే వున్నప్పటికీ స్నేహితురాలి పరిస్తితిని అర్థం చేసుకుంది. తన స్నేహ హస్తాన్ని అందించడానికి ముందుకు వచ్చింది.

తన భర్తని ఒప్పించి తన ఇంటిలోని మేడమీద గది ఒకటి ఖాళీ చేసి అక్కడ వుండే ఏర్పాటు చేసింది.

భానుమతికి ఇదంతా పెద్ద వేదన గా తయారయింది. కానీ చేసేదేం లేక సరిపెట్టుకుంది.

తరచూ ఆసుపత్రికి వెళుతూ చెకప్‌ లు చేయించుకుంటూ తన ఆరోగ్యాన్ని, కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటొంది ధరణి. తనకి కావలసిన అన్ని ఏర్పాట్లు అందేలా చూస్తున్నారు అక్కడి వైద్యులు.

ఇలా వుండగా, ఒకరోజు దమయంతి ధరణి ని అడిగింది. "ఈ విషయాలన్నీ మీ వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఎందుకు అసలు విషయాన్ని దాచి దోషిలా బతకటం" అంది.

"చెప్పొచ్చు కానీ చెబితే ఒప్పుకొనే అంత విశాల హృదయం వాళ్ల దగ్గర వుందని నేను అనుకోవటం లేదు. మా నాన్నగారికి విధి వైపరీత్యం వల్ల పక్షవాతం వచ్చి కాలు, చేయి పని చేయకపోవటం తో పాటు నోటిమాట కూడా పడిపోయింది. ఒక్కసారిగా మా జీవితాలు వీధిన పడ్డాయి. అసలే అంతంతమాత్రం బతుకులు. దిగువ మధ్య తరగతి కుటుంబం. నాన్నది చాలీ చాలని జీతంతో పనిచేసే ప్రైవేటు ఉద్యోగం. సింపుల్‌ గా చెప్పాలంటే రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ఊహించని ఉపద్రవానికి ఉప్పెన తోడయినట్టు మా నెత్తిన పిడుగు పడ్డట్టయింది. అప్పటికే భర్తని కోల్పోయి వాళ్ల నెత్తిన కుంపటిలా మారిన నాకు అసహాయమైన పరిస్థితిలో వున్న తండ్రిని చూసి నిస్సహాయ స్థితిలో కూరుకుపోయాను. ఓ పక్క సరైన చదువులేక, చేయడానికి పనీలేక తిరుగుతున్న తమ్ముడు. ఈ పరిస్థితులన్నిటినీ తట్టుకోలేక తనువు చాలిద్దామనుకున్నాను. నిద్రమాత్రలు మింగాను. కానీ నాకు చావు దూరమయ్యిందో లేక నేనే చావుకు దూరమయ్యానో మొత్తానికి ఇలా బతికాను. భగవంతుడు నాకు ఈ విదం గా సహాయపడే అవకాశాన్ని కల్పించడం కోసమే నన్ను బతికించాడులా వుంది.

ఆ ఆసుపత్రిలోని రమ అనే డాక్టర్‌ నా పరిస్థితిని పూర్తిగా అర్ధం చేసుకుంది. నీకు మనస్పూర్తిగా సహాయం చేస్తానని అత్మీయంగా చెప్పింది. నువ్వు చేసే పని ద్వారా రెండు కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని పూర్తిగా వివరించింది. నేనున్న పరిస్థితిలో నాకు కూడా ఇది అనివార్యం లా అనిపించింది. సరోగసీ ద్వారా నువ్వు ఒక బిడ్డకు జన్మనివ్వాలని అలా ఇవ్వడం ద్వారా సంతానం లేని ఆ దంపతులు ఎంతో ఆనందాన్ని పొందుతారని చెప్పింది. వాళ్ళిచ్చే ఆర్ధికసహాయం ద్వారా నా కుటుంభం కష్టాల కడలినుండి గట్టెకుతుందని అనిపించింది. నాకు ఇంతకు మించి మరో తోవ కనపడలేదు.

ఈ విషయాన్ని నోట మాట పలకలేని స్థితిలో వున్న నా తండ్రికి వివరించలేను. కడుపులో పెట్టుకోవలసిన తల్లి నన్ను అర్థం చేసుకోవడానికి నాకు జన్మనిచ్చిన తల్లి కాదు. అమ్మ లాంటి పిన్ని. ఇటువంటి స్థితిలో వున్న నేను నా కుటుంబం కోసం చేసింది తప్పా..." అంది.

"ధరణి... నువ్వు నిజంగా సార్ధక నామధేయురాలివి. స్త్రీ లోకానికే మణిపూస లాంటి దానివి." అంటూ ధరణి తలమీద మృదువుగా నిమిరింది దమయంతి.

మరిన్ని కథలు

Chadastam
చాదస్తం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Akrandana
ఆక్రందన
- జి.ఆర్.భాస్కర బాబు
Eeroju pandaga
ఈ రోజు పండగ
- Sreerekha Bakaraju
Ide naa Ugadhi
ఇదే నాఉగాది.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Amma nerpina sadgunam
అమ్మ నేర్పిన సద్గుణం
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kaay kaay
కాయ్.. కాయ్ ( కథ )
- హరి వెంకట రమణ
Tana daakaa vaste
తనదాకా వస్తే..!
- - బోగా పురుషోత్తం
Kotta konam
Kotta konam
- Prabhavathi pusapati