ఇంకా కొంత మంది నాటక ప్రియులు, పోషకులు ప్రతీ సంవత్సరం నాటక పోటీలు, పరిషత్తులు జరుపుతూ వుండటంతో నాటక కళ ఇంకా కొన వూపిరితో కొట్టుకుంటోంది.
నారాయణరావు కి నాటకాల పిచ్చి, ఆ పిచ్చితోనే నా.నా. సమాజాన్ని స్థాపించాడు. నానా అంటే నారాయణరావు నాటక సమాజం. ఆ సమాజం పేరుతో నాటకాలు ప్రదర్శించే వాడు. టి.వి. ఫ్లేవర్ వల్ల నాటకాల పవర్ తగ్గింది. దీంతో నా.నా. సమాజం నాటకాలు వెయ్యాలంటే నానా తిప్పలు పడేది. కానీ నారాయణరావు నాటకాలు మానలేక తను సృష్టించిన సమాజాన్ని తనే చంపుకోలేక ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎలాగో అలాగ చిన్న చిన్న నాటికలు ప్రదర్శిస్తూనే వున్నాడు. ఇక్కడ ఆత్మాభిమానాన్ని చంపుకోవటం అంటే కళాకారులు కనిపిస్తే నాటకం వేస్తారా అని అడుక్కోవటమే. దానికి కారణం ఏమిటంటే నటన రాక పోయినా, బాష పలకడం, భావం పలికించడం రాకపోయినా నటుడిగా చలామణీ చేసే కళారంగం ఒకటుంది. అదే టి.వి.సీరియల్స్ రంగం. దాంతో అందరూ నాటక రంగాన్ని వదిలి ఆ రంగం వైపు దూకుతున్నారు. దీనికీ ఓ చిన్న కారణం వుంది. ఆ రంగంలో కళాకారులకు హార్దిక మరియు ఆర్ధిక లాభం దొరకటమే. దాంతో నాటకాలు కుంటుపడ్డాయి.
నా.నా. సమాజంలో నారాయణరావు తో పాటే వున్న ఫౌండర్ మెంబర్ గోవిందరావు టి.వి రంగంలో ఓ చిన్న రచయితగా, నటుడిగా స్థిర పడ్డాడు. ఎన్నో సార్లు నారాయణరావు ని ఈ రంగంలోకి దూకమని అడిగాడు.
“నాటక రంగం అన్నింటికీ మాతృ సంస్థ. దాన్ని వదలటం నాకిష్టం లేదు." అన్నాడు నారాయణరావు. “నిన్ను వదలమనలేదు, కాకపోతే దీనిని కూడా రుచి చూడు" అన్నాడు గోవిందరావు.
దాంతో నారాయణరావుకు అందులో వున్న ఆనందం తెలుసు కుందామని ప్రయత్నించాడు. కానీ అందులో నారాయణరావుకి ఆనందం దక్కక పోగా అతనిలో వున్న కళాకారుడికి అవమానం జరిగింది.
ఓ రోజు రవీంద్రభారతిలో తన సమాజం తరపున ప్రదర్శిస్తున్న నాటకానికి వెళుతూ అద్దం ముందు నిలబడి తల దువ్వుకుని పక్కనే వున్న డైరీని తీసుకున్నాడు. అందులోనుంచి ఐదు వందల నోటు కింద పడింది. నారాయణరావు ఆ నోటుని తీసుకుని అద్దం ముందు పెట్టి చూసాడు.
సరిగ్గా పది రోజుల క్రితం ఏం జరిగిందో అద్దంలో అతనికి గతం కనిపించింది. అది ఏంటంటే...?
ఆ రోజు ఓ ఫోను వచ్చింది. ఫోను తీసి ‘హలో’ అన్నాడు.
‘నారాయణరావు గారా’
‘అవునండీ... నారాయణరావు నే మాట్లాడుతున్నా’
‘నమస్తే సార్’
‘నమస్తే... చెప్పండి.’
‘సార్ నేను జంబలకిడి పంబ బేనర్ నుంచి మేనేజర్ని మాట్లాడుతున్న.’
‘జంబలకిడి పంబ బేనరా’
‘జీళ్ళ పాకం... సీరియల్... ఆ... అవునండి.’
‘రేపు మీకు షూటింగు వుంది. అందులో మీరు తండ్రి పాత్ర చెయ్యాలి. మీ గురించి గోవిందరావు గారు చెప్పారు.’
నారాయణరావుకి ఆనందం ఆశ్చర్యం కలిగాయి.
‘మీ పేరు’ నారాయణరావు అడిగాడు
‘నాపేరు చంద్రం. మేనేజర్ని’ అన్నాడు చంద్రం
‘మీరెక్కడ వుంటారు’
‘వనస్థలి పురంలో’
‘షూటింగు పటాన్చెరు దగ్గర’
‘పటాన్చేరువా’
‘అవునండి. పటాన్చెరువు బస్టాండ్ దగ్గిరికి వచ్చి ఫోన్ చెయ్యండి. రేపు ఆరు గంటలకల్లా రావాలి. మీది కంటిన్యుటీ కారక్టర్. తండ్రి పాత్రలో మీకు రేపు మూడు సీనులు వుంటాయి. మొదటి సీనులో మీరు జమిందారు. అంటే కోటు, ఫాంటు, బ్లాక్ షూస్, టై తెచ్చుకోవాలి. అలాగే రెండో సీనులో మామూలు మిడిల్ క్లాసు తండ్రి. అంటే మామూలు ఫాంటు, షర్టు, మంచివి డార్క్ కలర్ వి రెండు జతలు తెచ్చుకొండి. అలాగే మూడో సీనులో చితికిపోయిన పేద తండ్రి. చిరిగి పోయిన బనీను, తెల్ల పంచె, తువ్వాలు. డార్క్ కలర్ వి రెండు జతలు తెచ్చుకొండి. ఎందుకయినా మంచిది అలాగే చిరగనివి కూడా రెండు జతలు తెచ్చుకోండి. రేపు అరుగంటలకల్లా లోకేషన్ లో వుండాలి. వుంటా సార్.' అంటూ ఫోన్ కట్ చేసాడు.
నారాయణరావు కనిపించిన అందరికీ తనకి టి.వి సీరియల్ లో నటిస్తున్నానంటూ అందరికీ చెప్పాడు. కానీ సూటు, టై లేకపోవటం తో పక్కనే వున్న సుబ్బారావుని అడిగాడు. సుబ్బారావు దగ్గర టై ఒక్కటే వుండటం తో అందరి దగ్గరా తలొకటి ముష్టి తెచ్చుకుని డ్రెస్ సమకూర్చుకున్నాడు. చంద్రం చెప్పినట్టు అన్నీ వున్నాయా లేదా అని చూసుకుని రాత్రే బాగ్ లో సర్దుకున్నాడు.
గదిలో తలుపు వేసుకుని అద్దం ముందు నిలబడి తండ్రి పాత్ర. అందులో మూడు సీనులు. జమిందారు తండ్రి , మామూలు తండ్రి, చితికిపోయిన తండ్రి. డైలాగులు ఎలా వుంటాయో తెలీదే... ఎలా... ఆ ఎలా వుంటేనే పాత్రలో జీవించాలి. అంటూ అద్దం ముందు అన్ని పాత్రల్లో నటించడం మొదలుపెట్టాడు. జమిందారుగా హుందాగా, మామూలు తండ్రి గా సగటు మనిషిగా, చితికిపోయిన తండ్రి గా దీనంగా ఆహ భావాలను అద్భుతంగా నటించి, రేపు కెమేరా ముందు ఇరగదీయాలి అనుకున్నాడు. రేపు ఉదయం ఆరు గంటలకి పటాన్చెరు బస్టాండ్ లో వుండాలంటే ఇంటి దగ్గరినుంచి కనీసం నాలుగు గంటలకయినా బయలు దేరాలి. అంటే నేను మూడు గంటలకి లేచి తయారుకావాలి అనుకుంటూ రెండున్నరకి అల్లారం పెట్టుకుని పడుకున్నాడు.
టి.వి.లో నటిస్తున్నానన్న ఆనందంతో నారాయణ రావుకి నిద్ర పట్టలేదు. అరగంటకోసారి అలారం మోగలేదేంటి అనుకుంటూ లేచి చూసుకుంటూ రెండు గంటలకే లేచి తెమిలాడు. ఆ రోజు ఇంట్లో అందరికీ జాగారమే అయ్యింది. మూడు గంటలకే నారాయణ రావు మోటారు సైకిల్ మీద పటాన్చెరు బయలుదేరాడు. హమ్మయ్య వెళ్ళాడురా బాబూ అనుకుంటూ అందరు హాయిగా పడుకుని ఉదయం తొమ్మిది గంటలకి లేచారు.
ఆరు గంటలకల్లా నారాయణ రావు పటాన్చెరు బస్టాండ్ చేరి ఇరవయ్ - ముప్ఫై సార్లు ఫోన్ చేసి మొత్తానికి లొకేషన్ చేరుకున్నాడు.
నారాయణరావు లొకేషన్ కి వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు. లొకేషన్ ఇదేనా కాదా... తప్పుగా వచ్చానా అనుకుంటూ కంగారు పడ్డాడు. టైం ఏడు అయ్యింది. మెల్లిగా ప్రోడక్షన్ వేన్ వచ్చింది. ఇంకో అరగంటకి రెండు కార్లు, రెండు వేన్ లు వచ్చాయి. కెమెరా సామానులు, లైట్లు, రిఫ్లెక్టర్ బోర్డులు దిగాయి. నారాయణ రావు కంగారు తగ్గింది. చంద్రం ఎవరో తెలీక ఇద్దరు, ముగ్గుర్ని అడిగి చంద్రాన్ని కనుక్కుని ‘సార్... నేనే నారాయణరావుని' అంటూ పరిచయం చేసుకున్నాడు.
‘అలాగా... కూర్చోండి...' అంటూ పట్టించుకోకుండా వెళ్లి పోయాడు.
నారాయణ రావు కి ఏం చెయ్యాలో తెలీలేదు. అంతా కొత్త. కొత్తవాళ్ళు, కొత్త వాతావరణం. కొత్త ఫీలయ్యి అక్కడే వున్న కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో ప్రొడక్షన్ బాయ్ ఫ్లాస్క్ లో టీ తెచ్చి ప్లాస్టిక్ గ్లాసులో పోసి ఇచ్చాడు. నారాయణరావు తీసుకుని తాగాడు.
ఇంతలో చంద్రం ఓ వ్యక్తి తో వచ్చాడు.
‘ఈయనకి తండ్రి పాత్ర మేకప్ చెయ్యండి. నారాయణరావు గారు వెళ్ళండి. అవును డ్రెస్లు చెప్పినవన్నీ తెచ్చారా' అన్నాడు చంద్రం.
‘తెచ్చాను సార్ చూస్తారా’ అంటూ ఆత్రంగా అడిగాడు.
‘వద్దులెండి. తర్వాత చూద్దాం’ అంటూ వెళ్ళిపోయాడు చంద్రం.
నారాయణరావు ఫీలయ్యి మేకప్ కోసం ఆ వ్యక్తి వెనకాలే వెళ్లాడు.
నారాయణరావు కి మేకప్ వేస్తున్నాడు. ఆ వ్యక్తి.
‘జమిదారు తండ్రి. మధ్య తరగతి తండ్ర్రి, పేద తండ్రి అన్నారు. ఏ పాత్ర కి మేకప్.’ అంటూ అడిగాడు నారాయణరావు.
‘తండ్రి పాత్ర కి వేస్తాను. ఏది కావాలంటే అప్పుడు టచ్ అప్ చేద్దాం.’ అంటూ వేసాడు.
టైం తొమ్మిదయింది.
నారాయణ రావు మేకప్ వేసుకుని కూర్చున్నాడు.
అసిస్టెంట్ డైరెక్టర్. డైరెక్టర్ కి సీను పేపరు చూపిస్తున్నాడు.
ప్రొడక్షన్ వాళ్ళు టేబుల్స్ వేసి అందరికీ టిఫిన్ ఎరేంజ్ చేసారు. అందరూ టేబుల్స్ దగ్గర కూర్చున్నారు.
ప్రొడక్షన్ చీఫ్ వాళ్లకి టిఫిన్స్ పెట్టాడు.
దూరంగా ఇంకో టేబుల్ మీద మిగిలిన వాళ్లకి టిఫిన్స్ ఎరేంజ్ చేసారు.
చంద్రం వచ్చి ‘రావుగారు టిఫిన్ చెయ్యండి' అని చెప్పి వెళ్లి పోయాడు.
నారాయణరావు అందరితో టిఫిన్ చేసి మళ్ళీ వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు. పలకరిద్దామంటే ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు. మిగిలిన వాళ్ళు ఎవరూ తనన్ని చూసీ చూడనట్టు చూస్తున్నారు.
ఇద్దరు ముగ్గురుని పలకరించినా వాళ్ళు కూడా ఏదో పలికీ పలకనట్టు మాట్లాడారు.
నారాయణరావు గోవిందరావు కోసం ఎంక్వయిరీ చేసాడు. గోవిందరావు గారు ఇవ్వాళ రారు. అంటూ ఓ వ్యక్తి చెప్పాడు.
మళ్ళీ ప్రొడక్షన్ బాయ్ ప్లాస్టిక్ గ్లాసులో టీ తెచ్చి ఇచ్చాడు. ఇంకో ప్రొడక్షన్ బాయ్ ఓ ట్రే లో పింగాణీ కప్పులతో టీ ని డైరెక్టర్, కెమెరామెన్, హీరో జానకిరాం లకి ఇస్తున్నాడు. నారాయణ రావు తన చేతిలో ప్లాస్టిక్ కప్పు వంక చూసుకొన్నాడు.
ఓ అరగంటలో షూటింగు మొదలయింది. డైరెక్టర్ మానీటర్ లో చూస్తున్నాడు. హీరో యాక్షన్ చేస్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ప్రామ్ప్టింగు చేస్తున్నాడు. ‘అమ్మా... నాకు ఉద్యోగం వచ్చింది. వెంటనే చేరాలి.’ అది విని హీరో జానకిరాం అదే డైలాగు చెబుతున్నాడు. మూడు టేకుల్లో ఓ.కే. అయ్యింది. అందరూ చప్పట్లు కొట్టారు.
నారాయణ రావు ఈచిన్న డైలాగు కి ప్రామ్ప్టింగు కావాలా. అనుకున్నాడు.
కాసేపు చూసి నా డైలాగులు ఎలా వుంటాయో అనుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ ని సీను పేపర్ అడిగాడు.
‘అవన్నీ మీకెందుకు ఇపుడు. మీ టైం వచ్చినపుడు ఇస్తాం. మీరు వెళ్లి రిలాక్స్ అవ్వండి.’ అన్నాడు.
‘ఏం లేదు కొంచెం ప్రాక్టీసు చేసుకుందామని.'
‘ఏం అవసరం లేదు. మేం చెబుతాం. మీరు చెప్పండి.’ అంటూ వెళ్లిపోయాడు అసిస్టెంట్ డైరెక్టర్
నారాయణరావుకి ఏం అర్ధంకాలేదు. మౌనంగా కూర్చున్నాడు.
టైం పన్నెండు అయ్యింది. నారాయణరావు షూటింగు ఎలా జరుగుతుందో అంతా చూస్తున్నాడు.
ఒంటి గంట అయ్యింది. డైరెక్టర్ బ్రేక్ చెప్పాడు.
‘నారాయణరావు గారు లంచ్ చెయ్యండి' అంటూ చెప్పి వెళ్లిపోయాడు చంద్రం.
లంచ్ ఎక్కడా అని చూసాడు. ఓ చోట టేబుల్స్ వాటిమీద భోజనానికి అన్నీ సర్దివున్నాయి. నారాయణరావు వెళ్లి కూర్చున్నాడు. మీకు ఇక్కడ కాదు లెండి అంటూ చెప్పాడు. ఓ ప్రొడక్షన్ బాయ్. నారాయణరావు లేచి వెళ్లాడు. ఇంకో చోట పెద్ద టేబుల్స్ కుర్చీలు వేసి వున్నాయి. అక్కడికి వెళ్లి కూర్చున్నాడు. ‘సార్ మీకు ఇక్కడ కాదు అక్కడ అంటూ చూపించాడు. నారాయణరావు చూసాడు. అక్కడ అందరికీ ప్లేట్లు చేతికి ఇస్తున్నారు. నారాయణరావుకి కూడా ఆ ఓ ప్లేటు ఇచ్చాడు. అక్కడ వున్న మోడాల మీద కూర్చున్నాడు నారాయణరావు. లైటు బాయ్స్, అసిస్టెంటులు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ కూర్చుని వున్నారు. నారాయణరావు వారితో పాటూ కూర్చుని ఎలో అలా లంచ్ కానిచ్చి అయింది అనిపించాడు. మళ్ళీ షూటింగు మొదలయింది. ఇంకా నారాయణరావు కి పిలుపు రాలేదు. చిరాగ్గా ఫీల్ అయ్యాడు.
ఇంతలో చంద్రం వచ్చి 'ఓసారి టచప్ చేయించుకోండి' అన్నాడు.
‘నా కారెక్టర్ ఎప్పుడు వస్తుంది’ అంటూ అడిగాడు నారాయణరావు.
‘వస్తుంది ముందు మీరు టచప్ చేయించుకోండి’. అంటూ వెళ్లాడు.
నారాయణరావు హేపీ గా తన సీను వస్తోందని వెళ్లి మళ్ళీ టచప్ చేయించుకున్నాడు.
గడియారం ఐదు అయ్యింది.
‘ఏడయ్యా తండ్రి పాత్ర వేసే ఆయన? ఎక్కడ?’ అంటూ డైరెక్టర్ అరిచాడు.
నారాయణరావుకి మండుటెండ లో వాన కురిసినట్టు అనిపించింది.
‘నేనేసార్' అంటూ వెళ్లాడు.
డైరెక్టర్ చూసి ఓకే అన్నాడు. అసిస్టెంటు డైరెక్టర్ ని పిలిచి ‘డ్రెస్ ఏంటి' అంటూ అడిగాడు.
‘పేద తండ్రి సీను సార్’ అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్.
‘అయితే చిరిగిపోయిన పంచె, బనీను, తువ్వాలు వెయ్యండి’ అన్నాడు డైరెక్టర్.
‘నేను తెచ్చుకున్నా. నాదగ్గర రడీగా వుంది సార్’ అన్నాడు నారాయణరావ్.
‘అలా అయితే వేసుకుని రండి’ అన్నాడు డైరెక్టర్.
‘త్వరగా వెళ్లి వేసుకురండి. లేటవుతోంది.’ అంటూ కసిరాడు అసిస్టంట్ డైరెక్టర్.
‘లేటవుతోందా... ఉదయం ఆరింటికి వచ్చాను సార్’ అన్నాడు నారాయణరావు.
‘సరేలెండి... త్వరగా రండి’ అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్.
‘మొదటి సీను పేద తండ్రి. సెంటిమెంటు సీను. ఆదరగొడతా' అనుకుంటూ డ్రెస్ వేసుకుని వచ్చాడు.
డైరెక్టర్ చూసి ‘బాగుంది’ అన్నాడు.
‘సార్. సీను పేపర్ ఇస్తారా’ అడిగాడు నారాయణరావు.
‘ఎందుకు మేం చెబుతాం. మీరు విని చెప్పెయ్యండి’ అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్.
నారాయణరావు కి అర్ధం కాలేదు. ‘ఓసారి మాటర్ పూర్తిగా చూడనీయండి’ అంటూ పేపర్సు చూసుకుని రెండు నిముషాల్లో సీను బట్టీ పట్టి ఇచ్చేసాడు.
ఓ ఐదు నిముషాల్లో సీను మొదలు అయ్యింది.
నారాయణరావు పేద తండ్రి వేషం లో ఓ అమ్మాయితో హీరో జానకిరాం ముందు నిలబడి వున్నాడు.
డైరెక్టర్ ‘యాక్షన్' అన్నాడు.
‘అయ్యగారు మీ కూతురు రాధని ఈ చేతులు మీదుగా పెంచి పెద్ద చేసాను’ అంటూ బాధగా ఆర్ద్రతతో చెప్పాడు.
‘కట్' అంటూ అరిచాడు డైరెక్టర్.
నారాయణరావు ఆగిపోయాడు.
‘ఎందుకండి అంత ఓవర్ యాక్షన్ చేస్తారు. మామూలుగా చెప్పండి చాలు.’ అన్నాడు డైరెక్టర్.
నారాయణరావు కి అర్ధం కాలేదు.
మళ్ళీ యాక్షన్ అంటూ అరిచాడు.
అదే డైలాగు మెల్లిగా చెప్పాడు.
మళ్ళీ ‘కట్' అంటూ అరిచాడు.
‘అబ్బా అదేంటండి సెంటిమెంటు డైలాగు అంత మెల్లిగా చెబుతారు. కాస్త గట్టిగా చెప్పండి.’ అంటూ మళ్ళీ ‘యాక్షన్' అంటూ అరిచాడు. డైరెక్టర్.
నారాయణరావు బాధగా చెప్పాడు.
‘కట్... అంత బాధ అవసరం లేదు. మోహంలో ఎక్స్ ప్రెషన్ అవసరం లేదు. మామూలుగా చెప్పండి. ప్రాణం తియ్యకండి... ఇదివరకు ఎప్పుడయినా చేసారా' అడిగాడు డైరెక్టర్.
‘చాలా నాటకాలు వేసాను సార్. చాలా ప్రైజులు వ చ్చాయి.’ అన్నాడు ఆనందంగా నారాయణరావు.
‘అదీ... ఎవడయ్యా నాటకాల వాళ్లకి కేరక్టర్ చెప్పింది. ఓవర్ యాక్షన్ చేస్తారు... సార్ ఇది నాటకం కాదు. టి.వి. సీరియల్. జాగ్రత్తగా... మామూలుగా చెయ్యండి.' అన్నాడు చిరాగ్గా డైరెక్టర్.
‘అలాగే సార్’ అన్నాడు నారాయణరావు.
‘ఓకే. యాక్షన్’ అన్నాడు డైరెక్టర్.
నారాయణరావు మోహంలో ఎటువంటి ఫీలింగులేకుండా, మాటల్లో ఎటువంటి బాధ లేకుండా బాడీలో అటువంటి నటన లేకుండా అదే డైలాగు చెప్పాడు.
‘షాట్ ఒకే'. అన్నాడు డైరెక్టర్. అలా నాలుగు డైలాగులు చెప్పించి ‘క్లోజులు తీసుకోండి' అంటూ డైరెక్టర్ సిగరెట్టు కాల్చుకోడానికి వెళ్లి పోయాడు. నారాయణరావు ని కెమెరా ముందు నిలబెట్టి ‘పైకి చూడండి, కిందకి చూడండి, అటు చూడండి, ఇటు చూడండి, తల నిలువుగా వూపండి, అడ్డంగా వూపండి. ఓసారి అటునుంచి ఇటు చూడండి, ఓసారి ఇటు నుంచి అటు చూడండి. ఓకే. అయిపొయింది. వెళ్ళండి.' అన్నాడు కో డైరెక్టర్.
‘ఇంకా రెండు సీన్లు వున్నాయి అన్నారు.’ అన్నాడు నారాయణరావు.
‘లేవు. ఇదొక్కటే. మీకు పేకప్. వెళ్ళచ్చు.’ అంటూ వెళ్లిపోయాడు కో డైరక్టర్.
అప్పటికి టైం రాత్రి పది అయ్యింది. నారాయణరావు బాధగా మేకప్ తుడిచేసుకున్నాడు.
చంద్రం వచ్చాడు. ‘సార్ ఇవిగో మీ అయిదువందలు. బాగా చేసారు. వచ్చినందుకు చాలా థాంక్స్.' అంటూ ఇచ్చాడు.
‘సార్ మూడు సీనులు, అయిదారు డ్రెస్సులు తెచ్చుకోమన్నారు.'
‘అదా... అది మీరు రావటం కాస్త లేటయితే ఇంకో అతనికి ఇచ్చేసాం.'
‘నేను రావటం లేటయిందా. ఉదయాన్నే అరుగంటలకి రమ్మన్నారు సార్. అందరికంటే ముందు వచ్చింది నేనే సార్. రాత్రి ఆరుగంటల వరకు పనే లేదు.' అన్నాడు నారాయణరావు.
‘ఈ ఫీల్డు లో ఇంతే. ఇలాగే చెబుతారు సార్... తీసుకోండి. ఈసారి పెద్ద వేషం చూద్దాం.' అంటూ ఐదు వందలు నారాయణరావు చేతిలో పెట్టి వెళ్లిపోయాడు.
నారాయణరావు ఏడవలేక ఆ ఐదు వందలు వంక చూసుకున్నాడు.
గతం లోంచి వర్తమానం లోకి వచ్చి భోరుమంటూ ఏడ్చి’ ఈ ఐదు వందలుని ఖర్చు పెట్టకూడదు' అనుకుంటూ డైరీ లో పెట్టుకున్నాడు.
ఇంతలో నారాయణరావు ప్రతిబింబం ‘హలో బాసూ ఎందుకు ఏడుస్తావు. అలాంటి డైరెక్టర్లు వున్నంత కాలం టి.వి.లో నటించడానికి కావాల్సింది నటన కాదురా... నటన వచ్చినట్టు నటించడం. అది నీ లాంటి నిజమయిన నటులకి చేత కాదు. అందుకని అలా ఏడవకుండా నీకు చేతనయినంత వరకు నాటకాన్ని బ్రతికించు’. అంటూ మాయం అయ్యింది.
ఇంతలో నారాయణరావు కి ఫోన్ వచ్చింది.
ఫోను తీసి ‘హలో’ అన్నాడు నారాయణరావు
‘నారాయణరావు గారా?’
‘అవునండి నారాయణరావునే మాట్లాడుతున్నా. చెప్పండి
‘నమస్తే సార్. నేను జంబలకిడి పంబ బేనర్ నుంచి మాట్లాడుతున్న.’
‘సారీ రాంగ్ నెంబర్' అంటూ ఫోన్ కట్ చేసాడు నారాయణరావు. కళ్ళు తుడుచు కుంటూ.