వినాయకుడి భూలోక యాత్ర - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Vinayakudi Bhooloka Yatra

తెల్లవారు ఝామున...

కైలాసం లో...

"పాహిమాం పరమేశ్వరా... పాహిమాం... పాహిమాం..." దేవ భక్తగణంతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోతోంది.

రజత సింహాసనం పై పార్వతిదేవీ సమేతుడై ఆశీనుడై వున్న పరమేశ్వరుడు అర్ధనిమీలిత నేత్రాలతో చిరునవ్వులు చిందిస్తూ అందరి వంక ఒకమారు చూసి "మీ అందరూ ఇక్కడకు ఏతెంచిన కారణం బేమిటి" అని అడిగాడు.

"మహాప్రభో మీకు తెలియనిదా? సర్వం తెలిసిన యోగీశ్వరులు మీరు!"

పరమేశ్వరుడు పార్వతీదేవి వంక ఒకమారు నవ్వుతూ చూసి" మీ నోటి నుండి వినాలని" అన్నాడు.

"స్వామీ! వినాయకచవితికి పట్టుమని రెండు రోజులు లేదు. మా అందర్నీ సర్వకాల సర్వావస్తల్లోనూ విఘ్నాలనుండి కాపాడుతున్న మన విఘ్ననాయకుడికి ఎప్పటిలానే ఏదో మాకు తోచినంతలో కాస్త ఘనంగా పత్రిపూజ చేసి చివరాఖర్న వ్రతకథ విని కాసిన్ని అక్షింతలు తల మీద వేసుకుని నీలాపనిందల్నుండి మమ్ము మేము కాపాడు కోవాలని మా కోరిక! అంతే స్వామి!" అన్నారు.

శివుడోమారు కన్నులు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళాడు.

’అదేంటి ‘తధాస్తు’ అనకుండా పరమేశ్వరుడు అలా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు’. అనుకుని దేవుళ్ళందరూ సందిగ్ధావస్థలో వున్నారు.

అప్పుడు... సరిగ్గా అప్పుడు ఎలకవాహనం మీద నెమ్మదిగా వచ్చాడు వినాయకుడు.

"విఘ్ననాయక వినాయక... పార్వతి తనయ వినాయక... మూషిక వాహన వినాయక" పాడడం మొదలెట్టింది దేవ భక్త బృందం.

"ఇంక ఆపండి" చిరాగ్గా అన్నాడు.

ఆ వాగ్ధాటికి శివుడు కూడా కళ్ళు తెరిచి వినాయకుడి వంక చూశాడు.

అక్కడంతా చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది.

"ఏమిటి నాయనా ఆ చిరాకు?" ప్రసన్న వదనంతో అడిగింది పార్వతి.

"ప్రతి సంవత్సరం వీళ్ళందరూ నన్ను కదలనీయకుండా చేసి పూజలు వ్రతాలు చేయడం చాలా విసుగు తెప్పిస్తోంది. అనవసరంగా తమ్ముడితో పోటీ పడి ఈ పదవి సంపాదించాను. అరె! అప్పటినుండి ప్రతి ఒక్కర్నీ కాపాడలేక చస్తున్నా. నా ముఖం నేను అద్దంలో చూసుకుని ఎంతకాలమైందో! అందుకే నేనో నిర్ణయానికి వచ్చాను." అన్నాడు.

శివ పార్వతులతో సహా ఏమిటన్నట్టుగా ప్రశ్నార్థక ముఖాలేసుకుని అందరూ ఆయన వంక చూడసాగారు.

"నేను భూలోకానికి వెళదామనుకుంటున్నాను. యముడు సరదాగా ఎన్నోసార్లు భూలోకానికి వెళ్ళి వచ్చాడట. ఆ విషయం మీద సినిమాలు కూడా తీశారట. నారదుడు చెప్పాడు. అందుచేత నాక్కూడా అలా వెళ్ళిరావాలనుంది పైగా అక్కడ తొమ్మిది రోజులూ అంగరంగ వైభోగంగా చేస్తారట నా పూజలు. ఇదీ నారదుడే చెప్పాడు. మరి నాకు చూడాలనుండదా?" అన్నాడు.

‘హతోస్మి... అదన్నమాట సంగతి. నారదుడు పెట్టిన పితలాటక మన్నమాట ఇది’ శివపార్వతులిద్దరూ ఒకేసారి మనసులో అనుకున్నారు.

"అది కాదు నాన్నా! అక్కడ పరిస్థితులు ఇప్పుడు అంతగా బాగాలేవు. తెలంగాణ... సమైఖ్యాంధ్ర అని పోట్లాడుకుంటున్నార్ట. పైగా తీవ్రవాదంతో బాంబులూ అవీ పేలుతున్నాయట. ఈ సమయంలో నువ్వక్కడికి వెళ్ళడం క్షేమం కాదు. అందుకు నేను సుతరామూ అంగీకరించను" అంది పార్వతీదేవి.

"అయితే ఇవాళనుండి నాకిష్టమైన కుడుములూ... ఉండ్రాళ్ళూ తినను... పాయసం తాగను... విఘ్నాలనుండి ఎవరినీ కాపాడను... అసలిక్కడ వుండనే వుండను. మీ నుండి దూరంగా వెళ్ళిపోతాను" అన్నాడు వేదనతో.

"నాయనా... గణేశా... అంతమాటనకు. అప్పట్లో తెలియక నీ ముఖాన్ని ఖండించి గజ ముఖం అతికించాను. ఆ విషయంలో ఇప్పటికీ చింతిస్తుంటాను. నీ కోసం తండ్రిగా నేనేం చేయలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. నీ సంతోషం కన్నా మాకు కావలసింది ఏముంది? నేను అనుమతినిస్తున్నాను. భూలోక పర్యటనకెళ్ళి... క్షేమంగా తిరిగిరా" అని దేవగణం వైపు తిరిగి "ఈసారి మీరు మనుషులు చేసుకునేటట్టుగా మట్టి వినాయకుడిని పెట్టుకుని పూజా వ్రతం చేసుకోండి. విధి రాతని ఎవరూ తప్పించలేరు" అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు శివుడు.

పార్వతీదేవి కళ్ళనీళ్ళతో ‘తన భర్త కోపంతో అయినా... ప్రేమతో అయినా తన కొడుకుని తననుండి ఎప్పుదూ విడదీస్తాడనుకుని’ బాధగా భర్తవంక కొడుకు వంకా మార్చి మార్చి చూసి లోపలికి వెళ్ళిపోయింది.

అందరూ భారమైన హృదయాలతో ఎవరిళ్ళకి వాళ్ళు బయల్దేరారు. ఒక్క వినాయకుడు మాత్రం సంతోషంగా తనకి కావలసినవి సర్దుకోవడానికి ఎగిరి గంతులేస్తూ వెళ్ళిపోయాడు.

***


వినాయక చవితి నవరాత్రులు పూర్తయ్యాయి.

ఆ రోజు వినాయకుడు కైలాసానికి వస్తున్నాడు. ఆ ప్రాంతమంతా దేవ భక్త గణంతో కళ కళ్ళాడుతోంది. పార్వతీదేవి కొడుకుకి దిష్టి తీయడానికి కావలసిన సరంజామాతో... కొడుకుని చూడాలన్న తపనతో శివుడూ కూడా అందరితోపాటు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అంతలో ఒక బైకు వేగంగా వచ్చి వాళ్ళందరి ముందూ ఆగింది. ఆ వాహనమేంటో అక్కడివాళ్ళకు అర్ధంకాక అది ఏమన్నా ప్రమాదం తలపెడుతుందేమోనని దూరంగా పారిపోసాగారు.

దానిమీదనుండి దిగిన గణేశుడు నవ్వుతూ ఒక చేత్తో గాగుల్స్ తీస్తూ విలాసంగా" ఎవ్వరూ భయపడనవసరంలేదు. నేను వినాయకుడిని రండి" అన్నాడు.

దాంతో అందరూ ధైర్యంగా ప్రాణాలు కుదుట పరచుకుని ఆ వాహనాన్ని ఆయన్నీ ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరకి వచ్చారు.

జిగేల్ మనే దుస్తులతో కొత్త ఆహార్యంతో కనిపిస్తున్న కొడుకుకి దిష్టి తీసింది పార్వతీదేవి.

"అమ్మా! నాన్నా!! ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ఎంతగా మారిపోయిందో తెలుసా? కాంచనమాల కాలంనాటి హైదరాబాదు కాదు. ఇప్పుడు ఆకాశాన్నంటే బహుళ అంతస్థులు... టీవీలు... ఛానల్లూ, పార్కులు... పబ్బులు... అబ్బో కాలం గిర్రున తిరిగిందంటే నమ్మండీ. ఇదిగో ఇదేంటో తెలుసా? దీనిని బైక్ అంటారు. ఎక్కడికైనా ఆఘమేఘాల మీద వెళ్ళిపోవచ్చు. మనమింకా వాహనాల విషయంలో ఆటవిక దశలో వున్నాం. ఇది తెలుసా? దీనిని సెల్ ఫోన్ అంటారు." అని దాన్ని చూపించి "ఇది తీసుకో" అని ఒకటి తల్లి చేతిలో వుంచి "నువ్విక్కడే వుండు... కాస్సేపటి తర్వాత దీనిలో ఒక గంట మోగుతుంది. అప్పుడు ఇది నొక్కు నేను అదృశ్య రూపంలో నీతో మాట్లాడుతాను" అని అక్కడినుండి రజత కొండల మాటుకి వెళ్ళిపోయాడు.

సెల్ ఫోన్ లో గంట మోగడంతో స్విచ్ నొక్కి పార్వతిదేవీ దానిని చెవిదగ్గరపెట్టుకుంది. అంతే! ఆశ్చర్యంతో "ఎక్కడినుండో గాని మన వినాయకుడు మాట్లాడుతున్నాడు" అంది.

అంతే శివుడితో సహా అందరూ దానిని తీసుకుని అందులో వినాయకుడి గొంతు విని ఆశ్చర్యానందాలతో తాదాత్మ్యానికి లోనయ్యారు.

కాస్సేపటికి నవ్వుతూ అక్కడికి వచ్చిన గణేశుడు"చూశారా! మానవుల అబ్బుర పరచే తెలివితేటలు. ఈ పరికరం ఒక్కొక్కటీ మీ దగ్గర వుంటే ఎవరు ఎవరితో నన్నా ఇట్టే మాట్లాడుకోవచ్చు. ఒకరి దగ్గర కొచ్చి మాట్లాడే శ్రమా వుండదు... నారదుడు, ఆకాశవాణిల సహాయాన్నర్ధించే బాధా తప్పుతుంది. అంతేకాదు... ఏమీ పాలుపోనప్పుడు నారదుడు తెచ్చే సమస్యలతో సతమతమయ్యేబదులు ఇదిగో దీనిలో ఇలా మన దేవుళ్ళకి సంబంధించిన సినమాలు చూసుకోవచ్చు. దీంట్లో ఎన్నో సినిమాలు లోడ్ చేసుకు వచ్చాను. చూడండి" అని వాళ్ళకి చూపించి వాళ్ళు ఆశ్చర్యంతో నోరు తెరిచేలోపు" మానవులు శాస్త్ర సాంకేతిగ రంగాల్లో అప్రతిహతంగా ఎదిగిపోతున్నారు. నా అంచనా తప్పుకాకపోతే ఏదోనాడు ఇక్కడికి రాకెట్ల మీద వచ్చి కైలాసం... వైకుంటం... యమలోకం... స్వర్గం అన్నీ ఆక్రమించేస్తారు. మనమేదో వాళ్ళని ఆడిస్తున్నామనుకుంటున్నాం కాని నిజానికి వాళ్ళే మనలని ఆడించే రోజు తొందర్లో రావడం తధ్యం! అందుకే మనం వీలయినప్పుడల్లా భులోకానికి వెళ్ళి మనని మనం తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే వాళ్ళకన్నా మనం ముందంజలో వుండగలం." అని బైకెక్కి రివ్వున వెళ్ళిపోయాడు.

అక్కడున్న అందరూ "తామూ భూలోకానికి వెళ్ళి వింతలు విడ్డూరాలూ చూస్తామని... అందుకు అనుమతించమని అడిగారు శివుడిని.

అందరూ ఒక్కసారిగా వెళితే సృష్టి కార్యాలకి విఘాతం కలుగుతుంది కాబట్టి కొంత కొంత మందిని ఒక గ్రూప్ గా చేసి పదిరోజులు భూలోక పర్యటన చేసి వచ్చేట్టుగా అనుమతిస్తామని చెప్పడంతో అందరూ వాళ్ళ వాళ్ళ నిజగృహాలకి ఆనందోత్సాహాలతో వెళ్ళారు.

శుభమ్! మంగళమ్!

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ