మన రూంలో దెయ్యం ఉండడం కంటే కూడా భయంకరమైన విషయమేంటో తెలుసా? మన పక్క రూంలో దెయ్యం ఉండడం...
***
అర్థరాత్రి గం.1:30 లు.
నేను ఇంకా మర్ఘా గుహల్లోనే సిద్ధాంత్ బాబా ముందు కుర్చుని ఉన్నాను. బాబా గారు చేసే ఈ క్షుద్ర పూజ మధ్యలో ఆపకూడదని, ఒకవేల అలా చేస్తే మన చుట్టూ ఉన్న రాక్షక శక్తులు ఇంకా శక్తివంతంగా అవుతాయని ముందే ఓ బాబా శిష్యుడు చెప్పడంతో నేను చిన్న శబ్దం కూడా చెయ్యకుండా కుర్చుని ఉన్నాను.
బాబా మెళ్ళగా కళ్ళు తెరిచి నా వైపు చూశాడు.
ఆయన కళ్ళలోకి చూడగానే ఏదో తెలియని ధైర్యం వచ్చినట్టు అనిపించింది. బాబా తనకి ఇరువైపులా ఉన్న ఇద్దరు శిష్యులకి సైగ చెయ్యడంతో, వాళ్ళలో ఒకరు పక్క గదిలో ఉన్న కుండ లోంచి రాగి చెంబుతో నీళ్ళు తీసుకొచ్చిచ్చారు. ఆ నీళ్లు నేను తాగిన వెంటనే, రెండో శిష్యుడు నా వంక చూసి జరిగింది చెప్పమన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు.
నేను నిదానంగా చెప్పసాగాను..
‘స్వామి, నేను ఒక బ్యాచలర్‍ని. ఒక నెల క్రితం హైదరాబాద్‍కి ఉద్యోగం చెయ్యడానికి వచ్చాను. డబ్బు అంతంత మాత్రమే ఉండడంతో ఆదా చెయ్యడానికి షేరింగ్ రూం తీసుకుందామని వెతకసాగాను. అప్పుడే నాకు కాళికా నగర్‍లోని వనిత విలాస్ గురించి తెలిసింది. ఆ రూంలో దెయ్యం ఉందన్న పుకార్లు విన్నా కూడా, పట్టించుకోకుండా రూం అత్యంత చవకగా దొరికిందనే ఆనందంతో అక్కడకి సామానుతో షిఫ్ట్ అయ్యాను. అసలే నిర్మానుషమైన కాలని. ఒక కిలోమీటర్ రేడియస్ వరకు జనాలు పట్టుమని పది మంది కూడా ఉండరు. షిఫ్ట్ అయిన పది రోజుల వరకు అంతా సవ్యంగానే జరిగింది.
కాని....
అ రోజు అమావాస్య.
రాత్రి గం.10:30 లకి నేను చికెన్ బిరియాని తిని, మిగిలిపోయిన ఎముకలని కిచెన్‍లో ఉన్న డస్ట్ బిన్‍లో పారేసి వచ్చి నడుము వాల్చే టైంకి కిచెన్ నుంచి పెద్దగా ఒక శబ్దం వినిపించింది. వెళ్ళి చూసేసరికి డస్ట్ బిన్ కింద పడి, ఎముకలన్నీ నేల మీద చిందర వందరగా పడి ఉన్నాయి. ఏ ఎలకో చేసిన పని అయ్యుంటుందని విసుగ్గా డస్ట్ బిన్‍ని నిలబెట్టి, ఆ యముకలన్నీ అందులో వేసి వచ్చి పడుకున్నాను. పడుకున్న పది నిమిషాలకి మళ్ళీ కిచెన్ నుంచి పెద్దగా శబ్దం వినబడడంతో నేను ఒక్క ఉదుటన వెళ్ళి చూసాను. ఈ సారి డస్ట్ బిన్ కింద పడి ఉండనప్పటికీ, లోపల ఉండాల్సిన ఎముకలన్నీ చుట్టుపక్కల చిందర వందరగా పడి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదు. చెత్త ఎత్తకుండానే తిరిగి వచ్చి పడుకున్నా, కాని నిద్ర మాత్రం తెల్లవారేంతవరకు పట్టలేదు.
మొద్దు నిద్దరపోయి లేచే సరికి మధ్యాహ్నం మూడయింది. ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామని బయటకి వెళ్ళాను.
నిరాశతో రాత్రి రూంకి తిరిగి వచ్చి, భోజనం చేసి, ఇళ్ళు మొత్తం చిమ్మి, చెత్తని ముందు రాత్రి పడి ఉన్న ఎముకలతో సహా డష్ట్ బిన్‍లో వేసి వచ్చి పడుకున్నాను. నిద్రలోకి జారుకునే సమయానికి వంట గదిలోని ట్యాప్ లోంచి నీళ్లు పడుతున్న శబ్దం వినపడింది. బద్దకంగా లేచి వెళ్ళి నళ్ళా తిప్పొచ్చి పడుకున్నాను. మళ్ళీ ట్యాప్ లోంచి నీళ్లు పడుతున్న శబ్దం వినపడింది. వెళ్ళి నళ్ళాని గట్టిగా తిప్పి ఆపేశాను. పొద్దున ప్లంబర్‍కి చూపించాలనుకుని పడకేశాను. నిద్ర పట్టిన అరగంటకి కిచెన్ నుంచి మళ్ళీ గట్టిగా ఒక శబ్దం వినబడేసరికి ఉల్లిక్కిబడి లేచాను. వెళ్ళి చూసేసరికీ డస్ట్ బిన్‍లోని చెత్త రూం నిండా పడి ఉంది. ఒక పది నిమిషాల పాటు అసలేం అర్థం కాలేదు. నిద్రకు రాం రాం చెప్పి మెళ్ళగా కిచెన్‍ని శుభ్రం చేద్దామని నడుం బిగించే సరికి, బెడ్ రూం నుంచి ఏదో గట్టిగా పేలిన శబ్దం వినిపించింది. వెళ్ళి చూసేసరికీ ట్యూబ్‍లైట్ పగిలి గాజు పెంకులు కింద పడి ఉండడం కనబడింది. ఇక ఆ చీకటి గదిలో నుంచుని అసలు ఆ ట్యూబ్‍లైట్ ఎలా పేలిందో అని ఆలోచిస్తూ ఉండగా కిచెన్‍లోని ట్యాప్ నుంచి నీళ్లు పడుతున్న శబ్దం వినిపించింది. మెళ్ళ మెళ్ళగా కిచెన్‍లోకి వెళ్ళి వణకుతున్న చేతులతో ట్యాప్ కట్టేశాను. గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఇంకొక చిన్న శబ్దం విన్నా గుండె ఆగి చచ్చిపోతానేమో?! అని అనిపించింది. ఓ పదిహేను నిమిషాల నిశబ్దం తర్వాత మెళ్ళగా హాల్ లోకెళ్లి, లైట్ ఆన్ చేసి సోఫా పై పడుకున్నా. నిద్ర పట్టేసరికి మళ్ళీ తెల్లవారిపోయింది. లేచేసరికీ సాయంత్రం అయిపోయింది.
రాత్రి అవుతున్నకొద్దీ ఒంట్లో వణుకొస్తోంది. వెంటనే ఆ ఇంటి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో సామానులన్నీ సర్దేసుకుని ఇంటి బయటకొచ్చాను. రాత్రి పూట మా విధిని చూడడం అదే మొదటిసారి. చుట్టూ చీకటి. ఒక్క మనిషి కూడా కనపడట్లేదు. పొద్దున్న కాళికా నగర్ నుంచి సిటీకి గంటకో ఆటో వెళుతుంది. రాత్రి కూడా ఏదైనా దొరకొచ్చొన్న ఆశతో రోడ్ మీద నుంచుని ఎదురు చూడసాగాను. ఎంత సేపయినా ఏ ఆటో రాకపోయేసరికీ తిరిగి రూంకి వచ్చేసాను. రూంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ ఇంటి మీద ఉన్న పుకారులన్నీ నాకు గుర్తురావడంతో చెమటలు పట్ట సాగాయి. దెయ్యాలు కేవలం మూఢనమ్మకమని నాకు నేను సర్ది చెప్పుకుని, జరిగినదంతా మర్చిపోయి, హనుమాన్ చాలీసా గట్టి గట్టిగా చదవసాగాను. ఒక ఆరు-ఏడు లైన్లు చదివాక ఏదీ గుర్తు రాలేదు. అప్పుడే నాకు టాయిలెట్‍లోంచి వాటర్ ఫ్లష్ అవుతున్న శబ్దం వినపడింది. అది విన్న మరుక్షణమే బాత్‍రూం నుంచి నీళ్ళు పారడం గమనించాను. వెళ్ళి చూసేసరికి షవర్ తిప్పి, అందులో నుంచి నీళ్ళు బయటకి పారడం చూశాను. కిటికీలన్నీ గట్టి గట్టిగా కొట్టుకోవడంతో నేను ఆ ఇంటి నుంచి బయటకు ఒక్క అదాటున పరుగు తీసి తప్పించుకొచ్చాను. ఇంట్లోంచి అడుగు బయట పెట్టగానే నాకు ఒక అమ్మాయి గొంతుతో భయంకరమైన నవ్వు భీకరంగా వినపడింది. మళ్ళీ నాకు ఆ ఇళ్ళు కాదు కదా, కాళికా నగర్ దరిదాపులకి కూడా వెళ్ళే ధైర్యం లేదు స్వామి...’ అని చెప్పి నుదుటి మీద పట్టిన చెమటని కర్చిఫ్ తో తుడుచుకున్నాను.
‘మంచి పని. ఇక మీదట ఎప్పుడూ అటు వైపు వెళ్ళకు. నీకికనుంచి ఏం కాదు.’ అని ఆ సిద్ధాంత్ బాబా నాకు ధైర్యం చెప్పారు.
‘కాని, నేను బయటపడినా, నా సామనులన్నీ ఆ ఇంట్లోనే ఉండిపోయాయి స్వామి. వాటిని తీసుకుందామని తెల్లారే వరకూ వేచి ఉండి, జన సంచారం కాస్త మొదలైన తర్వాత వెళ్లి తలుపు తెరిచే ప్రయత్నం చేశాను. కాని ఎంత ప్రయత్నించినా ఏ తలుపూ తెరుచుకోకపోవడంతో నేను బయటే ఆగిపోవాల్సొచ్చింది. అలా చీకటి పడిందో లేదో, ఇంటి తలుపులు బార్లా తెరుచుకున్నాయి. లోపలికి వెళ్లడానికి నాకు ధైర్యం చాలలేదు. మీరే ఏదో ఒకటి చేసి నా సామాన్లు నాకు దక్కేలా చేయి స్వామి’ అంటూ బ్రతిమాలసాగాను.
‘దెయ్యాలు పలురకాలుగా ఉంటాయి. మోహిని..కామిని..పిశాచి..రక్త పిశాచి.. మొదలైనవి. వీటన్నిటిలో అరుదైనది శంఖిణి. శంఖిణి దెయ్యాలు పగ పట్టవు కాని, వాటి స్వభావం ఏడిపించడం. ఆట పట్టించి, నిద్ర పోనివ్వకుండా, మనశ్శాంతి లేకుండా మానసిక చిత్రవధ పెట్టడం వీటికి సరదా. నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేశావు. ఇప్పుడే ఆ ఇంటికి మనం వెళ్ళి, ఆ శంఖిణిని ఆ ఇంటి నుంచి తరిమేద్దాం పద...’ అని సిద్ధాంత్ బాబా చెప్పడంతో నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చినట్టు అనిపించింది.
***
తెల్లవారుఝాము గం.3:30 లు.
మేము ఇంటికి దగ్గరగా రాగానే, ఇల్లు మమ్మల్ని లోనికి ఆహ్వానిస్తున్నట్టుగా తలుపులు బార్లా తెరుచుకునున్నాయి . లోపలికి వెళ్ళగానే స్వామిజీ హాల్‍లో కూర్చుని, బొగ్గుతో ఓ నక్షత్రం ముగ్గు వెయ్యసాగారు. వెంటనే ఆ ఇద్దరు శిష్యులూ, ఒకరు కిచెన్ లోకి, మరొకరు బెడ్‍రూంలోకి వెళ్లి చిన్న చిన్న బొగ్గు ముక్కలతో ఓ గుండ్రని ముగ్గు వెయ్యసాగారు. ఒక్కసారిగా ముగ్గురూ బిగ్గరగా మంత్రాలు చదవడం మొదలెట్టేసరికీ అన్ని తలుపులూ, కిటికీలు ఒక్కసారిగా మూసుకుపోయాయి. వాళ్ళు చదివే ఆ మంత్రాలకేమో, ఇంట్లోని అన్ని లైట్లు మిణుక్కు మిణుక్కు మనసాగాయి. అన్ని రూంల నుంచి గట్టి గట్టిగా శబ్దాలు వినబడసాగాయి. వస్తువులన్ని కింద పడి, అద్దాలు పగిలి, అన్ని ట్యాప్ ల నుంచి నీళ్ళు ప్రవహించసాగాయి. చుట్టూ ఇన్ని జరుగుతున్నా ముగ్గురూ మంత్రాలు చదవడం మాత్రం ఆపలేదు. అప్పుడే, ఒక ఆడగొంతు ఏడుపు వినపడింది. ఆ ఏడుపు భయంకరంగా మారుతున్న కొద్దీ వాళ్ల మంత్ర ఉచ్ఛారణ మరింత తీవ్రం అవసాగింది. నేను వినే ఈ శబ్దాలకి నా చెవులకి చిల్లు పడుతుందేమో? అని అనిపించింది. వెంటనే నా చెవులని చేతులతో గట్టిగా మూసేసా.
‘శంఖిణీ, వెళ్ళిపో.... ఈ ఇళ్ళు వదిలి వెళ్ళిపో....’ అంటూ గట్టిగా ఎర్ర కళ్ళతో బాబా అరిచేసరికీ ఇళ్లంతా ఒక్కసారిగా శాంతమైపోయింది.
లైట్లు అన్నీ ఒక్కసారిగా వెలిగాయి. ట్యాప్ ల లోంచి నీళ్లు కారడం ఆగిపోయింది. ఇంత ప్రశాంతంగా నాకు జీవితంలో ఎప్పుడూ అనిపించలేదు.
‘వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ శంఖిణి ఇక్కడికెప్పుడూ రాదు. నువ్వు ఇక్కడ ఇంక ఏ చీకూ చింతా లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.’ అని చెప్పేసరికీ నేను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను.
***
ఇది జరిగిన కొన్ని రోజులకు-
మధ్యరాత్రి గం.12:00 లు.
బాబా తన ఇద్దరి శిష్యులతో మర్ఘా గుహల్లో కూర్చుని తీక్షణంగా పూజ చేసుకుంటూ ఉండగా పక్క గదిలో కుండ పగిలిన శబ్దం విని ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు...
*********