నా పేరు ఝాన్సీ. ఒక ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగం. ఐదు అంకెల జీతం. యూనివర్సిటీలో ఉన్నప్పుడు జగదీష్ కి దగ్గరయ్యను. ఆ వయసులో కలిగే భావనలని ప్రేమ అనుకున్నాను. ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. చిన్నప్పటి నుంచి నాకు కాస్త ధైర్యం ఎక్కువ అని అందరూ అంటుంటారు. నాన్న కూడా నేను ఏ విషయానికీ భయపడకూడదనీ, ధైర్యంగా ముందుకు వెళ్లాలని ఆడపిల్లను కదా అని వెనుకడుగు ఎప్పుడూ వేయకని చెప్తుండేవారు. నాన్న ఇచ్చిన ఆ ధైర్యంతోనే జగదీష్ ని నాన్న ముందుకు తీసుకెళ్లాను. ఏమంటాడో అనే భయం లేదు. ఎందుకంటే నాన్న నాకు అన్నీ ఇచ్చాడు. భయం తప్ప. అయినా చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు చేసే పని నేను చేయలేదు. ఇంట్లో పారిపోయి దొంగతనంగా పెళ్లిచేసుకోవడం. పెద్దవాళ్ళ పరువు తీయడం. నా మీద నాకు నమ్మకం. నాన్న మీద అంతకన్నా ఎక్కువ నమ్మకం. అందుకే జగదీష్ ని నాన్నకు దగ్గరగా తీసుకొచ్చాను. జగదీష్ తో మాట్లాడిన నాన్న, కళ్ళతోనే మౌనంగా సంతృప్తి వ్యక్తం చేశాడు.
అమ్మే కాస్త సతాయించింది. మన కులం ఏమిటి? గోత్రం ఏమిటి? ఆ అబ్బాయి కులం ఏమిటి? గోత్రం ఏమిటి? అందుకే ఆడపిల్లని చదివించొద్దు పది పాసయ్యాక పెళ్లిచేసేద్దాం అన్నాను. మీరు నా మాట వింటేనా? ఇప్పుడేం చేస్తారో చెయ్యండి. ఎంతైనా అయ్యాకూతుర్లు ఇద్దరూ ఒకటేగా! నా మాట ఎక్కడ నెగ్గింది. అంటూనే .... ఏమిటబ్బాయ్ “కట్నకానుకలు ఏ మాత్రం కావాలి” అని జగదీష్ ని అడిగేసింది. సెకన్ కూడా గ్యాప్ లేకుండా జగదీష్ వెంటనే సమాధానం చెప్పాడు. అమ్మ ఫిదా అయిపోయింది. ఇంతకీ జగదీష్ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా?“మీ అమ్మాయినే కట్నంగా ఇవ్వండి అత్తయ్యా పువ్వుల పొట్లంలో పెట్టి చూసుకుంటాను”.
****
జగదీష్ ఎప్పుడు ఖాళీ దొరికినా తన క్లాస్ నుంచి నా క్లాస్ కి వచ్చేసేవాడు నన్ను చూడటానికి, నాతో మాట్లాడ టానికి. క్లాస్ జరగకపోతే చాలు వెంటనే క్యాంటిన్ కి వెళ్లిపోయేవాళ్లం. టీ తాగుతూ గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. సినిమాకి, షికార్లకీ అస్సలు టైమ్ తెలిసేది కాదు. యుగాలు క్షణాల్లా గడిచిపోయేవి. ఎన్నెన్ని మాటలు చెప్పేవాడో ... “నా జీవితమనే పుస్తకంలో ప్రతి పేజీలో నువ్వున్నావు... నేను రాసే ప్రతి అక్షరంలో నువ్వే నిండిపోయి ఉన్నావు” ఇలా ఒకటా రెండా ఎన్ని మాటలు చెప్పేవాడో... “నీ ప్రేమ నాకు దక్కదని నేను బాధపడటం లేదు. నాలో ఉన్న అనంతమైన ప్రేమ నువ్వు పొందలేకపోతున్నందుకే నాబాధ ప్రియా!!!” ఎక్కడో విన్నాను అయినా నాకోసం చెప్పినందుకు అనిర్వచనీయమైన ఆనందానికిలోనై జగదీష్ ని ప్రేమించాను. “కనుల దాటిన కన్నీరు కాసేపటికి ఆగును.... నన్ను దాటిన నా ప్రేమ ఏదో ఒక నాటికి నీ దరి చేరును” అని వాడు చెప్పిన మాటలు అక్షరాలా నిజం. ఒక్కో సారి అనిపిస్తుంది. నిజంగా వాడిని ప్రేమించకపోతే సముద్రమంత ప్రేమను కోల్పోయేదానినేమో... “ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రపంచంతో పని ఉండదట. ఎందుకంటే ప్రేమే వాళ్ళ ప్రపంచం.” అది వాడి సాహచర్యంలో నిజమనిపించింది. పెళ్ళికి ముందు.
*****
ఇప్పుడు... జీవితం నాశనమయ్యిందేమో అనిపిస్తుంది. నాన్న ఇచ్చిన ధైర్యం నన్ను ఇలా చేసిందా? అనిపిస్తుంది. ఎందుకింత పిరికిదానిలా మారిపోయాను. నా అస్తిత్వాన్ని నేను ఎందుకు కోల్పోయాను. అసలు నేను ఎవరిని ఝాన్సీ నేనా? లేక ఇంకెవరినైనా... నేను ఎవరు అనే ప్రశ్న వేసుకోవలసిన ఈ పరిస్తితి ఏమిటి!?
ఆయన చాలా మారిపోయారు. పెళ్ళికి ముందులా పెళ్లయ్యాక లేరు. సినిమాలు, షికార్లు తరువాత సంగతి కనీసం ఖాళీ టైమ్ లో పక్కన కూర్చుని ప్రేమగా మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. పెళ్లికి ముందు ప్రేమకు నిలువెత్తు నిదర్శనంలా కనిపించాడు. ఇప్పుడు పాషాణ హృదయానికి పరాకాష్టలా ఉన్నాడు. ఎందుకింత మార్పు అని అడిగితే ఉద్యోగం, బరువులు, బాధ్యతలు అంటాడు. ఒక్కన్ని తెస్తే అందరూ కూర్చుని తినే వాళ్ళే అంటాడు. నాకుండే టెన్షన్స్ నాకున్నాయి నన్ను ఇబ్బంది పెట్టకు అని వీలైనంత దూరంగా వెళ్లిపోతాడు. నాలో నేను ఎంత మదనపడ్డానో ఆయనకేం తెలుసు. అప్పుడు నాకు ఆరోనేల. ఈ సమయంలో భర్త పక్కన ఉంటే బావుండని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది. నేనూ... అదే కోరుకున్నాను. పెళ్ళికి ముందు అడగకుండానే అన్నీ నా కాళ్ళ దగ్గరికి తెచ్చిన వ్యక్తి ఈ రోజు అడిగినా కంటికి కనిపించనంతగా మారిపోయాడు. అత్త, మామ, భర్త అందరూ ఉండి నేను అనాథనయ్యాను. ఒంటరి జీవితమైపోయింది.
*****
జగదీష్ తో పెళ్ళికి మాయింట్లో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ నన్ను పెళ్లి చేసుకోవాలంటే మాత్రం వాళ్ళ ఇంట్లో ఒకే ఒక ఆంక్ష పెట్టారు. అదే నా జీవితాన్ని ఇలా మార్చేస్తుందని అనుకోలేదు. నన్ను జగదీష్ పెళ్లి చేసుకుంటే మా అమ్మ, నాన్న తో సంబంధాలు ఉండకూడదు. నేను పుట్టింటికి వెళ్లకూడదు. వాళ్ళు నా దగ్గరికి రాకూడదు. మా వాళ్ళు సరే అన్నారు. ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకో నిదానంగా వాళ్ళే మారతారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! అని చాలా సునాయాసంగా నవ్వుతూ ఒప్పేసుకున్నారు. అదేంటి నాన్నా అంటే ‘ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లే’ అని చేతులు దులిపేసుకున్నారు. అంతలా ఆలోచించే నాన్న ఎందుకిలా...!? ఆరోజే నాన్న ఈ సంబంధం వద్దురా తల్లీ! అత్తామామలు సరే, ప్రేమించినవాడు నిమ్మకు నీరేత్తినట్లు మౌనంగా ఉన్నాడు... అవసరమా అని ఉంటే జగదీష్ తో నా పెళ్లి అయ్యి ఉండేది కాదు. అయినా నాన్నని ఎందుకు అనడం. నన్ను నేనే తిట్టుకోవాలి. కండిషన్ పెట్టినప్పుడు అసలు నేను ఎందుకు ఒప్పుకున్నాను. నేను ఒప్పుకోకుందా ఉంటే...అంటే జగదీష్ మీద ఉన్న ప్రేమ నా చేత ఆరోజు మాట్లాడించలేదు. అందుకే ఆ తరువాత చాలా అనుభవించాను. ఘనీభవించాను.
నెలలు నిండుతున్నా ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. కడుపు నిండా తిండి కరువైంది. కంటి నిండా నిద్ర కరువైంది. మనసు నిండా ప్రేమ కరువైంది. అదే అమ్మ, పక్కన ఉంటే ఇన్ని పనులు నా చేత చేయించేదా? “గర్భంతో ఉన్న స్త్రీ గర్భ గుడిలో దేవత” అన్నారు. నేను దేవతని కాను. ఎందుకంటే గర్భ గుడిలో దేవత ఎప్పుడూ కూర్చోనే ఉంటుంది. నేను ఎప్పుడూ అటుయిటూ తిరుగుతూ గంపెడు పనులని నెత్తిన వేసుకొని, గంపెడంత కడుపుని ముందేసు కుని తిరుగుతూ ఉంటాను. చుట్టు పక్కల వాళ్ళు అందరూ నన్ను చూసి తెగ మెచ్చుకునేవారు. “రేపో మాపో కనేలా ఉంది. అయినా ఎంత ఓపిగ్గా పనులు చేసుకుంటుందో.... కోడలంటే అలా ఉండాలని” కూతురు మాత్రం ఇలా ఉండకూ డదు. సమసమాజం సమసమాజం అని చర్చలు, ఉపన్యాసాలు ఇస్తాం కానీ అత్త కోడళ్ళ మధ్య సమోధ్య ఉన్నప్పుడే నిజమైన సమసమాజం వస్తుందని నాకనిపించింది.
పెద్ద వయసు వాళ్ళు, అమ్మలక్కలు అందరూ అనేవారు ఇంత చలాకీగా ఉన్నావు నువ్వు ఖచ్చితంగా అబ్బాయినే కంటావని. నేను అదే కావాలనుకున్నాను. భగవంతుడా “అమ్మాయిని మాత్రం ఇవ్వకు. రేపు అది కూడా నాలానే ఇలా ఇబ్బందులు పడటం నాకిష్టం లేదు. అణిగిపోయి,అస్తిత్వాన్ని కోల్పోయి ఉండే అమ్మాయి కంటే ఆధిపత్యాన్ని చలాయించే అబ్బాయినే ఇవ్వు.” ఒక వేళ అమ్మాయి పుడితే...ఎంత ధైర్యంగా పెంచినా తను కూడా నాలా ఆలోచనా రహితంగా నిర్ణయాలు తీసుకుంటే....వద్దు దేవుడా! వద్దు నాకు అమ్మాయి వద్దు. అబ్బాయినే ఇవ్వు. అయినా మన చేతులో ఏముంది. నాలో నేను పిచ్చిదానిలా అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ అలా వంట గదిలో అడుగుపెట్టాను. కడుపంతా ఒకటే నొప్పి. అత్తయ్యగారూ అని పిలిచాను.. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది. నొప్పులు మొదలయ్యాయి అనే అనుమానంతో వెంటనే పక్కింటి వాళ్ళను పిలిచి విషయ నిర్ధారణ చేసుకున్నాక ఆటో పిలిపించి హాస్పిటల్ కి తీసుకెళ్లింది. నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. తట్టుకోలేకపోతున్నాను. ఆఫీస్ నుంచి ఆయన కూడా వచ్చారు. అత్తయ్య, ఆయన డాక్టర్ తో మాట్లాతున్నారు. ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. తరువాత డాక్టర్ సిస్టర్స్ తో మాట్లాడడం చూశాను. సిస్టర్స్ వచ్చి నాకు సెలైన్ పెట్టి ఇంజక్షన్ చేసి వెళ్లారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. నాకు మెలకువ వచ్చే సరికి నా పక్కన పాప. పొట్ట అంతా నొప్పిగా ఉంది. కదలలేని పరిస్తితి. ఎటు కదిలినా ప్రేగులు బయటకి వచ్చేలా భావన. పొట్టమీద నిదానంగా చేయిపెట్టి చూసుకున్నాను. జానెడు పొడవున దోసకాయను కోసినట్టు కోసి, వడ్ల బస్తాకి కుట్లు వేసినట్టుగా నా పొట్ట... అప్పుడనిపించింది నేను వచ్చింది హాస్పిటల్ కి కాదు కోతమిల్లుకని.
*****
నాలుగేళ్లు గడిచిపోయాయి. ఈ నాలుగేళ్ళలో అమ్మానాన్నతో ఎలాంటి సంబంధాలు లేవు. తెలిసిన వాళ్ళ ద్వారా బావున్నారని వినడమే కానీ, కళ్ళతో చూసింది లేదు. చదువుకునే రోజుల్లో కూడా అమ్మానాన్నలను వదిలేసి ఉండాల్సి వస్తుందని హాస్టల్ లో ఉండటానికి కూడా ఇష్టపడని నేను, ఒక్కరోజు కూడా అమ్మనాన్నలను చూడకుండా ఉండని నేను మూడేళ్లు... మూడేళ్లు ఎలా ఉండగలిగాను. పెళ్ళంటే ఇదేనా? నా అన్న వాళ్ళకు నన్ను దూరం చేయడమే పెళ్ళా? ఆయన మాత్రం పుట్టిన దగ్గరనుంచి ఇప్పటి వరకు వాళ్ళ అమ్మనాన్నలతోనే... ఆయనకులాగానే నాకు కూడా ప్రేమలు, అభిమానాలు ఉంటాయని ఎందుకు ఆలోచించరు. ప్రేమ పెళ్ళిళ్ళల్లో పెళ్ళికి ముందేనా ప్రేమ ఉండేది. ఇన్ని ఆలోచనల మధ్య మరో కొత్త ఆలోచన నన్ను నిద్రలేకుండా చేస్తుంది. భయం భయంగా బ్రతకాల్సి వస్తుంది. ‘నక్షత్ర’కి నాలుగేళ్ళు దాటుతున్నా ఇంకా మాటలు రావడం లేదు. లోపల తెలియని భయం. ఎవరికి చెప్పినా వస్తాయిలే... కంగారేముంది... అప్పుడే మాట్లాడి ఏం చేస్తుందిలే... ఈ కాలం పిల్లలు పెద్దలకు ఎదురు సమాధానం చెప్పడం తప్ప అని కొందరు... అనే వాళ్ళే తప్ప సలహాలు, సూచనలు ఇచ్చే వాళ్లే లేరు. ఎవరు ఎన్ని అన్నా నా బిడ్డ ముద్దు ముద్దు మాటలు విని తరించాలని నాకు ఉండడా?
*****
ఆటో దిగి పాపను ఒక చేత్తో పట్టుకొని, నాన్న చదివించిన చదువులకు సాక్ష్యామైన సర్టిఫికెట్స్ ఫైల్ ఒక చేత్తో పట్టుకుని ఏం జరిగినా ఫరవాలేదు అనే ధైర్యంతో గేటు తీసుకొని వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను. ఎవరూ తలుపు తీయలేదు. మళ్ళీ కొట్టాను... ఈసారి కూడా ఎవరూ తీయలేదు... మళ్ళీ కాలింగ్ బెల్ కొట్టబోతుంటే డోర్ గడియ తీసిన చప్పుడు... ఆగాను... నాన్న ...!!! ఎవరండీ అంటూ తలెత్తి... అలానే ... ఆశ్చర్యంగా ఝాన్సీ... నువ్వా! “ఏమోయ్ ఎవరొచ్చారో చూడు” అంటూ భార్య గాయత్రిని పిలిచాడు. సత్యమూర్తి. “ఎవరండీ...” అంటూ వస్తూ వస్తూనే ఝాన్సీని చూసిన గాయత్రి కుప్పకూలిపోయింది. వెళ్ళి కాసిన్ని నీళ్ళు ముఖాన కొట్టి నిదానంగా లేపారు. నాలుగేళ్ళ తరువాత కూతుర్ని చూసిన తల్లి విలవిలలాడిపోయింది. కాసేపటికి కానీ తేరుకొని “నా మానవరాలా? తల్లీ” అంటూ పాపను దగ్గరికి తీసుకొని ముద్దు చేసింది. అప్పటికే ఝాన్సీ వచ్చి రెండు, మూడు గంటలు దాటింది. ఎవరూ జగదీష్ గురించి అడగడం లేదు. ఝాన్సీ కల్పించుకుని “ఏంటి నాన్నా, ఎవరూ మీ అల్లుడి గురించి అడగడం లేదు”... ఝాన్సీ మాట పూర్తి కాకుండానే సత్యమూర్తి “యోగ క్షేమాలు అడిగేంత గొప్పవాడు కాదులేమ్మా! మీ ఆయన. నాలుగేళ్లపాటు నువ్వు మమ్మల్ని చూడటానికి ఏనాడూ రాలేదు. మేము నిన్ను చూసే అవకాశం, అదృష్టం కూడా ఏనాడూ రాలేదు. దీనికి కారణం మీ ఆయనే కదమ్మా! అంత ఉత్తమమైన అల్లుడి గురించి ... సారీ, జగదీష్ గురించి అడగాల్సిన అవసరం లేదు. ఆరేళ్ళ తరువాత ఇప్పుడు నువ్వు పుట్టిల్లు వెతుక్కుంటూ ధైర్యంగా వచ్చావంటే అర్ధం చేసుకోలేనంత అమాయకుడిని కాదులేరా, జానూ!. వాడితో తెగతెంపులు చేసుకొని వచ్చి ఉంటావు. లేదా, వాడే నీతో బంధాన్ని తెంపేసుకుని ఇంట్లో నుంచి బయటకు పంపి ఉంటాడు. ఈ రెండిటిలో ఏది జరిగినా ఒక మూర్ఖున్ని, ప్రేమ పేరుతో వంచించిన వాడిని, భార్యని గౌరవించని వాడిని నువ్వు వదిలేసి రావడానికి నాలుగేళ్లు పట్టిందన్నమాట. నేను పంచిన రక్తం, నూరిపోసిన ధైర్యం, చదివించిన చదువులు ఇవి నిన్ను నాలుగేళ్లు పిరికిదానిలా ఉంచాయా? మీ సహనం, మీ నిర్లక్ష్యం మిమ్మల్ని ఇలా భర్త చాటు భార్యల్లా తయారు చేస్తూనే ఉంటాయి. నువ్వు కట్టుబట్టలతో, ఒకచేత్తో పాపని, ఒక చేత్తో నీకు దారి చూపించే సర్టిఫికెట్స్ ని తీసుకొని వచ్చినప్పుడే అనుకున్నాను. ఇక నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని” నాన్న మాట్లాడుతుంటే నేను ఏడుస్తూనే ఉండిపోయాను. అమ్మ వచ్చి కన్నీళ్లు తుడిచి... “ఇప్పుడేమయ్యిందని ఆ ఏడుపు, సంతోషాన్ని వెదుక్కుంటూ నాలుగు గోడల మధ్య నుంచి నాలుగు దిక్కుల మధ్యలోకి వచ్చావు. ఇక అంతా మంచే జరుగుతుంది.” అంటూ “అమ్మ, అవును ఝాన్సీ నీ కూతురు ఏంటే వచ్చిన దగ్గర్నుంచి ఏం మాట్లాడకుండా మూగ మొద్దులా కూర్చుంది.”
*****
“యావండీ...”; “ఆ ...చెప్పు”
“ఈ రోజు హాస్పిటల్ కివెళ్లాలి” ; “ఎందుకు...”
“పాప చెకప్ కి”; “ఏమయ్యింది దానికి”
“ఏమవ్వడమేమిటండీ ఇప్పుడు దానికి నాలుగో ఏడు ...” ; “అయితే....”
“అయితే ఏమిటండీ ... అది మాట్లాడటం లేదు... పిలిచినా పలకడం లేదు... నాకు భయంగా ఉంది. ఈ రోజు ఎలాగైనా సరే హాస్పిటల్ కి పాపను తీసుకెళ్ళాల్సిందే.”
“నాకు కుదరదు. చాలా పనులున్నాయి.”
“పాపకంటేనా....!!!!”
“ఈ సోది మాటలు ఆపు. డబ్బులిస్తాను, క్రెడిట్ కార్డు ఇస్తాను. నువ్వే వెళ్ళి చెకప్ చేయించుకురా...”
ఆయన ప్రవర్తనకు చేసేది ఏమీ లేక పాపని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాను. డాక్టర్ నిరంజన్ చాలా పేరున్న డాక్టర్. పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో ఆయనకి బాగా తెలుసని అందరూ అంటుంటే ఆయన దగ్గరకే తీసుకెళ్లాను. టెస్ట్ లు చేసిన తరువాత ఎక్కువ సమయం నాకోసం కేటాయించారు. నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. కొన్నిటికి సమాధానం చెప్పాను. కొన్నిటికి చెప్పలేక పోయాను. కొన్నిటికి తెలిసి కూడా మౌనం వహించాను. డాక్టర్ దగ్గర ఏమీ దాచకూడద నడంతో దాదాపుగా ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను. చివరిగా ఆయన ‘పాపకు వినపడకపోవడం వల్ల మాట్లాడటం లేద’ ని చెప్పారు. అంటే పాప ‘డెఫ్ అండ్ డమ్’. డాక్టర్ ని ఎందుకిలా జరిగిందని కారణం అడిగితే ఆయన అడిగిన ప్రశ్నలలోంచి నాకు సమాధానాన్నిచ్చారు.
డాక్టర్ అడిగిన ప్రశ్నలలో మూడు ప్రధానమైన ప్రశ్నలు.
“మీది మేనరికమా?; మీ భర్త మీ పట్ల ఎలా వ్యవహరిస్తారు.?; మీరు గర్భంతో ఉన్నపుడు ఎక్కువగా ఫోన్ వాడేవారా?
మీకు డెలివరీ ప్రోపర్ గా జరిగిందా?”
“మేనరికం కాదన్నాను. భర్త సరిగా చూసుకోడన్నాను, కడుపుతో ఉన్నప్పుడు అయిదవనెలవరకు ఆయన నాతో ఎక్కువగా ఫోన్లో మాట్లాడేవారని చెప్పాను. డెలివరీ విషయంలో అనుమానం వ్యక్తం చేశాను.”
కడుపుతో ఉన్నప్పుడు ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం వలన లోపల ఉన్న బేబీస్ రేడియేషన్ కి గురై అబ్’నార్మల్ గా పుట్టటానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీ భర్త సరిగా చూసుకోక పోవడం వలన మీరు ఎక్కువగా డిప్రెషన్ కి గురయి ఉండొచ్చు దాని వలన కూడా అసాధారణ ప్రవర్తన కలిగిన పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. అంతేకాకుందా డెలివరీ అయ్యేటప్పుడు జరిగే కొన్ని తప్పిదాల వల్ల కూడా పిల్లల ప్రవర్తనలో మార్పు రావచ్చు. ఇవి పుట్టిన వెంటనే బయటపడతాయని చెప్పలేం. బిడ్డ ఎదుగుతున్న క్రమంలో ఇవి బయటపడే అవకాశాలు చాలా ఎక్కువ” డాక్టర్ చెప్పిన మాటలు విని మందులు తీసుకొని, నాకు డెలివరీ అయిన హాస్పిటల్ కి వెళ్ళి పాప కండిషన్ వివరించి డాక్టర్ ని డెలివరీకి వచ్చిన రోజు మాఆయన, అత్త గార్లు ఏం మాట్లాడారో చెప్పమని అర్ధించాను. ఫలితం శూన్యం. ఇదంతా విన్న సిస్టర్ “ఆరోజు అమావాస్య అని ఇంకో రెండు మూడు గంటల్లో అమావాస్య ఘడియలు వెళ్లిపోతాయని కాబట్టి ఎలాగైనా సరే రెండు మూడు గంటల వరకు డెలివరీ కాకుండా ఆపమని మీ అత్తగారు డాక్టర్ కి డబ్బు ఎర చూపడంతో నార్మల్ డెలివరీ అవడానికి 99% అవకాశం ఉన్న మీకు నొప్పుల్ని కాస్త కంట్రోల్ చేసి డ్రౌజీ లెవల్ కి తీసుకెళ్లి అమావాస్య ఘడియలు దాటిన తరువాత ఆపరేషన్ చేసి పాపని బయటికి తీశారు.” అని చెప్పడంతో నా గుండె పగిలినంత పనయ్యింది.
ఇంటికి వెళ్లిన నేను పాపకు కాస్త అన్నం పెట్టి, నేను కూడా కడుపునిండా తిని ప్రశాంతంగా కూర్చున్నాను ఇంట్లో ఎవరూ అడగలేదు పాపని చెక్ చేసి డాక్టర్ ఏమన్నాడని. సాయంత్రం అయ్యింది. జగదీష్ ఇంటికి వచ్చాడు. జగదీష్ కూడా పాప గురించి ఏమీ అడగలేదు. ఒక చేత్తో పాపను పట్టుకుని, ఇంకో చేత్తో సర్టిఫెకెట్స్ ఫైల్ పట్టుకుని నేను నాపుట్టింటికి వెళుతున్నాను. బహుశా ఇక తిరిగిరాకపోవచ్చు అని అందరికీ వినిపించేలా చెప్పాను. అక్కడ మూడో ప్రపంచ యుధ్దమే జరిగింది. ఈ గొడవను చూస్తూ పాప నోట్లో నుంచి నురగలు కక్కుకుంటూ పడిపోయింది. వెంటనే అంబులెన్స్ పిలిపించి పాపను హాస్పటల్ కి తీసుకెళ్ళాం. డాక్టర్ నిరంజన్ పాపని రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి “తనలో మానసికంగా కూడా ఎదుగుదల లేదు. తనని మీతో పాటే ఉంచితే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. పాపకు కూడా అది మంచిది కాదు. వీరి కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉంచడం వలన కొంతవరకు ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటినుంచైనా జాగ్రత్తగా మందులు వాడుతూ, పాపని ఒక కంట కనిపెడుతూ ఉంటే పాప కొన్నేళ్ళకి కాస్త మామూలు మనిషి కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఎదిగే క్రమంలో మీరు చేసిన పొరపాట్ల వల్ల పాపలోపల అంతర్గతంగా ఉన్న లోపాలు (మల్టిపుల్ డీసీజెస్) ఇంకేమైనా ఉంటే బయటపడొచ్చు. అన్నిటికీ తట్టుకునే శక్తి తల్లిగా మీరు కలిగి ఉండాలి” డాక్టర్ నిరంజన్ చెప్తున్నారు. అందరూ వింటున్నారు. బయటకి వచ్చిపాపను తీసుకొని వెళుతున్నా అని చెప్పాను. ఎవరు ఆపలేదు.” జరిగిన విషయం అంతా తల్లిదండ్రులకు చెప్పింది ఝాన్సీ.
*****
ఇలా తెలిసీ తెలియక చేసే పొరపాట్లకు అభంశుభం తెలియని పసిప్రాణాలు ఎంతటి అసాధారణ స్థితికి వెళుతు న్నాయో మనం బయట చూస్తూనే ఉన్నాం అయినా ఏమాత్రం మార్పు మనలో లేదు. చూడు సుభద్ర ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్. ఫోన్ కాస్త తగ్గించు. ఎప్పుడు ఫోన్ లో మాట్లాడినా ఏడుస్తూనే మాట్లాడుతుంటావు. ఏవైనా కుటుంబ సమస్యలుంటే కూర్చోని పరిష్కరించుకోండి. లేదంటే నాలాగా నువ్వు అసాధారణ ప్రవర్తన కలిగిన పిల్లల్ని కనాల్సి ఉంటుంది. మా పాపకి వినబడదు కాబట్టి మాట్లాడదు. మానసిక పరిస్తితి బావుండదు. పదేళ్ళు దాటినా తనకి పాస్ పోసుకోవడం కూడా రాదు. అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చి నురగలు కక్కుకుంటూ పడిపోతుంది. ఫంక్షన్లకు పిలిస్తే ఈ పాపతో ఎక్కడ వస్తానో అని మా బంధువులు ఎవరూ మమ్మల్ని పిలవరు. కలుపుకోరు. కొందరైతే ఎందుకు ముదనష్టపు పాప ఏ మందో మాకో వేసి చంపేదానికి. ప్రశాంతత లేని జీవితం. భగవంతుడు ఇలాంటి వాళ్ళను పురిట్లోనే ఎందుకు తీసుకుపోడో... ఇలా ఎన్నో వింటుంటాను. నరాలు తెగిపోతుంటాయి. చంపేయాలన్నంత కోపం వస్తుంది. పాప అలా తయారవడానికి కారణం నేను. అయినా తను నా పాప. నా పాపే నాప్రాణం. ‘పాప పున్నమి జీవితాన్ని నేను అమావాస్య చేసినా, నా అమావాస్య జీవితంలో పాపే వెన్నెల.’
“సుభద్రా.... మనసుభద్రం” అని చెప్పి అమ్మ,నాన్న ఎదురుచూస్తుంటారు అని చెప్పి కార్లో ఉన్న పాపవైపు ఝాన్సీ వెళ్లిపోయింది. వెళ్లిపోతున్న ఝాన్సీని చూసి సుభద్ర “నువ్వు నిజంగా ఝాన్సీవే... ఎంతటి గుండె ధైర్యం” అనుకుంటూ ఝాన్సీ వెళ్ళిన వెలుగు రేఖల్ని అనుసరించింది ‘సుభద్ర’.