తిరుపతి లో ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్. అప్పుడే MCA పూర్తి చేసిన నేను ఆ కాలేజ్ లో కంప్యూటర్ ఫ్యాకల్టీ గా చేరాను. అపాయింట్ మెంట్ లెటర్ చేతికిస్తూ
“మీరు రేపే వచ్చి జాయిన్ అవ్వచ్చు.” చెప్పాడు కాలేజ్ ప్రిన్సిపాల్.
“థ్యాంక్స్ సార్.”
“ఎలాక్టానిక్స్ లెక్చరర్ రాహుల్ ఒక్కడే ఒక రూమ్ లో ఉంటున్నాడు. మీకు అభ్యంతరం లేక పొతే మీరు తనతో రూమ్ ను షేర్ చేసుకోవచ్చు.
“ సలహా ఇచ్చాడు ప్రిన్సిపాల్.
నేను ఏం చెప్పాలా అని తటపటాయిస్తూ ఉండగానే ప్రిన్సిపాల్ ను విష్ చేస్తూ లోనికి వచ్చాడు ఓ యువకుడు. వయసు సుమారు పాతిక. ఆరడుగుల ఎత్తు, చామన ఛాయా.
“హలో ! రాహుల్! రండి. ఇతను గౌతమ్, కొత్తగా చేరిన కంప్యూటర్ లెక్చరర్. కొంత కాలం మీతో పాటు మీ రూమ్ లో ఉంటాడు.” నన్ను పరిచయం చేసాడు ప్రిన్సిపాల్.
“హలో!” నన్ను స్నేహపూర్వకంగా పలకరించాడు రాహుల్.
*************
రాహుల్ వయసులో నా కన్నా రెండేళ్ళు పెద్దవాడు. సిగరెట్, మందు అలవాటు ఉంది. ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. నేను వాటికి కాస్త దూరమే. రాహుల్ రూమ్ లో తక్కువగా ఉంటాడు. ఉన్నంతలో నాతో బాగానే మాట్లాడుతాడు.
***********
ఆ రోజు కాలేజ్ సెలవు. రాహుల్ ఉదయాన్నే బయటకు వెళ్ళాడు. మధ్యాహ్నం అయినా రాలేదు. తన ఫోన్ ఉదయం నుండి మ్రోగుతూనే ఉంది. తప్పని సరి పరిస్థితిలో తన ఫోన్ లిఫ్ట్ చేశా.
“ చాలా సార్లు ఫోన్ చేసాను. లిఫ్ట్ చెయ్యలేదు , బిజీ గా ఉన్నారా?” అవతల నుండి స్వీట్ వాయిస్ వినిపించింది.
“సారీ! నేను రాహుల్ కాదు, తను బయటకు వెళ్ళాడు. వచ్చాక కాల్ చెయ్యమని చెబుతాను.” పొడి పొడి గా మాట్లాడాను. ఫోన్ కట్ చేస్తూ ఉండగా
“మీరు............?” అని వినబడింది.
“నేను గౌతమ్, రాహుల్ రూమ్ మేట్ ను.” చెప్పాను.
అవతల నుండి మళ్ళీ మౌనం, ఆ సారీ నేనే అడిగాను,” మీరు.....?”
“నా గురించి రాహుల్ మీకు చెప్పలేదా?” కాస్త తటపటాయిస్తూ అడిగింది.
“అంటే అది...........” ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆలోచిస్తున్నా.
“నా పేరు ప్రసూన, నేను, రాహుల్ కొంత కాలంగా ఒకరినొకరు ఇష్ట పడుతున్నాం, త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకొంటూ ఉన్నాం .” సిగ్గుపడుతూ చెప్పింది.
“ఆ ..... అప్పుడప్పుడూ మీ గురించి చెబుతూ ఉంటాడు.” తన గురించి చెప్పలేదు అంటే నా వల్ల వారి మధ్య గొడవలు వస్తాయేమో అని, ఆమె సంతోషం కోసం అబద్దం చెప్పాను.
“అవునా? నా గురించి ఏమి చెబుతుంటాడు?” ఉత్సాహంగా అడిగింది ఆ అమ్మాయి.
“అది... ఆ ..... మీరు చాలా మంచి వారని, చాలా అందంగా ఉంటారని, తను మిమ్మల్ని తరచూ కలుస్తూ ఉంటాడని చెబుతుంటాడు.” మరిన్ని అబద్దాలు పోగు చేసి చెప్పాను.
నేను అలా చెప్పగానే తను గట్టిగా నవ్వేసింది.
“ఏమైంది , ఎందుకలా నవ్వుతున్నారు?” ఆశ్చర్యంగా అడిగా.
“మీ ఫ్రెండ్ రాహుల్ మీకు అబద్దాలు చెప్పాడు. మేము ఇంతవరకు కలుసుకోనే లేదు. ఒకరినొకరు ఇంత వరకు చూడనేలేదు. “ చెప్పింది ప్రసూన.
“మరి ప్రేమించు కొంటూ ఉన్నామని అన్నావు?” ఆశ్చర్యంగా అడిగాను.
“ఫోన్ లోనే పరిచయం. ప్రేమలేఖ సినిమాలో లాగా ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించు కొందామని నిర్ణయించు కొన్నాం. ఇంతకీ మీ ఫ్రెండ్ రాహుల్ ఎలా ఉంటాడు? బాగుంటాడా?” అడిగింది ప్రసూన.
“సినిమా హిరో లా చాలా బాగుంటాడు.” చెప్పాను.
“మంచివాడే కదా?” మళ్ళీ అడిగింది.
నేను కాస్త ఆలోచించాను. రాహుల్ నాకు కేవలం కొంత కాలంగా మాత్రమే తెలుసు , తను మంచి వాడో, కాదో నేనెలా చెప్పగలను. అయినా ఈ ప్రపంచంలో మంచిచెడులు అనేవి ఎవరు నిర్ణయించగలరు? చూసే దృష్టి బట్టి వాటి రూపం మారిపోతూ ఉంటుంది.
హలో అన్నయ్యా! తను మంచి వాడే కదా?” మళ్ళీ అడిగింది. ఈ సారి నన్ను అన్నయ్యా అని కూడా పిలచింది.
“మంచి వాడు. “ అప్రయత్నంగా నేను రాహుల్ కు కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చాను.
నేను అలా చెప్పగానే తను మరింత సంతోష పడినట్టు అనిపించింది.
“ఇంతకూ మీరు ఏం చేస్తుంటారు?” ప్రసూనను అడిగా.
“నేను వైజాక్ లో MBA చేస్తున్నా.” చెప్పింది ప్రసూన.
నేను తనను ఇంకేదో అడగబోయా,
“నేను తన గురించి ఎంక్వయిరీ చేసానని ఆయనకు చెప్పకండి!” బతిమాలినట్టు అడిగింది.
“నీతో ఫోన్లో మాట్లాడానని కూడా తనకు చెప్పను. నువ్వు కూడా చెప్పద్దు “
“ అలాగే అన్నయ్యా, మా నాన్నగారు వస్తునారు , నేను మరోసారి మాట్లాడుతాను.” చెప్పింది ప్రసూన.
“అలాగే ప్రసూన, ఉంటాను.” ఫోన్ కట్ చేసాను.
ఆ తరువాత రాహుల్ వచ్చాడు. నేను ప్రసూనతో మాట్లాడిన సంగతి తనకు చెప్పలేదు. బహుశా ప్రసూన కూడా చెప్పలేదేమో, రాహుల్ ఆ విషయం గూర్చి నాతో ఎప్పుడూ మాట్లాడలేదు.
************
రోజులు గడుస్తున్నాయ్.
ఆ రోజు నేను కాలేజ్ కు తయారవుతూ ఉన్నా. రాహుల్ నిద్ర లేచాడు కానీ తయారవలేదు.
“కాలేజ్ కు రావడంలేదా?” రాహుల్ ను అడిగా.
“కొద్దిగా తల నొప్పిగా ఉంది, అందుకే రావడంలేదు.” ముక్తసరిగా సమాధానం చెప్పాడు.
నేను కాలేజ్ కు బయలుదేరి వెళ్లి ఎప్పటిలాగే సాయంత్రం రూమ్ దగ్గరకు వచ్చా. క్రింద ప్లాట్ లోని అంటీ లు ఇద్దరు కుళాయి దగ్గర ఏదో గుసగుసలాడుతున్నారు.
“పొద్దున్నుండి రూమ్ లోనే ఉండి ఇంతకు ముందే బయటకు వెళ్ళింది.” ఒక ఆంటీ మరో ఆంటీ తో అంది.
“నెలకు ఒకటికి రెండు సార్లు ఇలాంటివి జరుగూతే ఉన్నాయి.” మరో ఆంటీ చెబుతోంది.
“ఒక్కోసారి ఒక్కో అమ్మాయి వస్తూ ఉంటుంది.”
నన్ను చూడగానే గొంతు సవరించుకొని వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు.
నేను నేరుగా గదిలోకి వెళ్ళా. షూ విప్పుతూ చూసా, డస్ట్ బిన్ పక్కన వాడిపోయిన సన్నజాజులు, డస్ట్ బిన్ లో చిరిగిన కండోమ్ కవర్ పడి ఉన్నాయ్. డాబా పై రాహుల్ గొంతు సన్నగా వినిపిస్తోంది. “ఈ రోజు మొత్తం జూలీ నా రూమ్ లోనే ఉంది. స్వర్గాన్ని చూసాననుకో. తను కూడా బాగా కోఆపరేట్ చేసింది.” ఎవరితోనో ఫోన్ లో చెబుతున్నాడు. నాకు రాహుల్ మీద అసహ్యం వేసింది.
***************
నేను రాహుల్ తో మాట్లాడడం బాగా తగ్గించేసా. “సెల్లూన్ షాప్ కు వెళ్తున్నా. వచ్చేటప్పుడు నీకు కూడా డిన్నర్ తీసుకోని వస్తా.” చెప్పి బయటకు వెళ్ళాడు రాహుల్.
ఆ రోజు మంగళవారం, పైగా రాత్రి 7 దాటింది. ఆ టైం లో సెల్లూన్ షాప్ కు ఎందుకు వెళ్తున్నాడో అర్థం కాలేదు. డ్రాయర్ లో చిందర వందరగా ఉన్న బుక్స్ ను సర్దుతున్నా. సైలెంట్ మోడ్ లో సైలెంట్ గా రింగ్ అవుతున్న రాహుల్ ఫోన్ కనబడింది. డిస్ప్లే పై ప్రసూన కాలింగ్ అని ఉంది. ఆ అమ్మాయితో మాట్లాడాలా? వద్దా?? అని ఆలోచించా. కానీ తను నన్ను అన్నయ్యా అని పిలిచింది గుర్తుకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశా.
“నేను గౌతమ్ ను మాట్లాడుతున్నా. ఎలా ఉన్నావ్ ప్రసూనా?”
“నేను చాలా టెన్షన్ గా ఉన్నాను అన్నయ్యా! రేపు మీరు కూడా వస్తారు కదా!”
“టెన్షన్ ఎందుకు?”
“ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అంటే టెన్షన్ ఉంటుంది కదా!! ఇంతకీ మా పెళ్ళికి మీరు కూడా వస్తారు కదా?”
“మీరు పెళ్లి చేసుకొంటున్న సంగతి రాహుల్ నాకు చెప్పలేదు.”సూటిగా చెప్పా.
“అదేంటి అన్నయ్యా! మున్సిపల్ ఆపిస్ నుండి తన కొలీగ్స్ అందరూ వస్తారని చెప్పాడు?”
“మున్సిపల్ ఆఫీసా?”
“అవును, మున్సిపల్ ఆఫీసే.”
“కానీ ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఇలా పెళ్లి చేసుకోవడం అంత కరెక్ట్ కాదు కదా ?” ప్రసూనను అడిగా.
“నాకు ఇప్పుడు వేరే దారి లేదు అన్నయ్యా, నేను, రాహుల్ మూడు నెలలుగా ప్రేమించు కొంటున్నాం. కానీ మా ఇంట్లో నాకు ఇష్టం లేని వేరే సంభందం ఫిక్స్ చేసారు. అందుకే వాళ్లకు తెలియకుండా రాహుల్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నా“ఇంతకీ నీకు తోడుగా ఎవరు వస్తున్నారు?”
“నేను ఒక్కదాన్నే వస్తున్నా.” .
“కనీసం నీకు తోడుగా పెద్ద వారిని ఎవరినా ఒకరిని తీసుకోని రా! ఒక అన్నయ్యగా నీకు నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేను.” ఫోన్ పెట్టేసా.
**************
ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. రాహుల్ తను మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తున్నానని ప్రసూనకు అబద్దం చెప్పాడు. నిజంగానే ప్రసూనను ప్రేమిస్తోంటే తనకు అబద్దం చెప్పాల్సిన పనిలేదు. కానీ అతన్ని నమ్మి ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లకు తెలియకుండా తిరుపతికి వస్తోంది.
*************
పొద్దున నేను నిద్ర లేచేటప్పటికే రాహుల్ తయారయ్యి ఉన్నాడు, చాలా ఉత్సాహంగా కనబడుతున్నాడు. బహుశా ప్రసూనను పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడేమో. నేను పేపర్ చదువుతున్నా. నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు.
**************
నేను స్నానానికి వెళ్ళేటప్పుడు రాహుల్ ఒంటరిగా రూమ్ కు తిరిగి వచ్చాడు. ముఖం బాగా వాడిపోయి ఉంది. నేను తనను ఏమీ అడగలేదు. స్నానానికి వెళ్ళా. రాహుల్ ఫోన్ లో మాట్లాడడం నాకు వినిపించింది.
“ ఫిగర్ సూపర్ గా ఉంది. అది ఒక్కటే వస్తుందని అనుకొన్నా. కానీ దానితో పాటు వాళ్ళ ఆంటీ కూడా వచ్చింది. నా ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యింది.” ఎవరితోనో చెప్పాడు.
“మరో రెండు రోజులు మంచి ముహూర్తాలు లేవు. రెండు రోజుల తర్వాత పెళ్లి చేసుకొందాం అని ఏదైనా హోటల్ కు తీసుకొని వెళ్లి రెండు రోజులు దానితో బాగా ఎంజాయ్ చేసి ఆ తరువాత వదిలేద్దాం అనుకొన్నా.”
అవతల వాడు మళ్ళి ఏదో అడిగాడు, దానికి మళ్ళీ చెబుతున్నాడు.
“పెళ్ళికి కావాల్సిన వస్తువులు తీసుకొని వస్తాను. అప్పటిదాకా మీరు ఇక్కడే ఉండండి అని వాళ్ళను గోవిందరాజ స్వామి గుడి దగ్గర వదిలి రూమ్ కు వచ్చేసా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తున్నా. వాళ్ళు ఓ రెండు గంటలు వెయిట్ చేసి వెళ్ళిపోతారు. కొత్త నంబర్ తీసుకొన్నాక నీకు ఫోన్ చేస్తాను. బాయ్.” వాళ్ళ ఫ్రెండ్ కు ఎవరికో చెప్పాడు. వెంటనే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన సౌండ్ వచ్చింది.
నేను కాలేజ్ కు వెళ్ళా. నా మనసు మనసులో లేదు. రాహుల్ కోసం వాళ్ళు గుడి దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటారు. వీడు వెళ్ళక పోయేసరికి ఆ అమ్మాయి కంగారు పడుతూ ఉంటుంది. తిరిగి ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఆ అమ్మాయికి. లంచ్ బెల్ కొట్టారు. రాహుల్ తినడానికి కేంటిన్ వెళ్ళాడు. నేను టూ అవర్స్ పర్మిషన్ తీసుకొని కాలేజ్ నుండి బయటకు వచ్చేసా. నేరుగా గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళా. చుట్టూ చూశా. ధ్వజస్థంభం దగ్గర ఒక అమ్మాయి, ప్రక్కనే ఒక పెద్దావిడ ఇద్దరూ నిస్సహాయంగా చూస్తున్నారు. ఎదురు చూపులు చూసి వారి కళ్ళు అలసిపోయి ఉన్నాయి.
“ప్రసూన అంటే?” ఆ అమ్మాయిని అడిగా.
“మీరు?”
“నేను గౌతమ్ ను, రాహుల్ వాళ్ళ రూమ్ మేట్ ను”
తను ఒక్కసారిగా ఏడుస్తూ “అన్నయ్యా!” అంటూ నా గుండెల పై వాలిపోయింది. ఆ క్షణంలో కనీస పరిచయం కూడా లేని నేను తనకు ఆసరాగా నిలుస్తానని ఆ అమ్మాయి భావించింది. తనకు జరిగిందంతా వివరంగా చెప్పాను.
“తోడుగా పెద్ద వారిని ఎవరినైనా తీసుకొని రమ్మని నువ్వు ప్రసూనకు ఇచ్చిన సలహా వల్ల రేణిగుంట లో ఉన్న నాకు ప్రసూన ఫోన్ చేసింది. నన్ను తోడుగా రమ్మని అడిగింది. నేను పొద్దున్నే రేణిగుంటలో ట్రైన్ ఎక్కాను. మీరు ప్రసూనకు ఇచ్చిన సలహా వల్లే వాడి నిజ స్వరూపం తెలిసింది. అలాంటి వాళ్ళను ఊరికే వదల కూడదు. వాడిపై పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇద్దాం.” చెప్పింది ఆ పెద్దావిడ.
“వద్దు ఆంటీ. ముక్కూ ముఖం తెలియని వాడిని నమ్మి, ఇంట్లో వాళ్ళను వదలి రావడం నాదే తప్పు. “ పీలగా చెప్పింది ప్రసూన.
“మరైతే నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళగలవా?” ప్రసూనను సూటిగా అడిగా.
“నాకూ అదే అర్థం కావడం లేదు. ఈ సరికే నా కోసం మా అమ్మా, నాన్న వెతికి ఉంటారు. ఇప్పుడు వాళ్లకు జరిగిన విషయం తెలిస్తే నన్ను ఇంట్లో కు రానివ్వరు.” ఏడుస్తూ చెప్పింది ప్రసూన.
“మీకు ప్రసూన ఎలా పరిచయం?” ఆ పెద్దావిడను అడిగా.
“మేము కొంత కాలం వైజాగ్ లో ప్రసూన వాళ్ళ పక్కింట్లో అద్దెకు ఉండే వాళ్ళం. మా ఆయన రైల్వే లో పనిచేసే వారు. ఆయనకు రేణిగుంట కు ట్రాన్స్ఫర్ అవడంతో చాలా ఏళ్ల క్రితమే రేణిగుంట లో స్థిరపడి పోయాం. ఆ తరువాత ఆయన ఆక్సిడెంట్ లో చనిపోయారు. ఆ వచ్చే పెన్షన్ తో నేను మా అబ్బాయిని చదివిస్తూ రేణిగుంట లోనే ఉండిపోయా.” చెప్పింది ఆ పెద్దావిడ.
“ఇప్పుడు మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు?”
“బిటెక్ , సెకండ్ ఇయర్ “
“మీ అబ్బాయికి ప్రసూన వాళ్ళ నాన్న గారితో పరిచయం ఉందా?”
“మేము వైజాగ్ లో ఉన్నప్పుడు మా అబ్బాయి చాలా చిన్న వాడు. వాడికి ప్రసూన వాళ్ళ నాన్నతో పరిచయం లేదు.”
“మీ అబ్బాయి పేరు?”
“ప్రవీణ్”
“మీ పేరు?”
“సులోచనమ్మ”
నేను బాగా ఆలోచించా. సులోచనమ్మ ఫోన్ తీసుకొని ప్రసూన వాళ్ళ నాన్నకు డయల్ చెయ్యమని ప్రసూనకు చెప్పా. ప్రసూన భయపడుతూ సులోచనమ్మ ఫోన్ నుండి తన తండ్రికి కాల్ చేసింది. ఒక్క రింగ్ లోనే కాల్ లిఫ్ట్ చేసాడు ప్రసూన వాళ్ళ నాన్న.
“హలో!” వారి గొంతులో ఆత్రుత కనబడింది.
“అంకుల్! నేను సులోచనమ్మ గారి అబ్బాయి ప్రవీణ్ ను మాట్లాడుతున్నా, రేణిగుంట నుండి.”
“చెప్పు బాబు!”
“ప్రసూనా అక్కను ట్రైన్ ఎక్కిస్తున్నాను. రేపు స్టేషన్ దగ్గరకు వచ్చి తనను పికప్ చేసుకోండి.”
“ప్రసూన అక్కడకు వచ్చిందా?”
“అవును అంకుల్. నిన్న అమ్మ షాపింగ్ కోసం తిరుపతికి వచ్చినప్పుడు సడన్ గా హార్ట్ ఎటాక్ వచ్చిందట. షాప్ వాళ్ళు అంబులెన్సు లో అమ్మను హాస్పిటల్ కు పంపించారు. అమ్మ ఫోన్ లో డయల్ నంబర్స్ లో ప్రసూన అక్క నెంబర్ ఉండడం తో హాస్పిటల్ వాళ్ళు ప్రసూన అక్కకు ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పారట. అక్క కంగారు పడుతూ వచ్చేసింది. తను ఇప్పటి వరకూ హాస్పిటల్ లో అమ్మకు తోడుగా ఉంది. ఇదిగో అక్క దగ్గర ఇస్తున్నా! మాట్లాడండి.” అంటూ ఫోన్ ప్రసూనకు ఇచ్చాను.
“హ...హలో!” భయపడుతూ అంది ప్రసూన.
“ఏమ్మా ! వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళాలి కదా! నువ్వు కనబడక పోయే సరికి ఎంత కంగారు పడ్డామో తెలుసా? మీ అమ్మ అయితే రాత్రి నుండి ఏడుస్తూనే ఉంది.”
“సారీ నాన్న! ఆంటీ కు హార్ట్ ఎటాక్ అని ఫోన్ వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేరు. గుడికి వెళ్లి పోయారు. ఆ టైం లో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అదే టైం లో వైజాక్ నుండి తిరుపతి కి ట్రైన్ ఉండడం తో వెంటనే బయలు దేరాను. స్టేషన్ కు వచ్చాక మీకు ఫోన్ చేద్దామంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. హాస్పిటల్ కు వచ్చాక ఫోన్ చెయ్యడం కుదరలేదు.” ఒక్కో అబద్దాన్ని ఏర్చి , కూర్చి చెప్పింది ప్రసూన.
“ఇంతకీ ఇప్పుడు ఆంటీ కు ఎలా ఉంది?”
బాగుంది నాన్న.”
“సరే, జాగ్రత్తగా వచ్చెయ్. నేను స్టేషన్ లో వెయిట్ చేస్తూ ఉంటాను.” ఫోన్ పెట్టేసాడు ప్రసూన వాళ్ళ నాన్న.
ప్రసూన ఊపిరి పీల్చుకొంది. తన ముఖం లో సంతోషం కనబడింది. నా వైపు కృతజ్ఞతగా చూసింది. తన చూపు నా మనసులో స్థిరంగా నిలచిపోయింది.
********************
తిరిగి సాయంత్రం కాలేజ్ కు వెళ్ళాను. స్టాఫ్ అందరూ తమ పనులు మానుకొని ఏదో గుసగుసలాడుకొంటూ ఉన్నారు. నేను స్టాఫ్ రూమ్ కెళ్ళి నా టేబుల్ ముందు కూర్చొన్నాను. అటెండర్ సుబ్బారావ్ టి తీసుకొని వచ్చాడు. “ఏమైంది? అందరూ పనులు మానుకొని మీటింగ్ పెట్టారు?” సుబ్బారావ్ ను అడిగా.
“మీ రూమ్ మేట్ రాహుల్ సార్ ను పోలీసులు పట్టుకొని వెళ్ళారు సార్!”
“పోలీసులా? ఎందుకు??”
“నెల రోజుల క్రితం ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటబడి, పెళ్ళిచేసుకొంటానని నమ్మించి, ఆ అమ్మాయిని మోసంచేసి, అప్పటినుండి కనబడకుండా తిరుగుతున్నాడని ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చిందట. పోలీసులు ఇంతకాలానికి ఆ అమ్మాయిని మోసం చేసిన వాడు రాహుల్ సార్ అని గుర్తించి అరెస్ట్ చేసారు.” చెప్పాడు సుబ్బారావ్.
సుబ్బారావ్ చెప్పింది వినగానే నాకు చాలా సంతోషం వేసింది. తప్పుడు ఆలోచనలు ఉన్న వాడు, తప్పుడు పనులు చేసేవాడు ఎప్పటికైనా తమ పాపాలకు తగిన మూల్యాన్ని అనుభవించాల్సిందే.