కెమేరా తీసుకోని హోటల్ లోంచి బయట పడ్డాడు కుమార్. కుమార్ వొక పేరుమోసిన పత్రికలో విలేఖరిగా పనిచేస్తున్నాడు. కెమెరా పట్టుకొని బయటికి వెళ్ళేడంటే సెన్సేషనల్ వార్త సంపాదించి తీరతాడని అతని సహోద్యోగుల మాట . శ్రీరాముడికి ధనుస్సు ,ఆంజనేయుడికి గద లాగ కుమార్ కి కెమేరా అలాగ.
వీధులన్నీ పట్టపగలు లా కళకళ లాడుతున్నాయి .సాయంత్రం ఎనిమిది గంటల వరకు నిద్ర పోతున్నట్టు వుండే వీధులన్నీ ఒక్కసారిగా దీపావళిని తలపిస్తాయి. నిమిషాలమీద రోడ్ల పైన డిస్కో బార్లు వెలుస్తాయి. డబ్బుతో కొనగలిగినవన్ని అమ్మకానికి తయారుగా వుంటాయి. అంగడి బొమ్మలు అందాలు ఆరబోస్తూ దర్శనం యిస్తారు . విటులని ఆకర్శించడానికి రకరకాల విన్యాసాలు చేస్తూ వుంటారు. హోరెత్తించే మూజిక్, దానికి అనుగుణంగా శరీర భాగాలని కదుపుతూ అటు యిటూ తిరుగుతున్న డాన్సర్లు.ఒంటి పైన చిన్నచిన్న బట్టలు ధరించిన ఆడ బొమ్మలు కొన్ని కస్టమర్ల గ్లాసులు నింపుతూ అటూ యిటూ తిరుగుతున్నాయి .వాళ్ళ దేశాలలో దొరకని విచ్చలవిడి తనాన్ని కొనుక్కోడానికి ఈ దేశం వచ్చిన విదేశస్తులతో ఆ వీధి నిండి పోయింది.
ప్రతీ బారులోంచి కొంపలు కాలుతున్నంత సిగెరెట్ పొగ, దాంతో లోపలి మనుషులు మసకబారి కనిపిస్తున్నారు.కొంపలు కొట్టుకు పోయెంత తాగుడు అందిస్తున్న వారకాంతలు మత్తెక్కిన కళ్ళకు అమృతంమందిస్తున్న అప్సరసల్లా కనిపిస్తున్నారు. రోడ్డు పైన వెలసిన మాంశాహారపు దుకాణాలలోంచి యేదో జంతువుని కాలుస్తున్న వాసన యివన్నీ ఈరాత్రి బజారులో సర్వసాధారణం.
ఫుట్ పాత్ మీద నడుస్తున్న కుమార్ కి సిగెరేట్ వాసన, మాంశం కాలుతున్న దుర్గంధం కలసి కడుపులో కవ్వం పెట్టి కలుపుతున్న అనుభూతి కలుగుతోంది. కడుపులో కదులుతున్న కంగాళీ ఎప్పుడు వాంతి రూపంలో బయటకి వద్దామా అని కాచుకొని ఉంది. అయినా తన అన్వేషణ ఆపదల్చుకోలేదు . కుమార్ కి తెలుసు యిలాంటి బురదలోంచే లక్ష్మీవాసమైన కమలాల్లాంటి కధల పుట్టినిళ్ళని. అందుకే ప్రతీ బార్ ని పరీక్షగా చూసుకుంటూ నడుస్తున్నాడు.ఆ వాకింగ్ స్ట్రీట్ లో తిరుగుతూ అప్పుడే వో గంట గడిచింది. మొత్తం వీధి రెండు చెక్కర్లు కొట్టేడు.యివాళ అదృష్టం వక్రించి నట్లుంది. ఇంక లాభం లేదు వర్తాన్వేషణ ఆపి హోటల్ కి వెళ్ళిపోదాం అని వెనక్కి తిరగబోయేడు. ట్రే లో రకరకాలైన మత్తుపానీయాలతో నింపిన గ్లాసులు తెస్తున్నామే పై పడింది కుమార్ చూపు.ఆమె తనకు బాగా తెలిసిన మనిషిలా అనిపించింది.ఆమె యెవరు అన్నది జ్ఞాపకం రాలేదు.ఆమె యెవరో తెలుసుకోవాలనే కుతూహలం ముందు కడుపులో తెమల్చుతున్న కంగాళీ కుడా బలాదూర్ అయ్యింది. అందుకే నాలుగడుగులు ముందుకి వేసి బారులోకి నడిచేడు కుమార్ .
డిస్కో లైట్ల మధ్య డాన్స్ పేరుతొ పిచ్చి గంతులేస్తున్న వాళ్ళని కళ్ళార్పకుండా చూడసాగేడు. అక్కడికి వచ్చేవాళ్ళ అందరి చూపులు అలానే ఏదో వెతుకు తున్నట్టె ఉండడంతో కుమార్ చూపులు ఎవరికీ ఎబ్బెట్టుగా అనిపించ లేదు. ఆర్డర్ తీసుకొడానికి టేబుల్ దగ్గరకి వచ్చిన ఆమెని పరీక్షగా చూసేడు. బాగా తెలిసిన మనిషి లా అనిపిస్తోంది, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించసాగేడు. అప్పుడు గుర్తొచ్చింది ఓ ఆరేడు సంవత్సరాల కి ముందు వెండితెర మీద ధ్రువతారగా మెరిసి చాలా కొద్ది సమయంలో మంచి ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా మాయమైన అందానికి మారుపేరుగా అభిమానులచే పిలిపించుకున్న "అరుంధతి ". కళ్ళముందు కనిపిస్తున్నది కలో నిజమో తెలియటం లేదు కుమార్ కి, అంత పేరు,అంతడబ్బు ఆర్జించిన ఆమె యిప్పుడు ఇలాంటి దీనస్తితిలో యెందుకుంది ? టాలివుడ్ లో తళ తళా మెరిసే అరుంధతి ఒక్క ఆరేడు సంవత్సరాలలో రంగు వెలసిన బొమ్మై ,పొట్ట గడవడం కోసం పరాయి దేశం లో పడుపు వృత్తిలో ఎందుకు గడుపుతోంది ? కుమార్ లో అన్నీ ప్రశ్నలే, మరొకరి జీవితంలొకి తొంగి చూడాలనే కుతూహలం ప్రతి మనిషి కి వుంటుంది, కుమార్ విషయంలో యిది యింకాస్త ఎక్కవనే చెప్పాలి.ఆ కుతూహలమే కుమార్ ని నాలుగు రోజులకు బదులు మరో నాలుగు రోజులు అక్కడే వుండేటట్టు చేసింది. బార్ యజమానితో మాట్లాడి రెండు రాత్రులు అరుంధతిని కొనుక్కొని, అట్టడుగు పొరలలో కరడుగట్టి మూగబోయిన మనస్సుని కరిగించి కన్నీరుగా ప్రవహింపజెయ్యగా అప్పుడు బయట పడింది అరుంధతి కధ.
మాలివుడ్, టాలివుడ్ లలో చిన్న,చిన్న పాత్రలలతో ప్రవేశించి,నటనలో కొత్త పాఠాలు నేర్చుకుంటూ చిత్రసీమలో దూసుకు పోతున్న అరుంధతికి రోజు రోజుకి నిశ్శత్తువగా అనిపిస్తోంది,దేనిపైనా ఆశక్తి వుండటం లేదు , చీటికి మాటికి చిరాకు కలుగుతోంది .ముఖం లోని నీరసాన్ని మేక్ అప్ కుడా దాచలేక పోతోంది .ఈ మార్పు ముందుగా పసికట్టింది ఆమె సహా కళాకారులు.వారి సలహాననుసరించి పని నుంచి వో వారం రోజులు శలవు తీసుకుంది ,అయినా ఫలితం కనిపించ లేదు . రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తోంది, ఒక గంట పనిచేసినా అలసటగా వుంటోంది.ఆహారపు అలవాట్లు మార్చినా ఫలితం శూన్యం. సెలెబ్రిటీ కాబట్టి డాక్టర్ దగ్గరికి అందరిలా స్వేచ్చగా వెళ్ళలేక నిర్మాతలకి ఇచ్చిన షెడ్యుల్ పూర్తి చేసుకొని ఈ దేశం లో టెస్ట్ చేయించుకుంటే తెలిసింది పిడుగులాంటి వార్త . సీనీ పరిశ్రమలో పేరు తెచ్చుకోవాలనే తపనే తప్ప మరో బలహీనత లేని అరుంధతి కి ఈ ముదనష్టపు జబ్బు ఎలా వచ్చిందో అర్ధం కాక మెదడు మొద్దుబారింది .ఆ షాక్ లో నుంచి కోలుకోక ముందే ఆమెకి అత్యంత విశ్వాసపాత్రుడు ,మంచి మిత్రుడు అని నమ్మిన మేనేజర్ కాయితాలమీద సంతకాలు చేయించుకొని వెళ్ళినవాడు మరి తిరిగి రాలేదు . వెనక్కి వచ్చి పువ్వులు అమ్మిన చోట కర్రలు అమ్మలేక ,చేతిలో డబ్బులేక ,తిన్నా తినకపోయినా మందులు మాత్రం వాడుతూనే వుండాలి ,లేక పొతే ఈ జబ్బు మీదపడి కొంచం కొంచంగా మృత్యువుకి దగ్గరగా చేరుస్తుంది కాబట్టి , చెయ్యడానికి మరో పని ఈ దేశం లో లేక,రాక ఈ వృత్తి లో స్తిరబడింది .
జబ్బు పేరు వినగానే కుమార్ ఒక్కసారి దిగ్బ్రాంతికి లోనయ్యేడు. అరుంధతి ఆ మహమ్మారి భారిన ఎలా పడిందో అడగకుండా వుండలేక పోయేడు . కారణం విన్న కుమార్ పాపం అనుకోకుండా వుండలేక పోయేడు . అందరు ఆడవాళ్ళకి వుండే బలహీనతే ఆమెకూ వుంది అదే అందంగా కనపించాలనే కోరిక , పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తలో అందానికి మేక్ అప్ తో మెరుగులు దిద్డుకోనేది, పేరు డబ్బు రావడంతో శాశ్వత మెరుగులు దిద్దించుకొనేందుకు ఇలాంటి శస్త్రచికిత్సలకి పేరుగాంచిన దేశంలో శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ సమయంలో జరిగిన అలక్ష్యం వల్ల దాపురించింది హెచ్.ఐ .వి పాజిటివ్ .
అరుంధతి కధని సెన్సేషనల్ న్యూస్ గా వార్తా పత్రికలకి , టి.వి వాళ్లకి యిచ్చి డబ్బు , పేరు సంపాదించవచ్చు , కాని కుమార్ అంతరాత్మ దీనికి వప్పుకోలేదు . ప్రజలకి వుపయోగపడే విషయాలని వార్తలుగా చెయ్యొచ్చుగాని, విధివంచితల, బాధితుల కన్నీళ్ళను వార్తలుగా చేసి ఆకన్నీటి కూటితో ఆకాశనికెగరకూడదని నిర్ణయించుకున్నాడు కుమార్ . ఆ దేశపు జ్ఞాపకాలకు అక్కడే అంత్య క్రియలుచేసి స్వదేశానికి తిరిగి వచ్చేడు కుమార్.
మనసు మాత్రం అరుంధతి చుట్టారా తిరగసాగేయి . ఆమె మనసు పొరలలో దాచుకున్న జ్ఞాపకాలను కదిలించి తను సాధించిపెట్టిన దేమిటో అర్దం కాలేదు కుమార్ కి . అరుంధతి కథ నలుగురికి తెలియజేసి మిగతా వారిని రక్షించే బాధ్యత దేశ పౌరుడిగా , ఓ పత్రకారునిగా తనపై వున్న సంగతి కుమార్ కి తెలుసు అందుకే అరుంధతి పేరు బయటకి రాకుండా ప్రజలను యెలా అప్రమత్తం చెయ్యాలా అనే ఆలోచనలో మునిగిపోయేడు కుమార్ .
మార్కెట్ లో రోజుకో పేరుతో కుప్పతెప్పలుగా వస్తున్న సౌందర్యసాధనాల ప్రకటనలు తప్పుతోవ పట్టిస్తున్న తరుణం లో కుమార్ 'మసకబారిన నక్షత్రం ' యెవరిలోనైనా మార్పును తెస్తుందా ? , మనిషి ఆశాజీవి , వస్తుంటే అనుకుందాం .