అన్న-చెల్లి-మధ్యలో.. ఓ వదిన. - సుంకర వి. హనుమంతరావు

anna chelli madhyalo o vadina

“వార్త విన్నారా?”

కాఫీ కప్ అoదిస్తూ..అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి రిలేక్స్ అవుతున్న ప్రకాష్ ని అడిగింది..అనసూయ.

“వార్త చదివావా?అనాలిగానీ వినడమేమిటి ?”

భార్యామణి అంతరంగాన్ని అర్ధం చేసుకోలేని ప్రకాష్ అయోమయంగా భార్య ముఖాన్నే చూస్తూ కాఫీ సిప్ చేసాడు.

“చదవడానికి ఇదేమీ జ్యోతి ఈనాడు వార్తకాదు స్వామీ ..వినే వార్తే.”

“అయితే వినిపించు .వింటాను.M.I.M గురించి కాదుగా?”

“M.I.M అంటే ?”

“మోడీ ,మెట్రో,మధ్యలో ఇవాంక..ఇదేగా నేటి కారం వార్త?”

“కారం వార్తా ?”

“అదే ..హాట్ న్యూస్ .”

“అయితే యిది M.K.M వార్తన్నమాట .”

“మధ్యలో ఐ బదులు కె ఎక్కడనుండి వచ్చిందబ్బా?”

“K..అంటే కాత్యాయినీ ఫ్రo కంకిపాడు.”

“నిజమా ? మా చెల్లాయి వస్తోందా?ఎప్పుడు?ఎవరుచెప్పారు?” ఉత్సాహంగా అడిగాడు ప్రకాష్.

“తెలియనట్లు నటించకండి.నా సెల్లుకు మెసేజ్ పెట్టిన తల్లి మీ సెల్లుకు మెసేజ్ పెట్టలేదoటే నేను నమ్మాలి?”

“పెట్టిoదేమో నేను వేరే బ్రాంచ్ ఇన్స్పెక్షన్ లో వున్నాను.సెల్లు ఆఫీస్ లోనే వదిలేసాను.”

సెల్లు చూసుకుoటు చెప్పాడు.

“నమ్మమంటారా?”

“నామాటలు ఎప్పుడు నమ్మావు నువ్వు?నిన్ను నేను నమ్మిoచలేను గానీ ..యిoతకీ మెసేజ్ ఏమిటి?”

“వివరాలేమీ లేవుగానీ అందుకే అయ్యుంటుందని అనుకుంటున్నాను.”

“అందుకే అంటే?అదేమిటో చెప్పరాదా..ఇవ్వాళ పూర్తిగా అలిసిపోయాను.బుర్ర తినకు ప్లీజ్ ..” ప్రాధేయ పడ్డాడు ప్రకాష్.

“వయసొచ్చిన అమ్మాయి తల్లి వయసొచ్చిన అబ్బాయి తండ్రి దగ్గరకు ఎందుకు వస్తుంది?”

“ఓ..నువ్వు ఆరూట్లో వచ్చావా?మన బడుద్దాయికి అంత అదృష్టమా?అవిక ఎక్కడ మనరాజా ఎక్కడ?”

“వాడిని బడుద్దాయి అనకండి.”

“మరేమనమoటావు?అత్తెసరు మార్కులతో బిటెక్ అయ్యిoదనిపించాడు. వుద్యోగం సంపాదించుకో లేక వూరు మీద పడ్డాడు.
మరి కాత్యా కూతురు ?అoదానికి అందం ..అణకువ..నువ్వన్నట్లు సంబoధం కోసమే వస్తే మాత్రం మనరాజా అదృష్టవంతుడే”
“ఇక ఆపండి.మీ చెల్లాయితో నేను మాట్లాడుతాను.మీరేమి జోక్యం చేసుకోకండి.

నాకొడుకుని చచ్చినా కాత్యాయిని కూతురికి కట్టబెట్టను.” వార్నింగ్ యిచ్చింది అనసూయ.కూతురి కాలేజి ఫీజ్ కోసం సాయం కోరి వచ్చిన కాత్యాయిన్ని ఎన్నిమాటలందో గుర్తుకొచ్చి ఆనాటి తన అసమర్ధతకు తనను తానే అసహ్యించుకొని మౌనం పాటించాడు ప్రకాష్.

“అయినా మన అబ్బాయికి వుద్యోగం యివ్వాళ కాకపోతే రేపు ..మనం వూ అంటే కోటిరూపాయల కట్నంతో వచ్చే అమ్మాయిలు కోకొల్లలు.”

“అవును మరి..నలుగువచ్చారు.వుద్యోగం లేదని పారిపోయారు.

అందమైన కలలు కనడానికి బాగుంటాయికాని..నిజజీవితoలో సాధ్యంకాదు.ఆకల చెదిరిపోతే మిగిలేది కన్నీరే.”

“మీరెన్నైనా చెప్పండి.కానీ మీ చెల్లమ్మ విషయం లో మాత్రం తలదూర్చకoడి.

ఆవచ్చే తల్లి తొందరగా వచ్చేడిస్తే బాగుణ్ణు .కుక్ వెళ్ళిపోతుంది.”

“ఏ ..ఎన్నో రోజులతర్వాత వస్తోంది నువ్వామాత్రం చెయ్యలేవా?”

“చెయ్యక చస్తానా?..ఎందుకు చెయ్యను..రాత్రికి అమ్మగారి బస యిక్కడేనో..వెళ్ళి పోతుందో?”

“ఇంకా రాలేదు ..అప్పుడే పంపించే ప్రయత్నాలా?”

“ రాక చస్తుందా?కాళ్ళకుపడ్డ పాము కరవకుండా వదులుతుందా?

మరోసారి చెపుతున్నాను ..మీ చెల్లమ్మ గారు చెమ్మగిల్లిన కళ్ళతో ..

అరే అన్నయ్యా !కట్నాలు ఇచ్చుకోలేను కనికరించి నా కూతుర్ని నీ కోడలిగా చేసుకోరా! అని చేతులు పట్టుకుంటే కరిగిపోయి సొల్లు కార్చొద్దు.నాకొడుకు పేరే కాదు వాడే రాజా.

నేను బాత్ రూoకెళుతున్నాను.వచ్చే లోపు కాత్యాయిని వస్తే పిచ్చి వాగుడు వాగకుండా కూర్చోoడి.”

“అలాగే అసూయమ్మగారూ!సారీ అనసూయా.”

******

“రారా కాత్యా ..ప్రయాణం బాగా సాగిందా?”

“బాగానే సాగింది అన్నయ్యా .అసలు అవికా కూడా రావాలనుకుంది.ఏవో ట్రైనింగ్ క్లాసులు వున్నాయని రాలేకపోయింది.”

“నువ్వొచ్చావు ..దాన్ని చూడడానికి నేనే వస్తాను.అమరావతి లో సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ కదూ?”

“ఏదో చిన్న జాబ్.”

“హాయ్ !కాత్యాయిని ..ఎంతసేపయ్యింది వచ్చి.?” అంటుకున్న తల తుడుచుకుoటు వచ్చి అడిగింది అనసూయ.

“యిప్పుడే వదినా ..అన్నట్లు రాజెక్కడ? జాబ్ చేస్తున్నాడా?”

మొన్నేదో ఇoటర్వు కెళ్ళాడు.మల్టీనేషనల్ కంపనీ.రేపో మాపో అంటున్నాడు.”

“నీకేమి వండిపెట్టాలా అని నీ మెసేజ్ చూసినప్పటి నుండి మీ వదిన బుర్ర బద్దలు ..”

“వదిన సంగతి నాకు తెలియదా అన్నయ్యా?నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా?”

“మీ అన్నయ్యే చెప్పాలి.నేను విని తరించాలి.

అవునూ ఒక్కదానివే వచ్చావే?అవిక రాలేదా?”

“అది మొన్నీ మధ్యే ఏదో చిన్న జాబ్ లో చేరింది.సెలవు పెడితే బాగోదని నన్ను పంపింది.”

“అవికా పెళ్ళి గురిoచి ఆలోచిస్తున్నావా?”

“అమ్మాయి పెళ్ళంటే మాటలావదినా?”

“అయినాతప్పదుగా ?అవికా వయసు ఇరవై నాలుగా ?ఐదా?”

“మొన్నే యిరవై నాలుగు దాటి యిరవై అయిదులోకి అడుగుపెట్టింది.”

“మీదగ్గరి బoధువుల్లో చూడలేక పోయావా?”

“ఆపనిమీదే వచ్చాను.”

“మీ అన్నగారిని నమ్ముకోకు..అదుగో అంటే ఆరు ఇదుగో అంటే ఇరవై.. నెలలు కాదు సంవత్సరాలు.”

“ఏరా అన్నయ్యా?నీ మేనకోడలి కోసం నువ్వేమి చేయలేవా?”

“ఇoతచెప్పినా అర్ధం కాలేదా వదినా?ఖర్మ ఖర్మ.”

“నేనేమి చేయగలను చెప్పు?”

“అదేమి మాటన్నయ్యా?ఏమీ చేయలేవా?కనీసం రాజాకైనా ?”

“వదినా వాడికిప్పుడే పెళ్ళా?”

“ఇరవైయేడు దాటిపోలా?”

“అవుననుకో మొన్నీమధ్య ఓసంబంధం వచ్చింది..కానీ వాళ్ళు కోటికన్నా ఎక్కువ యివ్వలేమన్నారు.”

“వీర లెవెల్లో కోతలు కోస్తున్న భార్యను ఏమీ అనలేక మౌనాన్ని ఆశ్రయించాడు ప్రకాష్.”

“అన్నయ్యా !నిన్నడుగుతున్నాను..నీ సమాధానం కూడా యిదేనా?”

“వదినా నన్నడుగు.నేను చెపుతాను.మారాజాకీ మీ అవికాకి పోలికేలేదు. కట్నం యివ్వగలవా అంటే అదీలేదు.పోనీ మీఅమ్మాయి ఏమైనా మిస్ వరల్డా? చిన్నజాబని నువ్వే చెప్పావు.మరి యేమిచూసి రాజాని యిమ్మంటావు?”

“వదినా! డబ్బు దర్పాలని మించి అనుబoధముంటుంది.

నాకు వీడు అన్నయ్య.ఒకతల్లి బిడ్డలం.”

“అయితే?”

“కట్నాల పేరుతో కావలసిన వారిని దూరం చేసుకుంటామా?”

“వదినమ్మా!నీతులు చెప్పడానికి యిది కధకాదు..సినిమాకాదు..జీవితం.

నీతులు చెప్పడానికే గాని ఆచరించడానికి కాదు.”

“చివరిగా అడుగుతున్నాను .. మా అవిక మీ రాజాకి తగిన సంబంధం కాదంటావు?”

“అవును.. అవును.. అవును..ఒకే మాట ఎన్నిసార్లు అడుగుతావు?” ఆవేశపడిపోయింది అనసూయ.

కాత్యాయిని అంతేనా అన్నయ్యా ..అన్నట్లు చూసిoది.ప్రకాష్ సిగ్గుతో తలదించుకున్నాడు.

“అన్నయ్యా !వదినా!

మీ అoతస్తుకు తగినదానినికాదని తెలిసీ అనవసరంగా వాదించాను.

అసలు విషయానికి వస్తాను.ఈ నెల యిరవై మూడున అవికపెళ్ళి..మీ మేనకోడలు మీకు పెళ్లిబట్టలకని ఈ యాభై వేలు పంపించింది. అమ్మాయితో బాటు అబ్బాయికూడా గూగుల్ కంపెనీ లోనే ఎంప్లాయి.

ఇద్దరి శాలరీ కలిపి రెండు లక్షల పైమాటే. పెళ్లి కాగానే యిద్దరూ కంపెనీ తరఫున స్టేట్స్ కు వెళ్ళిపోతారు. మీరు తప్పకుండా వచ్చి వధూవరులను ఆశిర్వదించండి.”

భార్యా భర్తలు తెల్ల ముఖాలతో నోరు తెరిచేశారు.

“మీతో యింత సేపు ఎందుకు గొడవపడ్డానో తెలుసా?

ఒక్కసారి ఈ విడియో చూడoడి.”

*****

“అమ్మా!నేను ప్రేమించిన అబ్బాయి మాకoపెనీలోనే నాతోబాటే పనిచేస్తాడు.

మా యిద్దరి కులాలు వేరుకానీ ..మతం మానవత్వం ఒక్కటే.

పుట్టింది విజయవాడ..ఉండేది భాగ్యనగరం.కట్నాలమీద ఆశలేదు. అయినా ఈకాలంలో అబ్బాయిలకు కట్నాలిచ్చి
పెళ్లి చేసుకునే అమ్మాయిలున్నారా ?”

“కాదనను..అవికా !మా అన్నయ్య కొడుకు రాజా వున్నాడు.మా అన్నయ్య నామాట కాదనడు.

అయిన సంబంధం ఆలోచిoచు.కట్నాలకు ఆశపడే స్వభావం కాదు మా అన్నయ్యది .”

“అమ్మా!మీ అన్నయ్య వెనుక మీ వదిన ఉంటుందని మర్చిపోయావా?

ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటే నమ్మనుగాక నమ్మను.

కానీ పతనమైన ప్రతి మగాడి వెనుకా స్త్రీ ఖచ్చితంగా ఉంటుందంటే నమ్ముతాను.”

“అనసూయ వదిన అన్నయ్య మాటను కాదనదు.అప్పుడంటే మనం పేదవాళ్ళం.

యిప్పుడు నీ మూలంగా మనం కూడా మంచి జీవితంలోకి అడుగుపెట్టాము.”

“అమ్మా!మానవ సంబంధాల మీద నీకంత నమ్మకముంటే ఒకసారి వెళ్ళి .. నా జాబ్ ..శాలరీ గురించి చెప్పకుండా అడిగిచూడు.వాళ్ళు సరేనంటే నా ప్రేమను నీకోసం వదులుకుంటాను.

నాకు తెలుసు..మనీ ముందు మమతలూ బoధుత్వాలూ బలాదూరని. నీది పిచ్చి నమ్మకమని నేనెందుకు వాదించాలి?నువ్వే కళ్ళారా చూడు ..

నువ్వు మీ అన్నావదినలతో మాట్లాడేటప్పుడు ఈ ఫోన్ ఆన్ చేసి ఉంచు.

నేను లైవ్ లో చూసి తరిస్తాను.”

“అవికా చెప్పిన కధ ..స్క్రీన్ ప్లే తో సహా సరిపోయింది.మీ యిద్దరి సూపర్ యాక్షన్ డైలాగులతో ఈ ఫోన్ తీసిన సినిమా మొత్తం చూసేసింది. నేను దానికి నాముఖం ఎలా చూపిoచాలో అర్ధమై చావడం లేదు.కన్నకూతురే కాబట్టి ముద్దులుపెట్టి మాయచేస్తాను.

అబ్బాయిది యీవూరే. కల్యాణవేదిక హైటెక్ సిటీ సైబర్ సిటీ కన్వెన్షన్ హాల్.

పెళ్లి రోజున యిదే డ్రైవర్ తో కార్ పంపిస్తాను.వస్తే సంతోషిస్తాము నేనూ..నాకూతురు అవిక.”

హేండ్ బ్యాగ్ నుండి శుభలేఖ తీసి అన్నయ్యా వదినల చేతుల్లో పెట్టి అనసూయకు బొట్టు పెట్టి ..వెండి కుంకుమ భరిణ వదిన చేతుల్లో పెట్టి బయట పార్క్ చేసున్న వెర్నా కార్ వైపుకు హుందాగా అడుగులేసిoది ..కాత్యాయిని .

ఇవాంకా టూర్ కోసం మాధాపూర్ రోడ్ల కు చేసిన అలంకరణ చూసి ముఖం మాడ్చుకుని యేడ్చేస్తున్న సిటీ రోడ్లలా నిలబడిపోయారు మిస్టర్ అండ్ మిసెస్ అసూయా పురుషోత్తం.సారీ.. సారీ..అనసూయా పురుషోత్తం.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు