జాతి గౌరవం . - ఆదూరి.హైమావతి.

jati gouravam

పుల్లేటి కుర్రులోని పెద్దిరెడ్డి ఇల్లు కోలాహలంగాఉంది. ప్రతి సంక్రాంతికీ ఆయన ఇంటికి ముగ్గురు తమ్ముళ్ళూ , ఇద్దరు ఆడపడుచులూ, ఇద్దరుకూతుళ్ళూ, ఇద్దరుకొడుకులూ అంతా రావటం వాడుక.పది గదుల పాతకాలపు పెంకుల మండువా లోగిలి అతడిది.

ఇంట్లో గదులన్నీ వారం వారం ఆవుపేడతో అలికించి, గోడ వారగా చుట్టూతా ఎర్రమట్టితో 'వారు ' పెట్టి, పిండి ముగ్గు వేసేవారు.గుమ్మాలన్నింటికీ మామిడితోరణాలు,కొత్తతాటాకు పందిళ్ళూ , పందిరి గుంజలకు కొబ్బరి మట్టలు , వీటన్నింటితో కమ్మని వాసనతో మనస్సుకు ఆహ్లాదం కలిగించేది పెద్దిరెడ్డి ఇల్లు ప్రతిపండక్కూ. సంక్రాతివచ్చిందంటే సరేసరి, గోడలకు సున్నాలు వేయించి మరీ ముస్తాబుచేయించేవాడు పెద్దిరెడ్డి..

గత ఐదేళ్ళుగా అమేరికాలో ఉంటున్న పెద్దల్లుడు పెళ్ళయ్యాక మొదటిఏడాదితప్ప , ఆతర్వాత తన ఇంటికి రాకపోడనికి కారణం ఏమై ఉంటుందాని,తనవారందరితోచర్చించి ఒక నిర్ణయానికి వచ్చాడు పెద్దిరెడ్డి . పండుగ రెండునెలలు ఉందనగానే ఆయన తన ఇంటి ముందు నడక దారంతా కడప నాపరాళ్ళుపరిపించాడు.

దక్షిణపు గది అల్లుడికోసం కేటాయించి మంచి ఖరీదైన టైల్స్ అతికించాడు. కొత్త డబుల్ కాట్ మంచాలురెండు తెప్పించాడు. స్నానపుగది ఎట్టాచ్డ్ గా కట్టించి, కమోడ్ టాయిలెట్,ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టించి,వేడి నీటి సౌకర్యం, వాష్ బేసిన్ , భోజనం బల్ల , కుర్చీలు ,సోఫాసెట్ కొత్తవితెప్పించి అమర్చాడు.అమేరికా అల్లుడు గనుక ఒక కొత్త మోడల్ కారు అద్దెకు తెప్పించి ఉంచాడు.

సంక్రాతి వారం ఉందనగానే ఒక్కోరూ దిగసాగారు.ఇంటిముందు వెనకటిలా తాటాకు పందిళ్ళకు బదులుగా షామియానా చూసి,"అదేంటినాన్నా !పందిళ్ళేవీ!" అంది చిన్నకూతురు రమ."మీ పెద్దక్క ,బావ వస్తున్నారాయె అమేరికానుంచీ వారికి నచ్చుతాయోలేదోనీ.." నసిగాడు పెద్దిరెడ్డి . లోపలికెళ్ళి మార్పులన్నీ చూసి మురిసి పోయింది రమ.

"అదేంటినాన్నా మాగదీ మోడల్ మార్పించలేకపోయావ్?ఎంతైనానీకు అమేరికా అల్లుడంటేఇష్టంలేనాకుతెల్సు. మీ చిన్నల్లుడూ బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నారుగా! ఆయనపై అంతచిన్నచూపెందుకూ? ఏం మాకా సౌకర్యాలు వద్దా?" అని తండ్రితో తగాదా కు దిగిందికూడా.

తల్లి అనసూయమ్మ ,సర్ది చెప్పింది" తర్వాతిఏడాదికీ మీగదీ చేయిస్తాంగా..సమయం చాల్లేదులే!" అని.పెద్దిరెడ్డి తనకున్న పది గేదెల్నీ, రెండు ఆవుల్నీ , ఇరవై ఎద్దుల్నీ ఊరిచివరగా తనకున్న పశువులగడ్డికుప్పలేసే దొడ్లో పాకలేయించి తాత్కాలికంగా మార్చాడు.పేడవాసన అమేరికాల్లుడు అరవిందుకు పడుతుందోలేదోని.

ఒక్కోరూ పెద్దిరెడ్డి రక్తసంబంధీకులం తాదిగడంతో ఇల్లంతా కోలాహలం ,సంక్రాంతిముందుగా వారింటికే వచ్చిన ట్లుంది. ఊరివారంతా “ పెద్దిరెడ్డి అమేరికా అల్లుడొస్తన్నాట్ట! మహా సంబరపడున్నాళ్ళే .." అని చెప్పుకోసాగారు.

అంతా ఎదురుచూస్తున్న రోజురానే వచ్చింది.పెద్దిరెడ్డి పెద్దకొడుకు రవిని అద్దెకుతెప్పించిన కొత్తకారిచ్చి ,రైలు సమయానికి అరగంటముందే రైల్వేస్టేషన్ కు పంపాడు.కానీ రైలు వెళ్ళిపోయాక రవి ఒక్కడే కారు దిగాడు.

" ఏమై దబ్బయ్యా!అల్లుడుగారు రాలేదేంటీ!" ఆశ్చర్యంగా అడిగాడు పెద్దిరెడ్డి.

" కారెక్కరుట నాన్నగారూ! వారంతామన సాంబయ్య ఎద్దుబండిలో వస్తున్నారు!!ఇవిగో పెట్టెలు నాతో పంపారు." అంటూ పెట్టెలు,బ్యాగులూ దింపాడు రవి. అవన్నీ మోసుకెళ్ళి వారికి కేటాయించిన గదిలో ఉంచారు.

ఒక గంటతర్వాత ఎద్దుబండి వచ్చి గేటుముందు ఆగింది.దాన్లోంచీ అల్లుడుఅరవిందు,కూతురు వినోదినీ ,వారి కవలపిల్లలు ఓంకార్, సహన దిగారు.అంతా బండిదిగి పెద్దిరెడ్డిరెడ్డీకీ,ఆయనభార్యఅనసూయమ్మకూపాదనమ స్కారాలు చేశారు. "తాతగారూ! అమ్మమ్మాగారూ! బావున్నారా! మిమ్మల్ని నేరుగాచూట్టం ఇదే!మీఫోటోలు చూస్తుంటాం " అంటూ నాలుగున్నరేళ్ళ ఆకవలపిల్లల పలకరింపుకు అంతాఆశ్చర్యపోయారు.

ఇదేంటీ మనదేశంలో ఉన్న మనవలూ, మనవరాళ్ళూ వచ్చాక తమని" హలో గ్రాండ్ పా!, గ్రాండ్ మా! “ అని పలకరించారే తప్పఇలా నమస్కారాలు చేయలేదు.పైగా అమేరికాలో ఉంటున్న అల్లుడు నమస్కారం చేయటం , పిల్లలుతెలుగు మాట్లాడటం, ఎద్దులబండిలో రావటం అంతా అయోమయంగా ఉంది వారికంతా. లోపలికివస్తూ " ఇదేంటి మామగారూ!ఇక్కడ ఆవుపేడతో అలికి పిండిముగ్గులూ ,ఎఱ్ఱ మట్టితో ‘వారు’పెట్టి ఉండేది !ఇలా కడపరాళ్ళుపరిపించారేంటీ!ఎండకు వేడెక్కి ఆవేడి ఇంట్లోకి వస్తుందేమోగా!"అన్నాడుఅరవిందు. లోపలికెళ్ళి వారిగది చూసి" ఇదేంటీ! ఆవుపేడతో అలికిన నేల కమ్మనివాసనతో, చల్లగాఉండేది! ఇలా నగర వాసపు రాళ్ళు వేయించారు?"అన్నాడు.
స్నానాలగది చూపగానే ,మరీఆశ్చర్యంగా " ఏంటిమామగారూ!ఇదంతా కొత్తగాఉంది? బావివద్ద చేదుకుని ఫ్రష్ నీరు స్నానంచేస్తే ఎంతహాయి!ఈటాయ్ లెట్ కూడా మార్చేశారే!ఈడైనింగుటేబులూ,కుర్చీలూ,సోఫాలూఇవన్నీ మా కోసంకొన్నట్లున్నారు? కనీసంవాడుతున్నట్లుకూడాలేదు!ఇదంతాఎందుకండీ!ఎంతశ్రమతీసుకున్నారు? మీరు బాగా అలసిపోయి నట్లున్నారు మామగారూ!"అంటూదగ్గరకొచ్చి,పెద్దిరెడ్డిని సోఫాలో కూర్చోబెట్టి ,తన మెడికల్ కిట్ తీసుకుని పరీక్షించి," మీ బీ.పీ. చాలా ఎక్కువగాఉందండీ! ఇదో ఈ మాత్రవేసుకునికాస్తంతసేపు విశ్రాంతిగా ఈ గదిలో పడుకోండి." అంటూ తమకు కేటాయించిన గదిలోఆయన్ను విశ్రమింపజేసి, తమ సామానం తా పక్కనే ఉన్న ఖాళీగదిలోకి మార్పించాడు అరవిందు.ఆతర్వాత స్నానాదికాలుకా పూర్తిచేశారు. “అత్తగారూ!ఇక్కడ అందరం కల్సి సరదాగా టిఫిన్స్ తిందాం !"అంటూఅందరినీ క్రింద వసారల్లో కూర్చోబెట్టి తన భార్యనూ పిల్లలనూ పిల్చి, వారితో కల్సిఇంట్లోఅందరికీ,ఇడ్లీలూ,సాంబారూ,చట్నీ,నెయ్యీ,మంచినీరూవడ్డించారు. గదిలోఉన్నమామగారినిపిల్చుకువచ్చి,కొత్తభోజనంబల్లమీదవడ్డించారు.అంతానోళ్ళుతెరుచుకునిచూడసాగారు.
ఫలహారాలయ్యాక వారినందరినీ చావట్లోకి పిల్చి తాము తెచ్చిన బహుమతులుపేరుపేరునాఅందరికీఇచ్చారు.
" మామగారూ ! మన ఆవులూ గేదెలూ,ఎద్దులూ ఏవీకనిపించట్లేదూ!?"అని అడిగాడు అరవింద్.
“వాటి గోల ,వాసనా మీకు పడవని వాముల దొడ్లో కట్టించాను " అన్నాడు పెద్దిరెడ్డి ఇబ్బందిగానే. “మామగారూ !వాటి అరుపులూ, వాటి మెడలోని మువ్వల చప్పుళ్ళూ ,పాలకోసం దూడలు అమ్మలదగ్గరికి పరుగెత్తడం, తువ్వాయిల గెంతులూ ఎంతబావుంటాయి!మీకేంఇబ్బందిలేకపోతేవాటినిఇక్కడికే తెప్పించరూ! మా ఓంకార్, సహన కూడా వాటిని చూడాలని సరదాపడుతున్నారు " అన్నాడు అరవిందు.వెంటనేఆఏర్పాట్లు చేశాడు పెద్దిరెడ్డి.అవన్నీ లోగిట్లోకిరాగానే ఓంకార్, సహనలను తీసుకుని దగ్గరగా వెళ్ళి వాటిని చూచూపుతూ, వారి సందేహాలన్నీ తీర్చసాగాడు అరవిందు. పెద్దల్లుడిమాటలూ,పనులూఅర్ధంకాకఅంతాఅవాక్కైచూడసాగారు.
వంటంతా అయ్యాక " అమ్మాయ్! వినోదినీ! మీరు సంక్రాంతి పండక్కు ఇంటికి వస్తే మనకులదైవం ఏడు కొండల స్వామికి మీరు వచ్చినరోజే పూజ చేసుకుంటామని మొక్కుకున్నాం.దానికోసం పూజారి వచ్చారు. మీరూవచ్చి ఇక్కడకూర్చుంటే , పూజ మొదలుపెడతారు." అంది తల్లి అనసూయమ్మ.
వినోదిని భర్తకు చెప్పగానే , పిల్లలూ, ఆయనా , కాళ్ళూచేతులూ, ముఖం కడుక్కుని, గదిలోకెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చారు.వారిని చూసి అంతా మరోమారు ఆశ్చర్యపడ్డారు. అరవిందు పట్టు పంచ గో చీపోసి కట్టుకుని, పైనకండువాకప్పుకుని రాగా, పిలల్లుసైతం , తమబట్టలు మార్చేసుకుని పట్టుపరికిణీ, లాల్చీపైజా మా వేసుకుని వచ్చారు. అప్పటికే పట్టుచీరలో ఉన్నరమ కూడా వచ్చికూర్చుంది .ఆమెనుచూసి ప్యాంట్ షర్ట్ వేసుకుని ఉన్న రమ కాస్తంత సిగ్గుపడింది.ఎవ్వరూ చెప్పకుండానే వారు నుదుట కుంకుమావిభూదీ ధరించి పూజకుకూర్చున్నారు.
పూజారి ఆచమనం చేయించకుండానే , కేశవనామాలు మొదలెట్టబోగా " అయ్యా! మేమూ ఆచమనం చేశాక కేశవనామాలు మొదలెడదాం" అని అరవిందు చెప్పడంతో పూజారి భయంగా పూజ ప్రారంభించాడు. అరవిందూ, వినోదినీ పిల్లలూ కూడా వెంకటేశ్వర అష్టోత్తరం, మంత్రాలన్నీ పూజారితోపాటుగా వల్లిస్తూ , చివర్లో మంత్రపుష్పంతో సహా చెప్పడం 'ఆనికానిచ పాపాని,..'అంటూ ముమ్మారు ఆత్మప్రదక్షిణాలు చేసి,చేతిక్రింద కొంగు అడ్డుపెట్టుకుని తీర్ధప్రసాదాలు తీసుకోడం చూసి పూజారే ఆశ్చర్యపడ్డాడు.
పూజంతా అయ్యాక పూజారికి దక్షిణా తాంబూలం అందించి,వారు నలుగురూ ఆయన పాదాలకు నమస్కారం చేశారు., పూజారి " అయ్యా! మీరు అమేరికాలో ఉంటున్నారని విన్నాను, ఇవన్నీ ఎలాతెల్సుకున్నారు?" అని అడిగాడు.
అప్పటికి తేరుకున్నచిన్నకూతురురమ ," నేను, కాదుకాదు మేమంతా అడగాలనుకుంటున్న మాటలు మీరే అడిగారు పూజారిగారూ! వచ్చినప్పట్నుంచీ చూస్తున్నాం, ఒక్కటీ అమేరికాపధ్ధతేలేదు,నిజంగా అమేరికాలో ఉంటున్నారా!లేక ఇండీయాలో ఏమారు మూలైనా మాకుతెలీకుండా ఉంటూ ఇప్పుడువచ్చారా! ఏంటిదంతా అక్కా! బావా?" అంది ..
అరవిందూ ,వినోదినీ నవ్వారు." రమా! నీకు పెద్ద అనుమానమే వచ్చింది.ఏంమేముఅమేరికాలోఉంటున్నంత మాత్రాన మన సంస్కృతీ ,సాంప్రదాయం మర్చిపోవాలా?మన భారతీయపధ్ధతులూ, పూజలూ, నోములూ, వ్రతాలు మేం చేయకూడదా?మంత్రపుష్పం ,మంత్రాలూ నేర్చుకోకూడదా? ఉద్యోగరీత్యా అక్కడ ఉంటున్నంత మాత్రాన , మనపల్లెలనూ,మనకు అన్నదానంచేసే పశువులనూ,మనఅలవాట్లనూ,మన పల్లెటూరినీ అన్నీ మర్చిపోవాలా?ఎప్పుడెప్పుడు వచ్చి మాపిల్లలకు ఇవన్నీ చూపుదామాని , ఈమధుర సంస్కృతిమాపిల్లలూ ఎప్పుడుచవిచూస్తారాని, గత 5సం.రాలుగా ఎదురుచూస్తూనే ఉన్నాం,నేనుమరోడిగ్రీకోసంచదువుతున్నందున శలవుపెట్టిరావటంకుదరక రాలేదు. మామగారేమో మేము ఇక్కడ సౌకర్యాలు లేక రాలేదని అపోహపడి ఏవేవో చేసి అలసిపోయి బీ.పీ. పెంచుకున్నారు .మేము ఇక్కడ పుట్టి పెరిగినవారమే కదా రమా!మీదిపుల్లేటుకుర్రైతే, మాది అమలాపురం అంతేతేడా! అంతా ఆంధ్రులమూ, అదీనీ భారతీయులమూ, అదిమరచిపోతేమనుషులమే కాదు.అందుకేగురజాడ అందించిన ప్రసాదమైన ఈ దేశభక్తిగేయం మేమెప్పుడూ పాడుకుంటూ ఉంటాం!--- ‘
ఏదేశమేగినా ఎందుకాలిడినా ,
ఏపీఠమెక్కినా ఎవ్వరెదు రైనా ,
పొగడరానీతల్లి భూమిభారతినీ..'
నిలుపరానీజాతి నిండుగౌరవమూ --- -- " అని అరవిందు అనగానే ముందుగా రమ చేతులు చప్పట్లు చరచగా అంతా చేతులు కలిపి చప్పట్లు చరిచారు.

***************************END******************************
. రచన- ఆదూరి.హైమావతి.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు