సంజీవనీ ఫలం - నల్లాన్ చక్రవర్తుల గోపీ మాధవులు

Sanjeevani Phalam

పూర్వం ఆనందనగరంలో జయసింహా అనే జమీందారుగారుండే వారు. ఆయనకి బోలెడంత ఆస్తి ఉండేది. లంకంత పెద్ద ఇల్లూ, ఇంటినిండా బోలెడంతమంది నౌకర్లూ చాకర్లతో నిత్యమూ ఆయన చుట్టూ సందడిగా ఉండేది. దివాణం వ్యవహారాలూ, జమా ఖర్చులూ పద్దులూ చూసేందుకు పదిమంది దాకా గుమస్తాలుండేవారు. వీటన్నిటితో తలమునకలై ఉండే జమీందారు గారికి తన హాస్య చతురోక్తులతో మానసికోల్లాసం కలిగించేందుకు అనంతుడనే విదూషకుడొకడు ఆయనతో బాటే ఉండేవాడు.

కొంతకాలంగా జమీందారు గారు ఏదో తీరని బాధతో లోలోపల కృంగిపోతుండటం గమనించాడు అనంతుడు. "అయ్యా, తమరికి లెక్కలేనన్ని ఆస్తి పాస్తులూ - బోలెడంతమంది పనివాళ్ళూ, మీ యోగ క్షేమాలు కనిపెట్టుకుంటుండగా మీ చింత దేనికో సెలవియ్యండి" అనడిగాడు ఓ సారి. జమీందారు విచారంగా మోహం పెట్టి, "అదేరా నా బాధా, నాకా వయసైపోతోంది, రాన్రానూ ఓపిక నశిస్తోంది..." అంటూ చెప్పడం ఆపేశాడు" నిజమే, మరయితే చిన్న జమీందారు వారికి బాధ్యతలు అప్పజెప్పి తమరు హాయిగా విశ్రాంతి తీసుకోక, బాధదేనికి" అన్నాడు అనంతుడు. "అది కాదురా. ఇంతకాలం బ్రతికినట్లు ఇక ఎంతోకాలం ఉండను కదా, ఇంత ఐశ్వర్యాన్ని వదిలి పోవాలంటే బాధగా ఉంది." అన్నాడు జమీందారు.

దానికి అనంతుడు "అయితే ఏం చేద్దామంటారు?" అనడిగాడు. ఒరే ఎవరైనా ఏ మూలికనో, ఫలమో - మంత్రమో ఏదైనా సరే, ఎలాగైనా సరే, ఎవరైతే నా ఆయుష్షు పెంచితే వారికి ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. జమీందారు పిచ్చి కోరికకు అనంతుడు లోలోపల నవ్వుకున్నాడు. పైకి సరేనని జమీందారు మనసులో మాట నలుగురి చెవిన వేశాడు. అది మొదలు ఎవరో ఒకరు ఏదో ఒకటి తీసుకొచ్చి జమీందారు కిచ్చి బహుమానాలు పట్టుకుపోవడం జరుగుతుండేది.

ఒకనాడు ఒక కోయదొర జమీందారునుచూడవచ్చి, ఒక ఫలాన్ని బహూకరించాడు. అది చూసి జమీందారు, "ఇదేం ఫలం?" అని ప్రశ్నించాడు. " అయ్యా, ఇది అరుదుగా లభించే సంజీవనీ ఫలం. ఎన్నో సంవత్సరాలకొకసారి కాస్తుందని మా తాతముత్తాతలద్వారా మాకు తెలుసు. ఇది తిన్నవారి ఆయుష్షు పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. అసలు మరణమే సంభవించదు." అని చెప్పాడు.

పక్కనే ఉన్న అనంతుడు ఆ పండు జమీందారు చేతుల్లోంచి తీసుకుని అటూ ఇటూ తిప్పి పరీక్షగా చూసాడు. "నిజమే ఇది సంజీవనీ ఫలమే. సందేహం లేదు. దీన్ని ముక్కలుగా కోసి వెంటనే తినెయ్యండి. మళ్ళీ అమృత ఘడియలు దాటిపోతే ఫలితముంటుందో, లేదో. కదూ, కోయదొరా..." అన్నాడు. "అవునవును... నిజం... నిజం..." అన్నాడా కోయవాడు. జమీందారు నౌకరు చేత ముక్కలుగా కోయించుకొని తినబోతుండగా అనంతుడు, "అయ్యా, ఒక్కనిముషం, ఎన్నోశ్రమలకోర్చి ఇంతదూరం మీకోసం తీసుకొచ్చిన కోయదొరకు ఒక్కముక్కయినా ఇవ్వకుండా తినడం ధర్మం కాదు." అన్నాడు. సరేనంటూ జమీందారు ఒకముక్క తీసి కోయవాడికిచ్చాడు. అది కోయవాడు తినగానే అనంతుడు, "అయ్యా, ఇది సంజీవనీ ఫలం కాదూ, పాడూ కాదు, వీడిది పచ్చి మోసం, వెంటనే వీడి తల తీయించండి." అన్నాడు గట్టిగా... నిజం ఎలా తెలిసిపోయిందాని సందేహిస్తూనే వాడు ప్రాణభయంతో వణికి పోసాగాడు.

అప్పుడు అనంతుడు, "సంజీవనీ ఫలం తిన్నావుగా, నీకింకా ప్రాణభయమెందుకయ్యా? తల తీసినా నీప్రాణం పోదుగా? " అన్నాడు. వాడింకా వణుకుతూనే, "అయ్యా. అసలలాంటి ఫలమే ఉండదు... అది మా కోయగూడెం లో దొరికే పండు. బుద్ధి గడ్డితిని, బహుమానాలకాశపడి సంజీవనీఫలం పేరుతో తెచ్చిచ్చాను. నన్నొదిలేయండి మహాప్రభో..." అంటూ పారిపోయాడు.

అప్పుడు అనంతుడు... "చూశారా అయ్యా, దీర్ఘాయుష్షులై ఉండడం తపశ్శక్తి సంపన్నులకే తప్ప సామాన్యులకు సాధ్యం కాదు. చిరంజీవులుగా నిలిచిపోవడం దైవాంశ సంభూతులకే తప్ప మానవమాత్రులకు అసాధ్యం. భౌతికంగా అంతరించినా, మంచి పనుల ద్వారా పదికాలాల పాటు నిలిచి ఉండవచ్చు. కదిలే కాలాన్ని ఆపడం, వృద్ధాప్యాన్ని నిలువరించడం మరణాన్ని జయించడం ఎక్కడా లేదు. ప్రకృతి ధర్మానికి ప్రతి ఒక్కరూ తలొంచాల్సిందే. " అంటూ చెప్పాడు. దాంతో జమీందారు తన అర్థంలేని ఆశను వదులుకుని, తన ఆస్థిపాస్తులను ధాన ధర్మాలకూ మంచి పన్లకూ వినియోగిస్తూ జీవించాడు...

మరిన్ని కథలు

Chadastam
చాదస్తం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Akrandana
ఆక్రందన
- జి.ఆర్.భాస్కర బాబు
Eeroju pandaga
ఈ రోజు పండగ
- Sreerekha Bakaraju
Ide naa Ugadhi
ఇదే నాఉగాది.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Amma nerpina sadgunam
అమ్మ నేర్పిన సద్గుణం
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kaay kaay
కాయ్.. కాయ్ ( కథ )
- హరి వెంకట రమణ
Tana daakaa vaste
తనదాకా వస్తే..!
- - బోగా పురుషోత్తం
Kotta konam
Kotta konam
- Prabhavathi pusapati