అభినందన - డా: పి.కె. జయలక్ష్మి

Abhinandana Telugu Story by PK Jayalakshmi

"సునీల్! స్నానానికి రావాలి. లేటయిపోతున్నావ్" వీక్షణ గట్టిగా పిలిచింది వంటింట్లోంచి. "ఇదిగో ఐదు నిమిషాల్లో వస్తున్నానమ్మా" బదులిచ్చాడు వ్రాస్తున్న పుస్తకంలోంచి తల ఎత్తకుండానే!

"ఎంతసేపురా అవతల ఆటో వచ్చేస్తుంది. ఏమీ తినకుండా పరిగెడతావ్, రా త్వరగా" మళ్ళీ అరిచింది వీక్షణ. "అబ్బా ఐదు నిమిషాలన్నానా! ఆగు... ఇంక పిలవకు" విసుగ్గా చెప్పాడు సునీల్.

"ఇంతకీ నువ్వు వెలగబెడుతున్న ఘనకార్యం ఏంట్రా?" విసురుగా బెడ్రూం లోకి వచ్చి సునీల్ చేతిలో పుస్తకం లాక్కుంది వీక్షణ. "అమ్మా, నేను ఒక పొయమ్ సగంలో ఉన్నానమ్మా, లెట్ మీ కంప్లీట్, ప్లీజ్ అమ్మా!" బతిమాలసాగాడు సునీల్.

"ఉద్ధరించావులే అవతల స్కూల్ కి లేటయిపోతోంది. పదపద, సాయంత్రం పూర్తి చేద్దువులే ఈ పోయమ్. అని సునీల్ చెయ్యి పట్టుకుని బాత్రూంలోకి నెట్టింది వీక్షణ. "అబ్బా, మూడ్ పోతే మళ్ళా వ్రాయలేను" సణుగుతూ స్నానానికి వెళ్ళాడు సునీల్.

శ్రావణ శుక్రవారం పేరంటానికి వెళ్ళింది వీక్షణ ఎదురింటికి. ఆ కోలనీ మహిళలంతా తమ నగలు, పట్టుచీరలు చూపించుకోవడానికి పేరంటం అనేది ఒక వేదిక. వాళ్ళకదో వేడుక!

రజిత, కోమలి, రాధ, అప్పటికే విశాలి ఇంట్లో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. వీక్షణని చూడగానే "అబ్బ వీక్షణా! ఇంత లేట్ గానా రావడం? చూడు, కోమలి పగడాల సెట్ ఎంత బాగుందో! ఇంతకీ నువ్వేం తీస్కున్నావ్ పండక్కి" అంటూ చుట్టుముట్టారు అమ్మలక్కలు. "ఆ, అన్నట్టు సునీల్ కి ఈ మధ్య దేంట్లోనో ఫ్రైజ్ వచ్చిందట కదా! మా అమ్మాయి చెప్పింది" అంది రాధ వీక్షణ చీర అంచు సరిచేస్తూ.

"ఆ, వ్యాసరచనలో సెకండ్ ఫ్రైజ్ వచ్చింది రాధా! అంతా వాళ్ళ మావయ్య పోలికేవాడికి. ఎప్పుడూ ఏదో వ్రాస్తూనో, చదువుతూనో ఉంటాడు స్కూల్ టైమైనా తెమలడనుకో," కంప్లైనింగ్ గా అంది వీక్షణ.

"పోన్లే వీక్షణా! ఎంతమంది పిల్లలు అంత టాలెంటెడ్ గా ఉంటారు వాడిలా? అస్తమానం ఆటలూ, పోచికోలు కబుర్లేగా వీళ్ళకి! మీ వాణ్ణి బాగా ఎంకరేజ్ చెయ్ మంచి రైటరు అవుతాడు" అన్నారు ఫ్రెండ్స్ ముక్తకంఠంతో.

"అలాగే" అని నవ్వుతూ వాయనం తీసుకొని ఇంటికి బయలుదేరింది వీక్షణ.

*****


ఆరోజు స్కూల్ నుంచి బిక్కమోహంతో వచ్చాడు సునీల్. "ఏం నాన్నా అలా వున్నావ్, మధ్యాహ్నం అన్నం తినలేదా? ఏం జరిగింది?" అనునయంగా అడిగింది వీక్షణ.

"లేదమ్మా నిన్న మా స్కూల్లో టీచర్స్ డే అయిందన్నాను కదా..."

"అవును. నువ్వు పొయమ్ కూడా చెప్పినట్లున్నావ్ కదరా...?"

"అవునమ్మా నన్ను అంతా మెచ్చుకున్నారు, చీఫ్ గెస్ట్ కూడా పొగిడారు. టీచర్ గురించి నేను - మాగురువు శ్రేష్టమైన తరువు - నిజంగా వారు కల్పతరువు, అని పోలుస్తూ తరువు నీడని, మధుర ఫలాలని ఇస్తే గురువు ప్రేమాప్యాయతల నీడని, విద్యా ఫలాలని ఇస్తారని, తరువు వేళ్ళని నీటితో తడిపినట్లే గురుపాదాలని కృతజ్ఞతాబాష్పాలతో అభిషేకించినా ఋణం తీరదని చెప్పానమ్మా.... కానీ... కాని... ఇవాళ మా తెలుగు టీచర్ నన్ను అందరి ముందు ఎగతాళి చేసారమ్మా." ఏడ్పు గొంతుతో చెప్పాడు సునీల్.

"ఏమన్నార్రా?" ఆరాటంగా అడిగింది వీక్షణ. "నువ్వు కవిత వ్రాయడమేంటి? నీ మొహం! నువ్వు వ్రాసిన కవితంటే నేనసలు నమ్మను. నిజం చెప్పు. ఎక్కడ కాఫీ కొట్టావు? అన్నారమ్మా."

"నిజంగా నేనే వ్రాసాను టీచర్" అన్నా ఆవిడ ఒప్పుకోకుండా "నీకంత సీన్ లేదులేగాని ఏ పుస్తకంలోంచి చూసి బట్టీ పట్టి చెప్పావో చెప్పు అన్నారమ్మా. మా ఫ్రెండ్స్ అంతా ఒకటే నవ్వులు." దీనంగా చెప్తున్న సునీల్ ని చూస్తుంటే వీక్షణకి గుండె తరుక్కుపోయినట్లయింది. "డాడీ రానీ చెప్దాం" అంది ఓదార్పుగా.

*****


ఆఫీస్ నుంచి వచ్చిన మధుకర్ కి కాఫీ ఇచ్చి జరిగింది క్లుప్తంగా వివరించింది వీక్షణ. కాస్సేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు మధుకర్. "పిల్లల్ని ప్రోత్సహించాల్సిన టీచర్లే ఇలా వెటకారంగా మాట్లాడితే వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలండీ? మీరు ఒకసారి హెడ్ మాస్టర్ తో మాట్లాడి రండి" అర్ధింపుగా అంది వీక్షణ.

"కంప్లైంట్ చేయడం పెద్ద పనేం కాదు, కానీ దానివల్ల జరిగేదేంలేదు. ఆయన ముందు తలవంచుకుని తిరిగి మనవాణ్ణి హేళన చేయచ్చు. దానికంటే ఆవిడకే వీడు తను వ్రాసిన కవితల పుస్తకం చూపిస్తే మంచిదేమో? అర్ధం చేస్కుంటుంది కదా. రేపు నేను వాడి కవితల పుస్తకం పట్టుకెళ్ళి మాట్లాడతాలే" అన్నాడు మధుకర్ స్నానానికి లేస్తూ.

"వద్దు డాడీ, మా టీచర్ బుక్ చూసినా నమ్మరు. ఎక్కడో కాఫీ చేశాననే అంటారు. తనన్నమాట ఆవిడ వెనక్కి తీస్కోరు సరికదా, ఇంకా సాధించాలని చూస్తారు. ఇక మీదట కవితలు ఎప్పుడూ వ్రాయను" కన్నీటి పర్యంతం అయ్యాడు సునీల్.

సునీల్ 8వ తరగతి చదువుతున్నాడు. చాలా సున్నితమైన మనసు. ఎవరయినా ఏదైనా అంటే లోలోపల కుమిలిపోతాడే తప్ప ఎదురించి మాట్లాడడు. మంచి భావుకత వున్న కుర్రాడు. వాళ్ళ మావయ్య వాడు 4వ క్లాసులో వున్నప్పుడు డైరీ ప్రెజెంట్ చేసి ఏవైనా మంచి విషయాలు, కవితలు దీంట్లో వ్రాస్కో అంటూ మంచి కొటేషన్ వ్రాసి ఇచ్చాడు. ఆ ప్రేరణతోనే దాదాపు 30 దాకా కవితలు వ్రాసాడు. కానీ అందరిలో చాటుకోవడం తనకి ఇష్టం వుండదు. తల్లిదండ్రులకి, కొంతమంది సన్నిహితులకి తప్ప సునీల్ కవితలు వ్రాస్తాడన్న విషయం ఎవరికీ తెలీదు. కానీ టీచర్ అభినందించకుండా ఇలా ఎగతాళి చేయడంతో సునీల్ ఆత్మాభిమానం దెబ్బతింది. దాంతో ఇంకెప్పుడూ వ్రాయకూడదు, వ్రాసినా ఎవరి ముందు చదవకూడదు అని తీర్మానించేసుకున్నాడు.

*****


నాల్గు రోజులు గడిచాయి. అనుకోకుండా వీక్షణ తమ్ముడు వేణు ఏదో సాహితీ సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాడు. తమ్ముణ్ణి చూసి వీక్షణ చాలా సంతోషించింది. స్కూల్ నుంచి వస్తూనే సునీల్ "వేణు మామా" అంటూ అల్లుకుపోయాడు.

"ఏరా సునీ ఏం చేస్తున్నావ్ రా? ఈ మధ్య నీ కబుర్లేం తెలీడం లేదు? నేనిచ్చిన బుక్ లో కవితలు నింపుతున్నావా లేదా? టీచర్స్ డేకి ఏదో కవిత చెప్పావట విన్పించు" అని అడిగేసరికి సునీల్ ముఖం చిన్నబోయింది. "అదీ" అంటూ మాటలు మింగేశాడు.

జరిగిందంతా అక్కద్వారా విని పెద్దగా నవ్వేశాడు వేణు. "నువ్వు నవ్వుతున్నావ్ గానీ మేమెంత బాధపడ్తున్నామో తెల్సా ఆవిడ మాటలకి? స్కూల్ కి వెళ్లి కనుక్కోమంటే ఇంకా కక్ష కట్టేసి, ఇంకా హేళన చేస్తుందేమోనని మీ బావగారు ఊర్కుండిపోయారు. ప్రోత్సహించి, వెన్నుతట్టాల్సిన టీచర్లు ఇలా చేయడం ఏమన్నా బాగుందట్రా వేణూ!" వేదనగా అడిగిన వీక్షణ మాటలకి అడ్డు తగుల్తూ "ఏంటక్కా నువ్వు కూడా...! ఆవిడ తప్పుగా ఏమందని అసలు...? అంటున్న వేణుని ఆశ్చర్యంగా చూడసాగారు వీక్షణ, సునీల్.

"ఏంటి? ఆవిడ తప్పుగా ఏమనలేదా నువ్వేం మాట్లాడుతున్నావో అర్ధమవుతోందా అసలు?" కోపంగా అడిగింది వీక్షణ. సునీల్ అయితే ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు

"అవును,అర్ధమయ్యే మాట్లాడుతున్నా, ఏరా సునీల్ మీ టీచర్ ఏమన్నారు?'

"అదే మామా... ఇది నువ్వు వ్రాయనే లేదు ఎవరో వ్రాస్తే కాపీ కొట్టావు అన్నారు" అన్నాడు చెప్పలేక చెప్పలేక చెప్తున్నట్లు. "అంటే... అర్ధమేంటి? ఇంత చిన్నపిల్లాడు అంత పెద్దస్థాయి కవిలా వ్రాసాడనే కదా! నీ వయసుకి, నీ క్లాసుకి నువ్వు వ్రాసిన కవిత ఎన్నో రెట్లు హెచ్చు స్థాయిలో ఉంది కాబట్టి ఆమెకి నమ్మశక్యంగా లేదు అందుకే ఎవరో పెద్ద కవి వ్రాసిన కవితగా నీ కవితని భావించింది. నువ్వు నీ వయసుకి తగ్గట్టు మామూలు కవిత వ్రాసుంటే నమ్మేది. అది చూస్తే ఎవరో చేయి తిరిగిన కవి వ్రాసినట్లు వుంది. అందుకే ఆవిడ నువ్వు వ్రాయలేదు ఎవరో వ్రాసింది చెప్పావ్ అంది. అంటే ఇది ఖచ్చితంగా అభినందనే గాని వెటకారం కాదు. దీనివల్ల నువ్వు బాగా ఇన్ స్పైర్ అయ్యి ఇంకా ఇంకా బాగా వ్రాయాలి కానీ ఏడుస్తూ కూచోకూడదు తెల్సిందా!" అన్నాడు నవ్వుతూ వేణు సునీల్ భుజం తడుతూ.

"హాట్సాఫ్ బామ్మర్దీ" అంటూ చప్పట్లు కొడ్తూ లోపలికి వస్తున్న మధుకర్ ని నవ్వుతూ అభివాదం చేస్తూ "అవును బావా! ఇదంతా హౌ వియ్ లుక్ ఎక్ థింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది అంతే! ఏ విషయమైనా మనం ఎలా ఆలోచిస్తే అలాగే అన్పిస్తుంది, అలాగే కన్పిస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా పాజిటివ్ గా ఆలోచించడం, పాజిటివ్ గా చూడ్డం, పాజిటివ్ గా మాట్లాడ్డం అలవాటు చేసుకోవాలి. అప్పుడు అవతలివాళ్ళు ఏ ఉద్దేశ్యంతో మాట్లాడినా పాజిటివ్ గానే స్పందిస్తాం."

"కానీ వేణూ..." ఏదో చెప్పబోతున్న వీక్షణని ఆపుతూ "వీక్షణక్కా! నీ వీక్షణాలు మార్చుకో! మన దృష్టి మార్చుకుంటే అంతా బాగా కన్పిస్తుంది. సునీల్ ఒకటి గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులు, టీచర్లు ఎప్పుడూ పిల్లల్ని వాళ్ళ ముందు పొగడరు. పొగడకూడదు కూడా! మీ టీచరు నిన్ను పరోక్షంగా ఎవరో వ్రాసిన కవిత అంటూ నిన్ను, నీ స్థాయిని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళారు. ఇది నిజమైన అభినందన. నీ ప్రతిభని సాన పెట్టుకుంటూ భవిష్యత్తులో గొప్పకవివి కావాలి, ఆల్ ద బెస్ట్ మై బోయ్ అంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వేణుమామ వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు సునీల్.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు