గతి తప్పిన మతి - గంగాధర్.వడ్లమన్నాటి

gati tappina mati

మధు స్నానం చేయటమే ఆలస్యం అన్నట్టుగా,చుట్టుకున్న తుండుగుడ్డతోనే,పరుగున హాల్లోకి వచ్చి ,కిటికీ తెరిచి ఎదురింటి వైపు కొండంత ఆసక్తితో చూశాడు.కానీ ఆమె కనిపించలేదు.దాంతో ఛ అనుకుని,బండoత నిరాశతో కిటికీ మూసేసి ,దివానీ కాట్ పై కూలబడ్డాడు.మధుకి పెళ్ళయి సంవత్సరం అవుతోంది.తన భార్య, మాట్లాడితే అమ్మని చూడాలనో ,అమ్మమ్మని చూడాలనో పుట్టింటికి పరుగుతీస్తుంది.పెళ్ళైన కొత్తలో ఆమెని కొంచెం వారించాలని చూసినా,తర్వాత్తర్వాత అది అసాధ్యం అనుకుని, ఆ ప్రయత్నాలు మానుకుని ,మానులా చూస్తుండటం అలవాటు చేసుకున్నాడు.అయితే ముద్దు,ముచ్చటా ఎలాగో లేవు.కనీసం మాట మాట్లాడాలన్నా,మనసు పంచుకోవాలన్నా, పక్కన మనిషి లేకపోవడంతో జీవితం మరీ బోరుగా, బేలగా అనిపించసాగింది

మధుకి.ఉద్యోగ రిత్యా వేరే ఊళ్ళో వేరు కాపురం కావడంతో ఒక్కడే ఉసూరుమంటున్నాడు.పోనీ తల్లిదండ్రులని రమ్మనమని పోరితే, పల్లెలోనే ఉంటాం,వ్యవసాయం చూడాలి కదా అంటారు.దాంతో మధు సెల్ ఫోన్ తోనూ ,టి‌వి తోనూ కుస్తీ పట్టి, విసిగి,వేసారి ,ఓ సారి హాల్లోకి వచ్చి కిటికీ తెరిచి చూశాడు.అంతే,ఆ క్షణంలో అతని హృదయం పొంగడంలా ఉబ్బిపోయింది.తాలింపులా మనసు చిటపటలాడిపోయింది.ముఖం బియ్యపు వడియంలా విచ్చుకుంది.పెదాలపై చిన్న నవ్వు,బూందీ లడ్డులో పంచదార పొడిలా తొంగిచూసింది.కారణం,ఓ అందమైన అమ్మాయి ఎదురింటి కిటికీలోంచి తనవైపు చూసి హాయిగా నవ్వింది.సిగ్గో ,మరేమో ,వెంటనే కిటికీని మూసేసింది.దాంతో మధు ముఖం ముడుచుకుపోయింది.

కానీ ఇప్పుడు మధుకి రోజూ ఊసుపోవడానికి ఓ ఆసరా దొరికింది.తర్వాత తనకి తెలియకుండానే ఆఫీసుకెళ్లే ముందు,వచ్చాక కిటికీ తెరిచి చూడటం.కనిపిస్తే నవ్వడం,కొన్ని సైగలు చేయడం చేస్తున్నాడు.కానీ ,ఆమె మాత్రం అలానే చూడటం,కొంటెగా నవ్వడం మాత్రం చేస్తుండటంతో,మధుకి కొండంత ఉత్సాహంతో తొండలా కుదురుగా ఉండలేక గుండాపిండైపోతున్నాడు.అందుకే ఇప్పుడు కూడా ,స్నానం చేసి ఆమె కోసం ఎదురుచూపులు మొదలెట్టాడు.పైగా ఈరోజు ఆదివారం కావడంతో ఇవాళ ఆమె ఫోను నెంబర్ ఎలాగైనా అడగాలనీ ,వీలుంటే ఓ లెటర్ వ్రాసి పడేస్తే బావుంటుందనే నిర్ణయానికి కూడా వచ్చాడు.అందుకే యుద్ధ ప్రాతిపదికన ఓ లెటర్ సిద్ధం చేసుకుని ,ఆమె కనబడగానే ,ఆమెకి కనిపించేలా ఆ లెటర్ని గురిచూసి విసిరేయాలని నిర్ణయించుకున్నాడు.అందుకే ఇప్పుడతనిలో ఆ ఆత్రం. మరో సారి చూశాడు.ఆమె కూడా కిటికీ లోంచే చూస్తోంది.ఇదే మంచి సమయం అనుకున్నాడు.అనుకున్నదే తడవుగా,తన ఫోన్ నెంబర్ ఉన్నప్రేమసందేశాన్ని ,ఆమె చూస్తుండగానే విసిరేశాడు .ఆమె ఏం అనకుండా కిటికీ మూసేసింది.హమ్మయ్య ఓ పనైపోయింది అనుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరకి వెళ్ళాడు,బ్రేక్ ఫాస్ట్ కోసం బ్రెడ్ తినడానికి. అంతలోనే మెసేజ్ వచ్చినట్టుగా కీక్ మంది ఫోన్.చూశాడు.వాట్సప్ మెసేజ్ .ఏవండీ నేను ఇప్పుడే ట్రైన్ దిగాను.వచ్చేస్తున్నాను.అని ఉంది.ఛ ఇదెప్పుడూ ఇంతే.కరెక్ట్ గా మంచి టైమ్ లో ఊడిపడుతుంది.అనుకుంటూ,తన చేతిలోని ఫోన్ ని పక్కన పెడుతూ ,ఫ్రిడ్జ్ లోంచి తీసిన బ్రెడ్ పై నైఫ్ తో బటర్ పూస్తున్నాడు.

అప్పుడే టక్ టక్,మంటూ తలుపు కొట్టారు ఎవరో.బ్రెడ్ ముక్కని పక్కన పెట్టి, అలాగే వెళ్ళి తలుపు తీశాడు.ఎదురుగా నలుగురు కుర్రాళ్ళు,క్రికెట్ బ్యాట్లతో నిలబడి కసిగా మధు వంక చూస్తూ ,మా ఫ్రెండ్ కి లెటర్ వ్రాసావట .ఏం అడిగాడు ఆ మందలో ఒకడు. ఆ మాటలకి మధు ,కొంచెం సిగ్గుపడుతూ, ఔను నేనే రాశాను.మీతో ఏమైనా జాబు పంపిందా అడిగాడు ఆశక్తిగా అందరి ముఖాల వంకా చూస్తూ.
లేదు.నీకు బుద్ధి చెప్పమంది అంటూ వారు మారు మాట్లాడనివ్వకుండా మధుని చితక్కొట్టి చింతకాయి తొక్కు చేశారు.తర్వాత ఆపండి అని చేయి పైకెత్తాడు.అంతే, ఆ కుర్రాళ్ళందరూ,దౌడు గుర్రాల్లా తలో దిక్కుకూ పారిపోయారు.అదేంటి! ఇప్పటిదాకా నన్ను దూదేకినట్టు బాది, ఇలా హఠాత్తుగా పారిపోయారు.

అని తన చేతి వంక చూసుకున్నాడు.ఇందాక బ్రెడ్ పై బటర్ పూయడానికని తీసిన నైఫ్ చేతిలోనే ఉండిపోయింది.బహుశా దాంతో పొడుస్తానని పారిపోయినట్టున్నారు, అనుకుని ,ఔనూ ఆ ఎదురింటమ్మాయి కూడా నేను చూసినపుడు చూసి ,నేను నవ్వినపుడు నవ్వి, నేను సైగ చేసినపుడు చేసి, ఇలా వాళ్ళ స్నేహితులతో నన్ను కొట్టిస్తుందా.అసలూ అని పైకి లేచాడు.ఇంతలో గుమ్మంలో ఆటొ దిగింది లలిత.ఆమెని చూసి పళ్లికిలిస్తూ ,రా లలితా రా.అన్నాడు .ఆమె ఆటొకి డబ్బులిచ్చి ,ఏంటండీ ముఖం అలా ఎర్రగా ఉంది.అడిగింది. అదీ మరీ ,అంటుండగానే,ఓ అమ్మాయి వచ్చి నే చెబుతానక్కా.అంది.

వామ్మో ఇదెవరు.ఇది కూడా ఆ ఎదురింటమ్మాయి ఫ్రెండేనా .కొంపదీసి నేను దానికి రాసిన లెటర్ గురించి చెప్పేస్తుందా ఖర్మ .అనుకున్నాడు మనసులో,చేతులు నలుపుకుంటూ. మీ వారికి తగిలిన దెబ్బలకి కారణం నేనే.నేను పక్క వీధిలో ఉంటాను.ఈ వీధిలో థర్టీన్ నెంబర్ హౌస్ లో ఉండే వేణు అనే వాడు నాకు అసహ్యంగా లెటర్ రాశాడు.అందుకే వాడికి బుద్ధి చెప్పమని,వాడి ఇంటి నెంబర్ చెప్పి మా ఫ్రెండ్స్ ని పంపిస్తే,వారు థర్టీన్ ని థర్టీ అనుకుని మీ వారిని కొట్టారు.క్షమించండి చెప్పిందామె లలిత వంక చూస్తూ. సరి సరే.గొప్ప పని చేశావు.అయినా ఇలా ఎవరికి వారు నచ్చినట్టు చేస్తే ఇలా అవుతుందనే చట్టం గట్రా పెట్టుకున్నాం.అయినా ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పావు కనుక సరిపోయింది.లేకుంటే మా ఇద్దరి మధ్యా అగ్గి రాజుకునేదేగా.ఆయన బంగారం అని నాకు తెలుసు.కానీ కొన్ని సంధార్భాలు మనుషుల ఆలోచనని చంపేస్తాయి.కనుక ఇకనైనా ఇలాంటివి చేయకు.ఇక వెళ్ళు. చెప్పింది లలిత అసహనంగా.

ఆమె పక్కనే నిలబడ్డ మధు,లోలోన ,హమ్మయ్య నా గుట్టు రట్టయ్యుంటే,నా బతుకు కాకి రెట్టయ్యేది.నా భార్యకి ద్రోహం చేయాలనుకుంటేనే ఇలా జరిగింది.ఇక చేసుంటే?అమ్మో,ఇలాంటివి ఎప్పటికైనా ప్రమాదమే.ఇది నాకో హెచ్చరిక లాంటిది.ఒక సమస్య ఎదురైనపుడు, దాని పరిష్కారం కోసం ప్రయత్నం మాని,వేరొక ఆప్షన్ కి మారడం అంటే అది తాత్కాలిక పరిష్కారం.కానీ మొదటి సమస్య అలానే ఉండిపోతుంది.ఎలా అంటే,ఒక గదిలో దుర్గంధం వస్తుందని వేరొక గదిలోకి వెళ్ళి కూర్చున్నట్టు.ఎందుకంటే పక్క గదిలోకి వెళ్లినంతమాత్రాన,మొదటి గదిలో ఉన్న దుర్గంధం పోకపోగా ,అది ఇల్లంతా వ్యాపించే అవకాశం కూడా ఉంది కదా.కనుక నాకు ఇది,ఒక సెకండ్ ఛాన్స్ అనుకుని మారాలి.

అలానే నా భార్యలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తాను.నా వల్ల కాకపోతే, మా రిలేషన్ బాగుపడేందుకు గాను ఓ సైకాలజిస్ట్ తో కౌన్సిలింగ్ ఇప్పిస్తాను.లేదా వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడతాను.కానీ ఇంకెప్పుడూ ఇలాంటివి చేయను. కానీ ఎదురింట్లో ఉన్న ఓ అమాయకురాలిని డిస్టర్బ్ చేసానే.ఇప్పుడెలా!అనుకున్నాడు మనసులో మదనపడిపోతూ.ఇంతలో ఎదురింటి దగ్గర ఏదో గొడవగా ఉండటంతో ,బయటకు వెళ్ళి చూశాడు.ఆ ఎదురింట్లోంచి మధుని కిటికీలోనుండి చూసే ఆ అమ్మాయిని బలవంతంగా ఆటో ఎక్కిస్తున్నారు.అలా ఎక్కించే వారిలో ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు.అక్కడికి పరుగున వెళ్ళి ,ఏం చేస్తున్నారు మీరు.ఆమెని ఎందుకలా బలవంతంగా ఆటొ ఎక్కిస్తున్నారు. ఆ. అడిగాడు ఆవేశం సినీమాలో రాజశేఖర్లా.

ఎందుకంటే ఏం చెప్తాo బాబూ.

అంటే చెప్పరా?పెప్పర్ తిన్నంత మంటగా ఉంది.స్లిప్పర్ తీసినా తీస్తాను.ముందు ఎందుకో చెప్పండి.మళ్ళీ ఆవేశపడ్డాడు మధు.
మా ఖర్మ బాబూ.దీని మతి గతి తప్పింది.అంటే దీనికి మతి స్తిమితం లేదు.ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం.ఇవాళ సైకియాట్రిస్ట్ ని కలవడానికి రమ్మంటే రావడం లేదు.అందుకే ఇలా.అని అతను చెప్తుండగానే,కొయ్యిబారిపోయి చూస్తూ ,ఇంత కాలం నేను చూసి మురిసి మైమరిచిన అమ్మాయి మతిస్తిమితం లేనిదా.అవునులే,నేను మతి ఉండి మాత్రం చేసినదేవిటి? పెళ్ళయి కూడా పరాయి స్త్రీ కోసం, ఛ ఛ, అనుకున్నాడు మనసులో, తన ప్రవర్తనకి కాస్త సిగ్గు పడుతూ,వెళ్లిపోతున్న ఆ ఆటో వంక అలానే రెప్పార్పకుండా చూస్తూ.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు