రోజూ లాగే మా ఇంటికి దగ్గరగా ఉన్న పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉంటె రామలింగం ఫోన్ చేశాడు. రామలింగం, మా ఊరు మునిపల్లె లోనే స్థిరపడ్డా నా చిన్న నాటి స్నేహితుడు. నా కొడుకులిద్దరూ పెద్ద వాళ్ళయి ఒకడు అమెరికా లోనూ, ఇంకోడు ఆస్ట్రేలియాలోనూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చి చూసుకోవడం ఎలాగు కుదరదని నేను ఉండగానే ఉన్న కొద్దీ పాటి ఆస్తుల్ని కాష్ గా మర్చి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు అని మా ఊళ్ళో ఆస్తుల్ని- పొలం, ఇల్లుని అమ్మేయమని చెప్పి రామలింగం సహాయం కోరాను. వాడు గతం లో పొలం అమ్మి పెట్టాడు. ఇల్లుకూడా ఎవరో షాపింగ్ మాల్ వాళ్ళకి అమ్మి పెట్టాడు . ఇప్పుడు ఫోన్ ఏమిటంటే వాళ్ళు రెండు మూడు రోజులలో ఇల్లు కూల గొడతారని, పాత జ్ఞాపకాల కోసం ఫోటోలు అవీ తీసుకుని ఆఖరి సారి చూడ దలుచు కుంటే వెంఠనే రమ్మని ఫోన్ చేశాడు. వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాను.
ఇంటికి రాగానే మాఆవిడ తో అంటే తాను కూడా వస్తానంది. రాజమండ్రి దాకా ట్రైన్ లో వెళ్లి అక్కడ నుంచి బస్సు లోనే వెళ్ళాలి మావూరికి. బస్సయితే రాజోలు దాకా వెళ్లి అక్కడినుంచి రిక్షాలో పోవచ్చు. నాకున్న బ్లాడర్ ప్రాబ్లెమ్ కి ట్రైన్ లో వెళ్లడమే మంచిది అనుకున్నాను. కానీ ఎందులోనూ రేజర్వేషన్ దొరక్క వాల్వో బస్సు లో బుక్ చేశాను.
ఆ సాయంత్రం ఆరు గంటలకి నేను మా ఆవిడా తయారయి బస్సు పికప్ పాయింట్ చేరుకున్నాము. ఒక అరగంట వైట్ చేసినా బస్సు జాడ లేదు. ఫోన్ చేస్తే, పది నిమిషా లలో వస్తున్నామన్నాడు డ్రైవర్. మళ్ళీ బస్సు ఎక్కితే కష్ట మని శంక తీర్చుకుందామని అటూ ఇటూ చూశాను. కాస్త దగ్గరలో పబ్లిక్ టాయిలెట్ లాంటిది ఎదో కనపడితే అటు నడిచాను. కానీ కొంచెం దూరం లో ఉండగానే ముక్కుపేలి పోయి వాంతి వచ్చే పని అయింది. అక్కడ లాభం లేదని ఏదయినా సందులో ఖాళీ స్థలం ఉందేమోనని చూశాను.ఒక బిల్డింగ్ పక్కన ఫరవాలేదు అనుకుని శంక తీర్చుకుని వెనక్కి తిరిగాను. ఇద్దరు యువకులు నాకేసి కొంచెం వేళాకోళం గా చూసి నవ్వుకుంటున్నారు. నాకు తెలుసు వాళ్ళ ఉద్దేశ్యం. 'దేశమంతా స్వచ్ఛ భారత్ అని కూస్తూ ఉంటె ఇదేమి పని సార్" అన్నట్టు ఉన్నాయి వాళ్ళ చూపులూ, నవ్వూ.' అమెరికా' అన్న మాట మాత్రం నా చెవిన పడింది. బహుశా "అమెరికా" లో ఇలా ఎవరూ చెయ్యరు అనుకుంటున్నారేమో. వాళ్ళ మెడలో బాడ్జిలు చూసి అనుకున్నాను. నాతో వాళ్ళు ఏమీ అనలేదు కాబట్టి నేనూ మనసు లోనే అనుకున్నాను " ఆమెరికా స్థాయి లో పబ్లిక్ టాయిలెట్లు ఉండేవరకూ ఇది తప్పదు నాయనా" అని
నేను తిరిగి వచ్చేటప్పటికి బస్సు వచ్చింది. సామాను చిన్న బాగులే కాబట్టి వెంఠనే ఏక్కి సీట్లలో సెటిల్ అయ్యాము.
"బస్సులలో కూడా 'రెండు' కి కాక పోయినా 'వొకటి' కయినా ఏర్పాటు చేసేలా తయారు చేయాలి. యూరప్ లో అక్కడా బస్సులలో ఆ ఏర్పాటు ఉంటుందట" మా విడతో అన్నాను. ఆలోచనలు ఇంకా ఆ సమస్య మీదే ఉండడంతో.
" ఇలాంటివి ఆలోచించరు గాని ప్రపంచ స్థాయి పూర్తి వైఫై పట్టణాలని కట్టేస్తామంటూ ఉంటారు మన నాయకులు" అంది ఆవిడ సెల్ లో వార్తలు చదువుతూ.
ఆలోచనలు ఒక సబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు. ఇంకో ముఖ్య విషయం మనసులోకి వచ్చే దాకా అదే విషయం మీద నడుస్తాయేమో. నా మనసు చిన్నప్పటి విషయాల మీదకి పోయింది.
మా ఊరు పంచాతీగా ఉండడం, ఆ తరువాత మునిసిపాలిటీగా మారడం జరిగింది. నాన్నగారు పంచాయతీలో పనిచేస్తే అదే ఉద్యోగాన్ని మునిసిపాలిటీ లో ఆయన తరువాత నాకు ఇచ్చారు . పది సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యి, పిల్లలు హైదరాబాద్ లో ఇల్లు కొని మమ్మలిని అక్కడికి మార్చారు.
మా ఊళ్ళో ఆధునిక జీవన వసతులు మాకు చాలా లేటుగా వచ్చాయి. మాఊరికి కరెంటు రావడం, వీధి దీపాలు మొదటి సారిగా వెలిగినప్పుడు వీధిలో గంతులు వేయడం నాకు బాగా గుర్తు. మా ఇల్లు రాజోలు పోయే రోడ్డు మీద ఉంటె, సఖినేటి పల్లి పోయే రోడ్డు మాఇంటికి వెనుకగా ఉండేది. మా ఇంటి వెనకాల నుంచి సఖినేటిపల్లి రోడ్డు దాకా చాలా పెద్ద ఖాళీ స్థలం చెట్ల తో నిండి ఉండేది. మావి, మా ఇంటికి వచ్చిన వాళ్లవి కాల కృత్యాలన్నీ అక్కడే చెట్ల మధ్యే . వేరే ప్రత్యేక వసతులు లేవు. ఆధునిక వసతులు కొన్ని ఊళ్లోకి వచ్చినా మా ఇంటి దాకా రావడానికి చాలా కాలం పట్టేది. నేను నరసాపురం కాలేజీ లో చేరిన తరువాతే మా ఇంట్లో కరెంట్ పెట్టించారు మా నాన్నగారు.
మా పెద్డత్త కొడుకు. రఘు, చిన్నత్త కొడుకు మురళి ఇద్దరూ మానాన్నగారికంటే పెద్దగా వయసులో చిన్న వారు కాదు. మా నాన్నగారు మా అత్తల వద్ద చదువు కోసం ఉండడం వల్ల అందరూ కలిసి పెరిగారు. మా అత్తలకి పనుపు కుంకుమ కింద ఇచ్చిన భూముల శిస్తు వసూలుకు రఘు బావ, మురళి బావ మా ఇంటికి వస్తూ ఉండేవారు. వాళ్ళు బొంబాయి లో పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా భార్యలని, కానీ పిల్లలిని కానీ తీసుకు వచ్చేవారు కాదు .
ఊళ్ళో మార్పులు కొద్దిగా వస్తున్నా నాకు పెళ్లీడు వచ్చిన తరువాత కూడా అదే పరిస్థితి. మునిసిపాలిటీలో నా ఉద్యోగం పెర్మనెంట్ అయిన తరువాత మా నాన్నగారు సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. నరసాపురం మునిసిపాలిటీ లో పనిచేస్తున్న రంగారావు గారు ఒక మాటు మా ఇంటికి వస్తే ఆశ్చర్య మేసింది. ఆయన నేనూ ఆఫీసు పనిమీద హైదేరాబద్ వెడుతూ ఉండేవాళ్ళం. ఆయన వచ్చి వాళ్ళ అమ్మాయిని ఇస్తాననడం, నా భార్య కల్యాణిని అమ్మా నాన్నగారితో వెళ్లి చూడడం, చూసిన రెండు నెలలకే ముహుర్తాలు పెట్టడం జరిగిపోయింది. నరసాపురం లో రంగారావు గారు వాళ్ళ ఇంటి ముందే పెద్ద పందిరి వేసి పెళ్లి చేశారు. పెళ్లి అయిన మర్నాడే మొదటి రాత్రి ఏర్పాటు ఉంటుంది అనుకున్నా. కానీ పెళ్లి అయిన మరునాడు అన్ని తతంగాలు అయి అందరం కూర్చుని ఉన్నప్పుడు మా అమ్మ మా అత్త గారితో ." మేము వెళ్లిన తరువాత మంచి ముహూర్తం పెట్టి చెబుతాము. ఆ ముహూర్తానికి మొదటి రాత్రి ఇక్కడ జరిపిన తరువాత పిల్లని తరవాత తీసుకు వెడతాము". అంది. ఇది నేను ఊహించలేదు.
ఎదో ఊళ్ళో బస్సుఆగడంతో నా ఆలోచనలకి బ్రేక్ పడింది . "పది నిమిషాలు ఆగుతుంది. కాఫీ, టీలు తాగేవాళ్ళు తాగవచ్చు" అని కండక్టర్ దిగ్గాడు.
మా ఆవిడ తన కేమీ వద్దంటే నేను బస్సు దిగి టీ తాగి వచ్చాను. బస్సు తిరిగి బయలుదేరు తుండగా ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి మా సీట్ కి అవతలివైపు కూర్చున్నారు. మా సీట్లు రిక్లైనింగ్ పోసిషన్ లో ఉన్నాయి కాబట్టి తల తిప్పకర్లేకుండానే కనపడుతున్నారు. వాళ్లు కబుర్లలో పడ్డారు. కొత్తగా పెళ్ళయిందేమో ఆ అమ్మాయికి కొంచెం సిగ్గుపడుతూ మాట్లాడుతున్నట్టనిపించింది బాడీ లాంగ్వేజ్ బట్టి.
డ్రైవర్ లైట్లు ఆర్పిన తరువాత ఆ కుర్రాడు కొంచెం ఆక్టివ్ అయ్యాడు. మాఆవిడ చెయ్యి నొక్కి చూడ మన్నాను, సభ్యత కాదేమోనని మనసు పీకుతున్నా
" అందరూ మీలాటి బుద్ధావతారాలు ఉండరు" అంది నవ్వుతూ
ఈ కామెంట్ మా పెళ్లయిన కొత్తలో జరిగిన సంగతి కి రిఫరెన్స్. దీనికి వివరణ ఇవ్వ వలిసిన అవసరం ఉంది.
మొదటి రాత్రి ముహూర్తం లేదు కాబట్టి పెళ్లి అవగానే మేము తిరిగి వచ్చేశాము. ఆ తరువాత మా అమ్మే ఇంటి బ్రష్మగారితో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తానంది. ఈ లోపులో అంతర్వేది ఏకాసి వస్తే " ఒరేయి ఏకాసి కి మిమ్మలిని పంపుతానని మొక్కు కున్నాను. నువ్వూ కల్యాణి వెళ్లి దర్శనం చేసుకు రండి. సఖినేటి పల్లి దాకా ఆయన్ని తీసుకు రమ్మని అక్కడినుంచి బస్సు లో వెళ్లి దర్శనం అయిన తరువాత మళ్ళీ దింపేసి రా" అంది . మానాన్న గారు మా మావగారికి కబురు పంపారు.
ఏకాసి నాడు పొద్దున్న నేను బయలు దేరుతోంటే అమ్మ అంది " పిచ్చి వేషాలు ఏమీ వేయక జాగ్రత గా వెళ్లి రండి దేముడితో పని " అని నవ్వుతూ అన్నా మెసేజ్ ఇచ్చింది. అయితే ఇక్కడ లీగల్ కాంట్రాక్ట్స్ లో ముఖ్యమయిన 'consenseus ad idem' లోపించిందేమో ( identity అఫ్ minds అంటారు - ఒకడు తనకున్న రెండు గుర్రాలలో-ఒకటి తెల్లది ఇంకొకటి నల్లది, ఒక గుర్రాన్ని అమ్ముతానన్నాడు కొనేవాడితో. రంగు చెప్పక పోవడం వల్ల, వీడు తెల్లదాన్ని అనుకుంటే కొనేవాడు నల్లది అనుకున్నాడు ) అది లోపించిందని ఆ తరవాత ఎప్పుడో మా ఆవిడ నన్ను 'బుద్ధావతారం" అన్నప్పుడు తెలిసింది. " పిచ్చి వేషాలు" అన్న పదానికి అమ్మ నిర్వచనం రేంజ్ ఒకటయితే, నా రియాక్షన్ మా ఆవిడ ఉద్దేశ్యం లో 'బుద్ధా వ తారం" అయి కూర్చుంది. అందుకే ఆంత్రవేదికి చేసిన మా ప్రయాణం, బస్సు లోనూ తరువాత రిక్షా లోనూ మా ఆవిడ 'బుద్ధా వ తారం" నిర్వచనానికి సరిపడా నే జరిగింది. ఆవిడ అలా అన్న తరువాత సింపుల్ కాచ్ వదిలేసిన ఫీల్డర్ లా అయింది నా మనసు..
ఇప్పుడు అదే కామెంట్ మళ్ళీ మాఆవిడ అంటే " అదంతా పెళ్లయిన వెంఠనే ముహూర్తం కుదిరి ఉంటె జరిగేది కాదు అన్నాను" నేను అప్పటి నిరాశ మళ్ళీ తలుచుకుని.
"అసలు విషయం మీకు నిజంగా తెలియదా?" అంది మాఆవిడ ఎదో నాకు తెలియని విషయం ఉన్నట్టు సూచిస్తూ
"అసలు విషయం ఏమిటి?" అన్నాను
" మీ ఇంటికి మీ బావలు పెళ్లాలతో ఎందుకు వచ్చేవారు కాదో మీకు ఎప్పుడయినా తట్టిందా?"
" ఏమో వాళ్ళు పట్టణాలు విడిచి రావడం ఇష్టం లేకేమో "
" పోనీ అది వదిలేయండీ, మీ ఊరు కంటే కొంచం పెద్దదయిన పట్టణం లో పెరిగిన అమ్మాయి మీకు భార్యగా మీ ఇంటికి వస్తే ఆవిడకి మీ ఊళ్ళో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో ఊహించారా?
" నాకేమీ తట్టలేదు!" అన్నాను ఏమిటబ్బా అది అనుకుంటూ
" అది తట్టక పోగా, ముహూర్తం లేటవుతున్నందు కు మీ అమ్మగారి మీద చిరాకు పడ్డారా?"
" అవును ఎప్పుడు అడిగినా ఇదిగో ఈ మాసం బాగోలేదు, ఆ మాసం బాగో లేదు అంటూ ఉంటె కొంచం అసహనం ప్రదర్శించి ఉంటాను. అవును ఇవన్నీ నీకెలా తెలిశాయి?'" అన్నాను ఎవరు చెప్పారన్నట్టు
" మీ అమ్మగారు పోయేముందు హాస్పిటల్ లో నేనే ఉండేదాన్ని కదా? అప్పుడు చెప్పిన చాలా విషయాలలో ఇది ఒకటి. పెళ్ళికి మా ఇంటికి వచ్చినప్పుడు నేను పెరిగిన వాతావరణం -బాత్ రూంలు, టాయిలెట్లు చూసి, నన్ను మీ ఇంట్లో ఊహించుకోలేక పోయారట. అందుకే ముహూర్తం వంక పెట్టి నేను రావడాం ఆపి, ఇంటికి వెళ్ళగానే మీ నాన్నగారి తో చెప్పి టాయిలెట్లు అవీ కట్టించే ఏర్పాట్లు చేశారట. ముహూర్తం గురించి మీరు చిరాకు పడటం చెప్పి ఆ స్థితి లో కూడా ఒకటే నవ్వు మీ అమ్మగారు"
ఆ మాటలు విన్న నాకు మా అమ్మ గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వ్యవహార దక్షత లో మా అమ్మ చాతుర్యం నాకు అదివరకే తెలుసు. కొబ్బరి దింపుల లెక్కలు కానీ, పసుపు పంట అమ్మకాల వ్యవహారాలు కానీ ఆవిడే చక్క పెట్టేది. కానీ ఇప్పుడు విన్న విషయం లో ఆవిడ చూపిన ముందు చూపు నాకు మాట రాకుండా చేసింది.
" అమ్మా" అని మనసులో తలుచుకుని అలా ఉండిపోయాను.