జీవచ్చవం - ..

jeevacchavam

"అమ్మా! .... ఆకలేస్తోందే..!"

అరవింద్ పిలుపుతో ఆలోచనలకి కామా పెట్టి ఈ లోకంలో పడింది అనసూయ.

భర్తది పేరుకి రైల్వే ఉద్యోగం. కానీ సంపాదన మాత్రం గొర్రె తోక. భర్తతో పాటు ముగ్గురు పిల్లలకి చదువు మాట దేముడెరుగు, కడుపు నిండా తిండి పెట్టలేని బతుకులు....

ఎన్నెన్నో కలల్తో రైల్వే ఉద్యోగయితే హాయిగా కాలం గడిపెయ్యొచ్చనుకున్న అనసూయ "పేరు గొప్ప ఊరుదిబ్బ"ని ఊహించలేక పోయింది.

అనుపమ్ రైల్వేలో ఆపరేటింగ్ పాయింట్స్ మేన్.

దైవపూజలు అవీ చేయక పోయినా పనినే దైవంగా నమ్మకున్న వ్యక్తి అనుపమ్.

రాత్రనక, పగలనక కష్టపడ్డా , కోతలు పోను చేతికందిన దాంతో తిండి గడవడమే అంతంత మాత్రం

పైగా పిల్లల చదువులూ, ఆడపిల్లల పెళ్ళిళ్ళు....

అనుపమ్ కి ఇద్దరమ్మాయిలు, ఓ అబ్బాయి.

ఇద్దరాడపిల్లలూ , ఫైనలియర్ ఇంటర్ అనూష, టెన్త్ అలేఖ్య.

తాను పెద్దగా చదుకోపోయినా పిల్లలకి పెద్దగా చదువు చెప్పి గొప్ప వాళ్ళని చేయాలన్నది అనుపమ్ ఉద్దేశ్యం.

తనకి పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. "గడించిందే గడించాల్సిన బ్రతుకు".

నాల్గు డబ్బులొస్తాయని నైట్ డ్యూటీలకీ ఓవర్ టైమ్ ల కోసం పరుగులు తీస్తుంటాడు అనుపమ్.

ఎంట్రెన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకు తెచ్చుకుంది అనూష.

ఐదొందలు అరక్షణంలో ఖర్చవుతున్న ఈ రోజుల్లో చాలీ చాలని జీతభత్యాల్తో పెద్ద చదువులు చెప్పించాలంటే గగనతుల్యమే అనుపమ్ లాంటి క్లాస్ ఫోర్ రైల్వే కార్మికులకి.

ఏ లోనో పెట్టి చదివిద్దామనుకున్నా, చదువయ్యాక చదువుకి తగిన వరుణ్ణి వెతకొద్దూ?

అలా అని మాన్పించెద్దామా అంటే అనూష తెలివైన పిల్ల మంచి మార్కులు తెచ్చుకుంటోంది.

అలేఖ్య కూడా తెలివైందే.

తొమ్మిదో తరగతి కొచ్చాడు అరవింద్.

ఈ ముగ్గుర్ని వో దరికి చేర్చాలన్నదే అనుపమ్ తాపత్రయం.

అందుకే అహర్నశలూ శ్రమించడానికే నిర్ణయించుకున్నాడు అనుపమ్.

ఎంతొచ్చినా చాలట్లేదు తన సంసారం గడపడాన్కి.

........

"అనుపమ్ డౌన్లో నీలాచల్ ఎక్స్ ప్రెస్ వస్తోంది, ఆఫ్ సైడ్ సిగ్నల్ ఎక్స్ చేంజ్ చెయ్యి " అన్న స్టేషన్ మాష్టర్ తో.....

"అలాగే సార్" అంటూ రెండు చేతుల్తో జెండాలు పట్టుకొని బయల్దేరాడు అనుపమ్ సిగ్నల్ ఎక్స్ ఛేంజ్ కి.

అనుపమ్ రైల్వేలో ఆపరేటింగ్ డిపార్ట్ మెంట్ పాయింట్స్ మేన్ .నీతినిజాయితీగా పన్జేయడమేకాని ఆమ్యామ్యలకి,అక్రమార్జనకి పరుగులుపెట్టెరగడు.

అనుపమ్ తండ్రి రామయ్య తాలూకాఫీసులో బంట్రోతు. అనుపమ్ తో కలిపి మరో ముగ్గురు మగపిల్లలు,ఇద్దరాడపిల్లలు రామయ్యకి.

పెద్ద సంసారం వల్ల ఉన్నదంతా అమ్మి ఆడకూతుళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే,మగపిల్లలు వాళ్ళమానాన వాళ్ళు స్ధిరపడ్డారు.

మగపిల్లల్లో చివరివాడు అనుపమ్.

పెద్దాడు డ్రైవింగ్ నేర్చుకొని ట్రక్కు నడుపుతున్నాడు.

రెండోవాడు రామయ్య స్నేహితుడు రంగయ్య దగ్గర పని నేర్చుకొని ఆటో మొబయిల్ గ్యారేజి లో మెకానిక్ గా ఉన్నాడు.

మూడోవాడు సెక్యూరిటీ ఏజెన్సీలో చేరి సెక్యూరిటీ గార్డు గా పనిజేస్తున్నాడు.

ఆఖరివాడయిన అనుపమ్ కి టెన్తు వరకు చదివించాడు రామయ్య. చదువులో అనుపమ్ కి ఎప్పుడూ ఫస్ట్ మార్కులే.

స్ధోమత లేని రామయ్య పై చదువులకై పంపలేదు అనుపమ్ ని.

రైల్వే రిక్రూట్ మెంట్ టెస్టులు రాసి ఈ ఉద్యోగంలో చేరాడు అనుపమ్.

ట్రైనింగ్ పూర్తయ్యాక కుర్ధా రోడ్డు డివిజన్ లో "బైరీ" స్టేషన్ లో పోస్టింగ్.

"బైరీ "స్టేషన్ వో నాలుగు లైన్ల చిన్న స్టేషన్. అప్ లూప్ లైన్, అప్ మైన్ లైన్, డౌన్ మైన్ లైన్, డౌన్ లూప్ లైన్ లు కాక రెండు సైడింగ్ లైన్లు.

సాధారణంగా రైల్వే లో రౌండ్ ద క్లాక్ డ్యూటీలుంటాయి పాయింట్స్ మేన్ లకి. ఒక్కోక్కరికి 8 గం।। చొ।। 3 షిప్టులుంటాయి. కొన్ని చోట్ల 0-08, 08-16, 16-0 వరకూ ఇంకొన్ని చోట్ల 06-14, 14-22, 22-06 గా

రోష్టర్ లు వుంటాయి. మూడు షిప్టులకి ముగ్గురు కాక ఒక రెష్ట్ గివర్, ఒక లీవ్ రిజర్వ్ మొత్తం

5గురు చొ।। కనీసం వుంటారు. వీరిలో ఏ ఒక్కరు రాలేక పోయినా మిగిలిన వాళ్ళు చెరో 12గం।। చొ।। డ్యూటీలు చెయ్యాల్సిందే. ఆ ఓవర్ టైమ్ డ్యూటీలకి తగిన ప్రతిఫలం అందజేస్తుంది యాజమాన్యం. చన్నీటికి వేళ్లీళ్ళలా కలిసొస్తాయని నైట్ డ్యూటీలు, ఓవర్ టైమ్ డ్యూటీలూ వొదులుకోడు అనుపమ్.

ఆపరేటింగ్ పాయింట్స్ మేన్ గా చాలీచాలని తన జీతంతో తన కోరిక తీరుతుందా అన్నదే అనుపమ్ ఆలోచన

ఈ ఆలోచనలతో గత కొంత కాలంగా సతమతమవుతున్నాడు అనుపమ్. పిల్లల చదువుకి, ఫీజులకి, యితర ఖర్చులకి భార్య నగలెప్పుడో సరిపెట్టేసాడు.

తను తన తండ్రిలా చెయ్యకూడదన్నదే అనుపమ్ కోరిక.

తెలివైన అనూషని ఎలాగైనా చదివించి డాక్టర్ చెయ్యాలన్నదే తన తాపత్రయమంతా.

కానీ ఎలా? మరో నెల్లాళ్లల్లో ఫీజు కట్టి జాయిన్ చెయ్యాలి... ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తం ఎక్కడ్నుంచి తేడం?

పిఎఫ్ లోను తీద్దామంటే వున్న మొత్తం లో రావల్సినంతా ఎప్పుడో తీసీసేడు.

అర్బన్ బ్యాంకు లోను క్రిందటేడాదే తీసాడు. సగం తీరలేదింకా.

బ్యాంకు లోను తెద్దామంటే తనకెవరిస్తారు?

బడాబాబుల్ కి, రాజకీయ నాయకులకి, ఎగ్గొట్టే వాళ్ళకైతే యిస్తారు..

కానీ.. తన లాంటి పేద నిజాయితీ పరుడికి ఎన్ని ష్యూరిటీలు యిచ్చినా బ్యాంక్ లోను మూత్రం శూన్యం

వడ్డీకి అప్పు తెద్దామంటే, నూటికి పది చొప్పున వడ్డీ కట్టాలి.ఇప్పుడే ఓ పూట తింటే రెండో పూట పస్తు.

అప్పు చేస్తే ఇక రెండు పూటలా పస్తులుండాలి. తనొక్కడైతే పర్వాలేదు కానీ భార్యా పిల్లలో....?

ఇటువంటి ఆలోచనలు చుట్టు ముట్టడంతో గత కొంత కాలంగా డ్యూటీ లు కూడా సరిగా చెయ్యలేకపోతున్నాడు అనుపమ్.

సాధారణంగా ఈ పాయింట్స్ మేన్ ని "పోర్టర్లు" అంటారు. పోర్టర్లు స్టేషన్ పరిసరాలు శుభ్రపరచటం, త్రూ ట్రైన్లకి సిగ్నల్ ఎక్స్ ఛేంజ్ చెయ్యడం, అవసరమైతే షంటింగ్ చెయ్యడమే కాక సిగ్నల్ వ్యవస్ధ పని చెయ్యకపోతే స్టేషన్ మాష్టరుగారు నిర్దేశించిన రూట్ సెట్ చేసి, క్లాంపులు కట్టి ట్రైనుని స్టేషన్ కి తేవాలి. దీన్ని ట్రైన్ ఆపరేషన్ భాషలో "పైలెటింగ్ ఇన్" అని

స్టేషన్ నుంచి మరో స్టేషన్ కి ట్రైనుని పంపడానికి "పైలెటింగ్ అవుట్" అనంటారు.

అలా సిగ్నల్ వ్యవస్ధ పని చేయనప్పుడు ఏవేవో ఆలోచనల్తో రెండు, మూడు సార్లు రాంగ్ రూట్ సెట్ చేస్తే, స్టేషన్ మాష్టారు సరిదిద్ది, స్టేషన్ మానేజర్ కి కంప్లయింట్ చేస్తే ఆయన కూడా మందలించడం జరిగింది

ఎడతెరిపిలేక తెగని ఆలోచనల్తో సతమతమవుతున్న వాళ్ళు ఆ ఆలోచనల్తో పరిసరాల్ని పట్టించుకోరట.

అనూషని డాక్టర్ చెయ్యాలి. అలేఖ్య క్కూడా మంచి చదువు చెప్పించాలి. అరవింద్ ని ప్రయోజకుడ్ని చెయ్యాలి . ఇవన్నీ నేనొక్కడినే చెయ్యాలి. చెయ్యగలనా?....."ఛస్తే చెయ్యలేను... చెయ్యలేను " చాలా సార్లనుకున్నాడు అనుపమ్.

మస్తాన్ మాటలు పదే పదే గర్తు చేసుకొని ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాడు.

"నైట్ డ్యూటీలో ఎప్పుడూ వుండేది నువ్వే కదా ఒక్క అరగంట చూసి చూడనట్టూరుకో ...సైడింగ్ లైన్లో ఐరన్ రాడ్ల లోడ్ తో వున్న సిక్ వెహికెల్లో ఓ అరగంటలో నా పనిని కానిచ్చుకొని నీ క్కావల్సినంత డబ్బు ముట్టచెప్తా"

"అంటే " అంటూ అర్ధం కాక తనంటే..."నాక్కావల్సిన్ని రాడ్లు నే తీసుకుంటా...నీ క్కావల్సిన డబ్బు నీకిస్తా" అన్నాడు మస్తాన్ నవ్వుతూ...

పోనీ మస్తాన్ తో చేతులు కలిపి కావల్సిన మొత్తం తీసుకు గడిపెద్దామా?....

ఈ ఏడాది జాయినింగ్ కీ వాటికి గడిపెయ్యొచ్చు...కాని ఎన్నాళ్ళిలా....?

ఏనాడూ ఆశించని తను.....ఒకసారి ఈ పరిస్ధితులకి లొంగి ఆ రొంపిలో దిగి అక్రమార్జన మొదలెడితే... అది క్రమేణా అలవాటైతే....ఎప్పటికైనా ఈ పాపం పండి బండారం బయటపడితేనో....

జగన్నాధం మాష్టారిలా...తనపై కూడా కేసు పెట్టి జైల్లో పెడ్తే, చార్జిషీట్లూ,కేసులూ...

అమ్మో....! అరెస్టులూ, ఆ కోర్టులూ, ఆ కేసులూ...వగైరా...వగైరాలూ...

ఇప్పటికే వున్న సమస్యల్తో సతమతమౌతూంటే...లేనిపోని సమస్యలు నెత్తికెత్తుకోవాలి.

అన్నవస్ర్తాలకి పోతే వున్న వస్త్రాలూడి పరువు పోదూ...?

ఇలా పదే పదే ఆలోచనలతో సతమతమౌతున్నాడు.

ఆలోచనా వలయాలు చుట్టుముట్టడంతో, అన్యమనస్కంగా కుడిచేత్తో ఎర్రజెండాని, ఎడం చేత్తో ఆకుపచ్చ జెండాని పట్టుకొని సిగ్నల్ ఎక్స్ చేంజ్ చెయ్యడాన్కి బయలుదేరాడు అనుపమ్.

డౌన్ లైన్ కి వెళ్ళాలంటే అప్ లైన్లు దాటాలి.

ప్లాట్ ఫాం దిగి అప్ లూపు లైన్ దాటాడు.

అప్ మెయిన్ లైన్లో గూడ్సుబండికి యిచ్చిన త్రూ సిగ్నల్స్ గమనించలేదు. దీర్ఘూలోచనల్లో పరిసరాల్ని మరిచిపోయాడు అనుపమ్.

అప్ మెయిన్ లైన్లో స్పీడుగా వస్తున్న గూడ్సుట్రైన్ని చూసుకోలేదు అనుపమ్.

జెండాలు పట్టుకు అప్ మెయిన్ లైన్ దాటుతున్న అనుపమ్ ని స్పీడుగా వస్తున్న గూడ్సు బండి ఢీ కొట్టింది.

మధ్యలో పడ్డ అనుపమ్ మీదుగా గూడ్సుబండి స్పీడుగా వెళ్ళిపోయుంది. అంతే అనుపమ్ శరీరం తునాతునకలయ్యింది....

తల,మొండెం వేరవ్వడమేకాక శరీరం రక్తపుముద్దయ్యుంది.

ఎన్నెన్నో కలలు గన్న అనుపమ్ రక్తపుముద్దగామారి ప్రాణాలనంతవాయువుల్లో కలసిపోయాయి.

.....

డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తూ మరణించడంతో....

ఆన్ డ్యూటీ డెత్ కాంపన్షేషన్, గ్రాట్యూటీ,ఇన్సూరెన్సు వగైరా చెల్లింపులు స్టేషన్ మానేజర్ గారి సహకారంతో సవ్యంగా ముట్టాయి. అనుపమ్ భార్య అనసూయకు.

................................


ఎనిమిదేళ్ళ తర్వాత.....


అనూష ఎమ్.బి.బి.ఎస్ పూర్తయ్యాక ఎమ్.ఎస్. చేసి మంచి ఉద్యోగంలో చేరింది.

అలేఖ్య డిగ్రీ పూర్తయ్యాక మంచి సంబంధం చూసి పెళ్ళి చేసింది అనసూయ.

సర్వీసుండగా అనుపమ్ మరణించడంతో డెత్ కోటాలో అసిస్టెంట్ స్టేషన్ మాష్టర్ ఉద్యోగం లో జాయిన్ అయ్యాడు అరవింద్. అనసూయకి పెన్షన్ దొరుకుతోంది. ఆర్ధిక యిబ్బందులు తీరి వాళ్ళ బ్రతుకులో కొలిక్కి చేరుకున్నాయి.

"నాలాంటి క్లాస్ ఫోర్ రైల్వే ఉద్యోగులు పిల్లలకి ఉన్నత చదువు చెప్పించటం, మంచి సంబంధం చూసి పెళ్ళిళ్ళు చేయాలని కలలు కనడమేగాని వాటిని ఛస్తే సాధించలేమే".....అనసూయా....

అన్న భర్త మాటల్ని తలుచుకొని....

" సాధించావు అనుపమ్...సాధించావు....నువ్వు నీ జీవితాన్ని పణం పెట్టి సాధించావు" కానీ నేను మాత్రం జీవచ్చవంలా బ్రతుకుతున్నాను" అని ఈ ఎనిమిదేళ్ళలో రోజుకెన్నిసార్లు అనుకుందో లెక్కేలేదు. అనసూయకు....!

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు