ఎవరు వాళ్ళు...? - నల్లాన్ చక్రవర్తుల గోపీమాధవులు

evaru vaalu?

" ఏం మూర్తీ ఇవాళ ఉపవాసమా? "అన్న పిలుపుతో సిస్టం లోంచి తల పక్కకు తిప్పాను. టిఫిన్ బాక్స్ పట్టుకుని నా ఎదురుగా నిల్చుని ఉన్నాడు రాజేష్. "అప్పుడే లంచ్ టైం అయ్యిందా? " అప్రయత్నంగా నాలోంచి రాబోయిన ప్రశ్నను అమాంతం మింగేసాను. ఎందుకంటే, రాజేష్ బాక్స్ పట్టుకుని తయారైతే లంచ్ టైమూ, బ్యాగ్ పట్టుకుని తయరైతే ఇంటికెళ్ళే టైమూ అయినట్టే. అందులో ఎలాంటి సందేహమూ అవసరం లేదు. అతడి పంక్చువాలిటి మీద అఫీసులో అందరికీ అంత కాంఫిడెన్స్. అంతే కాదు, ఎవరి వాచీ అయినా ఆగిపోతే రాజేష్ బయల్దేరే టైముని బట్టి సెట్ చేసుకోవడమూ మాకలవాటే.

"లేదు లేదు.. వచ్చేస్తున్నా.."అంటూ సిస్టం టర్న్ ఆఫ్ చేసి అతడి వెనకాలే క్యాంటీన్ కేసి నడిచా. బాక్స్ ఓపెన్ చేసి తినడంలో నిమగ్నమైపోయాడు రాజేష్.. అతడు తినే పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. చూసిన వాళ్ళకు మూడు అనుమానాలు కలుగక మానవు..స్పీడుగా తినే పోటీ ఏమైనా పెట్టారా, లేక అతన్నెవరైన తరుముతున్నారా, లేదా తిన్న వెంటనే ఎక్కడికైనా పరుగెట్టాలాని.. కానీ ఇవేవీ కావని తెలిస్తే మాత్రం మరి అంత స్పీడుగా తినడమెందుకని అశ్చర్యం కలుగక మానదు. ఈరోజు మా ఆవిడ లంచ్ బాక్స్ సర్ది ఇవ్వలేదు. పొద్దున తాను వంట చేసే మూడ్ లో లేదు. ఆమాటకొస్తే నేనూ అఫీస్ కొచ్చే పరిస్థితుల్లో లేను. కానీ ఒక్క రోజు లీవ్ అడిగే పాపానికి మా బాసు సాధించే పద్ధతులకు భయపడి ఎలాగోలా వచ్చేసాను. పొద్దున్నే ఇంటి ఓనరుతో మొదలైన గొడవ మా ఇద్దరి మూడ్ నీ చెడగొట్టింది. ఏదో వాళ్ళింట్లో అద్దెకున్నామనే లోకువ తప్ప అదేమన్నా గొడవ చేసేంత పెద్ద కారణమా? ఇంటి పక్కనున్న ఖాళీ జాగా లో పిల్లలు క్రికెట్ ఆడుతూ కొట్టిన బంతికి కిటికీ అద్దం ముక్కలైతె అది మా నేరమా? అంటే, చుట్టు పక్కల్నునుంచి వాళ్ళింటికి ఎలాంటి ప్రమాదం వస్తోందో కూడా కనిపెట్టుకు ఉండాలట...అది అద్దెకున్న వాళ్ళ కనీస ధర్మమట... ఆ గొడవ కాస్త పెద్దదై ఓనరు ఈక్షణాన ఇల్లు ఖాళీ చేసేయండని రంకెలేయడమూ నేనూ కాస్త గట్టిగానే అలా కుదరదు, మినిమం త్రీ మంత్స్ టైం ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వల్సొస్తుందని ఇంకా గట్టిగా రివర్స్ తిరగడమూ జరిగిపోయాయి.. సరే, ఏదేమైనప్పటికీ అద్దెకున్న వాళ్ళందరూ అరిటాకులే, ఓనర్లందరూ ముళ్ళే...ఇక అద్దె ఇళ్ళ వేట మొదలెట్టాలి.. ఈలోగా ఏదోక తప్పు బనాయించి సాధించే ఓనరు దంపతుల కుట్రలను ఓ కంట కనిపెట్టుకుండాలి.. ఇలా రకరకాల ఆలోచనలతో ఎందుకో తినాలనిపించలేదు..మెల్లిగా రోడ్డున పడ్డాను కాస్త రిలీఫ్ గా కూడా ఉంటుందని...ఆఫీస్ కి యాభై అడుగుల దూరంలో ఉన్న టిఫిన్ సెంటర్ కెళ్ళి ఇడ్లీ టోకెన్ తీసుకుని , రోడ్డు మీద పోయే జనాలని చూస్తూ మెల్లిగా తింటున్నా.. ఎవరి గోల వారిది. పరుగెత్తే వాళ్ళు..ఫోన్లో మాట్లాడే వాళ్ళు...ఎవర్నెవరూ పట్టించుకునే టైం లేదు..ఈలోగా హోటల్లోకి ఎంటరైన ఇద్దరు దృడకాయుల మీద పడింది నా దృష్టి ..అచ్చు సినిమాల్లో విలన్ల లాగే ఉన్నారు. వాళ్ళు నేరుగా కౌంటర్ దగ్గరకొచ్చి టోకెన్లేమీ తీసుకోకుండా మెల్లిగా కళ్ళతోనే నావైపు చూపించుకుని మెల్లిగా ఏదొ మాట్లాడుకోవడం చూసి మొదట ఆశ్చర్యం, తర్వాత భయం రెండూ కలిగాయి నాకు.. చూసీ చూడనట్టు వాళ్ళనే గమనిస్తూ ఇడ్లీ ముక్కని చట్నీలోనూ సాంబారులోనూ ముంచుతూ నోట్లో తోసేస్తున్నాగానీ అది గొంతు దిగడం లేదు. అనుకున్నంతా అయ్యింది..ఛ.. ఓనర్లతో అంత గట్టిగా పొట్లాట వేసుకోవాల్సింది కాదు..వీళ్ళు వాళ్ళు పంపిన కిరాయి గూండాలే. ఒకడు ఏదో చెప్తున్నాడు... ఇంకొకడు తల ఊపుతున్నడు. వాడు ఔనన్నట్టూ.. వీడు కాదన్నట్టూ కాసేపు ఏదో గూడుపుటాణీ చేసుకున్నారు...ఏమీ ఎరుగనట్టు కౌంటర్ దగ్గరకెళ్ళి టోకెన్ తీసుకుని రెండు ప్లేట్లలో టిఫిన్లు తెచ్చుకుని తింటున్నారు..అదీ నా పక్కనే.. నా పై ప్రాణాలు పైనే పోయాయి. నేనెలాగూ బయటకు రావడానికి టైం పడుతుంది కదాని ఊహించి ఈలోగా ఏదోక టిఫిన్ తింటూ నన్ను గమనిస్తూ ఇక్కడే కాలక్షేపం చేయడానికి ప్లానన్న మాట... అయినా ఇంటి ఓనర్లకు అంత కక్ష, బ్యాక్ గ్రౌండ్ ఉన్నాయా..? ఏమో! టైం వస్తే కదా ఎవరి ప్రేమైన పగైన తెలిసేది... ఈలోగా నా జేబులోని సెల్లు రింగౌతోంది.. తీసి చూస్తే మా ఆవిడ..నేనేమైన తిన్నానో లేదో అడుగుదామని చేసుంటుంది. పాపం తనేమైనా తిన్నదో లేదో .. ఫోన్ తీసి మాట్లాడడానికి నాకు గొంతు పెగలడం లేదు.. తర్వాత మాట్లాడతానని మెస్సేజ్ పెట్టేసాను. ఈలోగా వాళ్ళు తినడం ముగించి అటూ ఇటూ చూస్తూ మెల్లగా బయటకు నడిచారు.

మర్యాద రామన్నలో సునీల్ లాగా అయ్యింది నా పరిస్తితి. హోటల్ లోపల ఉన్నంత వరకే నా ప్రాణాలు సేఫ్..లంచ్ టైం కాస్తా దగ్గర పడింది. టిఫిన్ సెంటర్ నుంచి ఆఫీస్ కెలా వెళ్ళడం? మూర్తికి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటినుంచి ఫోనొస్తే వెళ్ళి పోయానని బాస్ కి రిక్వెస్టు చేయమని చెప్పేసా.. లంచ్ టైం అయిపోవడంతో టిఫిన్ సెంటర్లో రద్దీ కాస్త తగ్గింది. కూర్చున్న చోటు నుంచి లేవడానికి కూడా నాకు కాళ్ళాడడం లేదు. కౌంటర్ దాకా వెళ్ళి టోకెన్ తెచ్చుకోకుండా కుర్రాణ్ణి పిలిచి ఇంకో ఐటం తెప్పించుకున్నా.. ఓ గంటసేపు దాంతో గడచిపోయింది.. కానీ ఎంతసేపిలా? ఏమో నాకే తెలీదు.. ఎంతసేపటికీ నేను బయటకి రాకపోతే నాకోసం..కాదు కాదు నా ప్రాణాల కోసం కాచుక్కూర్చున్న వాళ్ళు విసిగి వెళ్ళి పోతారని నా పిచ్చి ఆలోచన..డౌట్ లేదు..నేను కాలు బయట పెట్టడం ఏ చెట్టు చాటునుంచో వాళ్ళొచ్చి గద్దలా నా ప్రాణాలు తీసెయ్యడం ఖాయం.. వీల్లేదు.. వాళ్ళకా ఛాన్సు ఇవ్వొద్దు. చూసీ చూసీ నేను బయటకు రావడం లేదనుకున్నారో ఏమో.. మరో ఇద్దరు లోపలికొచ్చారు.. మళ్ళే నావైపు చూపించుకోవడం... మాట్లాడుకోవడం.. జీవితంలో మొదటిసారి ప్రాణ భయం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసింది.. ఈలోగా మళ్ళీ మా అవిడ ఫోన్..ఈసారి తప్పనిసరై తీసి " హలో " అన్నా.."ఏమండీ.. ఆఫీసులో బిజీనా, మధ్యాన్నమేమైనా తిన్నారా? "అనడిగింది.. పాపం తన ఆత్రం తనది.. "నువ్వెక్కడున్నవు? "అని నేనడిగిన ప్రశ్నకి "ఇంకెక్కడుంటానండీ, ఇంట్లో.." కాస్త అయోమయంగా చెప్పింది.. "అది కాదే, తలుపులేసుకుని లోపలే ఉండు. నేనొచ్చి పిలిస్తే గాని తలుపు తియ్యొద్దు.. "కంగారుగా చెప్పాను. "అదేమిటండీ? అసలు విషయమేమిటీ? " అంది. నేనిక్కడ జరుగుతున్న సీన్ మొత్తం చెప్పా. "హయ్యో, ఓనర్లకంత బ్యాక్ గ్రౌండ్ ఎక్కడిదండీ? వాళ్ళున్నదే ఇద్దరు ముసలి పీనుగులు, వాళ్ళ అబ్బాయెక్కడో అమెరికాలో ఉంటాడాయె. .." అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది..నాకు చిరాకేసింది..నేనేది మాట్లాడినా తనది ప్రతిపక్ష స్థానమే..ఏమంటుంది..మీవన్నీ అర్థం లేని భయాలు.. అని కొట్టి పారేయడమో,లేక ఇంకేదైనా ఉచిత సలహా పారెయ్యడమో చేస్తుంది..అనిపించి " చెప్పింది చెయ్..మనుషుల్ని నమ్మలేం తెల్సా ఇక్కడ నన్నూ, అక్కడ నిన్నూ లేపేయడానికి ఓనర్ల ప్లాన్ కావచ్చు తెల్సా? "చెప్పి ఫోన్ పెట్టేస..ఇడ్లీ, దోశ..వడ, పూరీ ఐటంస్ అన్నీ తెప్పించుకోవడం, లోపలికి తోసెయ్యడం ఎలగోలా అయిపొయ్యాయి.. ఆఫీసు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ కావడాన ఉన్న పరిచయం తో కౌంటర్లోని వ్యక్తి అడిగాడు " ఏం సార్ ఈరోజు మా టిఫిన్ సెంటర్లో ఐటంస్ అన్నీ టేస్ట్ చెయ్యాలని బాక్స్ తెచ్చుకోలేదా ఏమిటి? " ... " వీడొకడు, పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం.. అయినా వీడికెందుకివన్నీ? " అనుకున్నా..అప్పటిదాకా రక్షణ కవచంలా ఉన్న టిఫిన్ సెంటర్లోంచి బయట పడాల్సిన టైం రానే వచ్చింది..వాళ్ళు పాత్రలన్నీ కడిగేసి హోటల్ కట్టేసే టైం అయ్యింది.." నువ్వుండేది మా కాలనీలోనే కదా..కాస్త నన్ను మా ఇంటి దగ్గర దిగబెడతవా? హోటలతన్ని దీనంగా అడిగా.." దానికతడు ఆశ్చర్యంగా. " ఏం సార్, బాక్సే కాదు వెహికల్ కూడా తేలేదా ఈరోజు ?" అనడిగాడు. " అదీ..అదీ.. తెచ్చా కానీ అఫీసులోనే ఉంది.. అంతకంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు.. వాడికి నాఫీలింగేమిటో అర్థం కావడం లేదు.. సాధారణంగా తలుపులేసే దాకా టేబిల్స్ పై వాలిపోయిన కస్టమర్లను బయటకి పంపే సీన్లు బార్లలో తెలుసు..కానీ ఇదేమిటాని వాడి ఆశ్చర్యం కావచ్చు. ఇక తప్పని సరై విషయమంతా చెప్పేసాను..వాడి ఆశ్చర్యం కాస్తా నవ్వుగా మారింది. నా భయం వీడికి కామెడీ అయిపోయింది అనుకుంటూండగానే వాడు " సార్ ఒక్కసారిటు వస్తారా " అన్నాడు. " ఏమిటి " అంటూ వాడి వెనకాలే నడిచా. వాడిప్పుడు సరిగ్గా ఆ ఆగంతకులు నిల్చున్న చోటే ఆగాడు. " ఒక్క సారి మీరు కూర్చున్న టేబిల్ వైపు చూడండి " అంటూ వేలుపెట్టి చూపించాడు. అటుకేసి చూసిన నాకు అప్పటి దాకా నన్ను వెంటాడిన భయానికి కారణం కనిపించింది. అక్కడ నిలువెత్తు మెనూ బోర్డు నన్నే వెక్కిరిస్తున్నట్టుంది. సీన్ మొత్తం నాకర్థమైపోయింది..వాళ్ళెవరో ఒకరికొకరు చూపించుకున్నది నన్ను కాదా? ఏ టిఫిన్ ఆర్డర్ చెయాలాని మాట్లాడుకున్నరా? ఛ, ఎంత సిల్లీగా భయపడ్డానూ...ఇక అక్కణ్ణుంచెలా బయట పడ్డానో నాకే తెలీదు.. హోటల్ వాళ్ళముందు ఫూల్ నవడం అయిపోయింది.. ఇక ఇంటి దగ్గర మా అవిడ ముందు మిగిలింది.......

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ