ఇచ్చుటలో ఉన్న హాయీ... - డా: పి.కె. జయలక్ష్మి

Ichhutalo Vunna Hayee

"మమ్మీ! అన్నయ్య కొట్టాడు" అని ఏడ్చుకుంటూ వచ్చిన కిరణ్ ని దగ్గరకి తీస్కుంటూ "హర్షా ఇలారా" అని కోపంగా పిలిచింది నీరజ. 'ఏంటి మమ్మీ?' అని దూరం నుంచే భయంభయంగా అడుగుతూ మూలగానిలబడ్డాడు హర్ష. "ఎందుకురా వాణ్ణి కొట్టావు. చిన్నవాడు కదా ఏదయినా తప్పుపని చేస్తే నాకు చెప్పమన్నానా లేదా, గుంజీళ్ళు తియ్యి ముందు" అని కసిరింది నీరజ.

"వాడేం చెప్పినా వింటావు నామాట అస్సలు విన్పించుకోవేం?" విసుగ్గా అన్నాడు హర్ష. "నా నోట్సు మీద ఇంకు వొంపేశాడు రేపు క్లాసులో టీచరు అడిగితే ఏం చెప్పాలి?" అందుకే కోపం వచ్చి చెంపమీద ఒక్కటిచ్చాను" అన్నాడు చేతులు తిప్పుతూ.

"వాడికి అందేలా ఎందుకు పెట్టావు? ఎనిమిదో క్లాసుకి వచ్చావు ఇంకా జాగ్రత్త రాకపోతే ఎలా? అయినా కిరణ్! నోట్సు మీద ఇంకు ఒంపాల్సిన పనేంట్రా బుర్రాబుద్ధీ లేదా?" అని చిన్నవాణ్ణి కూడా మందలించింది నీరజ. "నేను కావాలని ఒంపలేదమ్మా. ఇంకుపిల్లర్ నుంచి ఇంకు ఎలా పడుతుందో టెస్ట్ చేద్దామనుకున్నా. కిందపడితే గట్టు పాడవుతుందని నువ్వు తిడతావుగా అక్కడేదో నోట్సు ఉంటే దానిమీద డ్రాప్స్ లాగా వేసాను. భలే డిజైన వచ్చింది. నాకేం తెల్సు అది అన్నయ్య నోట్సని" కళ్ళు అమాయకంగా పెట్టి చెప్పాడు కిరణ్. "అంటే నీ డిజైన్లకి నా నోట్స్ దొరికిందా? నాలుగో క్లాసు చదువుతున్నావు ఇంకా బుద్ధి రాలేదు?" అన్నాడు హర్ష తల్లిని అనుకరిస్తూ.

"సరేసరే. గొడవలు ఆపి భోజనానికి రండి" అంది నీరజ. కంప్యూటర్ ముందు నుంచి లేస్తూ. "అమ్మా, నాకు తిన్పిస్తేనే తింటా" అన్నాడు గారంగా కిరణ్. "సర్లే, రోజూ ఉండేదేగా! నీకిష్టమని పొటాటో ఫ్రై చేశా" అంది ముద్ద కలిపి నోట్లో పెడ్తూ.

"మమ్మీ మమ్మీ నాకూ తిన్పించవా?" ఆశగా అడిగాడు హర్ష తల్లిని. "ఇంకా నయం! నువ్వేమన్నా చిన్నపిల్లవాడివా? బుద్ధిగా కలుపుకుని తిను" అంది గద్దిస్తున్నట్లు. "అంతే! కిరణ్ కి తిన్పిస్తావు గాని నేనడిగితే మాత్రం విసుక్కుంటావు నీకు వాడంటేనే ఇష్టం" అని కోపంగా ప్లేట్ పట్టుకుని తన రూమ్ లోకి వెళ్లిపోయాడు హర్ష. తనలో తాను నవ్వుకుంది నీరజ హర్ష ధోరణికి.

రాత్రి పిల్లల్ని నిద్రపుచ్చుతూ అనునయంగా చెప్పింది నీరజ "ఇద్దరూ కలిసి మెలిసి వుండాలి ప్రతి చిన్నదానికి కొట్టుకోవడం, తిట్టుకోవడం మంచిది కాదు. అంతా నవ్వుతారు అలా చేస్తే, నీకంటే తమ్ముడు చిన్నవాడు కదా వాడేమన్నా చేస్తే నాకుగాని డాడీకి గాని చెప్పాలి. అంతేకాని కొట్టకూడదు" అంటుండగానే "నాకే చెప్తావు అన్నీ. వాడికేం చెప్పవేం?" అని కయ్యిమన్నాడు హర్ష. "ఏం చెప్పమంటావు" అంది నవ్వాపుకుంటూ నీరజ.

"అదే! అన్నయ్య పెద్దకదా వాణ్ణి విసిగించకు, వాడి వస్తువులు ముట్టుకోకు. అని చెప్పవచ్చుగా" అన్నాడు ఆరిందాలా "ఎందుకు చెప్పను? నీకు చెప్పినట్లే వాడికీ చెప్తాను, కిరణ్! అన్నయ్య నిన్నేమన్నా అంటే నాకు చెప్పు" అంది నీరజ. "నేనెందుకు అంటాను? నన్నేమైనా అంటేనే కదా? వాడికే నువ్వు సపోర్టు ఎప్పుడూనూ, ఛీ!" అన్నాడు ఉక్రోషంగా హర్ష. "అబ్బ, పోన్లేరా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా పెద్దకొడుకువి కదా! ఇద్దరూ గుడ్ బాయ్స్ సరేనా? ఇంక పడుకోండి" అంది దుప్పటి కప్పుతూ.

******


"ఇదిగో చూసారా, హర్ష బ్యాటుతో కిరణ్ణి కొట్టాడు. రోజురోజుకి వాడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మీరు కాస్త కలగజేస్కోండి." అంది నీరజ అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి రిలాక్సవుతున్న భర్త కృష్ణతో. "ఇంతకీ కిరణ్ ఏం చేసాడో?" అడిగాడు సాలోచనగా. "ఏం చేసినా కొట్టాల్సిన పనేంటి? మనకి చెప్పాలి కదా" అంది కోపంగా. "ఒకసారి అటుచూడు" అన్నాడు కృష్ణ. కిటికీ లోంచి బయట దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది నీరజ. కిరణ్ ఫైవ్ స్టార్ అన్నకి ఆప్యాయంగా అందిస్తుంటే హర్ష వాణ్ణి సైకిల్ మీద కూచోపెట్టుకుని ఇంటి చుట్టూ రౌండ్స్ వేస్తున్నాడు. "పిల్లలన్నాక కాసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, తర్వాత మర్చిపోయి ఆడుకోవడం మామూలే నీరూ! అంత పట్టించుకోవాల్సిన పనిలేదు" అన్నాడు నచ్చచెప్పే ధోరణిలో కృష్ణ. "ఏమో బాబూ ఎవరికీ చెప్పలేను" అంది నిట్టూరుస్తూ నీరజ.

******


"ఏమండీ ఇవాళ మీ అన్నయ్యగారబ్బాయి వస్తున్నాడు గుర్తుందా? స్టేషన్ కి వెళ్ళాలేమో" కారియర్ అందిస్తూ అంది నీరజ. "ఆ... అవును సాయంత్రం ట్రైన్ కదా. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పికప్ చేస్కుంటాలే" అని వెళ్ళిపోయాడు కృష్ణ.

రాత్రి అంతా కల్సి భోజనాలు చేస్తుంటే కుశల ప్రశ్నలు అయ్యాక "ఏరా మధూ, మీ అన్నయ్య రవి ఎలా వున్నాడ్రా? ఈ మధ్య వస్తాడా ఇండియా?" అని ప్రశ్నించాడు కృష్ణ " వచ్చేనెల వస్తాడట బాబాయ్ నాకు నెలనెలా పాకెట్ మనీ పంపిస్తాడు. మొన్నామధ్య తన ఫ్రెండ్ ఎవరో హైదరాబాద్ వస్తోంటే నాకు జీన్స్, షూస్ పంపాడు. ఎంత బాగున్నాయో? మా ఫ్రెండ్స్ అంతా ఎంత పొగిడేసారో తెల్సా మా అన్నని. ఈసారి ఐపాడ్ తెస్తాట్ట నాకోసం! తనకీ బోలెడు అవసరాలుంటాయి కదా నాకేం పంపద్దు అన్నా వినడు. ఆ దేశంలో ఖర్చులెక్కువ కదా అందుకే నాకేం వద్దంటాను". అన్నాడు ఇంజనీరింగ్ చదువుతున్న మధు.

"బాగుందిరా అన్నదమ్ములంటే అలా వుండాలి. చూడండ్రా అన్నయ్యలు ఎంత సఖ్యతగా ఉన్నారో? మీలా అస్తమానం కొట్టుకోరు. నేర్చుకోండి" అన్నాడు కృష్ణ పిల్లలతో. "వాళ్లింకా చిన్నపిల్లలు బాబాయ్! బాగానే ఉంటార్లే... వాళ్లకేంటి?" అన్నాడు హర్ష తలనిమురుతూ. హర్ష ఏదో ఆలోచిస్తూ వుండిపోయాడు. వారం రోజుల్లో మధు తన ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు.

******


ఆదివారం... అంతా బీచ్ కి వెళ్లారు. కృష్ణ కిరణ్ణి తీస్కొని ఐస్ క్రీమ్ తేవడానికి వెళ్ళాడు. హర్ష తల్లితో ఇసుకలో నడుస్తూ "రవన్నయ్య ఎంత మంచివాడో కదా మమ్మీ! చాలా గ్రేట్. మధన్నయ్యకి ఎన్ని కొనిపెడుతున్నాడోనే! మధన్నయ్య హేపీ! ఏం కావాలన్నా పేచీ పెట్టక్కర్లేదు అన్నీ పెద్దన్నయ్య కొనిస్తాడు కదా!" అన్నాడు కెరటాల్ని తదేకంగా చూస్తూ.

వాడి మనసులో విషయం కనిపెట్టినట్లు కవ్వింపుగా "నీకూ అలాటి అన్నయ్య వుంటే బాగుండు అన్పిస్తోంది కదా! నీక్కావలసినవన్నీ కొనిపెడ్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా?" అంది నీరజ.

"లేదమ్మా నాకూ తొందరగా చదివేస్కొని, పెద్దవాణ్ణయిపోయి అన్నయ్యలాగా పెద్ద ఉద్యోగం తెచ్చేసుకుని తమ్ముడికి అన్నీ కొనిపెట్టాలని ఉంది. అప్పుడు తమ్ముడు కూడా మధన్నయ్యలా హేపీగా ఉంటాడు కదా!" అన్నాడు ఆశావాదంతో మెరుస్తున్న కళ్ళతో.

ఆశ్చర్యంగా వాణ్ణి చూస్తూ ఉండిపోయింది నీరజ. వాడు తమ్ముడు స్థానంలో వుండాలని ఆశపడుతున్నాడేమో అనుకుంది కాని వాడు అన్నగా తమ్ముణ్ణి ఎలా సంతోషపెడదామా అని ఆరాటపడుతున్నాడు.

'ఇచ్చుటలో ఉన్నహాయి వేరెచ్చటనూ లేనే లేదని' ఏనాడో అని ఒక మహాకవి ఎంత బాగా వ్రాసాడో కదా? నిజమే, నిజమైన ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం, కాని ఇతరులకి మనస్పూర్తిగా ఇవ్వడంలో, సాయం చేయడంలోనే కదా అసలైన ఆనందం దాగివుంది! ఇంత చిన్నవయసులోనే తన కొడుకు ఆ ఆనందాన్ని అంది పుచ్చుకోవాలనుకోవడం ఆమెకి చాలా ఆనందంగా అన్పించింది.

"అన్నయ్యా ఇదిగో ఐస్ క్రీమ్...! నీ కిష్టమైన బటర్ స్కాచ్... నేనే చెప్పా డాడీకి ఇది నీ ఫేవరేట్" అని అన్నచేతిలో పెట్టాడు. "థాంక్యూ రా కిరణ్" అంటూ ప్రేమగా వాడి భుజమ్మీద చెయ్యి వేస్తున్న హర్షని హర్షాతిరేకంగా చూస్తూ వుండిపోయింది నీరజ.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు