స్ఫూర్తి - పోడూరి వెంకట రమణ శర్మ

spoorti

నేను విశాఖపట్టణం లో ఎం కామ్ ఫైనల్ చేస్తుండగా మా బావ గారు ఢిల్లీ నుండి ట్రాన్స్ఫర్ అయి హైదరాబాద్ వచ్చారు. సంక్రాంతి సెలవలకి అక్క వాళ్ళ ఇంటికి వెళ్లాను. నేను వెళ్లిన మరునాడు ఎర్రగడ్డ దగ్గర మోతీ నగర్ వెళ్ళడానికి బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఒక కారు ఆగింది నా ముందు.. మోతీనగర్ వెళ్ళాలా అని డ్రైవింగ్ సీట్ లో ఉన్నాయన అడిగితె అవునని చెప్పాను. రండి నేను ఆటే వెడుతున్నానని ఆంటే ఆయన కారు ఎక్కాను. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన ఇల్లు అక్క వాళ్ళ ఇంటికి ఎదురుగానే. ఆయన పేరు నారాయణ మూర్తి గారని బావ గారు చెప్పారు. బావ గారు ఎల్ ఐ సి లో పనిచేస్తున్నారని తెలిసి, ఆయన పాలీసీల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి బావ గారి దగ్గరికి వచ్చారట. ఆ విధంగా ఆయనతో పరిచయం. ఆయన చాలా పెద్ద ప్రాక్టీసు ఉన్న ఛార్టర్డ్ అకౌంటెంట్ అని తెలిసింది. ఆయన ఇల్లు రెండు ఫ్లోర్స్ ఉన్న పెద్ద ఇల్లు. కింద అంతా ఆయన ఆఫిస్ కు వాడుకుంటూ పైన ఆయన కుటుంబం ఉంటుంది.

మాటల సందర్భం లో మా బావగారు, అక్క , నారాయణ మూర్తి గారి మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కారణం తెలియదు కానీ, నారాయణ మూర్తి గారు చాలా డబ్బు ఉన్నవాడయినా , దానిని ఆయన అనుభవించడు అన్నారు బావగారు. ఆయన కారణం తెలియదు అంటే, అక్క మాత్రం నిశ్చితంగా ఆయన వట్టి పిసినారి అనే అభిప్రాయం చెప్పింది. ఇద్దరిలో ఎవరి అభిప్రాయం సరి అయినదా అన్న కుతూహలం కలిగింది నాకు.

ఆయన తో మొదటి రోజు పరిచయం తరువాత ఆయన ఒకమాటు సిటీ బస్సు లోనూ, ఇంకో మాటు షేర్ ఆటో లోనూ కూడా తటస్థ పడడం జరిగింది. ఆయనకీ మంచి కారూ, ఆస్తులూ ఉన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణించడం కొంచం ఆశ్చర్య మేసింది. అక్క అభిప్రాయం సరి అయినదేమోనని అనుమానం కలిగింది నాకు

" ఎం కామ్ " అయిన తరువాత "సిఏ" చేయొచ్చుకదా కెరీర్ బాగుంటుంది అన్నాడు బావ గారు. నారాయణ మూర్తి గారి దగ్గర ఆర్టికల్స్ ఇస్తారేమో కనుక్కొనా అన్నారు. బావగారు . "సిఏ" పరీక్షలు, ప్రాక్టీసు చేస్తున్న సిఏ దగ్గర ఆర్టికల్స్ చేస్తూ రాయాలి. నాకు బాగానే ఉంది అనిపించి బావగారితో వెళ్లి ఆయన్ని కలిశాను. ఆయన బాగానే మాట్లాడారు. యూనివర్సిటీ కోర్సులా కాకుండా 'ప్రొఫెషనల్' కోర్సు కు కష్ట పడి చదవాలని చెప్పి, ఎం కామ్ అయిన తరువాత వచ్చి చేర మన్నారు.

యూనివెర్సిటీకి వెనక్కి వచ్చే ముందు ఒకటి రెండు మాట్లు నారాయణ మూర్తి గారి ఆఫీసు కి వెళ్లాను, కోర్సు వివరాలు ఇంకా సేకరిద్దామని. ఒక మాటు నేను వెళ్ళినప్పుడు ఆయన ఆర్టికల్స్ చేస్తున్న ఇంకో ఇద్దరు సీనియర్స్ తో సమావేశం లో ఉన్నారు. నన్ను కూడా వచ్చి కూర్చోమన్నారు. ట్రిబ్యునల్ లో కేసుకి సంబంధించి కొని వివరాలు ఇద్దరు క్లయిన్ట్స్ వద్దకి వెళ్లి పేపర్స్ తీసుకురమ్మన్నారు వాళ్ళని . వాళ్లు లేచి వెడుతుంటే వాళ్ళని కారు తీసుకుని వెళ్ళ మని చెప్పారు. అలా అని వాళ్ళకి చెప్పగానే ఆయన లోభి అన్న విషయం మీద అక్క అభిప్రాయం నన్ను గందరగోళం లో పడేసింది

*****

ఫైనల్ పరీక్షలు రాసిన వెంఠనే రిజల్ట్స్ కోసం ఆగకుండా అక్క వాళ్ళదగ్గరికి వచ్చేశాను. ఆలస్యం చేయకుండా నారాయణ మూర్తి గారి దగ్గర చేరి సిఏ ప్రారంభించాలని నాకు అనిపించింది. మళ్ళీ బావగారు నాతో వచ్చి నారాయణ మూర్తి గారిని కలిశారు. ఒక వారం రోజులలో నా సీనియర్ల సహాయంతో పేపర్ వర్క్ పూర్తి చేసి ఆయన దగ్గర చేరి పోయాను. రెండు నెలలు నా సీనియర్లతో కొన్ని కంపెనీ ఆడిట్ లకి పంపి చాలా మెళకువలు నేర్పించారు నారాయణ మూర్తి గారు. అందరితో సమానంగా టిఏ, డిఏ లు ఇవ్వడమే కాకుండా, ఒక నెల కాగానే స్టయిపెండ్ కూడా ఏర్పాటు చేశారు.

నేను చేరిన మూడో నెలలో ఒక రోజున నారాయణ మూర్తి గారు నన్ను పిలిచి మరుసటి వారం వైజాగ్ బ్యాంకు ఆడిట్ పని మీద వెళ్లాలని, దానికి ఆయనతో నేను వెళ్లాలని చెప్పారు. దానికి తయారీగా రేజర్వేషన్లు అవీ నన్ను చేయమన్నారు. ఎలాగూ ఈ ఖర్చులన్నీ క్లయింట్ ఖాతాకు వెడతాయి కాబట్టి నేను ఫస్ట్ క్లాస్ లో ఇద్దరికీ చేద్దామనుకుంటూ ఉండగా, ఆయన పిలిచి ఇద్దరికీ థర్డ్ క్లాస్ లో చేయమన్నారు. కొంచం ఆశ్చర్య పడినా ఆయన చెప్పినట్టే చేశాను. వైజాగ్ లో ఉండడానికి కూడా ఏ స్టార్ హోటలో కాకుండా మామూలు హోటల్ లో చేయమన్నారు.
ప్రయాణం రోజు సామాను తీసుకుని నారాయణ మూర్తి గారి ఇంటికి చేరుకోగానే ఆయన రెడీ గా ఉన్నారు. షేరింగ్ ఉబెర్ బుక్ చేయమని నాకు పురమాయించారు. స్టేషన్ చేరి ఫుడ్ పేక్ చేయించుకుని ప్లాటుఫారం చేరగానే ట్రైన్ వచ్చింది.

విశాఖ పట్టణం లో దిగిన తరువాత, నేను మళ్ళీ ఉబర్ కోసం ప్రయత్నిస్తోంటే, అవసరం లేదని, ఆ స్టేషన్లో పోలీసులు నడిపే ఆటో బుకింగ్ బాగా నడుస్తోందని అక్కడికి తీసుకు వెళ్లారు.వైజాగ్ లో చదివిన రెండు సంవత్సరాలూ నేను స్టేషన్ దిగగానే ఎదురుగా వచ్చే ఆటో వాళ్లని బేరమాడి యూనివర్సిటీకి వెళ్ళేవాడిని. పోలీసు బూత్, ఉందని కానీ, అది బాగా పనిచేస్తున్నదని కానీ నాకు తెలియదు. మా హోటల్ కి వెళ్ళడానికి పోలీస్ ఇచ్చిన స్లిప్ చూసి నాకు మతి పోయింది. అదే దూరానికి చాలా బేరమాడి గత రెండేళ్లు నేను రెట్టింపు మొత్తం చెల్లిస్తున్నానని తెలుసుకుని ఆశ్చర్య పోయాను.

వైజాగ్ లో ఆడిట్ పూర్తి చేసుకుని రావడానికి ఎలా ప్రయాణం చేశామో మళ్ళీ అలాగే తిరిగి వచ్చాము. సికింద్రాబాద్ స్టేషన్లో మాత్రం ఉబర్ రావడం ఆలస్యం అవడం చూసి ఆటో లో వచ్చేశాము.

తిరిగి వచ్చిన మర్నాడు నారాయణ మూర్తి గారు నన్ను పిలిచి " నువ్వు ఒక ఎక్సర్సైజ్ చెయ్యాలయ్యా అన్నారు"

"చెప్పండి సార్" అన్నాను ఏమిటో అది అని కుతూహల పడుతూ

" మొన్న మనం వైజాగ్ ఆడిట్ కి చేసిన మొత్తం ప్రయాణం లో ఖర్చులు వివరాలు ఒక టేబుల్ లో రెండు కాలమ్స్ తో రాయాలి. ఒక కాలం లో మనం అసలు ఖర్చు చేసినది, ఇంకో కాలం లో మనకు ఎలిజిబిలిటీ ప్రకారం ఆంటే. టాక్సీ, ఫస్ట్ క్లాస్ రైల్, మంచి హోటల్ అన్నీ రాయి. మొత్తం రెండిటికీ తేడా ఎంత ఉందొ చెప్పు నాకు" అన్నారు

తొందర పడటం దేనికి , తరువాత అడగవచ్చు అనుకుని ఆ పని చేయడానికి నా సీటు దగ్గరకి వచ్చేశాను

అన్ని రేట్లు సేకరించి ఆయన చెప్పిన ప్రకారం ఒక టేబుల్ తయారుచేసి ఆయనకీ చూపించాను రెండింటికీ ఎంత తేడా ఉంది అన్నారు. అప్పటికే నేను అది చేసి ఉంచాను కాబట్టి వెంఠనే చెప్పాను " 9600 సార్ " అన్నాను

" ఓకే వెరీ గుడ్" అని డ్రాయేర్ లోంచి ఒక న్యూస్ పేపర్ తీసి అందులో పెన్ తో మార్క్ చేసిఉన్న రెండు న్యూస్ ఐటెంలను చదవమన్నారు
మొదటిది ఒక పదిహేను సంవత్సరాల అమ్మాయికి గుండె ఆపరేషన్ కోసం ఖర్చుల నిమిత్తం సహాయం కోసం ఆ అమ్మాయి తల్లి చేసిన విన్నపం. సహాయం ఇవ్వదలిచిన వారు ఫలానా ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ చేయమని. రెండవది అలాంటిదే ఇంకొకటి ఒక ఎన్ జి ఓ సంస్థ ఒక కాన్సర్ పేషేంట్ కి సహాయం అడుగుతూ చేసిన విన్నపం

" చదివానని చెప్పాను " ఎందుకోసమా అనుకుంటూ

" ఇప్పుడు గూగుల్ సెర్చ్ లో రెండింటి గురించీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో వెతుకు" అన్నారు

అలా వెతికితే మొదటి దాని గురించి తెలియలేదు కానీ, ఎన్ జి ఓ సంస్థ వసూలు అయినా దాంట్లో ఖర్చుల నిమిత్తం ఎక్కువ శాతం మినహాయించు కుంటోందని చాలా మంది అభిప్రాయం పడ్డారు . అదే చెప్పాను ఆయనకీ

" ఇప్పుడు మొదటి విన్నపం సరి అయినది అవునో కాదో పత్రిక ఆఫీసు కి ఫోన్ చేసి, ఆ విలేఖరి తో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి చెప్పు " అన్నారు కనుక్కున్న తరువాత ఆ విన్నపం సరి అయినదే అనే నాకు అనిపించి అదే ఆయనకీ చెప్పాను

" మనం వైజాగ్ ట్రిప్ లో సేవ్ చేసినదాంట్లో నా వాటా 4800 ఆ అమ్మాయి ఆపరేషన్ కి పంపు" అన్నారు అలాగే అని చెప్పి ఒక్క క్షణం ఆగి " ఈ మొత్తం వ్యవహారం అంటే సౌకర్యాలు వదులు కొని, అదా చేసిన దానిని ఇతరుల సహాయానికి వాడడం లో అంతరార్థం ఏమిటండి "
అన్నాను తెలుసుకుందామని.

"బాగా అడిగావు. ఒకమాటు ఒక పత్రికలో చదివాను. ఒకమాటు సత్య సాయి బాబా ఎదో ఒక సహాయ కార్యక్రమానికి భక్తులని ఒక డబ్బాలో చందాలు వేయమన్నారట. ఆ డబ్బాని తెరిచి నప్పుడు అందులోంచి ఒక పొట్లం తీసి అందులోంచి ఒక పద్నాలుగు రూపాయలు అందరికీ చూపి మొత్తం వచ్చిన చందాలతో ఇది అత్యంత విలువయినది అన్నారట. ఎందుకంటే ఒక విద్యార్థి తనకి ఇష్ట మయిన ఎదో స్వీట్ తినబోతూ, అది కావాలని మానుకుని ఆ మొత్తాన్ని చందాగా ఇచ్చాడట. ఇతరులకి సహాయం అందరం చేస్తాము. కానీ మన సౌకర్యాలు కాదనుకుని ఇతరులకు చేసే సహాయం చాలా విలువయినదే కాకుండా ఎక్కువ తృప్తి నిస్తుంది అన్నారట. నేను సత్య సాయి భక్తుడిని కాదు కానీ ఆ విషయం చదివినప్పటినుంచీ వీలయినప్పుడల్లా నా సౌకర్యాలు కొన్ని కావాలని కాదనుకుని బాగా అవసరమున్న వాళ్లకి అర్హత నిశ్చయించుకుని ఇస్తూ ఉంటాను అన్నారు అదో తృప్తి " అన్నారు అడిగిన దానిని వివరిస్తూ

" అలా అయితే నాకు వచ్చే దాంట్లోంచి కూడా 4800 చేర్చి మొత్తం 9600 పంపుదాం సార్ " అన్నాను. నేను అలా అనగానే ఆయన ప్రశంసా పూర్వకంగా చూసి తల ఊపారు.

నారాయణ మూర్తి గారిని అర్థం చేసుకోవడం లో మా అక్క, బావగారూ ఇద్దరూ పొరపడ్డారని నాకు అనిపించింది

అప్పటి నుంచీ ఆయన పద్దతి అనుసరించాలని నాకు కూడా అనిపించింది.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు