గౌరి - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

gouri
విష్ణుశర్మ గొడ్ల చావిట్లోకి చూశాడు.

చెంగు చెంగున ఎగిరే లేగదూడ గౌరి పరిచిన ఎండుగడ్డి మీద పడుకుని ఉంది. కడుపులో నొప్పనుకుంటా, ఉండుండి మెలికలు తిరిగిపోతోంది. దాని పొట్ట బిర్రుగా కనిపిస్తోంది. నోట్లోంచి తెల్లని నురగ కార్తోంది. దూరంగా కూతురి బాధను చూస్తూ అప్పుడప్పుడూ ’అంబా, అంబా’ అని జాలి కలిగేట్టు అరుస్తూ, తన కూతురిని కాపాడమని ప్రాధేయపడుతోంది దాని తల్లి సావిత్రి.

దాన్నలా చూస్తుంటే ఆయన కడుపులోంచి దుఃఖం లావాలా పొంగుకొస్తోంది. కళ్లు అవిశ్రాంతంగా వర్షిస్తున్నాయి. ఆయనతో పాటు ఆయన భార్య సోమిదేవీ అదే స్థితిలో ఉంది.

నెమ్మదిగా వెళ్లి దాని పక్కగా కూర్చుని, శరీరాన్ని నిమరసాగాడు. ఆ స్పర్శకు మూసిన కనురెప్పలు కొద్దిగా తెరచి, లేని ఓపిక తెచ్చుకుని, తలను ఆయన చేతికి దగ్గరగా తెచ్చి నాలుకతో నాక సాగింది. అది చూసి ఆయన మనసు చలించి పోయింది. కడుపు తరుక్కుపోయింది.
"దీనికేమైంది దేవీ, యమ బాధ పడిపోతోంది. దీన్నిలా చూస్తుంటే ప్రాణం విలవిల్లాడి పోతోంది, దీనికేం కాదుగా"బేలగా అన్నాడు.
"మీరు బాధపడకండి. మిమ్మల్నీ ఇలా చూడలేకపోతున్నాను. నిన్న పశువుల డాక్టర్ వచ్చి చూసి మందులు ఇచ్చాడుగా" అంది.
"నన్ను ఊరడిస్తున్నావుగాని, నీకు మాత్రం బెంగగా లేదూ, నాకన్నా వాటితో నీకే చెలిమి ఎక్కువ కదా! దీనికి అది తల్లయితే, ఇద్దరికీ నువ్వు తల్లివికాదూ.."

ఇహ ఆగలేక, చీర కొంగు నోటికి అడ్డం పెట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. ఇప్పుడు ఆవిణ్ని ఊర్కోబెట్టడం ఆయనవంతయింది.

***

సూర్యాపేటలోని కమలనాభపురంలో విష్ణుశర్మ పురోహితుడు. యాభై ఏళ్ల వయసుతో, దబ్బపండు ఛాయతో, వెలిగిపోతున్న ముఖవర్చస్సుతో చూడంగానే అప్రయత్నంగా చేతులు జోడించేలా ఉంటారు. అగ్నిని కడిగే వంశ ప్రతిష్ఠ ఆయనది. పుట్టింది దైవ సేవకు, జన హితానికి అని నమ్మే వ్యక్తి ఆయన. ఆ ఊళ్లో ఆయన మాటంటే వేదం. ఆయన ముహూర్తం పెడితే తిరుగుండదు. ఆయన భార్య సోమిదేవి అచ్చం పార్వతీదేవే! వాళ్లిద్దరినీ పూలూ పళ్లతో దర్శించుకుంటే సాక్షాత్తు ఆది దంపతులను దర్శించుకున్నట్టే అన్నది ఆ ఊరి నమ్మకం. వాళ్లకి ఒక్కగానొక్క కూతురు కాత్యాయని. ఆమెకి తెనాలి నుంచి మంచి సంబంధం రావడంతో రెండేళ్ల క్రితం పెళ్లి చేశారు. ఆమె అత్తింటికి వెళ్లిపోయాక, ఇళ్లంతా ఒక్క సారిగా బోసిపోయినట్టు అనిపించింది. సరిగ్గా అదే సమయంలో ఒక షావుకారు లేగదూడతో కూడిన ఆవును దానం చేశాడు విష్ణుశర్మకు. భగవంతుడు తమకో తోడు పంపించాడని ఎంతో మురిసిపోయారు ఆ దంపతులు. ఆ రెంటికీ సావిత్రీ, గౌరీ అని పేర్లు పట్టుకుని ఎంతో ఆత్మీయంగా తమ పిల్లలుగా, వాటికి ఏ లోటూ కలగకుండా చూసుకోసాగారు. ఆవుపాలతో, నెయ్యితో ఇంట్లో ఉన్న శివలింగానికి అభిషేకాలు చేస్తూ తన్మయులయ్యేవారు. అలాంటిది ఒక్క సారిగా గౌరి బాధతో కూడిన అరుపులు, నొప్పితో లుంగలు చుట్టుకుపోవడం చూసి తళ్లడిల్లిపోయారు ఆ దంపతులు.

***

ఉదయం ఏడుగంటలు.

"ఏవండీ విష్ణుశర్మగారూ, మీరిద్దరూ రాత్రంతా నిద్రపోయినట్టులేరు. మీరిలా బాధగా ఉంటారనే పొద్దున్నే వచ్చేశాను"అన్నాడు వెటర్నరీ డాక్టర్ అచ్యుతం.

"రండి..రండి..నేనే మీ ఇంటికొచ్చేద్దామనుకున్నాను. రాత్రంతా దాని బాధ చూడలేకపోయాను..చక్కగా పరీక్షించి మంచి మందు ఇయ్యండి డాక్టరుగారూ, పాపం నోరు లేని జీవం"అన్నాడు జీరబోతున్న గొంతుతో.

"అరె నేను మందిస్తే తగ్గక పోవడముండదే!" అని దాని దగ్గర చిన్న స్టూల్ మీద కూర్చుని పరీక్షించసాగారు. పొట్ట మీద చేయి పెడితే బాధతో గిల గిల్లాడుతోందది.

ఆయన సాలోచనగా లేచి నుంచున్నాడు.. అంతలో సోమిదేవి రెండు కుర్చీలు తెచ్చి బయట వేసింది. ఆయన యథాలాపంగా లేగదూడ ఉన్న పరిసరాలను గమనిస్తూ కొద్ది దూరంలో గుంజకి తట్టుకుని ఉన్న రెండు మూడు సన్నని పాలిథీన్ కవర్లను చూసి "ఇవెక్కడి నుంచి వచ్చాయి?"అన్నాడు ఉద్వేగంగా!

"తెలియదండీ" అన్నాడు విష్ణుశర్మ ఆయన అంతలా ఎందుకు గాబరా పడ్దాడో అర్థంగాక.

"బాగా ఆలోచించుకోండి. మీది ఎత్తైన కాంపౌడ్ వాల్, గేటు ఉన్న ఇల్లు. గాలికి ఇలాంటివి కొట్టుకొచ్చే వీలు లేదు. మరెలా వచ్చాయి. ప్లీజ్ ఆలోచించుకుని చెప్పండి" అన్నాడు.

విష్ణుశర్మ ఐదు నిముషాలు బాగా ఆలోచించి " ఆఁ, గుర్తొచ్చింది పోయిన్నెల మా చుట్టాల ఇళ్లలో శుభకార్యాలుంటే ఎలా వెళ్ళాలా అనుకుంటుంటే, డిగ్రీ చదువుతున్న మా మేనల్లుడు సుదీప్ సెలవులకు మా ఇంటికి వచ్చాడు. వాణ్ని ఓ పది రోజులు మా ఇంట్లో ఉండి, సావిత్రిని, గౌరినీ జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పి వెళ్లాం. మేము కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంటికి రాగానే ఆ సాధు జంతువుల దగ్గరకు వెళ్లాం. అవి మమ్మల్ని చూసి ప్రేమతో మా మీదకొచ్చి ఒళ్లంతా నాలుకతో నాకేసాయి. అవి అంత జాగ్రత్తగా, కళ కోల్పోకుండా ఉండడం చూసి మా మేనల్లుడు వాటిని జాగ్రత్తగా చూసుకున్నందుకు వాడిని మెచ్చుకున్నాం కూడా, ఒకవేళ వాడేమన్నా వేశాడేమో" అన్నాడు విష్ణుశర్మ అంత బాధలోనూ కాస్త ఆనందం ముఖంలో తాండవింపజేస్తూ.

"ఒక్కసారి అతనికి ఫోన్ కలిపి నాతో మాట్లాడించండి"అన్నాడు డాక్టర్.

విష్ణుశర్మ అలాగే చేశాడు. డాక్టర్, సుదీప్ తో మాట్లాడాక విష్ణుశర్మ వైపు తిరిగి "మనం గౌరిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి" అని హడావుడి చేసి, బండి మాట్లాడించి అందులోకి గౌరిని ఎక్కించాడు.

"నేను వెళతాను. మీరు స్నానం, పూజలు పూర్తి చేసుకుని రండి" అని ఆ బండితో వెళ్లిపోయాడు.

***

విష్ణుశర్మ దంపతులు ఆసుపత్రికి వెళ్లంగానే డాక్టర్ వాళ్లకెదురొచ్చి, "గౌరికి అన్ని పరీక్షలూ చేశాను. దానికి ఆపరేషన్ చెయ్యాలి"అన్నాడు.
"అదేంటి డాక్టర్..దానికేమైంది?"మ్రాన్పడిపోయాడు విష్ణుశర్మ.

"తర్వాత చెబుతాను ముందు ఆపరేషన్ చెయ్యాలి"అని లోపలికి తీసుకెళ్లిపోయాడు.

మనిషైతేనేం, జంతువైతేనేం అభిమానం పెంచుకుంటే అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు విలవిల్లాడి పోతారు.

విష్ణుశర్మకి అది చెలాకీగా వాకిలంతా తిరగడం, దానికేదన్నా తగులుతుందేమోనని సావిత్రి దాని వంక ఆందోళనగా చూడడం గుర్తొచ్చాయి.

"పాపం సావిత్రి తన కూతురు ఏవైందోనని ఎంత మదనపడుతూందో ఇంట్లో కదండీ"అంది కన్నీళ్లని కొంగుతో తుడుచుకుంటూ.

"అవును దేవీ, పోయిన జన్మలో ఏం పాపం చేసిందో..చిన్న వయసులోనే దానికి ఈ కష్టాలు"బాధగా నిట్టూర్చాడు.

కొద్ది సేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి "గౌరికి ప్రాణాపాయం తప్పింది. ఇంకేం ఫర్వాలేదు."అన్నాడు.

"గౌరికి అసలేం అయింది డాక్టర్?"ఆత్రుతగా అడిగాడు.

"నాతో రండి"అని తను ముందుకు నడుస్తూంటే ఆ దంపతులు వెంబడించారు.

ఒక గదిలోకి తీసుకెళ్లాక, అక్కడ టేబుల్ మీద గుట్టగా ఉన్న పాలిథీన్ కవర్లను చూపించి "ఇవన్నీ మన గౌరి పొట్టలోంచి తీసినవి"అన్నాడు.

"అవునా"ఇద్దరికీ భయంతో కూడిన విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. "ఇదెలా జరిగింది?" అడిగారు ముక్తకంఠంతో కాస్త తేరుకున్నాక.

"మీ మేనల్లుడికి ఇంటినీ, ఈ రెండు మూగజీవాలనీ అప్పగించి వెళ్లారన్నారు కదా! దాని పర్యావసానమే ఇది. అతనికి చిరుతిళ్లు తినే అలవాటు ఉంది. బయట నుంచి పాలిథీన్ కవర్లలో ఆహార పదర్థాలు తెచ్చుకుని, తిన్నంత తిని మిగతాది కవర్తో పాటు పడేసేవాడు. సావిత్రి రాటకి కట్టేసి ఉండేది కాబట్టి అది తినలేకపోయింది. పాపం గౌరి వాకిలంతా కలయ తిరుగుతూ ఉంటుంది కాబట్టి, కవర్లలో ఉన్న ఆహారం కోసం కవర్లతో సహా
తినేసింది"అన్నాడు.

"పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ సామాన్లు పర్యావరణానికి పెద్ద పీడలా దాపురించాయి. అవి భూమిలో కలవడానికి వందలు వేల సంవత్సరాలు పడుతుంది. మూగజీవాల పొట్టల్లోకి వెళ్లి వాటిని తీవ్రంగా బాధిస్తాయి. చివరికి చంపేస్తాయి. ఇప్పటికే అభం శుభం ఎరుగని ఎన్నో మూగజీవాల ఉసురు తీసుకున్నాయి ఈ కవర్లు"అన్నాడు.

ఆ చివరి మాటకి ఆ భార్యాభర్తల ఒళ్లు జలదరించింది.

గౌరి లేని ఇంటిని ఊహించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సావిత్రిని తల్చుకుంటే గుండే జారిపోతోంది.

గబగబ వెళ్లి గౌరిని చూసి, దాన్ని ఆప్యాయంగా చేత్తో స్పృశించాక వాళ్ల మనసులు కొద్దిగా సేదదీరాయి.

***

గౌరి ఆరోజు డిస్చార్జ్ అయి ఇంటికి వచ్చింది.

అప్పటిదాకా మౌనంగా తిండి మానేసి కూచున్న సావిత్రి కూతుర్ను చూసి ఒక్క ఉదుటన "అంబా" అంటూ లేచింది.

గౌరి ఓపిక లేకపోయినా తల్లిదగ్గరకి వెళ్లింది. అది ఆప్యాయంగా గౌరి ఒంటిని నాలుకతో నాకేసింది. గౌరి ఆ ఇంటి పరిసరాలు తనకు పరిచయమైన ప్రాంతం కావడంతో అంతా కలయతిరిగింది. వాటిని చూస్తుంటే ఆ భార్యాభర్తల కళ్లు ఆనందబాష్పాల చెరువులయ్యాయి.
ఆరోజు నుంచి విష్ణుశర్మ తను ఏ ఇంటికి వెళ్లిన వ్రతాల్లో చెప్పే కథల్లాగా గౌరి కథ చెప్పి పాలిథీన్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులూ వాడొద్దనీ, అసలు పర్యావరణానికి చేటు చేసేవేవీ ఉపయోగొంచొద్దనీ, అవి భూదేవికి, ప్రకృతి మాతకు చేసే అపచారాలని, వాటివల్ల సమస్త జీవ నాశనం తప్పదని సున్నితంగ హెచ్చరిస్తూ చెప్పేవాడు.

విష్ణుశర్మ మాట వేదవాక్కు కాబట్టి ఆ ఊళ్లో అందరూ విన్నారు, ఆచరించారు. ఇప్పుడు కమలనాభపురంలో పాలిథీన్ భూతాలు మచ్చుకైనా కనిపించవు. పశువు పక్షీ, గొడ్డూ గోదా హాయిగా ఆనందంగా మనుషుల్లాగానే పూర్ణాయుర్దాయంతో ఆనందంగా బతుకుతున్నాయి.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు