“ఆఫీసులో ఈ మధ్య బాగా ఇబ్బంది అయిపోతూ ఉంది. వాళ్ళిచ్చే టార్గెట్లు రీచ్ కాలేక పోతున్నా.” చెప్పాను నా భార్య సౌమిత్రి తో.
“ఎలాగోలా ఇంకొన్నేళ్ళు తప్పదుకదా! అబ్బాయి చదువు పూర్తయితే మనం ఒడ్డున పడ్డట్టే.” అంది తను.
“ఇంతకీ వాడేడీ? కనబడడం లేదు!”
“వాడు బయటకు వెళ్ళాడు.”
“ఈ టైం లోనా? ఎనిమిది దాటుతోంది!”
“వచ్చేస్తాడు లెండి.”
“ఎక్కడకు వెళ్ళాడు?”
“తెలియదు.”
“తెలుసుకోవాలి కదా! అసలే వాడు పదోక్లాసు. వాడి పరీక్షలు కూడా దగ్గర బడ్డాయి. వాడు చదువుకోకుండా తిరుగుతుంటే ఎలా?” అడిగాను.
తను సమాధానం చెప్పలేదు.
“వాడు ఈ టైం లో బయట తిరిగితే ఎలా? చెడు స్నేహాలు చేస్తున్నాడా వాడు?? స్నేహితులు వాడికి చెడు అలవాట్లు నేర్పిస్తారేమో! అసలే దారి తప్పే వససులో ఉన్నాడు వాడు.” గట్టిగా అరిచాను.
“వాడు రోజూ వెళ్ళడు కదండీ! ఇవ్వాళే కదా వెళ్ళాడు. వాడు చెడు స్నేహాలు ఏవీ చెయ్యడు. అయినా వాడి గురించి మీకు తెలియదా! మీరు కంగారు పడకండీ.”
“సర్లే! ఇంతకీ వాడు తిన్నాడా?” భోంచేసి చేయి కడుక్కొంటూ అడిగాను.
“ఆ|| , తిన్నాడు.”
ఇంతలో వాడు వచ్చిన చప్పుడు వినబడింది. వాడికేసి చూసాను.
“ఎక్కడకు వెళ్ళావ్? ఇంత రాత్రి పూట??” అడిగాను కోపంగా.
“షాప్ కు వెళ్ళాను.” తలదించుకొని చెప్పాడు.
“ఎందుకు?”
వాడేమీ చెప్పలేదు. వాడి చేతిలోని క్యారీ బ్యాగ్ తీసుకొన్నా. అందులో బాడీ స్ప్రే కనబడింది. దాని ధర మూడొందలు పైమాటే.
“అప్పుడే బాడీ స్ప్రే వాడేటంత పెద్దవాడివి అయిపోయావా?”
వాడు తల దించుకొనే ఉన్నాడు.
“సర్లే! వెళ్లి చదువుకో!” చెప్పాను.
“నాకు రేపు మీ బైక్ కావాలి.” తల పైకెత్తుతూ చిన్నగా అడిగాడు వాడు.
“బైక్ కావాలా? ఎందుకు??”
“రేపు మా స్కూల్ లో ఫేర్వెల్ ఫంక్షన్. అందుకే.”
“ఫేర్వెల్ అయితే బైక్ ఎందుకు? ఇవ్వడం కుదరదు!”
“రేపు మీకు ఆఫీస్ సెలవు కదా?” అడిగాడు.
“అదంతా నీకు అనవసరం. బైక్ ఇవ్వడం కుదరదు.”
“మా ఫ్రెండ్స్ అందరూ ప్రతిరోజూ స్కూల్ కు బైక్ లో వస్తారు. నేను రేపోక్క రోజే కదా అడిగాను.”
“బైక్ వేసుకెళ్ళి ఏం చెయ్యాలి నువ్వు.? అమ్మాయిల ముందు ఫోజు కొట్టాలా?” అడిగాను కోపంగా.
“అదంతా నాకు తెలీదు. బైక్ కావాల్సిందే!!” మొండిగా వాదించాడు వాడు.
“చెప్తోంది నీకు కాదూ? వెళ్ళు, వెళ్లి చదువుకో!”
“మీరెప్పుడూ అంతే. నన్ను శత్రువును చూసినట్టు చూస్తారు. మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ గా ఉంటారు. వాళ్లకు వాళ్ళ పేరెంట్స్ అన్నీ ఇస్తారు. కానీ మీరు మాత్రం నేనేమడిగినా ఇవ్వరు.” కోపంతో అరుస్తున్నాడు వాడు.
“ఏంట్రా! గట్టిగట్టిగా మాట్లాడుతున్నావ్?” కళ్ళెర్ర చేసాను నేను.
“నేనడిగిన దాన్లో తప్పేముంది. మీరు నన్ను నిజంగానే శత్రువును చూసినట్టు చూస్తున్నారు. “ అంటూ నా వైపు వేలు చూపించి
మాట్లాడాడు.
నాకు చాలా కోపం వచ్చింది. వాడు ఏ రోజూ నాకెదురుగా నిలబడి మాట్లాడింది లేదు. కానీ ఇవ్వాళ నన్ను ఎదురించి మాట్లాడుతున్నాడు. పదో క్లాస్ కే అంత పెద్దవాడయిపోయాడా వాడు. దాచుకోలేనంత బాధ, అనచుకోలేనంత కోపం వచ్చింది నాకు. గట్టిగా ఒక్కటి ఇచ్చా. వాడు వెళ్లి దివాన్ పై పడ్డాడు.
“ఏంటండీ మీరు! వెళ్ళండి, మీరెళ్ళండి.” అంటూ సౌమిత్రి నన్ను ప్రక్కకు తోసింది. నేను గదిలోకి వెళ్ళిపోయా.
వాడు ఎక్కిళ్ళు పుట్టేట్టు ఏడుస్తున్నాడు. వాడిని వాడి గదిలోకి తీసుకెళ్ళి సౌమిత్రి వాడికేదో నచ్చజెప్తూ ఉంది.
*********
వంటగదిలో గిన్నెలన్నీ సర్ది పడుకోవడానికి నా గదిలోకి వచ్చింది సౌమిత్రి.
“ఏంటండీ! ఎందుకలా మొండిగా ఉంటారు?” పడుకొంటూ అడిగింది.
“మొండిగా వాదించింది వాడు కదా! నేను మొండిగా ఉన్నానని అంటూ ఉంది.” నాలో నేనే అనుకొన్నా.
“వాడు ఎదుగుతున్నాడండీ! వాడిపై చెయ్యి చేసుకోకుండా ఉండాల్సింది. “ అంటూ పడుకొని కళ్ళు మూసుకొంది. నేను శూన్యం లోకి చూస్తూ ఉండిపోయా, ఆలోచిస్తూ.
నా పేరు విశ్వనాధం. ఒక ప్రయివేట్ కంపెనీలో, చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగం చేస్తున్నా. నా భార్య సౌమిత్రి. ఇంట్లోనే ఉంటుంది. ఖాళీ సమయంలో బ్లౌజులు కుడుతుంది. మాకు ఒక్కగానొక్క కొడుకు, నందు. వాడు పుట్టిన తరువాత పిల్లలు వద్దనుకొన్నాం. ఎక్కువ మందిని పోషించే శక్తి, చదివించే స్థోమత మాకు లేవుగనుక. మా ఆశలన్నీ నందు పైనే పెట్టుకొన్నాం. మేము సంపాయించే ప్రతి రూపాయి వాడి కోసమే ఖర్చు పెడుతున్నాం. మేము ఉంటున్న ఊరు పల్లెకు ఎక్కువ, పట్నానికి తక్కువ. ఈ ఊర్లోనే ఒక ప్రయివేటు స్కూల్ లో వాడ్ని చదివిస్తూ ఉన్నాం. వాడికి ఏ లోటూ లేకుండా చూసుకొంటూ ఉన్నాం. వాడు పుట్టినప్పటి నుండే, వాడి పైచదువుల కోసం ఒక మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పొదుపు చేస్తున్నాం. వాడికి పద్దినిమిది నిండగానే ఆ డబ్బులు వస్తుంది. వాడు బిటెక్ చదవాలన్నా, డిగ్రీ చెయ్యాలన్నా, లేక వేరే ఏమైనా చదవాలన్నా ఆ డబ్బు ఉపయోగ పడుతుంది. ఇంటర్ మీడియట్ ను పేరు మోసిన కాలేజీ లో చదివించాలంటే ఎక్కువ మొత్తంలో ఫీజులు కట్టాలని మా కొలీగ్ రామబ్రహ్మం చెప్పాడు. అందుకోసం రెండేళ్ళుగా డబ్బులు దాస్తున్నాను. వాడికి పది పరీక్షల రిజల్స్ వచ్చేటప్పటికి ఆ డబ్బులు కూడా చేతికి వచ్చేస్తుంది. వాడి విషయంలో చాలా ముందు చూపు నాకు. వాడు నాలాగా చాలీ చాలని జీతంతో, జీవితాంతం బాధపడకూడదు.
వాడి కోసం నేను ఇంత చేస్తున్నా. వాడికి నేనేమీ ఇవ్వడం లేదని ఎంత తేలిగ్గా మాట్లాడాడు ఇవ్వాళ. నా శక్తికి మించి వాడికోసం చేస్తూనే ఉన్నాను కదా! అయినా నేను మాట్లాడిన దాన్లో తప్పేముంది? వాడు బైక్ అడిగాడు, నేను ఇవ్వనన్నాను. కానీ నేను ఎందుకు ఇవ్వనని అన్నానో వాడికి అర్థం కాలేదా? వాడు స్కూల్ కు వెళ్ళే దారిలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. పద్మవ్యూహంలో శత్రువులు సంధించిన భాణాలు లాగా వాహనాలు ముందు నుండి, వెనుక నుండి, అస్తవ్యస్తంగా వస్తూ ఉంటాయి. మరి అంత రద్దీ లో వాడు బైక్ నడప గలడా? అసలు వాడికి బైక్ ను నిలబెట్ట గలిగేటంత శక్తి ఉందా? వాడికేదైనా ప్రమాదం జరిగితే? వాడిపైనే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న మా పరిస్థితి ఏంటి!
వాడు చాలా కాలంగా నాతో ఇలానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. నాతో చాలా తక్కువుగా మాట్లాడుతాడు. కానీ, వాళ్ళమ్మ తో చాలా స్నేహంగా ఉంటాడు. నేను ఇంట్లో ఉంటే, వాడు వాడి గదిలోనే ఉంటాడు. వాడు చాలా బాగా చదువుతాడని, చాలా మంచి క్రమశిక్షణ గల వాడని, వాడి టీచర్లు వాడి గురించి చెబుతూ ఉంటారు. అప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. నా పెంపకం పట్ల నాకు చాలా సంతృప్తి గా ఉంటుంది. ఇక మా బంధువులు అయితే, వాడ్ని చూసి, నేను కూడా వాడి వయసులో ఉన్నప్పుడు వాడంత అందంగా ఉండే వాడినని చెప్తారు. అలా ఎవరైనా చెప్పినప్పుడు నాకు చాలా సంభరంగా ఉంటుంది.
“ఏమండీ! ఆలోచించింది చాలు. ఇక నిద్ర పొండి.” అంది మా ఆవిడ. నా ఆలోచనల నుండి బయటకు వచ్చా. లేచి వాడి గదివైపుకు వెళ్ళా. చాలా గట్టిగా కొట్టాను వాడ్ని. పాపం! ఎలా తట్టుకొన్నాడో ఏమో!! వాడు వాడి గదిలో అటుతిరిగి పడుకొని ఉన్నాడు. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. వాడ్ని పలకరించాలనే ఉంది. కానీ, నేనే వెళ్లి పలకరిస్తే నా పెద్దరికం వాడి ముందు చిన్నబుచ్చుకొంటుంది కదా! టీవీ ఆన్ చేసి హాల్లో కూర్చొన్నా. టివీ లో శాస్త్రి గారి ప్రవచనాలు వస్తున్నాయి.
రామాయణం లోని తండ్రి కొడుకులైన దశరధుడు, శ్రీరాముడి విశిష్టతను చాలా గొప్పగా వర్ణిస్తున్నారు శాస్త్రిగారు. చాలాసేపు టివి ముందు ఉండిపోయా. టైం పన్నెండు దాటింది. టి.వి ఆఫ్ చేసి మరో సారి వాడి గదికి వెళ్లి చూసా. ఏడ్చి, ఏడ్చి అలాగే నిద్ర పోయాడు వాడు. ఫ్యాన్ ఆన్ చేసి, దుప్పటి కప్పి నా గదిలోకి వచ్చి పడుకొన్నా. ఎప్పుడు నిద్ర పోయానో తెలీదు.
*********
నేను నిద్ర లేచేటప్పటికే వాడు రెడీ అయ్యి ఉన్నాడు. సంక్రాంతికి తెచ్చిన కొత్త బట్టలు వేసుకొని ఉన్నాడు. రోజూ కంటే చాలా అందంగా, హుందాగా ఉన్నాడు.
“కాఫీ తాగి, తొందరగా రెడీ అవ్వండి! వాడ్ని అర్జెంటుగా స్కూల్ లో దిగబెట్టాట!” చెప్పింది సౌమిత్రి.
ముఖం కడుక్కొని ,కాఫీ తాగి బయలుదేరి, బైక్ స్టార్ట్ చేసాను. వాడు వెనుక కూర్చొన్నాడు. అర్థ గంటలో వాడ్ని స్కూల్ దగ్గర దింపాను. వెళ్తున్నంత దూరం వాడు నాతో మాట్లాడలేదు. నేను కూడా వాడితో మాట్లాడలేక పోయాను. స్కూల్ పార్కింగ్ లో, రోజూ కనబడేకన్నా ఎక్కువ బైక్ లు, కొన్ని కార్లు ఆగి ఉన్నాయి. బహుసా స్టాఫ్ అందరూ అప్పుడే వచ్చేసారేమో. నందు బైక్ దిగి లోనికి వెళ్తున్నాడు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా! మా వాడి చదువు గురించి వాకబు చేద్దామని అనిపించింది.
“కరెస్పాండెంట్ గారు ఉన్నారా?” వాచ్ మాన్ ను అడిగా.
“సారు గారు ఇంకా రాలేదండీ” చెప్పాడు వాచ్ మాన్.
“మా అబ్బాయి వాళ్ళ క్లాస్ టీచర్?”
“ఇంకా స్టాఫ్ కూడా ఎవ్వరూ రాలేదండీ!”
“బయట చాలా బైక్స్ ఉన్నాయి కదా! కార్లు కూడా ఉన్నాయి?”
“అవన్నీ స్టూడెంట్స్ తెచ్చిన బైక్లు, కార్లు అండీ. మనం చదువుకొనే రోజుల్లో డిగ్రీకు వెళ్ళాక కూడా సైకిళ్ళు వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఎనిమిది, తొమ్మిది చదివే పిల్లలు కూడా బైక్లు వాడుతున్నారు. కాలం చాలా మారిపోయిందండీ “ చెప్పాడు వాచ్ మాన్.
ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయి, వెంటనే మేల్కొన్నా.
“నందూ! నందూ !! “ దూరంగా వెళ్తున్న నా కొడుకును పిలిచా.
వాడు వచ్చి నా ముందు మౌనంగా నిల్చున్నాడు. వాడి జేబులో ఐదువందల నోటు పెట్టి, వాడి చేతికి బైక్ కీస్ ఇచ్చా. వాడి కళ్ళలో వెలుగు కనబడింది. అది నా పట్ల ప్రేమను, కృతజ్ఞతను చాటుతున్నట్టు అనిపించింది. ఆటోలో బయలుదేరా.
*********
నిజమే! కాలం మారింది. ఇక మారాల్సింది నేనే. కేవలం వాచ్ మాన్ చెప్పినందుకే కాదు. రాత్రి టి.వి లో శాస్త్రి గారు ప్రవచనాలు చెప్తూ, పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలో చెప్పారు. ఈ తరం పిల్లలతో, తల్లిదండ్రులు కఠినంగా ఉండకూడదని, కఠినంగా ఉంటే వారు తల్లిదండ్రులను శత్రువులు లాగా చూస్తారని చెప్పారు. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలతో, తల్లిదండ్రులు స్నేహంగా ఉండాలని చెప్పారు.
**********
ఇంటికి వచ్చానన్న మాటేగానీ, నా మనసు మనసులో లేదు. వాడికి బైక్ ఇచ్చి వచ్చాను. వాడు ఎలా నడుపుతాడో ఏమో. ఆలోచిస్తూనే ఉన్నా.
“మీరేమీ కంగారు పడకండీ! వాడు బైక్ బాగానే డ్రైవ్ చేస్తాడు. పోయిన ఆదివారం మీరు ఇంట్లో లేరు కదా! ఆరోజు వాడే నన్ను బైక్ లో కూర్చోబెట్టుకొని ప్రక్క వీధిలోని పెద్ద మార్కెట్ కు తీసుకొని వెళ్ళాడు.” చెప్పింది సౌమిత్రి. అయినా నా మనసు కుదుటపడలేదు.. వాడు క్షేమంగా ఇంటికి వచ్చేలా చెయ్యమని దేవుడ్ని చాలా సార్లే అడిగాను. సాయంత్రం వరకూ చాలా కష్టంగా గడిపాను
“పొద్దు పోతోంది, వాడు ఇంకా రాలేదే?” అడిగాను సౌమిత్రి ని. “ఫంక్షన్ కదండీ! లేటవుతుంది కదా! మీరు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొని రండి. కాఫీ కాచిస్తాను.” చెప్పింది.
నేను వీధి మొదటన ఉండే కొట్టు దగ్గరకు వెళ్లి పాల ప్యాకెట్, కిరాణా సరుకులు కొన్నాను. ఇంటికి రావడానికి రోడ్ దాటుతుండగా, ఒక బైక్ సరాసరి నా మీదకే వస్తున్నట్టు అనిపించింది. చట్టుక్కున ఆగి ప్రక్కకు చూసాను. మా నందు గాడే. నా కోసం బైక్ ఆపాడు.
“కూర్చోండి! నాన్నగారు !! చెప్పాడు వాడు.
“ఫంక్షన్ బాగా జరిగిందా?” అడిగాను.
“జరిగింది నాన్న గారు!”
“నువ్వు సంతోషంగా గడిపావు కదా!”
“చాలా సంతోషంగా గడిపాను నాన్న.” వాడి కళ్ళలో సంతోషం కనబడుతోంది.
బైక్ పై వెనుక సీట్ లో కూర్చొన్నా. వాడు చాలా చక్కగా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. మొట్టమొదటిసాటి కొడుకు బైక్ నడుపుతొంటే, వెనుక సీట్ లో కూర్చొన్న తండ్రి మనసు పొందే గర్వం ఎంత గొప్పగా ఉంటుందో, ఆ క్షణాన్ని అనుభవించిన తండ్రికే తెలుస్తుంది. నాక్కూడా చాలా గొప్పగా, గర్వంగా అనిపించింది.
నా కొడుకు ఎదుగుతున్నాడు. ఇకపై వాడికి నేను శత్రువు లాగా కాకుండా, మంచి మిత్రుడిలాగా ఉండాలి. వాడు తప్పు చేస్తే వాడ్ని సున్నితంగా మందలించాలి. ఒప్పు చేస్తే గొప్పగా ప్రోత్సహించాలి.” ఆలోచిస్తూనే ఇంటికి చేరుకొన్నా.
“ఏమేవ్! వాడికి డిస్టి తియ్యి. ఎంత మంది కళ్ళు పడ్డాయో ఈ రోజు వాడిపైన.” చెప్పాను సౌమిత్రితో.