.....””నను చూసి నవ్వేవేమిరా? నా నగరాజ ...నాపై నీ అలుకేలరా?””.....
అంటూ జావళి పాటలోని ఆఖరి చరణం మృదుమధురంగా ఆలపించి వేదిక మీద నుండి నిష్క్రమించింది బంగారం. మైమరచి ఆమె పాట వింటున్న ప్రేక్షకుల కరతాళధ్వనులతో సీతాపురం జూనియర్ కాలేజీ ఆడిటోరియం మారుమ్రోగింది.
కాలేజీ వారు నిర్వహిస్తున్న సంగీత విభావరి పోటీలో ప్రధమస్థాయి బహుమతి అందుకుంది బంగారం. సంతోషంగా ఇంటిదారి పట్టింది. ఆ ఊరి అమ్మవారి గుడి ఆవరణలోనే వాళ్ళ ఇల్లు. అక్కడి అర్చకులు మాధవ శర్మ, ఆయన భార్య లలితమ్మల గారాల బిడ్డ బంగారం. నిజానికి, ఆ అమ్మాయి వారికి గుడి మెట్ల మీద దొరికిన పసిబిడ్డ. ఆ అనాధ బిడ్డకి ‘బంగారం’ అని పేరు పెట్టుకుని ప్రేమగా పెంచుకున్నారు. ఆ అమ్మాయి అద్భుతంగా పాడగలగడం వారికి ఎంతో ఆనందం.
అమ్మ నేర్పిన జావళి పాటకి తాను గెలుచుకున్న బహుమతిని ఆమె చేతిలో పెట్టాలని వడివడిగా వీధి మలుపు తిరిగింది బంగారం. వెన్నంటే అనుసరిస్తున్న రాంబాబుని ఆమె గమనించనూ లేదు. ఆ చిన్ననాటి స్నేహితుడి పిలుపులు వినిపించుకోనూ లేదు...
ఎంతకీ వెనుతిరగడం లేదని చేతిలోని గులాబీని గురిపెట్టి బంగారం పైకి విసిరాడు రాంబాబు. నడుముపై పడ్డ పూవు తాకిడికి గబక్కున వెనుతిరిగి చూసింది ఆమె. ఆగమని సైగ చేసాడు రాంబాబు.. దగ్గరగా వచ్చేంతమటుకు ఆగింది బంగారం.
“ఏమిటా మోటు చేష్టలు. పువ్వే ఐనా వెనుకనుండి తగిలితే భయపడరా? అడిగింది అతన్ని కరుకుగా...
“పువ్వే కదా బంగారం! కోప్పడకు” అన్నాడు రాంబాబు.
“పోరా, నీ నంగి చేష్టలు నువ్వూను. ఇంతకీ ఏమిటి సంగతి? పువ్వు విసిరి మరీ ఆపావు” అడిగింది సూటిగా...
“పద. గుడి ముందు పార్క్ లో కూచుందాము. ముఖ్యమైన విషయం చెప్పాలి” అంటూ బంగారం చేయి పట్టి మరీ పార్క్ వైపు నడిపించాడు...
పార్క్ బయట వేరుసెనగలు కొనుక్కుని...లోనకెళ్ళి ఓ బెంచీపై కూర్చున్నారు. పదినిముషాల పాటు బంగారం పట్ల తన ప్రేమ గురించి వెయ్యిన్నొక్కటోసారి వివరించి, తనని ప్రేమించమని కోరాడురాంబాబు..
ఓపిగ్గానే విన్నది బంగారం. “చూడరా రాంబాబు, మునుపే చెప్పానుగా...నాకు ప్రేమ, పెళ్లి మీద ధ్యాస లేదని... గానం, నాట్యం, అలంకారాల మీదే నా దృష్టి. ఇవన్నీ పక్కన పెట్టినా, అసలు నువ్వంటే నాకు అటువంటి ప్రేమ లేదురా! కలగదు కూడా. నీవు నా చిన్ననాటి స్నేహితుడివి మాత్రమే” అంది బంగారం..
“నా మీద దయ చూపవే.. నీవు నాకు దక్కకపోతే చస్తాను...అయినా నీకు అన్నివిధాల తగిన వాణ్ని, నీ ప్రేమ కోసం పిచ్చివాడినయ్యానంటే ఖాతఃరు చెయ్యవే? బతిమాలినా ప్రేమించవే? అసలు ప్రేమించడం నీకు తెలీదులా ఉంది” అంటూ జుట్టు పీకున్నాడు.
వింతగా చూసింది బంగారం... “నీవిలా ప్రేమించమని నిర్బందిస్తే మాత్రం ఊర్కోను. నీతో స్నేహం కూడా కుదరదు” అని గబగబా చెప్పి అక్కడినుండి పైకి లేచింది..
బంగారం చేయిపట్టి, గట్టిగా లాగి బెంచీ మీద కుదేసాడు రాంబాబు. ఆమె ముఖాన్ని రెండు చేతుల్లో బంధించి, పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టాడు. త్రుటిలో తేరుకుని ముఖంపైనున్న అతని చేతిని గట్టిగా కొరికింది బంగారం.
దాంతో రెచ్చిపోయాడు రాంబాబు. కోపంగా ఆమె చెంప చెళ్ళుమనిపించాడు. “నేను ఇన్నాళ్ళూ ఓపిక పట్టాను. నీవింకా నన్ను ఓ వెధవ కింద జమకట్టి ఇలా బెట్టు చేస్తే, నిన్ను చంపి నేను చస్తా” అని అరుస్తూ పైకి లేచి సిగరెట్ కోసం జేబులు తడుముకోసాగాడు. ఇదే అదుననుకుని ఒక్క ఉదుటున లేచి అల్లంత దూరంగా ఉన్న గుడి దిశగా పరుగందుకుంది బంగారం.....
**
సీతాపురం లోని అమ్మవారి గుడి వ్యవస్తాపుకులైన రఘురాం, దమయంతీ గార్ల అధునాతన భవంతి ‘శాంతి నివాస్’. హైదరాబాదు జూబిలీ హిల్స్ లోని ఆ భవంతి వరండాలో, తివాసీపై ఒదిగి కూర్చున్నారు బంగారం, ఆమె తల్లితండ్రులు.
తమని ఆదుకోమని నేరుగా యాజమాన్యం పంచన చేరక తప్పలేదు మరి. జేవురించిన వారి ముఖాల్లో బాధ, కంగారు ప్రస్పుటంగా కనబడుతున్నాయి. జరిగిన దుర్ఘటనతో ఆ ముగ్గురి మనస్థితి అల్లకల్లోలంగా ఉంది. బంగారం తలకి కట్టు వేసుంది. కట్టు రక్తసిక్తమైంది. ఆమె కళ్ళవెంట ఆగని కన్నీరు.
పడవంత ఆ వరండాలోఆ ముగ్గురి ఎదురుగా సోఫాలో కూర్చునున్నారు దమయంతీ గారు. సీతాపురంలోని గుడికి వచ్చినప్పుడల్లా, తన చేత పాటలు పాడించుకుని అభిమానంగా కానుకలు అందించే దమయంతీ గారి ఎదుట తలదించుకోవలసి రావడం అవమానంగా ఉంది బంగారంకి..
గుడి ఆవరణలోని తమ ఇంట జరిగిన సంఘటనకి మనసు చెదిరి మిన్నకుండిపోయాడు ఆమె తండ్రి మాధవ శర్మ..అవమాన భారంతో అతనూ తల దించుకుని కూర్చున్నాడు.
అది గ్రహించిన అతని భార్య లలితమ్మ చొరవ తీసుకుని, తాము ఆ స్థితిలో హైదరాబాదు వచ్చిన కారణం దమయంతీ గారికి వివరించింది. చేతులు జోడించి ఆమెని సహాయం కోరింది.
లలితమ్మ నోట విషయం విన్నాక దమయంతీ గారు కూడా ఆలోచనలో పడ్డారు. ఏమిచేయాలో తోచక తమకి తెలిసిన పోలీస్ ఇన్స్పెక్టరుకి ఫోన్ చేస్తానన్నప్పుడు, ఆమెని వినయంగా వారించాడు మాధవ శర్మ.
చేతిలో ఫోన్ పక్కకి పెట్టి కోపంగా మాధవ శర్మ వైపు చూసారామె. “ఏమిటిది శర్మా? ముందు పైకి లేచి కుర్చీల్లో కూర్చోండి. ఇంతటి ఘోరమైన స్థితిలో, ధైర్యంగా ఊరు వదిలి హైదరాబాదైతే చేరారు. మంచిదే. అదే ధైర్యంతో గట్టి నిర్ణయాలు తీసుకోండి. ఆ రౌడీ వెధవ రాంబాబు పైన పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి ఒప్పుకోండి. ఆడపిల్ల వెంటపడి ప్రేమించమని నిర్బంధించిన వాడికి తగిన శిక్ష పడాలి. అంతేకాక రాత్రివేళ ఇంట్లో జొరబడి, తాళి కట్టించుకోమని పదారేళ్ళ పిల్లని బలవంత పెట్టిన ఆ పాపిని వదిలేయమంటారే? అసలేమిటిది మాధవా! ఏమిటీ ఘోరం?” అంటూ కోపంతో ఊగిపోతున్నారామె...
జవాబివ్వడానికి తడబడుతున్న భర్తని ఆగమని సైగ చేసింది లలితమ్మ. దమయంతీ గారిని ఉద్దేశించి, “క్షమించండమ్మా.. ఆయనలా వారించడానికి కూడా కారణం ఉంది. నిజానికి రాంబాబు కుటుంబం మాకు సన్నిహితులు. రాంబాబు కూడా మా కళ్ళెదుట పుట్టి పెరిగినవాడేనమ్మా. బంగారం పట్ల వాడలా దౌర్జన్యం చేయడాన్ని వాడి కుటుంబమే తీవ్రంగా ఖండిస్తుంది. సంఘటన జరిగిన రోజు వాడి వాలకం కనిపెట్టి, వాడిని అనుసరిస్తూ ఆ రాత్రి వేళ మా ఇంటికి వచ్చారు వాడి తల్లితండ్రులు. సమయానికి అడ్డుపడి వాడి బారి నుండి బంగారాన్ని కాపాడారు. గాయపడ్డ బంగారాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి కట్టు వేయించాక టాక్సీలో మమ్మల్ని హైదరాబాదుకి పంపింది కూడా వాళ్ళేనమ్మా. మా బిడ్డని మీ రక్షణలో ఉంచి తిరిగిరమ్మని కన్నీళ్ళతో వేడుకున్నారు. తమ ఒక్కగానొక్క కొడుకుని దారికి తెచ్చుకోడానికి కూడా ఇదొక మార్గమని ప్రాధేయపడ్డారమ్మా” అని మొరపెట్టుకుంది లలితమ్మ...
విషయం విఫులంగా అర్ధమయి, మనసు చలించిన దమయంతీ గారి వైఖరి మెత్తబడింది.
“అర్ధమయింది లలితా. ఒప్పుకుంటాను..అమ్మాయిని మా వద్దే విడిచి వెళ్ళండి. బంగారం లాంటి ఆడపిల్ల ఇంట నడయాడుతుంటే నాకు ఇంకేం కావాలి? ఇకనుండీ హైదరాబాదులోనే చదువుకుంటుంది” సంతోషాన్ని వెలిబుచ్చారామె.
అందరి ముఖాల్లో ఒకింత శాంతి కనబడుతుంది...
“పోతే, రాత్రంతా ఆసుపత్రిలో గడిపి, అరపూట ప్రయాణం చేసినందువల్ల మైలపడి ఉన్నాము. అందుకే తివాచీపై కూర్చున్నాము. మీరు సమ్మతిస్తే, బంగారం మీ ప్రాపకంలో ఉంటుందన్న నిశ్చింతతో తిరుగుప్రయాణం అవుతాము. మాకు సెలవిప్పించండమ్మా” అంది లలితమ్మ..
“అలాగే లలితా. మధ్యాహ్నం రెండవుతుంది కదా. వెనుక వీధిలో మన అతిధిగృహం ఉంది..అక్కడికి వెళ్లి స్నానాలు, భోజనం కానిచ్చి నాకు కనబడి వెళ్ళండి. ...” అంటూ సోఫా నుండి లేచి లోనికి వెళుతూ వెనుతిరిగింది ఆవిడ... “ఈ గొడవలో చెప్పడం మరిచాను. మా సాగర్ బాబు రేపు అమెరికా నుండి దిగుతున్నాడు. తాను పెళ్లాడబోయే అమ్మాయితో సహా. రఘురాం గారు కూడా ఇవాళ రాత్రికి బొంబాయి నుండి వచ్చేస్తారు. రేపు సాయంత్రం ఇంట్లో పార్టీ పెట్టుకున్నాము. ఆ వేడుక కూడా చూసుకుని ఎల్లుండి పొద్దుటే వెళ్ళండి. గుళ్ళో ఆరాధనకి కొత్తగా పౌరహిత్యం చేస్తున్న కృష్ణ శాస్త్రి ఉన్నాడుగా” అన్నారామె.
“అంతకన్నానా? సాగర్ బాబుని చూసి కూడా ఏడేళ్ళవుతుంది. అప్పుడే పెళ్ళికొడుకయాడన్నమాట ....శుభం....” అన్నాడు మాధవ శర్మ.
“అప్పుడేనా అంటావే మాధవా? వాడికి ముప్పైరెండేళ్ళు నిండాయి. వాడికి నచ్చిన అమ్మాయిని మేము మెచ్చుతాము అని ఒప్పుకున్నాక, ఆ అమ్మాయిని తీసుకుని వస్తున్నాడు. ఒక్కగానొక్కడు... పెళ్ళి కూడా వాడిష్ట ప్రకారమే జరిపించేస్తే సరి అనుకున్నాము” అన్నారామె.
**
సాగర్ కాబోయే భార్య అమరికన్ అమ్మాయి. పేరు సోఫియా. ఆమెకి తోడుగా ఉండి సహాయం చేయమంటూ సోఫియాకి తెప్పించిన చీరల్లో నుండి ఒకటి బంగారానికి బహుమానంగా కూడా కట్టబెట్టారు దమయంతీ గారు...
అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో సాగర్ ని, అతని కాబోయే భార్యని తమ మిత్రులకి పరిచయం చేసారు రఘురాం దంపతులు. అందరితో కలివిడిగా మెలుగుతున్న అమెరికా అమ్మాయి అందరికీ నచ్చింది కూడా.
అతిధులంతా వెళ్ళిపోయాక, బంగారాన్ని సాగర్ కి ప్రత్యేకంగా పరిచయం చేసారు దమయంతీ గారు.
“ఇక నుండీ బంగారం మన ఇంట్లోనే ఉంటుంది. మీరున్న ఈ నెలరోజులూ సోఫియాకి అన్నిటా సాయంగా కూడా” అన్నారు నవ్వుతూ ఆమె..
ఆశ్చర్యంగా చూసాడు సాగర్ బంగారాన్ని. “అవునా! చింపిరి జుత్తుతో సీతాపురం గుడి ఆవరణలో పరుగులు పెడుతుండేది కదూ! ఆ బంగారమా ఈ అమ్మాయి?” అంటూ కరచాలనం కోసం చేయందుకున్నాడు. ఆ క్షణాన బంగారం కళ్ళకి అతను ఆకాశంలో జాబిల్లిలా, తన చేయందుకున్న అందాల రాకుమారుడిలా కనిపించాడు.. మనసంతా అతని పట్ల తెలియని ఆకర్షణ, ఆరాధనతో నిండిపోయింది. తన ఉనికే మరిచి అలా చూస్తుండిపోయింది.
కొద్ది క్షణాలకి బంగారం చేయి విడిచి, “ఇక నేను మీ నాన్నగారి వద్ద ఆశీర్వాదం తీసుకోనా?” అని నవ్వుతూ ఆమె భుజం మీద తట్టాడు సాగర్.
**
సాగర్ బాబు, సోఫియాలతో పగలంతా ఊరు చుట్టడం, సాయంత్రం ఇంటిపని, వంటపనిలో సాయం చేయడం, భోజనాల వద్ద అందరికీ వడ్డించి మెప్పు పొందడం ఎంతో గొప్పగా అనిపించింది బంగారంకి. పదారేళ్ళ ఆ పడుచుకి మేఘాల మీద పయనిస్తున్నట్టు ఉంది.
సాగర్ బాబు వెంట కొన్నిసార్లు కాన్సర్ ఆసుపత్రులకి, వృద్దశ్రమాలకి, స్త్రీ సంక్షేమ సంస్థలకి వెళ్ళడం మరో కొత్త అనుభవమే అయింది ఆమెకి. కాన్సర్ ఆసుపత్రికి లక్షల్లో విరాళం ఇచ్చిన అతని ఔన్నత్యానికి ఆమె మనసు జేజేలు పలికింది. వైద్య నిపుణుడిగా అమెరికా కాన్సర్ పరిశోధన సంస్థకి పనిచేసే అతని మీద గౌరవం పెంచుకుంది..
**
ఓ రోజు సాయంత్రం వడ్డన చేస్తున్న బంగారంని ఉద్దేశించి, “మాతో ఆసక్తిగా హాస్పిటల్స్ తిరగుతున్నావు. అమెరికా వచ్చి మా వైద్య సంస్థకి పని చేస్తావా బంగారం? పని చేస్తూ చదువుకోవచ్చు కూడా” అని సాగర్ అడిగినప్పుడు నమ్మలేకపోయింది. తనకంతటి అర్హతని ఆపాదించిన అతని పట్ల ఎనలేని కృతజ్ఞతాభావం కలిగింది ఆమెకి. నవ్వి మౌనంగా ఉండిపోయింది.
“నిజం బంగారం. బిజినెస్ చదువుకున్న సోఫియా కూడా మరి మా వైద్యసంస్థకి ముఖ్య నిర్వాహకురాలుగా పనిచేస్తుంది. ఏదో ఒక స్థాయిలో మా వద్ద పని చేయవచ్చు” అన్నాడు సాగర్.
“ఇక దాన్ని కూడా దూరదేశాలు తీసుకెళతావా సాగర్? వాళ్ళమ్మావాళ్ళని, మమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళదు బంగారం” అని తీర్మానించి చెప్పారు దమయంతీ గారు.
“మీ బంగారం నోటినుండి రత్నాలు రాలతాయా? అసలు మాట్లడదే?” నవ్వాడు సాగర్. జరుగుతున్న సంభాషణకి అర్ధం అడిగి తెలుసుకున్న సోఫియా, “అవును, బాగానే ఉంటుందిగా! బంగారంతో తన భాషలో మాట్లాడి, తనకిష్టమైన వంటలు కూడా అడిగి చేయించుకుంటాడు సాగర్. నాకు మంచి స్నేహితురాలుగా కూడా ఉంటుంది” అంది నవ్వుతూ ఇంగ్లీషులో.
“ఆ ముచ్చట తీరేది కాదు కాని, పదిరోజుల్లో జరగనున్న మీ పెళ్లిముచ్చట గుర్తుంది కదా! రేపటి నుండి అందరూ పెళ్లిపనుల్లో మునగాలి... బంగారం వాళ్ళ అమ్మానాన్నా కూడా ఓ రోజు ముందే ఊరి నుండి వస్తారు. పెళ్ళైన మూడోరోజు అందరం సీతాపురంలోని మన కోవెలకి వెళతాము.. ఆ పైవారమే మీ ప్రయాణం... చూస్తూ చూస్తూ సమయం ఎలా గడిచిపోయిందో” అన్నారు దమయంతి గారు.
**
సాగర్, సోఫియాల పెళ్లి ఏర్పాట్లన్నిటా పాల్గొంది బంగారం. పెళ్ళికొడుకు సాగర్ కి కూడా దగ్గరుండి సలహా సహాయాలు అందించింది. నిగర్వి సాగర్ అంటే బంగారానికి మక్కువ ఏర్పడింది. కల్మషం లేని అతని నైజం ఆమె మనసును ఆకట్టుకుంది... రేయింబవలూ మది నిండా అతని గురించిన ఆలోచనలోనే ఉండిపోయింది బంగారం.
సాగర్ పెళ్ళికూతురి మెడలో తాళి కడుతున్న సమయంలో, తెలియని కలవరంతో ఆమె కళ్ళు తడయ్యాయి. సోఫియా అదృష్టానికి ఒకింత ఈర్ష్య పడింది ఆమె స్త్రీ హృదయం. తన భావనలు, ఉద్వేగాలు తప్పన్న తత్తరపాటుకి గురయింది కూడా.
నూతన వదూవరులని ఆహ్వానిస్తూ ఏర్పాటు చేయబడిన వేడుకలో బంగారం చేత పాటలు పాడించారు దమయంతీ దేవి. ఆమె గానానికి మంత్రముగ్డులయ్యారు అతిధులు. బంగారాన్ని మెప్పులలో ముంచెత్తారు.
**
పెళ్లి వేడుకలు, వ్రతాలు, సీతాపురం గుడికి వెళ్ళిరావడాలతో పదిరోజుల పాటు సమయం సరదాగా గడిచింది.. అమెరికా ప్రయాణానికి సూట్కేసులు సర్దుకుంటున్న సోఫియా, సాగర్ లకి కాఫీ కప్పులందించి వెనుతిరిగింది బంగారం. కాసేపు కూర్చుని వెళ్ళమన్నాడు సాగర్.. సంకోచిస్తూ వెళ్లి వారికెదురుగా కుర్చీలో కూర్చుంది..
“చూడు బంగారం, నీకు కొన్ని విషయాలు చెబుతాను. అదీ నీ గురించే. ఈ నెల్లాళ్ళగా నిన్ను గమనించాక... ఓర్పు, సహనం, వివరం ఉన్న మంచి అమ్మాయివని సోఫియా కూడా అభిప్రాయ పడుతుంది. వైద్యరంగంలో అయితే, ఇతురులకి సహాయపడుతూ రాణించగలవు. మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వు.. లేదంటే నులుగురికీ ఉపయోగపడే చదువు మరేదైనా పర్వాలేదు. నీకు నేనున్నాను. అన్నీ అమరుస్తాను. పైగా నేనిక్కడ ఆసుపత్రిలో కాన్సర్ విభాగానికి పనిజేయబోతున్నాను. వైద్యావిధానాల్లో నూతన పథకాలని అమలు చేసే నిమిత్తం, ప్రతి యేడు వస్తూనే ఉంటాను.. నువ్వు నాకు సాయంగా కూడా ఉండి అన్నీ నేర్చుకోవచ్చు” క్షణమాగాడు సాగర్..
తలొంచుకుని మౌనంగా ఉండిపోయిన ఆమెని చూసి సోఫియా కలగజేసుకుంది. “నీ ముందు మాట్లాడడానికి భయపడుతుంది సాగర్. చెప్పావుగా! తన నిర్ణయాలు చేసుకోనివ్వు” అంది.
తలెత్తి ఇద్దరి వంకా చూసింది బంగారం...
“పైగా... అందం, ఆకర్షణ ఉన్న అమ్మాయి. మంచి సింగర్ కూడా. టైం వచ్చినప్పుడు మంచి అబ్బాయి కిచ్చి పెళ్లి కూడా చేస్తారుగా మీ అమ్మావాళ్ళు” అంది సోఫియా నవ్వుతూ...
“అవునవును. నీ పాట మాత్రం బ్రహ్మాండం. ఎప్పటికీ కొనసాగించు. నేనెప్పుడు అడిగినా పాడాలి మరి” అన్నాడు సాగర్.
పదారేళ్ళ బంగారం మనస్సులో సాగర్ బాబు ఓ దేవుడై నిలిచాడు...ఓ గురువుగా, మార్గదర్శకుడుగా అనిపించాడు..ఓ ప్రియమైన స్నేహితుడులా అనిపించాడు. తన పాటని కూడా మెచ్చుకోవడం అమితానందంగా అనిపించింది. అతడంటే ఆమెకున్న ఆకర్షణ, ఇష్టం, ఆరాధన, గౌరవం అర్ధంచేసుకోడానికి అవస్థ పడసాగింది బంగారం.
ఏమైనా, సాగర్ బాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానీయరాదని అనుకుంది. అతను ఆశించినట్టుగా నడుచుకోవాలని నిశ్చయించుకుంది. సాగర్ తన వెంటే ఉండి తనని నడిపిస్తున్నట్టు భావించసాగింది బంగారం...
**
రఘురాంని బాబాయి గారు అని, దమయంతీని పిన్ని గారు అని పిలుస్తూ.. అన్నిటా సాయంగా మెలగసాగింది బంగారం. వారు కూడా ఆమెని తమ సొంతబిడ్డగానే భావించసాగారు.
సాగర్ ఆశించినట్టు మెడిసిన్ చదవాలనే ఆశగా ఉన్నా, దమయంతి గారి ప్రోత్సాహంతో కిమ్మనకుండా ‘హోంసైన్స్’ కాలేజీలో చేరింది. ఏడాది పాటు చదువు సాగించింది కూడా..
సంవత్సరం తరువాత సాగర్, సోఫియాలు హైదరాబదుకి వచ్చినప్పుడు మాత్రం...ధైర్యాన్ని కూడకట్టుకుని ...తాను ‘వైద్య కళాశాల’ లో చేరి డాక్టర్ అవుతానని కుటుంబానికి విన్నవించుకుంది బంగారం....
“మంచి నిర్ణయం బంగారం. నీ విషయంలో ఇదే నా ఆశయం” అని కరచాలనం చేసి అభినందించాడు సాగర్.
రఘురాం గారి ఆశీర్వాదంతో మెడిసిన్ లో చేరే సన్నాహాలు మొదలు పెట్టింది బంగారం. సాగర్ కి తన పట్ల ఉన్న శ్రద్ధ, స్నేహభావం, నమ్మకాలని తన జీవితానికి ఆసరాలుగా మలుచుకోసాగింది బంగారం.
సాగర్ ఇండియాలో ఉన్న మూడునెలలు అతనితో కాన్సర్ వార్డులు తిరుగుతూ... ఆ వ్యాధి, వైద్యం గురించి కొంత అర్ధం చేసుకుంది. కాన్సర్ రోగుల శ్రేయస్సు పట్ల సాగర్ కనబరిచే అంకితభావం ఎంతగానో నచ్చింది ఆమెకి.
దుస్తులు, అలంకారాల కొనుగోళ్ళకి సాయం చేస్తూ సోఫియాకి కూడా చాలా దగ్గరయింది బంగారం. వారు ముగ్గురూ మంచి స్నేహితుల్లా కూడా మెలగసాగారు. సాగర్, సోఫియాలు ఇండియాలో ఉన్నన్నాళ్ళు... బంగారం చేత పాటలు పాడించుకోని సాయంత్రమే లేదు.
మాధవ శర్మ, లలితమ్మ దంపతులు తమ కూతురి ఎదుగుదలకి మురిసిపోయారు. హైదరాబాదు వచ్చినప్పుడల్లా దమయంతీ గారితో బంగారం వివాహం గురించిన ప్రస్తావన తప్పక తెస్తారు. మెడిసిన్ పూర్తయ్యే సమయానికైనా తప్పక బంగారం వివాహం జరిపించాలని నిశ్చయించారు ఆ పెద్దవాళ్ళు.
**
ఇంటిల్లిపాదికీ తలలో నాలుకలా మెలుగుతూ.. నాలుగేళ్ళల్లో పరిణతి చెందిన ఇరవైయేళ్ళ యువతిగా ఎదిగింది బంగారం. శ్రద్దగా మెడిసిన్ చదువుతున్న ఆమెకి పెద్దవాళ్ళంతా వరాన్వేషణ మొదలుపెట్టారు.
ముగింపు వచ్చేసంచికలో...