ఊబర్ టేక్సి లోంచి దిగింది శాలిని ..
ఇంటి మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసి అర్ధంగాక ..మొక్కలకు నీళ్ళుపోస్తున్న పనమ్మాయి లక్ష్మిని పిలవబోయింది. అప్పటికే ఉరుకులు పరుగులమీద వచ్చి గేటు తీస్తూ..చేతిలో వున్న బేగ్ అందుకుంటూ ..
“అమ్మాయి గారండి..మీరు వస్తారని డాక్ట్రమ్మ గారు సెప్పారండి..రండి..” మెయిన్ డోర్ కీస్ అందిస్తూ చెప్పింది.
“అమ్మ ఎక్కడ?”
“ఇస్కూల్ కి వెళ్ళారండి.”
“స్కూలుకా?అమ్మ స్కూల్కిఎందుకు వెళ్ళారు?”
“అదండీ..మన వంట మనిషి యాదవ్వ నాలుగో కూతురు సరస్వతి ...”
“సరస్వతి కేమయ్యింది?”
“అదేదో పరీక్ష లో పాసయ్యిందంట..ఇస్కూల్లో సన్మానం చేస్తున్నారంట..”
“ఓ..అదాసంగతి?”
“ఔనండమ్మా..మిమ్మల్ని స్నానం చేసుకొని ఇస్కూల్ కు రమ్మని చెప్పారు.కారు పంపిస్తానన్నారు . ఒకవేళ రాక పోతే టివి లో చూడమన్నారు ..”
“సరే !నేను స్నానం చేసి వస్తాను..నువ్వు హాల్లో వుండు.”
“శాలినమ్మా..మీతో..నేనూ చూస్తానమ్మా ..తోటపని అయిపోయిందమ్మా..అమ్మ గారిని కూడా అడిగానమ్మ ..”
“సరే ..తయారుగా వుండు..”
అమ్మతో ఆనందాన్ని పంచుకునే మధుర క్షణాలను వూహించుకుం టు..స్నానాల గదిలోకి అడుగు పెట్టింది శాలిని..డాటర్ ఆఫ్ డాక్టర్ కమలాదేవి .
****
శాలిని టివి ఆన్ చేసింది.
గవర్నమెంట్ హైస్కూలు..చాలా కోలాహలం గావుంది.
రంగు రంగు పూల దండలతో అందంగా అలంకరించారు.ఆ పూల దండల మధ్య కుమారి.సరస్వతికి స్వాగతం.. జిల్లాకలక్టర్ గారికి స్వాగతం ..శ్రీమతి.డాక్టర్.కమలాదేవిగారికి స్వాగతం స్వర్ణకాంతులతో మెరుస్తున్నఅక్షరాలను చూస్తూనే..సరస్వతీ..నువ్వా అనుకుంటు.. సంతోషానికి లోనయ్యింది.
సివిల్స్ లో జిల్లా టాప్ రేంకర్..సరస్వతికి జిల్లా కలెక్టర్ చేతులమీదుగా జరుగున్న సన్మాన కార్యక్రమం . స్కూల్ స్టేజి మీద వున్న బేనర్ మీద కెమేరా జూం చేసారు. స్టేజి మీద తన తల్లి తో బాటు ..జిల్లా కలెక్టర్..మరో ఇద్దరితో బాటు యాదవ్వ..సరస్వతి . చిన్నప్పుడు తనను ఎత్తుకొని పెంచిన యాదవ్వ..తనతో బాల్యాన్ని పంచుకున్న సరస్వతి. ఒక్క సారిగా చెప్పలేని ఆనందంతో..ఎమోషనల్ అయిపోయింది..శాలిని.
“అమ్మా!మన సరస్వతి..”
ఒక్కసారిగా అరిచేసింది లక్ష్మి ..పట్టరాని ఆనందం తో..
“ఔను..యిటు చూడు.డాక్టరమ్మ..యాదవ్వ.ప్రక్కన మన జిల్లా కలక్టరమ్మ.”
“అబ్బా!యెంత గొప్పో ...మన డాక్టరమ్మఅంటే మాటలా?”
“ముందు మాటలాపి టివి చూడు.” కలక్టర్ మైకు ముందు కొచ్చింది.
“అందరికీ వందనం..ఒక వాచ్ మన్ కూతురు..ఓపనిమంతురాలి కుమార్తె మన లక్ష్మి.. కాబోయే కలెక్టర్.కానీ లక్షి కన్నా గొప్పవ్యక్తి..యాదవ్వ.ఆమెను సన్మానించాలంటే ..మాటలు గాని ఈ పూలదండలు సరిపోవు.పురిటిలోనే ..కాదు కాదు ప్రాణం పోసుకున్నది ఆడ ప్రాణి అని తెలుసుకొన్న వెంటనే చంపేస్తున్న యీరాక్షస ప్రపంచంలో నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన యాదవ్వ ఓదేవత. చదువు రాదు..సంపాదన అంతంతమాత్రమే..అటువంటి యాదవ్వ నేటి సోకాల్డ్ ఎడ్యుకేటేడ్ బేబీ కిల్లర్స్ కు ఓచెప్పు దెబ్బ.అమ్మల మించిన అమ్మ..యాదవ్వ ..ఆమె పాదాలకు నా శతకోటి వందనాలు.
మైకు ముందునుండి కదిలి స్టేజి మీదున్న యాదవ్వ పాదాలకు నమస్కరించింది. అందరి ముఖాలలో అనిర్వచనీయమైన అనుభూతి.తత్తర పడిపోయిన యాదవ్వ లేచి కలెక్టరమ్మ పాదాలను చుట్టేసింది.కలెక్టర్ యాదవ్వను లేపి .అమ్మా !మీరు పెద్దవారు.నేను మీలక్ష్మి లాంటి దాన్ని.మీరు నాకు నమస్కరించ కూడదు.
అక్కున చేర్చుకొని ఆశీర్వదించాలి.” యాదవ్వను కౌగలించుకొని కుర్చీలో కూర్చో పెట్టింది. ఒక్కసారిగా సభా ప్రాంగణం కరతాళ ధ్వనులతో మార్మోగి పోయింది. కలెక్టర్ మైకు ముందుకొచ్చింది.
“యాదవ్వను యెంత పొగిడినా ..అభినందించినా సరిపోదు.ఆమె జీవితం మనకు ఆదర్శం.
అమ్మా!మీరు నలుగురు ఆడ పిల్లల్ని ఎలాకన్నారో..యెలా పెంచారో మీమాటల్లో చెప్పండి.
మీ మాటల్ని టివీ ల ముందున్న ఎందరో తల్లులు..ఆడ పిల్లల్ని చంపాలనుకుంటున్న మరెందరో.. కసాయి తల్లులు తండ్రులు చూస్తారు..వింటారు.కొంతమంది తల్లులు ఆనందంతో పులకరించి పోతుంటే కసాయిలు తమ పాపానికి పరితపించి పోతారు.మీ జీవితం కొందరికైనా కనువిప్పు కలిగించాలి.” యాదవ్వ కు మైకు అందించారు.భయపడుతూ లేచి అందరికి నమస్కారాలు చెప్పింది.
“మన కలెక్టరమ్మ ఏమి చెప్పిన్రో సమజ్ కాలా.నాకూతురు లచ్మి ఏమి చదివిందో..దానికి ఏమి వుద్దోగ మోచ్చిందో నాకు ఎరికలే.నేను డాక్తరమ్మ యింట్లో పనిచేస్తాను.లచ్మి తండ్రి డాక్తరమ్మ దవాకాన్లో వాచ్మన్.నాకు నలుగురు ఆడపిల్లలు.మూడు కాన్పులయనంక నాలుగో బిడ్డ ను సాకలేమని డాక్తరమ్మను కడుపు తీసేయమని కాల్లావెల్లా పడినాను.ఆ అమ్మ నాపాలిట దేవతమ్మ..ఆ అమ్మ దయే ఈలచ్మి.నన్ను ఒకే మాట అడిగిన్రు..ఆడపిల్ల పుడుతుందని వద్దనుకుంటున్నావా?అని.
కాదమ్మా !ఏ బిడ్డపుట్టినా సాకలేమని చెప్పినా.
అయితే నేను పెంచుకుంటానని చెప్పిన్రు.భరోసా యిచ్చిన్రు.ఆడపిల్ల పుట్టింది.ఆడపిల్ల అంటే లచ్మి దేవి. మాతతప్పినా .. అమ్మా !నాబిడ్డను యివ్వజాల..తలతాకట్టు పెట్టిఅయినా మేమే సాక్కుంటమని చెప్పిన. డాక్టరమ్మ ఏమన్నారో ఎరికేనా? “నామాట మన్నించినావు ..ఆడపిల్లకు జనమనిచ్చి లచ్చిందేవని మురిసినావు.నాకు యిద్దరమ్మాయిలు..వాళ్ళతో బాటే పెరుగుతుంది..నేను పెంచుతాను..లక్ష్మి నీ కూతురే..
నీతోనే వుంటుంది..కానితనకు అయ్యేఖర్చంతా నేనుభరిస్తాను.నేనేచదివిస్తాను.. నాకూ నీలా ముగ్గురు కూతుర్లు అవుతారు..”
ఆ దినం సంది..ఆ అమ్మే దీనికి అమ్మయ్యింది.మొన్న పేపర్ల ఖబర్ చూసి..నాకూ వాల్ల నాన్నకు చెప్పి..దవాఖానా కెల్లి..అందరిముందూ డాక్తరమ్మ కాల్లమీద పడిపోయింది.కలకటరమ్మ అస్తున్రు అని చెప్పి..ఈడకు లాక్కొచ్చి కూర్చో బెట్టిన్రు.నాకు సమజైనది గింతే.అన్దరికీ దండాలు.” కరతాళ ధ్యనులమధ్య డాక్టరమ్మ కు మైకు అందించారు.“అందరికి వందనాలు..యిప్పటి వరకు యాదమ్మ చెప్పింది విన్నారు.యాదమ్మ త్యాగం యెంత గొప్పదో అర్ధం చేసుకున్నారా?ముగ్గురు ఆడపిల్లలతో పొట్టగడవని ఓతల్లి నాలుగో ఆడబిడ్డ కోసం యెంత తపించిపోయిందో నాకు తెలుసు.ఆనాడు అమ్మా!నా బిడ్డను యివ్వజాల..మగబిడ్డ అయినట్లైన
మీకు యిచ్చి నామాట నిలుపుకుందును.ఆడబిడ్డ అంటే లచ్చిందేవి..అంది.ఆనాడే యాదవ్వ పాదాలు తాకాలనుకున్నాను.ఆకోరిక యిప్పుడు తీర్చుకుంటాను.” కమలాదేవి వస్తుంటే లేచి వచ్చిన యాదవ్వ
“ఎంత మాట అనిన్రు..మీరు దేవత అమ్మా..పూజలు చేయాలే..” అంటూ కాళ్ళకు అడ్డం పడిపోయింది.కన్నీళ్ళతో లేచి వచ్చిన లక్ష్మిసరస్వతి కాళ్ళమీద పడబోతుంటే.. ఆపి అక్కునచేర్చుకుంది.
“అందరికి ఒకమాటచెప్పాలి..డాక్టర్ గా..చెప్పినా..అమ్మగా చెప్పినా ఈమాటే చెపుతాను. ఈ మధ్య ఆడపిల్లల మీదే కాదు.. అఘాయిత్యాలు..ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డల మీద..కూడా జరుగుతున్నాయి.ఆడపిల్లలు తాము అబలలమని భావిస్తూ..పురుష ప్రపంచానికి భయపడుతున్నంత కాలం..ఈఘోరాలు సాగుతూనే వుంటాయి.సృష్టిలో పురుషుడి కన్నా..స్త్రీయే శక్తిమంతురాలు.. ధీరురాలు..నా ముప్పై సంవత్సరాల అనుభవంలో ఎందరో మహిళలు గర్భ నివృత్తి కోసం వచ్చేవారు. ఆడదైన అత్తగారే ఆపాపానికి తోడుగా వచ్చేవారు.ఎక్కడెక్కడో స్కేనింగ్ చేయించుకొని..ఆడ శిశువని తెలుసుకొని కల్లిబొల్లి కహానీలు అల్లుకొని ..ధనాన్ని ఎరగా చూపించి..నన్ను ఆ పాప పంకిలంలోకి దింపాలని ప్రయత్నించేవారు.నయానా భయానా చెప్పిచూసి ..చివరకు పోలిస్ రిపోర్ట్ యిస్తానని బెదిరించి.. ఎంతోమంది ఆడపిల్లలకు ప్రాణం పోసాను.సృష్టికి మూలం స్త్రీ..మనందరి అమ్మ..స్త్రీ ..చెల్లీ..అక్క..వదిన.. అత్తా ..అందరూ స్త్రీలే.నాతోబాటు...ఈవేదికమీద వున్నఅందరూ అత్యున్నత స్థాయిలో వున్న స్త్రీలే.
నేటి సమాజంలో..స్త్రీలకు రక్షణ కరువైంది.స్త్రీ మాన ..ప్రాణాలకు విలువ పోయింది.మగవాళ్ళు..మృగాలై సమాజ విలువల్ని హీన పరుస్తున్నారు. ఇక్కడ ఆసీనులైన అమ్మాయిలు ఇద్దరూ సమాజాన్ని
శాసించగల అధికారమున్న వ్యక్తులే.భ్రూణహత్యలను అరికట్టండి.డాక్టర్ల నందరిని కట్టడి చేయండి.
స్కానింగ సెంటర్లను బేన్ చేయించి క్లోజ్ చేయించండి.అదుపుతప్పిన వారికి జీవిత ఖైదు విధించేలా చట్టాలలో మార్పు తీసుకురండి. కడుపులో వున్న బిడ్డ జోలికి వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుట్టేలా
ఆర్డర్స్ పాస్ చేయించండి.వధూ వరులతో పెళ్లి మంత్రాల సాక్షి గా మాకు పుట్టబోయే బిడ్డ మగైనా..ఆడైనా రక్షించుకుంటామని.. చంపబోమని ప్రమాణం చేయించండి.మీరు నన్ను ప్రశ్నించవచ్చు..మీరు మీ ఇద్దరు కుమార్తెలను ఇటువంటి ఘోరాలకు దూరంగా ఉండేలా పెంచారా?అని.అవును ..పెంచాను..అని సగర్వంగా చెప్పగలను.
ఒక వేళ జనరేషన్ గ్యాపని..పిల్లల్ని కనకపోయినా బాధలేదు..కాని గర్భంలో పడిన శిశువును హత్య చేయాలన్న ఆలోచన నాకూతుర్లకు కలిగిన నాడు ..నా ఈగర్భంలో హంతకులను మోసి కన్నానాఅన్న ఆలోచన వచ్చిన మరుక్షణం బ్రతుకు చాలిస్తాను.చివరిగా నా తల్లి లక్ష్మి సరస్వతిని మాట్లాడమని కోరుకుంటున్నాను.” కాబోయే కలెక్టర్ లక్ష్మి సరస్వతి మైకు అందుకుంది.
“నాకు ఇద్దరు తల్లులు.జన్మనిచ్చిన తల్లి యాదవ్వ.ప్రాణం పోసిన తల్లి డాక్టరమ్మ.
ఈ మధ్య జరిగిన ఘోరాతిఘోరమైన చైల్డ్ అబ్యూజ్..మర్డర్స్ మానవత్వమున్న మనుషుల్ని కదిలించి కన్నీరు పెట్టించాయి.పోయిన సంవత్సరంలో ఒక్క కాశ్మీర్ లోనే 211 సంఘటనలు జరిగాయి.మొన్నీమధ్య జరిగిన అసిఫాభాను సంఘటన జాతి మొత్తాన్ని కదిలించి ..కన్నీరు పెట్టించింది. తాత వయసున్న వయో వృద్ధులు ..గురు స్థానంలో వున్న కామాంధులు సైతం ఈ ఘోరాలకు పాల్పడుతూ..వయసుకూ..గురు స్థానానికి కళంకం తెస్తున్నారు. నాకు తెలిసినంతవరకూ..అమ్మతరువాత అమ్మఅని పిలిపించుకో గలిగిన మానవతామూర్తులు..
ముగ్గురే ముగ్గురు.ప్రాణం పోసే డాక్టరమ్మ..
జ్ఞానం పోసే పంతులమ్మ..
న్యాయాన్న్ని బ్రతికించే లాయరమ్మ.
కాని అమ్మకోరిన కోరిక తీర్చి..కలక్టరమ్మఅనిపించుకుంటాను.
నేను చేయను....నాకు సంబంధించే యేవ్యక్తిని గాని భ్రూణ హత్యలకు పాల్పడనివ్వను.ఒకవేళ డాక్టరమ్మ చెప్పినట్లు నేను గనుక నామాటను నిలబెట్టుకో లేక పొతే మరణాన్ని కోరుకుంటానని.. ఇక్కడున్న అందరు అమ్మల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.”
****
లక్షీసరస్వతి మాటలు పూర్తి అవుతుండగానే ..జరిగిన అనుకోని ఆ సంఘటనతో సభ మొత్తం నిర్ఘాంత పోయింది. ఏదో ట్రాన్స్ లో వున్నట్లు స్టేజ్ మీదకు దూసుకొచ్చింది..శాలిని ..డాటర్ ఆఫ్ డాక్టర్ కమలాదేవి.
అందరికి నమస్కరించి..సభ అనుమతితో మైక్ ముందుకొచ్చింది..శాలిని.
“అందరికి వందనాలు.ముఖ్యంగా యాదవ్వ పాదాలకు.నన్ను డాక్టరమ్మ కంటే ..ఎత్తుకు పెంచింది..యాదవ్వ. నేను గర్భవతినన్న వార్త చెప్పి అమ్మలతో ఆనందం పంచుకోవాలని వచ్చాను.
మీ అందరి మాటలు విన్నాక నాలోని ఆనందం ఆవిరై పోయింది.” అందరి ముఖాలలో..ఆందోళన..
“మీరు యెవరూ ఆందోళన చెందకండి. యిప్పుడు నా గర్భంలో వున్నది..ఆడో ..మగో తెలియదు.అదే నాబాధ.”
“అంతేనా?స్కానింగ్ ..చేయించుకోవచ్చుగా ..” సభికుల్లో ఒకరి సలహా. “స్కానింగ్ చేయించుకుంటే ఆడో మగో తెలుస్తుంది..అంతేగాని నా సమస్యకు పరష్కారం దొరకదు.”
సభతోబాటు స్టేజ్ మీదున్న తల్లి కమలాదేవితో బాటు కలెక్టర్ కూడా నివ్వెర పోయారు.
“అక్కా!అసలు నీ సమస్య ఏమిటో మాకెవరికీ అర్ధం కాలేదు.నీతో బాటు కలిసి పెరిగాను.నా ఊహకు కూడా అందడం లేదు.ప్లీజ్ చెప్పక్కా.” కాబోయే కలెక్టర్ లక్ష్మి సరస్వతి ప్రాధేయ పడింది.
డాక్టర్ కమలాదేవి వచ్చి కూతుర్ని దగ్గరకు తీసుకొని
“నీ బాధ ఏమిటో చెప్పరా..మాపరిధిలో వుంటే పరిష్కరిస్తాం.”
“అమ్మా ! చెపుతాను తప్పకుండా చెపుతాను.డాక్టర్ వు కాబట్టి నా బాధ నువ్వే తీర్చ గలవు.”
“అమ్మగా కాదు ..ఓడాక్టర్ గా హామీ యిస్తున్నాను.నా శాయశక్తులా ప్రయత్నిస్తాను.”
“అమ్మా!తీరా చెప్పాక సారీ అనో ..సాధ్యం కాదనో ..తప్పించుకో కూడదు.”
“అమ్మ మీద నమ్మకం లేదా?”
“కొండంత వుంది ”
“అయితే చెప్పరా..”
“చెపుతాను ..సిల్లీ అని నవ్వొద్దు..”
“నవ్వనే నవ్వం..మమ్మల్ని నమ్ము.”
అందరూ కోరస్ గా చెప్పారు.
“నాకు అమ్మాయే కావాలి ..నాకు అమ్మాయే పుట్టాలి.”
“శాలినీ !నేను నీకు హామీ యిస్తున్నాను..నువ్వు కూతుర్నే కంటావు.”
“అమ్మా!మన రాష్ట్ర విభజన సమయంలో వెంకన్న సాక్షిగా మోడీ ..పార్లమెంట్ సాక్షిగా వెంకయ్య హామీ యిచ్చారు.నాలుగు సంవత్సరాలనుండి ..సాక్షులు బిజీగానే వున్నారు..
మాట తప్పిన మహాను భావులూ..
హేపీగానే వున్నారు.మధ్యలో హామీయే అన్యాయమైపోయి మౌనాన్ని దాల్చింది.”
“నీకు అలాంటి భయాలే వద్దు..మీ అమ్మమ్మకు యిద్దరు అమ్మాయిలు..నాకూ మీ పెద్దమ్మకూ యిద్దరూ అమ్మాయిలే.నీ అక్కకు అమ్మాయే ..నీకూ అమ్మాయే పుడుతుంది.యిది హామీ కాదు..
నిజం..నిజం..నిజం..నిజమయ్యే నిజం..”
తల్లి మాటలు వింటునే అమ్మకు ముద్దు పెట్టి ఉత్సాహంతో చెప్పింది.
“అమ్మను మించిన నిజం..జీవితం లో వుండదు.
అమ్మాయిని మించిన భాగ్యం ప్రపంచంలో వుండదు.
అందుకే మనం..కంటే కూతుర్నే కందాం.”
“కందాము ..కందాము ..కూతుర్నే.. కందాము.”
శాలిని మాటలకు స్పందించారు అందరూ..ఆ నాలుగు మాటల్ని ఓస్లోగన్ లా నినదించారు.
సభా ప్రాంగణం లోని సభికులు కోరస్ గా పలికిన నాలుగు మాటలు నాలుగు దిక్కులూ పిక్కపిక్క టిల్లేలా ప్రతిధ్వనించి పోయాయి .