“ ఏరా పెద్దోడా! నీ మరదలు నీళ్లోసుకుంది..తమ్ముడు తండ్రి అవుతున్నాడు..మరి తమరి సంగతియేమిటి? యింకా ఆ గొడ్రాలితో ఎంత కాలం కాపురం చేస్తావ్?” తల్లి మాటలకు నషాళానికి అంటిన కోపాన్ని దిగమింగుకుంటూ..
“అమ్మా!అప్పుడే మాకు వయసైపోయి ముసలివాళ్ళమై పోలేదు. ధాత్రికి యింకా ముప్పై దాట లేదు. నాకూ తనకి ఐదు సంవత్సరాలే తేడా. అప్పుడే ఏదో ముంచుకు పోయినట్లు..గొడవ.” విసుక్కున్నాడు విశ్వం. “ అవున్రా.. నేను మంచి చెప్పినా గొడవే ..పెళ్ళాం బెల్లం ..అమ్మ అల్లం అని ఊరికినే అనలేదు.” “అమ్మా! ధాత్రి వింటే బాధ పడుతుంది. తనని డాక్టర్ కి చూపిస్తాను..నేను కూడా టెస్ట్ చేయించు కుంటాను.”
“నువ్వెందుకు చేయించుకుంటావ్? అదేదో ఆ మహా తల్లికి చేయించు ..” “అదేమిటి?లోపం నాలో కూడా ఉండొచ్చుగా?” “నీలో లోపం వుందని పెళ్ళాన్ని వెనకేసుకు రాకు. నాకు మన వంశ చరిత్ర తెలుసు..పిల్లల్ని కనని వాళ్ళు మన వంశంలో లేనే లేరు.” “అమ్మా! కాలం మారింది. సరైన ఆహారం దొరకడం లేదు. రసాయనాలతో పండిన బియ్యం..కూరగాయలు.. కార్బైడ్ తో పండుతున్న పండ్లు ఫలాలు. వాటి విషం మనుషుల మీద ప్రభావం చూపిస్తోంది.
అంతే కాదు కంప్యూటర్ల ముందు కూర్చోని ప్రతి క్షణఒ టెన్షన్ తో మేము చేసే ఉద్యోగాలు కూడా కారణమవుతున్నాయి. పిజ్జాలు..బర్గర్లు..ఐస్ క్రీంలు ..కూల్ డ్రింక్స్ ఒకటేమిటి సెల్ ఫోన్లతో సహా అన్ని విషాలుగా మారి మనిషిని నిర్వీర్యం చేస్తున్నాయి. ఇప్పుడిది మన ఒక్కింటి సమస్యే కాదు . ప్రతి యింటి సమస్య కూడా. మా ఉద్యోగం పేరులో వున్న సాఫ్ట్ నెస్ మా బ్రతుకుల్లో లేదు. ఆ లోపం మన యింట్లో ప్రత్యక్షం గా కనిపిస్తోంది..కలతల్ని రేపుతోంది.
” మనసులో దాచుకోలేని బాధను బయటకు కక్కేసాడు ...విశ్వం. “నువ్వు లక్ష చెప్పు.. వినను గాక వినను. నీకున్న చదువు నాకు లేక పోవచ్చు..జీవితాన్నివడ పోసిన అనుభవం నాది. ఈ చిన్ని విషయానికి డాక్టర్ ఎందుకు? నీ పెళ్ళాం ముఖం చూసి చెప్పొచ్చు.” “అయితే యింకేం మనం కూడా ఓ హాస్పిటల్ పెట్టేద్దాం.
” డాక్టర్ రంగమ్మత్త స్కానింగ్ సెంటర్..బోర్డు రాయించేద్దాం యీమధ్య నీ పేరు కూడా తెగ పాప్యులర్ అయి పోయింది. డబ్బులే డబ్బులు.”
“వాగుడాపి ముందు పిల్లల సంగతి చూడు. డాక్టర్ దానిలోనే లోపముందని చెపితే నీకు మరో పెళ్ళి తప్పదు. ఇది నా మాట కాదు..శిలా శాసనం.” “అమ్మా! నేను ఒప్పుకుంటాను. ధాత్రిలో లోపముందంటే నేను రెండో పెళ్ళికి రెడీ. అదీ ఒక షరతు మీద. ఒక వేళ నాలో లోపముందంటే ధాత్రికి కూడా మనమే మరో పెళ్లి చేయాలి.”
“నోర్ముయ్ ..నువ్వసలేమి మాట్లాడుతున్నావో అర్ధమవుతుందా?” దాదాపు అరిచేసింది విశ్వం మాత రంగమ్మ. “తప్పేం మాట్లాడాను ..కొడుక్కో న్యాయం ..కోడలికో న్యాయమా?” “ఎవెతెరా కోడలు? నిన్ను నవ మాసాలు మోసి నేను కన్నాను. నీ భవిష్యత్ నా యిష్టం..నా బాధ్యత. విడాకులిచ్చాక దానికి పెళ్ళే చేసుకుంటారో..గొడ్రాలి కూతుర్ని కడుపులో దాచుకుంటారో..కాటికి పంపించుకుంటారో దాని అమ్మా నాన్న యిష్టం.
” “సరే ! ఒక వేళ నా విషయంలో పిల్లల్ని కనలేని వెధవని తేలితే కడుపులో దాచుకుంటావా? కాటికి పంపిస్తావా?” “విశ్వం! నాన్న చని పోయాక నిన్ను నీ తమ్ముడిని చెల్లి ని కన్నుల్లో పెట్టుకుని పెంచాను. కాటికి పంపిస్తానా?” కన్నీటితో కదిలి పోయింది.
“కరక్టే.. మరి ధాత్రిని కూడా అత్తయ్య మామయ్యలు అలాగే పెంచి వుంటారు కదా? అసలు లోపం ఎవరిదో యింకా తెలియదు. అయినా కోడలు నీ దృష్టిలో గొడ్రాలు. నా గురించి అత్తయ్య మామయ్యలు కూడా.. పిల్లల్ని కనలేని వెధవకి కూతుర్నిచ్చి తన జీవితం నాశనం చేసామని అనుకుంటారు కదా ? భావం ఎలా వున్నా అది భాషలో కనిపించ కూడదు. నువ్వు జీవితాన్ని చదివావు. వ్యక్తుల సంస్కారాన్ని కూడా చూసి వుంటావు.
ధాత్రి నా భార్య. నాలో..సగ భాగం. తనని అంటే నన్నుకూడా అన్నట్లే.
యిందాక ఒక మాటన్నావు.. అమ్మ అల్లం..పెళ్ళాం బెల్లం అని. అది తప్పు.
పెళ్ళాం బెల్లమే ..కాని అమ్మ అల్లం కాదు..అమృతం. అమృతం లాంటి అమ్మ మనసు..నవనీతఒలా వుండాలి. విషాన్ని చిమ్మ కూడదు.
ధాత్రి వాషింగ్ మెషిన్ ఆపి వస్తున్నట్లుంది. తను వింటే బాధ పడుతుంది. మనం మరో సారి మాట్లాడుకుందాం. నీ మనసు నాకు అర్ధమయ్యింది. రేపు డాక్టర్ తో మాట్లాడుతాను. రిపోర్ట్స్ వచ్చేంత వరకు మనం ఈ విషయాన్ని మాట్లాడుకోక పోవడం మంచిది.” కోడలొచ్చి మాటలు వింటుందేమో నన్న భయంతో నోరు మూసేసింది రంగమ్మ.
*******
“హాయ్ లహరికా ..అనుకోకండా హటాత్తుగా ..వేసవి కాలం వర్షంలా..అమ్మ మీద బెంగా? అన్నగారి మీద అలుకా?”
చేతిలో సూట్ కేస్ అందుకుంటు..అడిగింది ధాత్రి .
“బెంగో గింగో.. తర్వాత చెప్తాను. అమ్మెక్కడ?”
“ప్రక్కింటి కెళ్ళారు. నువ్వు ముందు కాఫీ తాగి రెస్ట్ తీసుకో..అమ్మా..అన్నయ్య యిద్దరూ వచ్చేస్తారు. అన్నట్లు నవకాంత్ ఎలావున్నారు?”
“అందరూ బాగున్నారు..నేను తప్ప.” గొణుక్కున్నట్లు అనుకుంది.
“బ్రూ కాఫీనా ? ఫిల్టర్ కాఫీ నా ? జర్నీ కదా?చిరాకుగా వుంటుంది. గీజర్ ఆన్ చేస్తాను .
బాత్ రూములో లిక్విడ్ సోప్ వుంది..కొత్త టవల్ పెడతాను. ఈ లోగా అత్తయ్యకు కబురు చేస్తాను.”
“అర్జంటేమి లేదు గాని..నాకు రూము చూపించు..యిక మన మకాం యిక్కడే.”
“సంతోషం..నవకాంత్ వస్తారు కాబట్టి మేడ మీద గది సర్దుతాను.ఎసి వుంది..పెద్ద టెర్రేస్ ..డ్యుయట్లు కూడా
పాడుకో వచ్చు.”
“ఓ! నీకు..అలా అర్ధమయ్యిందా? సరే ..నీ యిష్టం.”
విసుగ్గా బాత్ రూము లోకి లహరికలా దూసుకు పోయింది..లహరిక.
******
హాల్లో అందరూ సమావేశమయ్యారు.
ముందు రంగమ్మే మొదలు పెట్టింది.
“వచ్చినప్పటినుండి చూస్తున్నాను..మాట్లాడ కుండా ముంగిలా బిగుసుకు పోయావు. నువ్వెందుకు ఒక్క దానివే వచ్చావు..అల్లుడు గారేరి? పోట్లాడి వచ్చావా?”
“నా బ్రతుక్కి అదొక్కటే తక్కువ.”
తనలో గొణుక్కుంటు..చేతి గోళ్ళు చూసుకుంటు..ఉండి పోయింది.
“ఏయ్! లహరి అమ్మ అడుగుతోంది నోరిప్పవచ్చుగా ..నేను నవకాంత్ తో మాట్లాడనా?”
విశ్వం అనునయంగా అడిగాడు.
“అరె అన్నాయ్! తొందర పడకు ..మాట్లాడే సమయం వస్తుంది..అప్పుడు మాట్లాడు..లేదా పోట్లాడు.”
“అంటే వ్యవహారం అక్కడి దాకా వచ్చిందన్న మాట. ఇంతకీ ఏమయ్యింది? అన్నయ్యను పోట్లాడ మంటున్నావ్. నువ్వు ఏమి చేసావే తల్లి చెప్పు?”
రంగమ్మ మాటల్లో కోపం తొంగి చూసింది.
“నేను యేమీ చేయలేదు..నా తప్పేమీ లేదు.”
“సరే నువ్వేమీ చేయ లేదు..ఒప్పుకుంటాను..అసలేమి జరిగిందో చెపితేనేగా అర్ధమయ్యేది. మరి నవకాంత్ తొందర పడ్డాడా? బుర్రలు తినకుండా చెపితే ఏమి చేయాలో అన్నయ్య నేను ఆలోచిస్తాము.”
“అమ్మా! యిప్పుడు నన్ను వదిలేయండి ..తర్వాత మీకే తెలుస్తుంది.
వదినా !యిందాక బ్రూ యిచ్చావు ..యిప్పుడు ఓ స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ యిస్తే తల నెప్పి తగ్గుతుంది.”
సోఫా లోంచి లేవ బోతూ ధాత్రిని చూస్తూ రిక్వెస్ట్ చేసింది.
“వదిన తెస్తుంది.. నువ్వు లేవకు..అమ్మకు బీపీ తెప్పించకు..రెండు మూడు ముక్కల్లో చెప్పు.”
“అరేయ్ అన్నయ్యా! ఇదేమైనా ప్రేమ వ్యవహారమా ? ఐ..లవ్.. యూ..అని మూడు ముక్కల్లో చెప్పడానికి. జీవితం. మీరే కొని పెట్టిన నవ..కాంత్..నే అడగండి.
నేను వదినతో కిచన్ లోకి వెళుతున్నాను.”
ఒక్క సారిగా లేచిన లహరిక సముద్రపు అలలా దూసుకు పోయింది.
రంగమ్మ ..విశ్వంలు అయోమయంతో ఒకరిముఖం ..మరొకరు చూసుకున్నారు.
“అరే విశ్వం! యిదేదో పీకల మీదకు వచ్చే వ్యవహారంలా వుంది. దీనికి తొందరపాటు ఎక్కువ. అసలిది ఏమి చేసి వచ్చిందో తెలిసేది ఎలా? పొనీ నువ్వు నవకాంత్ ని కలిసి రాకూడదూ? అసలు విషయం తెలుస్తుంది.” ఆందోళనగా అడిగింది.
“అమ్మా! హైదరాబాద్ నుండి అమరావతి వెళ్లి రావాలంటే కనీసం మూడు రోజులు..కావాలి. అది కూడా రిజర్వేషన్లు బస్సుల్లో గాని ట్రైనుల్లో గాని దొరికితేనే. నాకు ఆఫీసులో సెలవు దొరకదు.
ముందు ఫోన్ చేద్దాం. మేటర్ తెలుసుకుందాం. సీరియస్సయితే టాక్సీలో వెళ్లి వద్దాం..” తన నిస్సహాయతను వ్యక్తం చేసాడు విశ్వం.
“మంట రాజేసి అది పోయి కాఫీ తాగుతోంది. పిల్లలు మారిపోయారు.అంతా నా ఖర్మ.”
“అమ్మా! విషయం తెలుసుకోకుండా హైరానా పడకు. నవకాంత్ చాలా మంచి వ్యక్తి. నేను మాట్లాడుతాను.”
“అబ్బాయి మంచోడే .. ఎటొచ్చి మన బంగారం మీదే నా అనుమానం. సరే నువ్వు ఫోన్ చెయ్యి.”
విశ్వం రెండు మూడు సార్లు ప్రయత్నించాడు.
“అమ్మా! నవకాంత్ ఫోన్ దొరకడం లేదు. లహరికను అడుగు..మరో నెంబర్ ఉందేమో?”
“నువ్వే అడుగు..వున్నా అది నాకు చెప్పదు.జగమొండి.” కూతురి నైజాన్ని ఒక్కమాటలో తేల్చేసింది ..రంగమ్మ.
“ఫోన్ తీస్తే మాట్లాడొచ్చు.తిరిగి ట్రై చేస్తా .
" హలో బావా! ఎలావున్నారు? లహరిక వచ్చింది..నోరు తెరవడం లేదు..యింతకీ గొడవేంటి?”
“గొడవా?మా యిద్దరి మధ్యా? నెవ్వర్..” నవకాంత్ వాయిస్.
“అమ్మా ! అసలు గొడవే లేదంట..ఏం మాట్లాడ మంటావ్?”
“కొంచెం ఆగు..దాన్ని అడుగుతాను..లహరికా మీ ఆయన లైన్ లో వున్నారు. త్వరగా రా.”
“ఇంకా నాకు ఆయనేంటి? నేను భార్య నేంటి? ఆబంధం ఎప్పుడో తెగిపోయింది. నేను మాట్లాడను.”
“విన్నావా నీ చెల్లాయి చెత్త వాగుడు? అక్కడ కూడా యిలాగే పిచ్చి వాగుడు వాగుంటుంది.”
“బావా! సారి టు డిస్టర్బ్ యూ..మరి ఏమి లేక పోతే సూట్ కేస్ తో వచ్చింది..బంధం తెగి పోయిందని తిక్క తిక్కగా మాట్లాడుతోంది. ప్లీజ్ మీరైనా చెప్పండి.”
విశ్వం అభ్యర్ధన పని చేసినట్లుంది..
“అయితే ఒక సారి ఫోన్ అత్త గారికి యివ్వండి..”
నవకాంత్ అడిగినట్లు అమ్మకి ఫోన్ యిస్తూ..
“అమ్మా! అల్లుడు గారు అత్తగారి తోనే మాట్లాడుతానంటున్నారు..నువ్వే మాట్లాడు.”
“హలో !అల్లుడు గారూ!నేను రంగమ్మత్తని..ఆరోగ్యం ఎలా వుంది?”
“అత్తయ్యా! మీ అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశఒ లేదని డాక్టర్ రిపోర్ట్. మా అమ్మ గారు లహరికకు విడాకులిప్పించి నాకు మరో పెళ్లి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. అది తెలుసుకొనే మీ అమ్మాయి బట్టలు సర్దుకొని మీ ఇంటికి వచ్చింది. నాకు మరో కాల్ వస్తోంది..తర్వాత చేస్తాను.”
కుండ బద్దలు కొట్టేసాడు అల్లుడు..ఫోన్ విశ్వానికిచ్చి పిచ్చి దానిలా కూలబడి పోయింది.
కంగారు పడిన విశ్వం తల్లిని లేపి సోఫాలో కూర్చో పెట్టాడు.
“అమ్మా! బావ ఏమన్నారు? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ధాత్రీ ! వాటర్ తీసుకురా.”
“నీ పెళ్ళాం కొచ్చిన జబ్బే దీనికి కూడా వచ్చింది. దీనికి పిల్లలు పుట్టే అవకాశం లేదని ఎవడో పనికి మాలిన డాక్టర్ చెప్పాడట. దీనికి విడాకులిప్పించి మరో పెళ్లి చేయాలని దీనత్త రాక్షసి ప్లేనట.”
అదేంటి? బావ నాతో అసలు గొడవే లేదన్నారు..మరి నీతో యిలా..నువ్వు ఒక సారి వెళ్లి మీ వియ్యంకురాలి తో మాట్లాడితే బాగుంటుంది.” అన్నగారి సలహా కు అడ్డం పడిపోతూ .. “అక్కర్లేదు..వాళ్ళిచ్చే దేమిటి బోడి విడాకులు? నేనే సంతకం పెట్టి వాళ్ళ ముఖాన కొడతాను.”
కాఫీ మగ్గుతో వచ్చిన లహరిక కోపంతో స్టేట్ మెంట్ యిచ్చింది. వాటర్ గ్లాస్ తెచ్చి అత్తగారికి అందించింది ధాత్రి.
“ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావ్ ..అలాగేనా మాట్లాడేది?” అరిచేసింది రంగమ్మ.
“బలిసింది నాక్కాదు..మా అత్త దెయ్యానికి. కొడుక్కి మరో పెళ్లి చేస్తుందా?చెయ్యమను..చూస్తా..ఏంనేను మరో పెళ్లి చేసుకోలేనా?చెప్పు ..ఫోన్ చేసి ..చేసుకోమని చెప్పు.”
“నోర్ముయ్ ! పిచ్చిదాన్లా మాట్లాడకు.. రెండో పెళ్ళంట.” విసుక్కుంది తల్లి రంగమ్మ.
“ఏ..ఏంటా గొప్ప?కాలం మారి పోయింది..అబ్బాయిలకు కట్నాలిచ్చే రోజులు పోయి..కన్యాశుల్కం రోజులు వచ్చేశాయి. నాకు పిల్లలు పుట్టక పోతే అనాధ శరణాలయం నుండి ఓ బిడ్డను దత్తత తీసుకుంటా. ఏరా అన్నయ్యా! నీకు పిల్లలు పుట్టక పోతే నువ్వేం చేస్తావ్? వదినకు విడాకులిచ్చి మరో అమాయకురాలి గొంతు కొస్తావా? చేసినా చేస్తావ్..నోట్లో నాలుక లేని దద్దమ్మవి..వదిన పేరుకు తగ్గట్టే భూ దేవంత సహనశీలి. అసలు నేను యిక్కడకు రాకుండా అక్కడే వుండి.. మా అత్త రాక్షసిని టివీల్లో చూపించినట్లు..కాఫీలో ఎలుకలమందు కలపడమో ..గ్యాస్ లీకో చేసి పైకి పంపించేయడమో చేసి వుంటే దరిద్రం పోయేది.
వదినా! ఒకవేళ నాసమస్యే నీకొచ్చి మాఅమ్మ గనుక మా అత్తలా ప్రవర్తిస్తే చెప్పు.. నేను సాల్వ్ చేసేస్తాను. అమ్మయినా అత్తయినా హద్దులు దాటనంత వరకే. నవకాంత్ అదే మీఅల్లుడు ఏమన్నాడు? నాకు పిల్లలు పుట్టరన్నడాక్టర్ రిపోర్ట్ చూపించి విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకుంటాననేగా? నేనూ కేసు పెడతా ..అమ్మ కూచి నన్ను పెళ్లి చేసుకొని నాజీవితం నాశనం చేసాడు..అత్త రాక్షసి గ్యాస్ లీక్ చేసి నన్ను చంపాలని ట్రై చేసింది..బ్రతుకు మీద భయాన్ని కలిగించారు..భరణంగా ఓ ఇరవై కోట్లు యిస్తే విడాకులిస్తానని . నా ఫ్రెండ్ విడాకుల కేసుల్లో ఎక్స్ పర్ట్..అమ్మా !అసలు నేను వచ్చింది అత్త మీద కోపంతో కాదు. మీ అల్లుడు మీద అలిగీ కాదు. నా లాయర్ ఫ్రెండ్
ఉండేది యిక్కడే. దానికి ఫోన్ చేస్తే తన దగ్గరకు రమ్మని అడ్రస్ మెయిల్ చేసింది. సరదాగా వదిన్నో ఆట పట్టించాను. అన్నయ్య వాడి పోయిన ముఖం...కోపంతో ఎరుపెక్కిన నీ ముఖాన్ని వస్తూనే గమనించాను.
నేను చదివిన సైకాలజీ సబ్జక్ట్ మీరిద్దరూ ఏదో మానసిక ఘర్షణలో వున్నారని చెప్పింది. మీ బాధలేవో మీరు పడండి. వదినా మా అన్నయ్య పేరుకే విశ్వం..అమ్మ విషయం లో మాత్రం శూన్యం. నీకు మా అత్త సంగతి తెలియదు..కానీ నాకు మీ అత్త సంగతి పూర్తిగా తెలుసు. నీకు ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నాను. నాకు చిన్న కాల్ చెయ్. అమ్మాయిలంటే అబలలు కారు..
సబలలని నిరూపిద్దాం. నాకు నీ చేత్తో మరో ఫిల్టర్ కాఫీ ప్రసాదించు. అరేయ్ అన్నయ్యా ! నవకాంత్ వాళ్ళమ్మ మాటల్లాఒటి మాటలు మన అమ్మ నోటి నుండి రావు..రాకూడదు..ఒక వేళ వస్తే మాత్రం గంగిరెద్దులా తలూపకు. నాకు ఫోన్ చెయ్ బై రా.” లహరిక తల్లికి కూడా చెప్పకుండా అలలా దూసుకు పోయింది.
*****
“అరే విశ్వం నన్ను బస్సు ఎక్కించు..అనాధల్ని దత్తత తీసుకుంటారో..పిల్లలు లేని దంపతుల్లా వుండి పోతారో మీ యిష్టం. ఇక నీ చెల్లి రాక్షసి విషయం..అత్తను చంపుకుంటుందో..కోర్ట్ కెళ్ళి భర్తను బజార్ కు యీడుస్తుందో దానిష్టం.
నేను నీతో విడాకుల గురించి అనవసరం గా వాగాను. ఆ విషయం మాత్రం ధాత్రితో కాని.. లహరికతో కాని పొరపాటునైనా ప్రస్తావించకు. కాలం కలిసి రాక పోతే తాడే పామై కరుస్తుంది అంటారు. యిప్పుడు నా పరిస్థితి అలాగే వుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త.” రంగమ్మతో బాటు ..విశ్వం గుండెల్లోని బరువును మోసుకుంటు అమరావతికి బయలు దేరిన సూపర్ లగ్జరీ బస్ విల్లు విడిచిన బాణంలా దూసుకుపోయింది ..
ఉదయిస్తున్న భానుని కిరణాలు విశ్వం ముఖాన్ని రాగ రంజితం చేసాయి అతని మనసులో మొలకెత్తుతున్న ఆశలకు ప్రతిరూపంలా.
.................................
“ఏయ్ లహరీ!మొత్తానికి సార్ధక నామధేయురాలివి అనిపించు కున్నావు. మీ వదిన ధాత్రి తో కలిసి పెద్ద నాటకమాడావు.కానీ నన్ను మా అమ్మనీ విలన్లు గా మార్చేసావ్. రెండు నెలల గర్భిణి వని వదిలేస్తున్నాను..లేకపోతే పరుగులు పెట్టించైనా లక్ష ముద్దుల నివాళులుల కఠిన శిక్ష విధించే వాడిని. మొత్తానికి ఓ అనాధ శిశువుకు అమ్మా నాన్నల్ని ప్రసాదిస్తున్నావు.” “ఏయ్!నవకాంత్ ..నాకే కాదు మా అందరి జీవితాలకి నువ్వు నవ్య కాంతివే. అత్త గారికి..అత్త గారి అబ్బాయి గారికి.. హృదయ పూర్వక క్షమాపణలు.. ఈక్షణం నుండి..ఆ లక్ష ముద్దుల వ్రతాన్ని నేనే నిష్టగా నోచుకుంటాను..” ఆనందంతో భర్తను అల్లుకు పోయింది.. అమ్మను దిద్దిన సముద్ర అల లాంటి లహరిక.