దట్టమౌ అడవి లో చిట్టెలుక దూరింది
ముని పుంగవుని ముందు మోకరిల్లింది
"పిల్లి మూకల నుంచి కాపాడుమయ్య
భీతిల్లు నా మదికి దిక్కునీవయ్య "
అని వేడుకొనగానె ముని చూసినాడు
ఎలుకపిల్లను పిల్లిగా చేసినాడు.
ఒకనాడు ఆ పిల్లి తోకముడిచింది
మునిపుంగవునిముందు మోకరిల్లింది
"జాగిలమ్ముల దండు బాధించెనయ్య
భీతిల్లు నా మదికి దిక్కు నీవయ్య"
అని వేడుకొనగానే ముని చూసినాడు
గండుపిల్లిని జాగిలము చేసినాడు.
ఒకనాడు జాగిలము ఉరికి వచ్చింది
ముని పుంగవుని ముందు మోకరిల్లింది
"సింగముల బెంగ వేధించేనయ్య
భీతిల్లు నా మదికి దిక్కు నీవయ్య "
అనివేడుకొనగానె ముని చూసినాడు
జాగిలమ్మును సింగమొనరించినాడు
ఒకనాడు సింగము వణకజొచ్చింది
మునిపుంగవుని ముందు మోకరిల్లింది
"బాణముల గురి నుంచి కాపాడుమయ్య
భీతిల్లు నా మదికి దిక్కునీవయ్య"
అని వేడుకొనగానె ముని చూసినాడు
చిట్లించి కనుబొమలు ఇట్లు పలికాడు
"ఎన్నెన్ని రూపాలు ధరియించినా సరే
నీ గుండె మాత్రము చిట్టెలుక నాటిదే
రూపమేదైనా మారదే గుణము!
పుష్టి విగ్రహము .. నష్టి నైవేద్యము !"
అని పలికి ముని జలము మంత్రించినాడు
సింగమును చిట్టెలుక గావించినాడు