అమరావతి అపార్ట్ మెంట్స్ ఆరోజు సందడితో కళ సంతరించుకుంది. అందులోని ఫ్లాట్స్ వాళ్ళు.. చుట్టు పక్కల ఫ్లాట్స్ లోని వాళ్ళందరూ అందంగా ముస్తాబై అపార్ట్ మెంట్ పైకి చేరుకున్నారు. కొద్ది సేపటి తర్వాత టాం టాం టీవీ టీం అక్కడకి చేరుకుంది. ఆ ఏరియాలోని అన్ని అపార్ట్ మెంట్లలో ఆ అపార్ట్ మెంట్ ‘మనసులోది కక్కు.. బహుమతి పట్టు’ కార్యక్రమానికి ఎంపికయింది. దానికి మిగతా అపార్ట్ మెంట్ల వాళ్ళు కుళ్ళిపోతున్నారు కూడాను.
స్వీట్లు హాట్లు కతకడం.. తాపీగా టీ లు తాగడం అయ్యాక.. కెమెరాలు.. రిఫ్లెక్టర్లు అరెంజ్ చేసుకుని..
"అమరావతి అపార్ట్ మెంట్లో మన కార్ క్రమం ‘మనసులోది కక్కు..బహుమతి పట్టు’ కి స్వాగటం సుస్వాగటం..అందరూ ఎంతో ఆషక్తిగా.. ఉత్సాహంగా పార్టిసిపేట్ చెయ్యడానికి రెడీగా వున్నట్టు టెలుస్తోంది. మరి ప్రారంభిద్దామా?" అంది యాంకర్ ఇంగ్లీష్ ని తెలుగుని తన నోటి మిక్సీలో వేసి బయటకి మాటల రూపంలో విడుస్తూ..
"ఓ" అన్నారు ఒకరిద్దరు.
"నాకు విన్బడ్డం లేదు" అంది.
"ఓ" ఈసారి అందరూ గట్టిగా ముక్తకంఠంతో అన్నారు.
"సరే అయితే.. ఈ అంకుల్ పెద్దపొట్టతొ..చిన్నకళ్ళతో.. అచ్చం మొన్న మనం జరుపుకున్న వినాయక చవితి వినాయకుడిలా వున్నాడు. ఈయన చేత ఓ పాట పాడుతూ స్టెప్పులేద్దామా?"
యాభైయేళ్ళ వయసున్న ఆయన అందరిమధ్యా సిగ్గుతో అత్తిపత్తిలా బిక్కచచ్చిపోయాడు.
"మీరు పాడాలి.. ఆడాలి.." అని అరచి "మీరందరూ కూడా ఆయన్ని ప్రెషర్ చేయండి" అని అందరిముందు మైకు పెట్టింది.
అందరూ "పాడాలి..ఆడాలి" అని కోరస్ గా అరిచారు.
ఆయన "తెలుగు వీర లేవరా.." పాటందుకున్నాడు "అబ్బే అది కాదండి.. ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట పాడుతూ ఆడాలి.. అన్నట్టు అమ్మమ్మ వుంటే మజాగా బాగుంటుంది కదూ.." అని సిగ్గులమొగ్గవుతున్నావిడ్ని లాక్కొచ్చి ఆయన పక్కన నిలబెట్టింది. ఇహ చేసేందేంలేక వాళ్ళిద్దరూ రెండు నిమిషాలు ఆడి పాడి దూరంగా వెళ్ళిపోయారు.
"అదండీ.. బాగుంది కదా.. ఇహ మనం ‘మనసులోది కక్కు.. బహుమతి పట్టు’ ప్రారంభిద్దామా? అంది"
"ఆఁ" అన్నారందరూ..
పాతికేళ్ళున్న ఒకామె దగ్గరకెళ్ళి "మీ అత్తగారి గురించి మీ అభిప్రాయం?" అంది.
"అమ్మలా చూసుకుంటుంది.."
"ఈ కార్యక్రమం ‘మనసులోది కక్కు.. బహుమతి పట్టు’ నువ్వు నిజాలే కక్కాలి అప్పుడే బహుమతి" అంది.
"అమ్మ పెంపకంలో అల్లారు ముద్దుగా పెరిగిన నేను పెళ్ళి పేరుతో ఈ అత్త రాక్షసి చేతిలో పడ్డాను.. ఇహ అప్పటినుండీ నరకం.. భూలోక నరకం" ముక్కుచీదుడులో ఏడుపు మిళితంచేస్తూ అంది.
"ఏంటే నోటికొచ్చిందల్లా వాగుతున్నావు? నువ్వు మాత్రం నా కొడుకుని అమాయకుడ్ని చేసుకుని కొంగుకి కట్టుకుని నన్ను నానా హింసలూ పెట్టట్లా.."
"యస్..అదీ ఊపు.. ఎవరు ఎక్కువ కక్కితే వాళ్ళకి బహుమతి.. కానీయండి.. ఊ రెచ్చిపోండి"
"అబ్బో నీ కొడుకు.. ఎంత సేపూ తల్లి తల్లీ అంటాడు.. కొంగుచాటున పెంచావు.. నా కొంగున కట్టుకునుంటే.. ఈ పాటికి వేరుపడే వాళ్ళం.."
"నువ్వెన్నిప్రయత్నాలు చెయ్యలేదే మహా తల్లీ.." అని కోడలి మీదకి లంఘించి జుట్టు పట్టుకుంది.
"నిన్నొదుల్తానటే.." అని కోడలు కూడా అత్త జుట్టు పట్టుకుంది.
ఇద్దరూ కూడా రక్తాలొచ్చేటట్టు కొట్టుకుంటుంటే యాంకరు మైకు మరొకాయన ముందు పెట్టి "మీరు ఎవరి మీదనన్నా కోపం కక్కాలనుకుంటున్నారా?"
"నాన్నా మీ ఆఫీసరుని ఎప్పుడూ తిడుతూంటావు కదా" అని అతడి పుత్రరత్నం ఉప్పందించాడు.
"మీ ఆఫీసరుగారంటే మీకు కోపమా..అయితే కక్కండి ఇది మీకు మంచి అవకాశం.. పైగా బహుమతి కూడా రావచ్చు.." అంది యాంకర్ ఎరకి పడిన చేపలావున్న అతడ్ని చూస్తూ.
భార్య కూడా బహుమతి కోసం ‘రెచ్చిపోండి’ అని సైగ చెయ్యడంతో-
‘ఆఁ.. ఈ కార్యక్రమం ఎప్పుడో టెలికాస్ట్ అవుతుంది. మాఆఫీసరు ఈ కార్యక్రమం చూడొచ్చాడా..ఏమిటి?’ అని మనసులో అనుకుని - "మా ఆఫీసరు.. అసలు మనిషికాడండి.. దుర్మార్గుడు. సెలవు మాట అటుంచితే కనీసం పదినిముషాలు పర్మీషన్ అడిగితే చాలు ఫయిరైపోతాడు. వాడు మాత్రం సెలవులు తీసుకుని పెళ్ళాం పిల్లలతో ఊటీ, కొడైకెనాలు తిరగొచ్చు.హుఁ" అని బాధగా నిట్టూర్చాడు.
మైకు ఇంకొకామె ముందు పెట్టి "ఇప్పుడు మీరు చెప్పండి మీ కోపం ఎలా కక్కుతారో"
"మా పనిమనిషి ఉత్త చాడీలది.. అందరి మీదా ఉన్నవి లేనివి చెబుతుంది.."
"అబ్బో.. ఊకోవమ్మా.. ఆ పొరుగింటావిడ ఏం కొంది.. ఈ పక్కింటావిడ ఇంట్లో అడావుడేంటని రోజూ నువ్వు అడగవూ.."
‘ఇదిక్కడే చచ్చిందా.. అందరిలో పరువుపోతోంది.. అనవసరంగా దీని నోట్లో నోరు పెట్టా’ననుకుని.. "చాల్లేవే..పెద్ద చెప్పొచ్చావు.." అని దాని మీద కెళ్ళింది. అదూరుకుంటుందా సేం టు సేమ్.
మైక్ ఒక పిల్లాడి ముందు పెట్టి "చిన్నా మరి నువ్వు ఎలా కక్కుతావు?"
"మా టీచరుకి మమ్మల్ని బాదడం తప్ప ఏమీ రాదు. మార్కులు తక్కువొస్తేనేమో అమ్మా నాన్న నన్ను బాదుతారు. అసలు ఈ టీచర్లు..." వాడో పదినిముషాలు రెచ్చిపోయాడు.
"మరి నువ్వు ఎలా కక్కాలనుకుంటున్నావు?" అక్కడున్న పదహారేళ్ళ అమ్మాయిముందు పెట్టింది మైకు.
"ఆ రాం గాడు నన్ను ప్రేమిస్తున్నానని వెంటబడితే పోన్లే కదా అని ప్రేమించాను.. వాడిప్పుడు ఆ శ్యామల వెంటబడుతున్నాడు.. చిత్తకార్తె కుక్క"
"కుక్కేంటే కుక్క.. నువ్వుమాత్రం ఆ రాజా గాడికి లవ్ లెటర్ రాయలా..మరి నిన్నేమనాలే"
"పోరా"
"పోవే"
అలా అలా మైకు అందరి ముందుకూ వచ్చింది. కెమెరా ముందు ఒళ్ళు తెలియకుండా రెచ్చిపోయారందరూ.
"ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. నాకు తెలుసు మీరందరూ ఎవరికి బహుమతి వచ్చిందా అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని. చెప్పేస్తున్నాను.. చెప్పేస్తున్నాను.. మొదటి గిఫ్ట్ అత్తకి కోడలికి ట్రెడిషనల్ బ్రదర్స్ నుండి రొట్టెల సాన అప్పడాల కర్ర.. రెండో బహుమతి ఈ పిల్లాడికి తుత్తూ స్టేషనరీస్ నుండి కంపాస్ బాక్స్.. ఇహ మూడో బహుమతి ఆరేసుకోబోయి పాడిన తాతకి అమ్మమ్మకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ వారి తరఫు నుండి యాభై రూపాయల స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్." అంది యాంకర్ వయ్యారాలు పోతూ.
బహుమతులు తీసుకోవడానికి అక్కడెవరూ లేరు. వాళ్ళ ఇల్లల్లోంచి మాత్రం పెద్ద పెద్ద అరుపులు కేకలు.. శబ్దాలు వినిపిస్తున్నాయి.
మరుసటిరోజు ఆ ఏరియాని కల్లోల ప్రాంతంగా ప్రకటించి అక్కడ శాంతి కోసం పారామిలిటరీ దళాలని మోహరించారు. ఆఫీసర్ని అవాకులు చెవాకులు పేలిన ఆ ఉద్యోగి ప్రస్తుతం కొన్ని వేల ఫయిల్ల మధ్య వరదల్లో చిక్కుకున్న బాదితుడిలా విలవిల్లాడుతున్నాడు.
టీచరు గురించి సొల్లు వాగుడు వాగిన ఆ పిల్లాడు రోజూ ఆ టీచరుకి గోడకుర్చీ అవుతున్నాడు. ‘ఆరేసుకోబోయి’ పాడినాయన వెళుతుంటే, ఆయన వెనకాల "ఈనాడే మనకీ పండగా.. ముసలాడికి దసరా పండగ" అని రాగాలు తీస్తున్నారు.
ఇవేవి తెలియని అమాయక ప్రేక్షక జనం టీవీల ముందు కూర్చుని ఆ కార్యక్రమం చూస్తూ వెటకారంగా నవ్వుకుంటున్నారు.