ఆనందరావు ఆనందానికి అంతులేదు. పదే పదే కాలెండర్ వైపు చూడసాగారు. పార్వతమ్మ ముసి ముసి నవ్వులతో భర్తని ఓరగా గమనించసాగింది. వారి ఏకైక కుమారుడు ధీరజ్ వచ్చేవారమే అమెరికా నుంచి సపరివార సమేతంగా స్వదేశానికి తిరిగి వస్తున్న శుభ వర్తమానాన్ని టెలిఫోన్ అందించింది మరి ఇందాకే, ఇద్దరూ హడావిడి మొదలుపెట్టారు.
"పార్వతీ! అబ్బాయి శుక్రవారమే కదా వచ్చేది వాడికి ఇష్టమైన వంటకాలతో స్వాగతం చెప్పాలి తెల్సిందా, ఈలోపు బజార్నించి ఏమేం తేవాలో లిస్ట్ ఇద్దూ", అంటూ బట్టలు మార్చుకొని స్కూటర్ తాళాలు అందుకున్నారు. "అబ్బ, ఇంకా వారం వుందండి. ఈ లోగా మనవడికి బంగారుగొలుసు, కోడలికి పట్టుచీర, బాబుకి మంచి సూటు కొనాలి ఆ పని చూద్దాం ముందు బ్యాంకుకు వెళ్ళాలి" అని ఆవిడ తొందరపెట్టింది.
ఈ విధంగా కొడుకు స్వాగత కార్యక్రమాలు చురుకుగా మొదలుపెట్టారు భార్యాభర్తలు, ఆనందరావు పెద్ద ప్రయివేటు ఫర్మ్ లో క్లర్క్ గా జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా మేనేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి, భార్య పార్వతి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. వారిద్దరూ క్లాస్ మేట్స్ ప్రేమించి పెళ్ళి చేసుకుని ఆధునిక భావాల్ని మనసు నిండా పుష్కలంగా నింపుకున్న జంట. ఆమె స్కూల్ టీచర్ గా జీవితాన్ని ప్రారంభించి ప్రొఫెసర్ గా రిటైరయ్యింది. వాళ్ళ ఏకైక పుత్రరత్నం ధీరజ్. ఎమ్. ఎస్ చేసి తల్లిదండ్రుల అభిరుచులకి తగినట్లున్న అమ్మాయిని పెళ్ళిచేసుకుని అమెరికాలో సెటిలయిన యువ ఇంజనీర్, 5 సంవత్సరాల అనంతరం తల్లిదండ్రులని చూడ్డానికి ఇండియా వస్తున్నాడు.
**** **** **** ****
శుక్రవారం రానే వచ్చింది ధీరజ్, రాణి, బంటి ఉత్సాహంగా అమెరికా విశేషాలు దారి పొడుగునా కథలుగా వర్ణిస్తున్నారు. ఆనంద్, పార్వతి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. టాక్సీ ఇంటి ముందు ఆగింది. సామాన్లు లోపల పెడుతుంటే ధీరజ్ తల్లితో "అమ్మా! మీ ఇద్దరికీ కొత్తకారు బుక్ చేద్దామనుకుంటున్నాను. ఇంకా స్కూటర్ ఏంటి నాన్న ఈ వయసులో అన్నాడు.
'ఎందుకురా? మా ఇద్దరికీ, స్కూటర్ చాల్లే, పదపద స్నానాలు కానిచ్చి భోజనాలు చేద్దురు' అంటూ లోపలికి దారి తీసింది పార్వతి.
ఒక కునుకు తీసి సాయంత్రం అలా షికారుకు వెళ్లారు తండ్రీ కొడుకు, మనవడు. వంటగదిలో అత్తగారికి సాయంచేస్తోంది రాణి "అత్తయ్యగారు! అమెరికాలో దేనికీ కొరతలేదంటే నమ్మండి ఎంతో హాయిగా ఉంది తెల్సా" అంది రాణి కూరలు తరుగుతూ.
"అవును రాణీ! కాని పనిమనుషులు ఉండరని, పన్లన్నీ మనమే చేసుకోవాలని, ఫాస్ట్ లైఫ్ అని అంటారే." అడిగింది పార్వతి ఆశ్చర్యంగా.
"నిజమే కాని అలా అన్పించదస్సలు అత్తయ్య! ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతారు. బాబు స్కూల్ కి వెళ్ళిపోతాడు అందరం తలా ఒక పని చేసుకుంటాం బస్, పనీ త్వరగానే తెమిలిపోతుంది. అన్ని పన్లకి మిషన్స్ ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడ్డం గాని, పని మనుషుల కోసం, చాకలి కోసం ఎదురుచూడ్డం గాని ఏవీ ఉండవంటే నమ్మండి. అక్కడ మనుషులు కూడా చాలా కలివిడిగా, స్నేహంగా ఉంటారు. మనవాళ్ళు అక్కడ ఎక్కువగానే ఉన్నారు. వీకెండ్స్ లో పార్టీలు అవుతూ ఉంటాయి. గెట్ టు గెదర్స్ అవీ తెలుగువాళ్ళం అందరం ఒక దగ్గర చేరతాం. భోజనాలు, సంగీత కచేరీలు, నాటకాలు చాలా సరదాగ ఉంటుందండీ. మీ వయసువాళ్ళు, మీలాగే రిటైరైన వాళ్ళు, పిల్లలతో అమెరికా వచ్చి సెటిలయిపోయినవాళ్ళు చాలామందే ఉన్నారు. నాకయితే మీరు మామయ్య మాతో వచ్చేస్తే బాగుండును అన్పిస్తుంది. ఎక్కడ ఎవరున్నారు? మీరు రిటైరయిపోయారు కూడా కదా, మాతో వచ్చేయండి" అని ప్రేమగా అడిగింది రాణి.
పార్వతి పొంగిపోయింది కోడలి అభిమానానికి నిజానికి ఆవిడకి మనసులో కొడుకు దగ్గర ఉండాలని వుంది. భర్త దగ్గర చెప్పకపోయినా ఎప్పుడూ అదే ఆలోచన. ఒక్కగానొక్క కొడుకు చిన్నప్పుడు ఉద్యోగ నిర్వహణలో పడి వెనకా ముందు ఎవరూ లేకపోవడంతో వాణ్ణి ఆయాలమీద, హాస్టల్స్ లో ఉంచి చదివించడంతో కొడుకుని చాలా మిస్సయ్యానని ఎన్నోసార్లు ఆమె బాధపడింది. అదే మాట ఆవిడ ఆనందరావుని నిద్రపోయేటప్పుడు అడిగింది.
"ఏమండీ! ఒకమాట అడగనా,
"ఏంటి పారూ" అన్నారు ఆనంద్.
"మరేంలేదండీ, 4 నెలల క్రితం నేనూ రిటైరయిపోయాను. మనిద్దరం ఖాళీయే. ఇక్కడ మనకి ఆస్తులు గాని, బాధ్యతలు గాని ఏమీ లేవు. ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోదామండి. రాణి కూడా రమ్మంటోంది," అని గోముగా అడిగింది.
"నిజమేలే? వాడేమంటాడో, ఇవాళ్ళే కదా వచ్చారు. అన్నీ కనుక్కొని తర్వాత మాట్లాడదాం" అని నిద్రకి ఉపక్రమించారు.
**** **** **** ****
"రాణీ! ఎంతసేపు? ఇంకా తెమల్లేదా?" విసుక్కుంటూ అరిచాడు ధీరజ్.
"అబ్బ వస్తున్నానండీ బంటి ఎక్కడికో ఆటలకి వెళ్ళాడు ఇంకారాలేదని చూస్తున్నా" అని చీర కుచ్చెళ్లు పెట్టుకుంటూ సమాధానమిచ్చింది రాణి. "అబ్బాయికి కాఫీ ఇవ్వమ్మా" అని కప్పు రాణి చేతికిచ్చింది పార్వతి.
"అమ్మా! ఇదిగో నీకోసం డైమండ్ నెక్లెస్, నాన్నకి డైమండ్ రింగ్, మీరు తిరగడానికి టాటా కారు వచ్చేవారం మన ఇంటి ముందుంటుంది. ఇందాక నా ఫ్రెండ్ బిల్డర్ ఒకడున్నాడు. వాడితో మన ఇంటిని మోడరన్ గా రీమోడల్ చేయడానికి ఎస్టిమేషన్ మాట్లాడాను. 6 లక్షలు అవుతుందన్నాడు. నేను రెండు దఫాలుగా పంపిస్తాను మీ టేస్ట్ కి తగినట్లు ఇంటిని రీమోడల్ చేయించుకోండి అని ఆపకుండా మాట్లాడుతున్న కొడుకుని విస్మయంగా, చూస్తూ వుండిపోయారు ఆనంద్, పార్వతి.
ముందుగా తేరుకున్న ఆనంద్ "ఎందుకు బాబూ! నీకు ఇంత ఖర్చు అంత దూరం నుంచి వచ్చావు. వచ్చినప్పటి నుంచి పనులు పెట్టుకొని తిరుగుతున్నావు. అయినా మీ అమ్మకి ఇవేమీ అక్కర్లేదురా! ఈ వయసులో ఈ డైమండ్స్, కార్లు, షికార్లు కొత్త హంగులు కాదురా కావాల్సింది. ఒక్కగానొక్క కొడుకువి నువ్వు ప్రయోజకుడివి అయ్యావు. లక్షణమైన కోడలు, ముద్దొచ్చే మనవడు. మా కింతకంటే కావాల్సిందేముంది? మేమూ రిటైరయిపోయాం. జీవిత పయనంలో అలసిపోయాం రా! నీ దగ్గరికి వచ్చి శేష జీవితం గడిపేయాలని మీ అమ్మ కోరిక. నా కోరికా అదే! ఏమంటావు?" అని కొడుకువైపు చూశారాయన.
ధీరజ్ నిర్లిప్తంగా వుండిపోయాడు. రాణి భర్త భుజం పట్టుకుని "మాట్లాడరేమండీ! మీ అమ్మ, నాన్న అంత ప్రేమగా మన దగ్గరికి వచ్చి ఉండిపోతామంటుంటే ఎగిరి గంతులేసి ఆహ్వానించాల్సింది పోయి అలా ముభావంగా ఉండిపోయారేం. నేనేమైనా వద్దంటానని అనుకుంటున్నారా! మనకి వాళ్ళు తప్ప ఎవరున్నారండి? నాకు వాళ్ళు మనతో ఉండడం చాలా ఇష్టమండీ. అసలు నేనే అత్తగార్ని మన దగ్గరికి వచ్చేయమని అడిగాను తెల్సిందా? బంటి కూడా 4 రోజుల నుంచి అత్తయ్య గారికి, మావయ్య గారికి బాగా మాలిమి అయిపోయాడు. మీ నాన్నగారి కథలతో, అత్తగారి పిండివంటలతో అమ్మ, నాన్నల్ని మర్చిపోయాడు తెల్సా! ప్లీజ్ అండీ, వాళ్ళని మనతో తీసుకెళదాం' అంటూ గలగల మాట్లాడేస్తుంది రాణి.
"రాణీ! నువ్వు కాస్త నోర్మూసుకుంటావా నాకు తెల్సు ఏం చేయాలో, అవతలకి వెళ్ళు నన్ను విసిగించకుండా" అని గట్టిగా విదిలించుకున్నాడు ధీరజ్.
రాణి చిన్న మొహం చేసుకొని బెడ్ రూంలోకి వెళ్ళిపోయింది. పార్వతికి, ఆనందరావుకి ఏదో కొంచెం కొంచెం అర్థమైనట్లు అన్పించింది కాని పూర్తిగా తెలియడం లేదు.
"ఏరా ధీరూ! పాపం రాణీని అంతలా కసిరేసావు, నాకు అయినా సమాధానం చెప్తావా? లేదా" అని పార్వతి చిరుకోపంతో అడిగింది.
"దేనికీ? నాన్నగారు అడిగిన దానికేనా! అదే అయితే నా నిర్ణయం కూడా వినండి. మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇక్కడే ఇండియాలో, మీ ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను. ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని డాలర్లు ప్రతినెలా పంపుతాను. మీరు గతంలో ఏయే సౌకర్యాలు, వస్తువులు కావాలనుకొని పొందలేకపోయారో అవన్నీ మీకు అందజేస్తాను. దేనికీ లోటు చేయను. కానీ...."ఆర్ధోక్తిలో ఆగిపోయాడు ధీరజ్.
"ఆపేశావేం? చెప్పరా! మీరు మాత్రం మాతో అమెరికా రావద్దు, నేను ఈ ముసలివాళ్ళని భరించలేను అంటావా? చెప్పరా!" ఆవేశంగా అరిచారు ఆనందరావు గారు. "అయినా మేం ముసలి వాళ్ళం కదా, మేము నీతో వస్తే నీ డిగ్నిటీకి భంగం. ఎంతయినా తల్లిదండ్రులం కదా. నువ్వు ఆ విషయాన్ని మర్చి పోయావని తెలీక పిచ్చి మొహంది నీ తల్లి బాబు దగ్గరికి వెళ్దామండీ అని ఆశపడింది. ఇప్పుడు తెల్సిందా పార్వతీ అడ్డాలనాడు బిడ్డలుగాని గడ్డాలనాడు కాదే! నీ ఆస్తులు, ఐశ్వర్యాలు కోసం మేం మొహం వాచిపోలేదురా! కన్న కడుపు తీపితో నీ ప్రేమాభిమానాల కోసం పాకులాడుతున్నాం రా!..." అన్నాడు ఆనందరావు.
"ఆపండి" అని ధీరజ్ గట్టిగా ఒక్క అరుపు అరవడంతో అందరూ ఉలిక్కిపడి భయంగా ధీరజ్ వైపు చూసారు.
"ఏంటీ కడుపు తీపా? ప్రేమ, అభిమానం? మీకా? ఎంత బాగా నటిస్తున్నారు నాన్నా! జీసస్ ఏం చెప్పారు 'ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును.' ఏనాడైనా నన్ను ప్రేమగా లాలించారా? నేను పుట్టిన నెలరోజులకే అమ్మ ఉద్యోగమే ముఖ్యం అనుకొని కేర్ సెంటర్ లో నన్ను పడేసి తన దారిన తాను ఉద్యోగానికి వెళ్ళిపోయింది. కొంచెం పెద్దయ్యాక ఆయాల అజమాయిషీ! నువ్వు, నీ ఉద్యోగం, ఓవర్ టైములతో నీ దారి నీదిగా ఉండేవాడివి. ఎప్పుడు క్రమశిక్షణ, మంచి అలవాట్లు అంటూ రెసిడెన్షియల్ స్కూల్ లోను, హాస్టల్ లోనూ నా బాల్యం, యౌవనం గడిచిపోయాయి. సెలవులకి ఇంటికి వచ్చినా కూడా మీ క్యాంపులు, మీ హడావిడులే గాని నన్నేనాడయినా దగ్గరకు తీసుకొని, ఆప్యాయంగా లాలించారా? ఎన్నో రాత్రులు అమ్మా, నాన్నా అని ఏడుస్తూ నిద్రలేకుండా గడిపాను తెలుసా. నాన్న చల్లని చూపుకోసం, అమ్మ వెచ్చని స్పర్శ కోసం నామనసెంత పరితపించిపోయిందో మీకేం తెల్సు? కష్టం సుఖం చెప్పుకోవడానికి, తోబట్టువులు లేరు. ఒంటరి జీవితం. మీ ఇద్దరూ డబ్బు సంపాదనే లక్ష్యంగా నిర్దేశించారే కాని నేనేమైపోతున్నానో, నాకేం కావాలో ఎప్పుడైనా గమనించారా? హాస్టల్ లో అందరూ సెలవులకి ఇంటికి వెళ్ళేవారు. నేను మాత్రం ఒంటరిగా..." కళ్ళ నీళ్ళు తిరిగిపోతుంటే మాట పూర్తి చేయలేకపోయాడు ధీరజ్. కాసేపటికి తేరుకుని "అందుకే, నాకు బాల్యం అన్నా, తల్లిదండ్రులు అన్నా ఇష్టం లేదు. నేను అనే ప్రాణిని భూమ్మీదకి రాకపోతే ఎంత బాగుండేది? నాకెవరున్నారు? మీ సుఖాలు చూసుకున్నారే గాని నాగురించి ఆలోచించారా? పోటీతత్వంతో నన్ను పెంచారు. మెడిసిన్ చదవడం ఇష్టమైతే మీ కోరిక మేరకు ఇంజనీరింగ్ లో చేర్పించారు. పెళ్ళి మీకు నచ్చిన అమ్మయితోనే చేసారు. అన్నీ చివరికి అమెరికా కూడా మీకు నచ్చినట్లుగా పంపారు. కొడుకుగా నాకేం కావాలో, నా ఇష్టాయిష్టాలేమిటో, ఏనాడయినా ఆలోచించారా? డబ్బుతో దేన్నయినా కొనగలం, సాధించగలం అనే అనుకున్నారు గాని ప్రేమ, ఆప్యాయతల్ని మర్చిపోయి ఈ రోజు మీరు వాటి గురించి మాట్లాడడం చాలా చాలా విడ్డూరంగా వుంది. మన మధ్య ఉన్నది రక్త సంబంధం, ప్రేమానుబంధం కాదు డబ్బు సంబంధం మీరు నాకు ఎంతో ఖర్చు పెట్టారు. ఇంతవాణ్ణి చేసారు అనుకుంటున్నారు కదా ఋణం తీర్చుకోవడానికే ఇండియా వచ్చాను. మీక్కావలసిన సౌకర్యాలు అన్నీ డబ్బుతోనే అమర్చి తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాను. నా పిల్లాడ్ని మాత్రం మీరు నన్ను పెంచినట్లు పెంచను. నాలా వాడికి బాల్యం చేదు జ్ఞాపకం కాకూడదు. నా భార్యని అందుకే ఉద్యోగం చేయనివ్వను వాడు పెద్దయి నాలా ఫీలవకూడదు. నేను పొందలేని ప్రేమాభిమానాల్ని వాడు పూర్తిగా పొందేలా చేస్తాను, చూస్తాను అన్నాడు" ఆవేశంగా!
"అయిందా, ఇంకా ఏమైనా ఉందా?" శాంతంగా అడిగారు ఆనందరావు. "ఏంటి? మాకు నీ మీద ప్రేమ, వాత్సల్యం లేవా? అవి లేకుండానే నువ్వు ఇంత వాడివయ్యావా? నీకసలు ఏం తెల్సని మాట్లాడుతున్నావురా?" కొంచెం ఆగి తిరిగి మొదలు పెట్టారు.
"మా ఇద్దరిదీ వర్ణాంతర వివాహం. అటు వాళ్లని, ఇటు వాళ్లని కాదని చేసుకున్న పెళ్ళి, అందరి శాపనార్ధాల మధ్య మొదలుపెట్టిన కాపురం. నాదా ప్రయివేట్ ఉద్యోగం. ఇద్దరం కల్సి ఉద్యోగాలకి వెళితే గాని నమ్మకంగా, ధైర్యంగా ఉండలేని పరిస్థితి. నువ్వు కడుపులో పడిన వేళా విశేషం మీ అమ్మకి ఉద్యోగం దొరికింది. మెటర్నిటీ లీవ్ నెల కంటే ఇవ్వలేదు ప్రయివేట్ స్కూల్ కావటంతో ఉద్యోగం వదులుకోలేదు. ఎందుకంటే నీ భవిష్యత్ కి మా ప్రేమ ఒక్కటే సరిపోదు కదా డబ్బు కూడా వుండాలి. నువ్వు పుట్టిన నెల రోజులకే మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళలేక ఎంత ఏడుస్తూ ఉద్యోగానికి వెళ్లిందో నీకేం తెల్సురా? కేర్ సెంటర్ స్కూల్లోనే వుండడంతో గంటగంటకీ నీ దగ్గరికి వెళ్లి వచ్చేది! మాకు వెనకాల ఆస్తులు లేవు! బాబూ మా పెద్దల తిట్లు తప్ప! మమ్మల్ని కాదని చేసుకున్నారు. ఎలా ఉంటారో, ఎలా పైకి వస్తారో చూద్దాం అని సవాళ్ళు విసిరేవారే కాని సాయం చేద్దామనే సహృదయులు మాకెవరూ లేరు. మేము ఆరోజు క్రమశిక్షణతో నిన్ను పెంచబట్టేరా నువ్వీ స్థితికి రాగల్గినది. మా అదుపాజ్ఞలు, కట్టుబాట్లు చూసావే గాని వాటి వెనకాల మా ప్రేమ, ఆత్మీయతని అర్థం చేసుకోలేకపోయావు. ఉన్నది ఒక్క నలుసు! ఎంతో గొప్పవాణ్ణి చేయాలి. నవ్విన నాప చేనే పండింది అని అనుకొనేటట్లుగా నిన్నుపెంచాలి అన్నదే మా తాపత్రయం. ఈరోజు నీకు ఉన్న స్థాయి, హోదా ఆ రోజు నాకుంటే మీ అమ్మ, ఉద్యోగం చేసేదే కాదు. నేనూ నీలాగ గొప్ప కబుర్లు ఎంతో బాగా చెప్పేవాణ్ణి. హాస్టల్ లో ఎందుకుంచామనేగా నీ ప్రశ్న? ఎప్పుడూ క్యాంపులని నేను, అమ్మ స్కూల్లో ప్రయివేట్లని వుండిపోవడం వల్ల నీకు సమయం ఇవ్వలేక పోతున్నామే దగ్గర ఉండి చదివించలేకపోతున్నామే అన్న బాధతో హాస్టల్ లో అయితే అందరితో కలిసి మెలిసి ఒంటరితనం పోగొట్టుకొని, బాగా చదువుకుంటావని పెట్టాంరా! 9వ క్లాసులో ఉన్నప్పుడు ఒక్కసారేనిన్ను సెలవులకి ఇంటికి తీసుకురాలేదు. ఎందుకో తెల్సా మీ అమ్మకి మేజర్ ఆపరేషన్ అయ్యింది. నువ్వు గాభరా పడతావని ఆ సంవత్సరం సెలవులకి నిన్ను తీసుకురాలేదు. అంత మాత్రానికే అమ్మ నాన్నకి ప్రేమ లేదు డబ్బే ప్రధానం అని ఎంత తేలిగ్గా అనేశావు ధీరూ మేము పోటీ తత్త్వంలో కాదురా నిన్ను చదివించింది. నువ్వు దేనికీ లోటు పడకూడదు. అమ్మ, నాన్న నాకు ఏమీ ఇవ్వలేదు. అందరిలా ట్యూషన్స్ పెట్టించలేదు. వాళ్ళు బాగా ఖర్చు పెట్టి వుంటే నేనివాళ ఇంకా ఎంతో గొప్పగా ఉండేవాణ్ణి అని కలలో కూడా అనుకోకూడదనే ఉద్దేశ్యంతోనే నిన్ను మా శక్తికి మించి చదివించాము. నీకు సైటు ప్రాబ్లం ఉండటంతో మెడిసిన్ కష్టపడలేవని ఇంజనీరింగ్ అయితే త్వరగా సెటిల్ అవడానికి అవకాశాలు ఎక్కువ అని నీ శ్రేయోభిలాషులుగా ఆలోచించి అలా చదివించాంరా! మా సంపాదన అంతా మేం జల్సాలు చేసుకోవడానికి కాదు నాన్నా, నీకోసం నీ భవిష్యత్ కోసం! నువ్వు చిన్నప్పుడు చదువులో చాలా వెనుకబడి వుండేవాడివి. మేం కూడా వీడు ఏదో ఒకటి చదివితే చాల్లే అని ఏ డిగ్రీయో చేయించి, నాలా క్లర్క్ ఉద్యోగం ఎక్కడో వేయించేస్తే ఎవరు అడుగుతారు? కాని నా పిల్లవాడు నా కంటే ఉన్నతంగా ఉండాలి. భవిష్యత్తులో ఎప్పుడూ. అయ్యో! మా వాళ్ళు నన్ను ఇలా తయారుచేశారేంటి అని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఫీలవకూడదు అని మా తాపత్రయమంత నీ గురించేరా! మా స్థాయికి మించి అప్పులు చేసి నిన్ను ఫారిన్ కూడా మా ఖర్చుతో పంపించాము. తర్వాత నువ్వే బాగా సంపాదిస్తున్నావు. ఇదేదో ఉద్ధరింపుగా మేము అనుకోవడం లేదు. ఇది మా బాధ్యత. మాదే కాదు ప్రతి తల్లిదండ్రుల కనీస ఖచ్చితమైన బాధ్యత. పిల్లల్ని కనగానే కాదు వాళ్ళని సరైన నడవడికతో పెంచి, చక్కని పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత. మీ నుంచి మేము ఆశించినది డబ్బు కాదు నాన్నా ప్రేమ. కాని బాబూ! నీరు పల్లమెరుగు అన్నట్లు ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల శ్రేయస్సునే కోరుతారు కాని, పిల్లలు మాత్రం, పెరిగి పెద్దయ్యి వాళ్ళ భార్య పిల్లల కోసం ఆలోచిస్తారే కాని కనిపెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించరు. కొంతమంది పిల్లలు అమ్మా నాన్న మాకేం ఇస్తారు? ఆస్తా, పాస్తా, మంచి చదువా? అంటూ ఎంతసేపు తల్లిదండ్రుల నుంచి మనం ఎంత పీల్చుకుంటున్నామా అనే ఆలోచిస్తారే గాని తల్లిదండ్రులకి మనం ఏం చేస్తున్నామని ఆలోచించరు. ఇది మీ తరం తప్పుకాదు. ఇదొక జీవన స్రవంతి. మేము మా తల్లిదండ్రుల కంటే నీకు ప్రాధాన్యత ఇచ్చినట్లే నువ్వూ నీ కొడుకు, కుటుంబం కోసం తాపత్రయ పడుతున్నావు. మంచిది బాబూ! నువ్వు ఆనందంగా నూరేళ్ళూ వర్ధిల్లడమే నాక్కావాలి. మేము ఎక్కడున్నా నీ సంతోషాన్ని, సుఖాన్నే కోరుకుంటాము. కాని ఎప్పుడూ కలలో కూడా అమ్మ నాన్నలకి నీ మీద ప్రేమ లేదు అని అనుకోకు. నువ్వే మా ప్రాణం, సర్వస్వం! ఈ బంధాలు, ఆత్మీయతలు చాలా సున్నితమైనవి ధీరూ! డబ్బుతో కొనలేనివి, వెలలేనివి. ఇంతసేపూ, నిన్నేదో మభ్య పెట్టాలనో, లేదా నీ దగ్గర ఉండడానికి ఏవో మాయ మాటలు చెప్తున్నాననో పొరపాటున కూడా అనుకోకు. సమయం వచ్చింది కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది. ఆ పైన ఏమనుకున్నా నీ ఇష్టం" అని భారంగా విశ్వసించి లేచారు ఆనందరావు గారు.
అప్పటికే సిగ్గుతో, గిల్టీ ఫీలింగ్ తో కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతున్న హైటెక్కు కొడుకు ధీరజ్ తండ్రిని సమీపించి "నాన్నగారూ! నేను ఎంత అవివేకినో, అజ్ఞానినో నాకు ఇప్పుడే తెలిసింది. నేను చాలా మూర్ఖంగా ఆలోచించి అమ్మని, మిమ్మల్ని నా మాటలతో, ప్రవర్తనతో చాలా బాధపెట్టాను. మీరు అహరహము నా అభ్యున్నతి కోసం ఎంతో పాటు పడ్డారు. ఇప్పుడు కొడుకుగా నా కర్తవ్యం నిర్వర్తించే అవకాశం నాకు కల్గచేయండి!" నన్ను క్షమించి మాతో పాటు మీరూ అమెరికా బయలుదేరండి. అంటూ తల్లిదండ్రుల పాదాల మీద వాలిపోయాడు.