కొత్తలోకం - కర్రా నాగలక్ష్మి

kottalokam

అమ్మమ్మా ......... అంటూ కాళ్లకు చుట్టుకున్న రెండు చిన్న చేతులు తప్పిస్తూ దేశం కాని దేశం లో యీ పిలుపేంటి ? , అని ఆలోచనలో పడింది ప్రసన్న .

అప్రయత్నంగా ఆ పాప వెన్నును సున్నితంగా నిమరసాగేయి ప్రసన్న చేతులు .

ప్రసన్న నుంచి జవాబు రాకపోవడంతో యింగ్లీషు యాసలో ' అమ్మమ్మ ...... నువ్వు అమ్మమ్మ....... కాదా ? ' అంటూ కాస్త వెనుకడుగు వేసింది పాప .

అయిదారేళ్లుండొచ్చు , పాపని చూడగానే యేడాది కిందట ఓ పంక్షనులో అమ్మమ్మా అంటూ తన చుట్టూ తిరుగుతూ ఆడుకున్న పాప సరయు గుర్తొచ్చింది ,' నువ్వు సరయూ వా ? .... ' ఆశ్చర్యంగా అంది ప్రసన్న .

' ఔను అమ్మమ్మా..... ' అంటూ మళ్లా ప్రసన్న చీర కుచ్చెళ్లలో మొహం దాచుకుంది సరయు .

సరయుని పొదవి పట్టుకొని చుట్టూ చూసింది ప్రసన్న సరయు తల్లి యెక్కడైనా కనిపిస్తుందేమో అని , చుట్టుపక్కల సరయు తల్లి జాడ కనిపించక పోవడంతో ' అమ్మేది సరయూ ' నెమ్మదిగా అడిగింది ప్రసన్న .

నీళ్లు నిండిన కళ్లతో అమ్మేమో...........అమ్మేమో....' అంటూ చేతులు తిప్పుతూ యేదో అనబోయింది సరయు . యేదైనా షాపులోకి వెళ్లిందేమో ? చుట్టూ వున్న షాపుల వైపు చూడసాగింది ప్రసన్న .

యెదురుగా వున్న షాపులోంచి వచ్చినతను ' సరయు యింటికి వెళదాం పద ' అంటూ గబగబా పాపను బయటకి తీసుకు పోసాగేడు . తనున్న ప్రదేశాన్ని కూడా మర్చిపోయి ' పాపకు యెంత గుర్తో చూసేరా ? కిందటి సంవత్సరం ఓ పంక్షన్లో కొన్ని గంటలు నన్ను అమ్మమ్మా అని పిలుస్తూ ఆడుకుంది , సుమారుగా యేడాది తరువాత నన్ను పోల్చుకొని మళ్లా అమ్మమ్మా అంటూ నన్ను చుట్టుకుపోయింది ' ఉద్వేగం నిండిన కంఠంతో అంది ప్రసన్న .

" మీరు యెవరిని చూసి యెవరనుకున్నారో ? మేం యే పంక్షన్స్ కు వెళ్లం " పాప ను గుంజుతూ అన్నాడు .

పాప యేడాది తర్వాత పలకరించడమే నమ్మలేకుండా వుంటే , అతనెందుకలా చిర్రుబుర్రు లాడుతూ పిల్లని గుంజుకు వెళ్లాడో అస్సలు అర్దంకాలేదు .

పక్కనున్న బెంచి మీద కూర్చొని మనవడితో పాటు అక్కడ ఆడు కోడానికి వచ్చిన విదేశీ దేశీ పిల్లల వైపు దృష్టి సారించింది ప్రసన్న . అదో పెద్ద మాల్ , అమెరికా లో వున్న అన్ని బ్రాండుల షాపు లూ అందులో వున్నాయి . . క్రిందనే పిల్లలు ఆడుకోడానికి మెత్తని ప్లాస్టిక్ తో చేసిన బొమ్మలు అమర్చిన పార్క్ , పిల్లలు పడిపోయినా దెబ్బలు తగలకుండా యెంత బాగుందో .

కళ్లు కిందామీదా పడి ఆడుకుంటున్న పిల్లలను చూస్తున్నా మనసు మాత్రం గతం లోకి పరుగెత్తింది .

కిందట సంవత్సరం కోడలు పని చేస్తున్న కంపెనీ యేర్పాటు చేసిన పిక్నిక్ లో సరయు తల్లి పరిచయం అవడం , కోడలితో పాటు యేర్పాట్లలో బిజీగా తిరుగుతూ వుంటే సరయు మాత్రం మనవడితో పోటీగా తన ఒళ్లో కూర్చొని ఆడుకోవడం . మనవడితో పాటు తన ఒడిలోనే నిద్రపోవడం యెంత ఆశ్చర్యాన్ని కలుగ జేసిందో మళ్లా యివాళ అమ్మమ్మా అని పిలిచి అంత ఆశ్చర్యానికి గురిచేసింది .

మాల్ నుంచి యింటికి చేరిన తరువాత కూడా ఆలోచనలు సరయూ చుట్టూ తిరగ సాగేయి .పెద్దల యిగోలకి బలైన చిన్ని మందారం అనుకోడం తప్పయేమీ చెయ్యలేని నిశ్సహాయత . మనవడి ముద్దుమురిపాలతో అయిదు నెలలు అయిదు నిముషాల్లా గడిచిపోయేయి . తిరుగు ప్రయాణం రోజులలోకి వచ్చింది .

నలభై యేళ్ల వైవాహిక బంధం కన్నా నాలుగేళ్ల మనవడి బంధం యెక్కవై దిగులు కలిగిస్తోంది . ఇరుగు పొరుగులకు యేదైనా కొనాలనే ఆలోచనలో మాల్ కి వచ్చింది ప్రసన్న .

' నానమ్మా , వాళ్లని వెళ్లనీ గిఫ్ట్ లు కొనడానికి మనిద్దరం యిక్కడ ఆడుకుందాం ' అన్న మనవడి మాటలకి గుండె పట్టేసినట్టై " మీరు వెళ్లి యేదోవొకటి తెచ్చెయ్యండి " అంటూ మనవడి వెనకాల నడిచింది ప్రసన్న .

ప్లే యేరియాలో కి అడుగు పెడుతూనే ఆటలలో మునిగి పోయేడు మనవడు .

' అమ్మమ్మా ....' అన్న పిలుపు చెవిలో పడింది , సరయూవా ? అనుకుంటూ తల తిప్పిన ప్రసన్నని చుట్టుకు పోయింది సరయు .

యిదేం పిల్ల , యింత జ్ఞాపక శక్తేమిటి ? అనుకుంటూ వెన్ను నిమర సాగింది ప్రసన్న .

' తల్లీ సరయూ నువ్వెళ్లి ఆడుకోమ్మా , అమ్మమ్మ యిక్కడే వుంటారులే , ఎయిట్ కి ప్లే ఏరియా మూసేస్తారుగా ' మృదువుగా అంటున్న సరయు తండ్రిని నమ్మలేనట్లుగా చూసింది ప్రసన్న .

సరయూ ఆటలో నిమగ్నమవగానే ప్రసన్న వైపు తిరిగి ' నమస్తే ఆంటీ , నా పేరు సుగుణకుమార్ , అందరూ కుమార్ అనిపిలుస్తారు ' అంటూ ప్రక్కనే కూర్చున్నాడు .

సుగుణకుమారో దుర్గుణకుమారో నాకెందుకు నీపేరు , అవేళ అంత రూడ్ గా బిహేవ్ చేసి యివాళ యింత శాంతమేమిటో ? అనుకోకుండా వుండలేకపోయింది ప్రసన్న .

' మంచి మర్యాద లేకుండా కిందటి సారి విదిలించుకు పోయినవాడు యీ సారేమిటి యింత మర్యాదగా మాట్లాడు తున్నాడు అనుకుంటున్నారా ఆంటీ ? ' తన మనసు చదివినట్లు అంటున్న అతనిని విస్మయంగా చూసింది ప్రసన్న .

తను ఊహించుకున్నంత దుర్మార్గుడైతే కాదు , మనిషి మంచాడిలాగే కనిపిస్తున్నాడు , సరే అతనే పలకరించేడుగా , విషయమేదో అతన్నే చెప్పనీ అనుకుంటూ మౌనంగా వూరుకుంది ప్రసన్న .

నాకు తెలుసాంటీ , కిందటి సారి నా ప్రవర్తన మీలో యెన్నో సందేహాలను కలిగించి వుంటుందని , అప్పుడు యేం చేస్తే సరయు గతాన్ని మరిచిపోతుందో తెలియని అయోమయ స్థితిలో వున్నాను . పసి దాని మనసులోంచి శాంతి జ్ఞాపకాలను తుడిచెయ్యాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు , ఇంట్లో శాంతికి సంబంధించిన వస్తువులన్నీ తీసేసేను . శాంతిని మరిచిపోయిందని అనుకొనే సమయంలో యేడాదిన్నర కిందట కలిసిన మిమ్మల్ని పలకరించడం చూస్తే గతం మరచిపోలేదని అనిపిస్తోంది . అలా అని అమ్మకావాలని హఠం చెయ్యడం కాని యేడవడం కాని చెయ్యదు దీన్ని యెలా అర్దం చేసుకోవాలో తెలియటం లేదు ' నిర్వేదంగా అన్నాడు కుమార్ .

సరయు పిల్లలందరితో కలిసిపోయి ఆడుకుంటోంది . ఏ పొరపొచ్చాలూ లేకుండా ఆడుకుంటున్న పిల్లలను చూసి పెద్దలు యెన్నో జీవిత సత్యాలు నేర్చుకోవచ్చు .

మెల్లగా పదాలు కూడదీసుకుంటూ ' శాంతిని యెందుకు మర్చిపోవాలి సరయు ? ' అడగడమైతే అడిగింది గాని అతని రియాక్షన్ యెలా వుంటుందో అని భయపడింది ప్రసన్న .

' ఆంటీ మీరు పెద్దవారు , సరయూకి మీరంటే యిష్టం , మీరిచ్చే సలహా నిష్పక్షపాతంగా వుంటుందనే ఆశతో మీతో నా సమస్య పంచుకోవాలని అనుకున్నానాంటీ .

ప్రసన్నకి టెన్షన్ తో నరాలు తెగేలా వుంది . అసలు శాంతి యేమయింది ఆవిషయం చెప్పడే , సరయు యెందుకు మరచిపోవాలి , సలహా అంటాడు , వ్యవహారం విడాకుల వరకు వెళ్లిందా ? పిల్లని నాలుగురోజులు అక్కడ , మూడురోజులు యిక్కడ అని పంచుకుంటారు కబోలు , హారి దేవుడా ! జీవంవున్న పిల్లలు , యిళ్లు పొలాలు కారు , మీ యిష్టం వచ్చినట్లు పంచుకోడానికి , ఆవేశం కలిగింది ప్రసన్నలో .

" శాంతి నువ్వు విడాకులు తీసుకోవాలను కున్నరా ? , మీ యిగోలను దూరంగా పెట్టి మీ పిల్లలకోసం కలసి వుండలేరా ? " తెచ్చి పెట్టుకున్నశాంతం తో ప్రశ్నించింది ప్రసన్న .

'కాదు కాదు కాదు ' గబగబా అన్నాడు కుమార్ , ' నెలలు నిండిన శాంతి మేడ మెట్లు దిగుతూ కాలు జారి కిందపడిందాంటి , మాకు ప్రాప్తం లేదు డాక్టర్లు తల్లిని బిడ్డనీ రక్షించలేక పోయేరు ' . పోకెట్ రుమాలులో మొహం దాచుకున్నాడు కుమార్ .

ఒక్కసారి గుండె ఆగి కొట్టుకొన్న అనుభూతికి లోనయింది ప్రసన్న .

' అదేంటయ్యా మీతరం వారు పిల్లలకి నిజాలే చెప్పాలి , అప్పుడే వారిలో ధైర్యసాహసాలు పెరుగుతాయి లాంటివన్నీ అంటూ వుంటారు కదా , మరి నువ్వు తల్లి చనిపోయిన విషయం సరయు కి చెప్పలేదా ? ' .

' చెప్పలేదాంటి , ఒక్కరోజు కూడా అమ్మేదని అడగలేదు , యెప్పుడొస్తుందనీ అడగలేదు ,

కిందటి సారి సరయు మిమ్మల్ని పలకరించేంత వరకు శాంతిని మరచిపోయిందనే అనుకున్నాను , అందుకే పాపని తీసుకెళ్లిపోయేను ' .

' యేదో యిన్నాళ్లూ ఉడికీవుడకని తిండిపెట్టి పెంచుకున్నాను , యిలా యెన్నాళ్లు అనే ప్రశ్న తరచూ వేధిస్తోంది ' .

' నువ్వు చెప్పింది నిజమేనయ్యా , పాపని తల్లి లేకుండా యిన్నాళ్లు పెంచడమే గొప్ప , నీకు తోడు , సరయుకి తల్లి అవుసరం యెంతో వుంది

, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో , ఆ వచ్చే ఆమె నీకు భార్యగా కాక పాపకు తల్లిగా వుండేటట్లు చూసుకో ' .

' చూసుకున్నా ఆంటీ , కష్టం సుఖం చూసిన అమ్మాయిని , మా వాళ్లకి యిష్టం లేదు , సరయు యెలా రియాక్టవుతుందో తెలియడం లేదు , యీ మధ్య నాకు శీతల్ అనే ఆమెతో పరిచయం యేర్పడింది , ఆమె డైవోర్సీ , డౌరీ గొడవల వల్ల యేడాది బాబుతో భర్తకు విడాకులిచ్చి రెండేళ్లుగా ఒంటరిగా వుంటోంది , సరయూ కి కూడా ఆమంటే యిష్టమే , నేను టూర్లకి వెళ్లినప్పుడు వాళ్లింట్లో వుంచి వెళుతున్నాను , బాబుతో కూడా బాగానే వుంటోంది , కాని ఆంటీని అమ్మగా అంగీకరించగలదా ? అనేదే నాముందున్న సమస్య .

ఒక్కసారి ప్రసన్న తల తిరిగింది , నిజమే పెద్ద సమస్యే , సున్నితమైంది కూడా !

' వయసు వస్తున్న ఆడపిల్లకు తల్లి అవుసరం యెంతైనా వుంది , ఆ విషయం పాపకి అర్దమయేటట్లు చెప్పలేనేమో అనే భయం , చెప్పిన తరువాత సరయు రియాక్షను యెలా వుంటుందో అనే భయం . ఎందుకో యీ విషయంలో మీరే సహాయం చెయ్యగలరు అని అనిపించింది . అందుకే నాలుగు రోజులుగా మీకోసమే పాపను తీసుకొని యిక్కడకు వస్తున్నాను . ఈ విషయంలో నాకేమైనా సహాయం చెయ్యగలరా ఆంటీ ? '

ఆలోచనలో పడింది ప్రసన్న . ఎప్పుడో ఒకప్పుడు యీ ప్రశ్న సరయు యెదుర్కోవలసిందే , జీవితంలో మూడోవంతు కూడా గడపని కుమార్ కి తోడు అవుసరమే , ఆరేళ్ల సరయూకి తల్లి అవుసరమే , సరయూకి తల్లిగా వుండడానికి శీతల్ కి , బాబుకు తండ్రి ప్రేమను యివ్వడానికి కుమార్ కి కావలసిన మానసిక పరిపక్వత వుందా ? అనేది తేల్చుకోవాలి , యివాల్టి మాట రేపటికి , యెల్లుండికి వుంటుందా ? .

మెల్లగా తనలో కలిగిన సందేహాలను కుమార్ ముందు పెట్టింది ప్రసన్న .

' ఆంటీ , ప్రేమ అంటే శారీరిక ఆకర్షణ , కలలు అనే తప్ప సర్దుబాట్లు , కష్టాలు వుంటాయని తెలియని పసితనం లో లేం , నలభైలలో అడుగు పెడుతున్న వారం , జీవితంలో ఒడిదుడుకులను చూసినవారం , యిద్దరం జీవితంలో దెబ్బతిన్న వారమే , పిల్లలకి తల్లితండ్రుల అండదండల అవుసరం తెలిసినవారమే కాబట్టి యివాళటి మాట జీవితాంతం వుంటుందనే విశ్వాసం నాకుంది ' .

కుమార్ లోని ఆత్మవిశ్వాసం నచ్చింది ప్రసన్నకి , శీతల్ ని చూడకపోయినా ఆ అమ్మాయి సరయు కి తల్లికాగలదనే నమ్మకం కలిగింది .

' సరే నాప్రయత్నం నేను చేస్తాను , ' హోప్ ఫర్దబెస్ట్ ' , పాపను డిన్నరు బ్యాగిచ్చి పంపించు ' అంది ప్రసన్న .

' అమ్మమ్మ మామ్ము యిస్తారు తిన ఆడుకో , నేను పదినిముషాలలో వస్తా యేం , బిహేవ్ లైకె గుడ్ గర్ల్ ' అని కుమార్ సరయుని ప్రసన్న దగ్గర వదిలి వెళ్లిపోయేడు .

' దా... దా..... బేగులో యేం తెచ్చుకుంది సరయూ చూడనీ , వావ్ క్రీమ్ బిస్కెట్స్ , ఊ........ యింకా ఫ్రూట్స్ యింకా ........ '

' అమ్మమ్మా ....... అమ్మమ్మా బాక్స్ లో దాల్ రైస్ వుంది అది తనిపించవా ? , అని మెల్లగా ' నాకు తినిపించవా. ....... , నువ్వు తినిపిస్తే తినాలనుంది అమ్మమ్మా , మళ్లా యెప్పుడు కనిపిస్తావో ' తలవంచుకుని నెమ్మదిగా అంది . కళ్లల్లో తిరగబోతున్న నీటిని కళ్లల్లోనే ఆపి , యేనాటి బంధం యిది " అలాగేరా సరయూ దా ... దా ... దాల్రైస్ తింటూ మాట్లాడుకుందాం , దాల్రైస్ అంటే సరయూకి యిష్టమా ? అంటూ స్పూన్తో పెట్టసాగింది .

' అస్సలు నాకు దాల్ రైసు నచ్చదు అమ్మమ్మా , కాని యీ దాల్ రైసు యెవరు చేసేరో తెలుసా ఆద్విక్ మమ్మీ , అదే శీతల్ ఆంటీ అందుకే నాకిష్టం , యిప్పుడేం నాకు రోజూ దాల్ రైసు తినడం యిష్టం .

అమ్మో దీని కడుపు నిండా కబుర్లే , యీ కాలం పిల్లలే యిలా వున్నారో యేమిటో నాలుగేళ్లు నిండని కార్తి గాడూ యింతే కామాలు పులుస్టాపు లేకుండా మాట్లాడతాడు , అంతేనా తను మాట్లాడే యింగ్లీషు బాగులేదని చెయ్యడ్డం పెట్టుకొని నవ్వడం వొకటి . తమ కాలానికి తమ పిల్లల కాలానికి భావవ్యక్తీకరణలో చాలా మటికి స్పష్టత వచ్చింది . ఈ కాలం పిల్లలు తమకు యేం కావాలో చాలా చక్కగా స్పష్టంగా చెప్పగలగడం చూస్తే ఆశ్చర్యంగా వుంటుంది ప్రసన్నకి .

పెద్దగా కష్టపడక్కరలేకుండానే శీతల్ ప్రశక్తి రావడం శుభసూచకంగా అనిపించింది ప్రసన్నకి .

' సరయూకి యింకేంటేంటి యిష్టం '

' సరయూకా........ సరయూకేమో , అమ్మంటే యిష్టం ....కాని అమ్మ చనిపోయిందిగా..... అందుకు డాడీ అంటే యిష్టం , బుజ్జి ఆద్విక్ అంటే యిష్టం . ఆద్విక్ తో ఆడుకుంటూ ఆద్విక్ మమ్మీని మమ్మీ అని పిలవడం యిష్టం , ఆద్విక్ కి నాడాడీ అంటే యెంతిష్టమో తెలుసా ? డాడీ బుజాలెక్కి ఆడుకోడం , డాడీ వళ్లో తలపెట్టుకు నిద్రపోడం , నేను పాటపాడితే డాన్స్ చెయ్యడం , దీదీ దీదీ అని పిలుస్తూ నావెనుకే తిరుగుతాడు తెలుసా ? నాకు వాడంటే యిష్టం . వాడికి నేనంటే యిష్టం . మా యిద్దరికీ మమ్మీ డాడీ కావాలి . మరి మేం అంతా కలిసి ఒకే యింట్లో వుండకోడదా ? నువ్వు చెప్పు అమ్మమ్మా " . డాడీ నేనూ , ఆద్విక్ మమ్మీ ఒకే యింట్లో వుంటే యిష్టం . అమ్మమ్మా యేం అలా వుండకూడదా ? , నాకు నువ్వన్నా కూడా యిష్టమే '

పెద్దపెద్ద కళ్లను మరింత విశాలంగా చేస్తూ అంది సరయు .

ఏమి తెలియని చిన్న పిల్ల అని తమనుకుంటున్న సరయు లో యెన్ని ఆలోచనలో అనుకుంది ప్రసన్న .

" మరి సరయూ కి యిష్టం లేనివేమిటో "

" అమ్మమ్మా సీక్రెట్ , సీక్రెట్ అంటే తెలుసుగా యెవ్వరికీ చెప్పకూడదు , డాడీకి కూడా యేం , నాకు డాడీఅమ్మ యిష్టంలేదు , యెందకంటే డాడీ శీతల్ ఆంటీని పెళ్లి చేసుకుంటానంటే వొద్దని బాగా యేడ్చిందిగా , తరవాత డాడీ మామ్ము తినిపిస్తే తిని కావాలంటే ఆద్విక్ ని యెక్కడైనా విడిచిపెట్టి శీతల్ ని పెళ్లి చేసుకోమంది , నాకు చాలా యేడుపొచ్చింది తెలుసా ? '

తన్ని మాట్లాడ నివ్వకుండా అన్నీ తన మాట్లాడేస్తున్న సరయూని ఆశ్చర్యంగా చూడడం తప్ప యేం మాట్లాడ లేక పోయింది . ఇంత చిన్నపిల్లల ఆలోచనలో క్లారిటీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది .ఇంత చిన్న పిల్ల అంతపెద్ద సమస్యకి యెంత సులువుగా పరిష్కారం చూపించింది . ఏ యిగో లు లేని మనసులే యింత చక్కని పరిష్కారాన్ని చూపించగలవేమో . అందుకే పిల్లలూ దేముడూ ఒకటే అన్నారు . కుమార్ వచ్చేంతవరకు సరయూతో మాట్లాడుతూ గడిపింది ప్రసన్న .

' రోగి కోరినదే డాక్టరు యిచ్చాడు ' కుమార్ ని చూస్తూ అంది ప్రసన్న .

' ఇప్పటికైన ఆలస్యం చాలుగాని మంచిరోజు చూసి దండలు మార్చుకోండి ' అంది ప్రసన్న .

' నానమ్మా , మామ్ము ' అంటూ వచ్చిన మనవడికి భోజనం తినిపించసాగింది ప్రసన్న .

బొజ్జ నిండిన సరయు తిరిగి ఆటలలో పడింది .

అమెరికాలో పుట్టి పెరుగుతున్న నేటి పిల్లలు యింగ్లీషు తప్ప మరోభాష మాట్లాడరు , కాని మామ్ము , బొజ్జో పెట్టు అనే పదాలు వాడి అమ్మమ్మలను , నానమ్మలను కాకా పట్టడం బాగావచ్చు .

' మనమనుకున్నంత అమాయకురాలు కాదయ్యా నీకూతురు , తనకి కావలసినదేమిటో చాలా చక్కగా చెప్పింది . శాంతి చనిపోయిన విషయం కూడా దానికి తెలుసు . మనస్పూర్తిగా శీతల్ ని తల్లిగా అంగీకరించడానికి సిద్దంగా వుంది . ఈ శ్రావణమాసంలో మంచిరోజు చూసుకొని యిద్దరూ ఒకటవండి , పెద్దవాళ్ల సంగతా ? కొన్నాళ్లు కోపంగావున్నా తరువాత వాళ్లే సర్దుకుంటారులే ' అంది .

' రేపు వెళ్లి వెసక్టమీ చేయించుకొని అప్పుడు పెళ్లి గురించి శీతల్ తో మాట్లాడుతానాంటీ '

' అదేంటి యిప్పడు ఆ ప్రస్తావన యెందుకు ' ఆశ్చర్యంగా అంది ప్రసన్న .

' మీ దగ్గర దాపరికం యెందుకు గాని , మాది అనే బిడ్డ మీద మమకారం యెక్కువై , నా , నీ అనే తేడాలు వస్తాయేమో అని ....... ' .

' అయ్యయ్యో యెంతమాటన్నావయ్యా ? , నువ్వు జీవితంలో కాస్తో కూస్తో ప్రేమను చవి చూసేవు , దాని ప్రతిఫలం సరయు , కాని శీతల్ ద్వేషాన్నే చూసింది , దాని ప్రతిఫలమైన ఆద్విక్ ని అసహ్యించుకోకుండా తల్లి ప్రేమను అందిస్తోంది , రాదనుకున్న వసంతం శీతల్ జీవితంలోకి నీ రూపంలో అడుగు పెడుతూ వుంటే , లేదనుకున్న బంధం పెనవేసుకుంటూ వుంటే పుష్పంచి ఫలించాలని యే లత కోరుకోదు చెప్పూ ? , ఆమె పరిపూర్ణ మాతృమూర్తి , ఆమె మీద యెటువంటి అపనమ్మకం పెట్టుకోకు .

నువ్వు నేనూ కలిస్తేనే మనం అవుతాం , ఆ ప్రయత్నమే ఆమె చేస్తోంది , కాదనకు . మీ పెంపకం లో పెరిగిన పిల్లలు తప్పకుండా ఉన్నత శిఖరాలను అందుకుంటారు . ఏ ఆలోచనలకు తావియ్యకు , నీ వెనకే కొన్ని వేల అడుగులు అనుసరిస్తాయనే ఆలోచనతో ముందడుగు వెయ్యి . ఆల్ ద బెస్ట్ , అదిగో మా వాళ్లొస్తున్నారు . నా ఆశీస్సులు యెప్పుడూ మీ కుటుంబానికి వుంటాయి . బై ..... నాన్నా సరయూ బై ..... ' చేయి వూపుతూ తన వాళ్లతో ముందుకు సాగి పోయింది ప్రసన్న .

మరిన్ని కథలు

Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు