భుజం మీద పెద్ద సంచిని మోస్తూ ఒక ఇంటి ముందు కూర్చున్నాడు ప్రసాద్. ఎండ విపరీతంగా మండి పోతుంది. సూర్యుడు తన ప్రతాపం పూర్తిగా చూపిస్తున్నాడు. వీధి నిర్మానుష్యంగా నిస్తేజంగా ఉంది. దాదాపు మూడు గంటల నుంచి విశ్రాంతి లేకుండ తిరిగాడు ప్రసాద్. అనుకున్న దానికంటే చాల వస్తువులు అమ్మాడు. కాని ఇంకా కొన్ని మిగిలి పోయాయి. వాటిని కూడా పూర్తి చెయ్యాలి. అప్పుడు కాని అతని డ్యూటి పూర్తి కాదు.అప్పుడు కాని ఇంటికి వెళ్ళలేడు.
చెమటతో అతని బట్టలు పూర్తిగా తడిసి పోయాయి. వేడి సెగలు చెంపలను అదరగొడుతున్నాయి. దాహంతో నోరు ఆర్చుకు పోతుంది. చుట్టు పక్కల చూశాడు. ఏ ఇంటి తలుపులు తెరిచి లేవు. మెల్లగా లేచి గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. తలుపు మీద మెల్లగా తట్టాడు. క్షణం తరువాత తలుపులు తెరుచుకున్నాయి. ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆమెకు దాదాపు ఇరవై అయిదు సంవత్సరాలు ఉంటాయి. చాలా అందంగా నాజుకుగా ఉంది. మొహంలో చాలా ప్రశాంతగా ఉంది. చప్పున చూస్తే ఎవరికైన ఆమె మీద సదభిప్రాయం కలుగుతుంది.
“సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్. చాలా దాహంగా ఉంది. ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇవ్వండి’అన్నాడు ప్రసాద్.
“లోపలకి వచ్చి కూర్చో”అంది ఆ అమ్మాయి.
“ఫర్వాలేదు. నేను ఇక్కడే ఉంటాను”అన్నాడు మొహం మాటంగా. అయిన ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. లోపలికి వచ్చి కూర్చోమని మరి బలవంతం చేసింది. భుజం మీద సంచితో లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఇల్లు చిన్నదైన అందంగా పొందికగా ఉంది. ఎక్కడి వస్తువులు అక్కడ నీట్ గా సర్ది ఉన్నాయి. ప్రసాద్ దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. లోపలికి వెళ్ళిన అమ్మాయి క్షణం తరువాత ఒక ప్టేటులో కొన్ని బ్రెడ్ ముక్కలు వేడి పాలు తీసుకు వచ్చింది.
“నాకు ఒక గ్లాసు మంచి నీళ్ళు చాలు మేడం”అన్నాడు కంగారుగా ప్రసాద్.
“ఫర్వాలేదు. ఎండనపడి వచ్చావు. బాగా ఆకలి మీద ఉన్నావని నీ మొహం చూస్తుంటే తెలుస్తోది. పరకడుపున మంచి నీళ్ళు తాగటం మంచిది కాదు. ఇది తిని పాలు తాగు”అంది ఆప్యాయంగా.
ప్రసాద్ కళ్ళు చెమర్చాయి. ఎవరు అతనితో ఇంత అప్యాయంగా మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళిన అందరు చీదరించుకునే వారే ఎదురు పడ్డారు. ప్లేటు అందుకుని గబగబ బ్రెడ్ ముక్కలు నోట్లో పెట్టుకున్నాడు. మంచి నీళ్ళు తాగిన తరువాత వేడి పాలు తాగాడు.
“వస్తాను మేడం”అన్నాడు ప్రసాద్.
“జాగ్రత్తగా వెళ్ళు. చదువుకుంటున్నావా”అడిగింది.
“నైట్ కాలేజిలో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. పగలు సేల్స్ మెన్ ఉద్యోగం చేస్తూ నా ఖర్చులకు సంపాదించుకుంటున్నాను. ఎలాగైన డాక్టర్ కావాలని నా ఆశయం”అన్నాడు ప్రసాద్.
“నీ ఆశయం తప్పకుండ నెరవేరుతుంది. నీ కష్టం ఊరికేపోదు”అంది ఆమె.
ఆమె మాటలు వినే సరికి ప్రసాద్ కు మరింత ఉత్సాహం వచ్చింది. తన గురించి ఇంకా చెప్పాడు.
“చిన్నతనం నుంచి నేను అనాధను. ఎవరికి పుట్టానో తెలియదు. నా కన్నతల్లి నన్ను గుడిమెట్ల మీద విడిచి పెట్టి వెళ్ళిపోయింది. ఒక పెద్ద మనిషి మహానుభావుడు నన్ను ఒక అనాధ ఆశ్రమంలో చేర్పించాడు. ఆ రోజు నుంచి అక్కడే పెరిగాను. వాళ్ళు పదో క్లాసు వరకు చదువు చెప్పించారు. ముందు నుంచి బాగా చదువుకుని మంచి డాక్టర్ కావాలని నా కోరిక. అందుకే ఎన్నో కష్టాలు అవమానాలు భరిస్తూ చదువు కొనసాగించాను. నా కష్టం వృధా కాలేదు. టెన్త్ క్లాసులో పది మంది టాపర్స్ లో ఒకడుగా నిలిచాను. నా విజయం చూసి అందరు సంతోషించారు. విపరీతంగా మెచ్చుకున్నారు.
అదే సమయంలో ఒక దుర్వార్త కూడా చెప్పారు. టెన్త్ క్లాసు తరువాత పై చదువులు చెప్పించే వసతి అనాధ ఆశ్రమానికి లేదని ఖచ్చితంగా చెప్పారు. నా గుండెలు అవిసిపోయాయి. ఏం చెయ్యాలో తోచలేదు. నా ఆశయం ఎలా నెరవేర్చుకోవాలో తెలియలేదు. ఇంకా ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలని తీర్మానించుకున్నాను. అందుకే ఉద్యోగం కోసం ప్రయత్నించాను. చాలా కష్టపడిన తరువాత ఈ సెల్స్ మెన్ ఉద్యోగం దొరికింది. నెలకు జీతంతో పాటు అమ్మిన దాని మీద కొంచం కమీషన్ కూడా వస్తుంది.
సంపాదించుకున్న డబ్బుతో రాత్రి కాలేజిలో చేరాను. సాయంత్రం అయిదుగంటలవరకు ఈ పని చేస్తాను. తరువాత నా యజమాని దగ్గరకు వెళ్ళి లెక్కలు చూపిస్తాను. తరువాత కాలేజికి వెళ్తాను.ఒక చిన్న గదిలో ఉంటున్నాను. నేను ఆశ్రమం నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆశ్రమం యజమాని నా పుట్టుక గురించి చెప్పాడు. చాల బాధపడ్డాను. నా తల్లి నన్ను కని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయింది. అయిన నాకు నా తల్లి మీద కోపం లేదు. ఆమె నిస్సహయ స్దితి తలుచుకుని బాధపడుతున్నాను.”
“నా కన్నతల్లి ఎవరో నాకు తెలియదు. నాకు సహయం చేసిన ప్రతి స్త్రీ కన్నతల్లితో సమానం. నాకో సహయం చెయ్యగలరా”అన్నాడు ప్రసాద్.
“ఏమిటో చెప్పు. నాకు చేతనైతే తప్పకుండ చేస్తాను”అంది ఆమె.
“మీ ఫోటో ఒకటి ఇవ్వండి”అన్నాడు ప్రసాద్.
“ఎందుకు ఆశ్చర్యంగా చూసింది ఆమె.
“నా కడుపు నింపిన గొప్ప పుణ్యాత్ములు మీరు. అడగకుండానే అన్నం పెట్టిన ఆమె తల్లితో సమానం. అందుకే అడిగాను”అన్నాడు ప్రసాద్. ఆమె ఆశ్చర్యంగా చూసి లోపలికి వెళ్ళింది. క్షణం తరువాత ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకువచ్చి ఇచ్చింది.
“ద్యాంక్స్ మేడం. వీలుంటే మళ్ళి మిమ్మల్ని కలుస్తాను”అని ఫోటోను భక్తితో కళ్ళకు అద్దుకుని బయటకు నడిచాడు ప్రసాద్.
ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.
“నాకు నాలుగు నెలల నుంచి విపరీతంగా తలనొప్పి గా ఉంది. ఎంతో మంది డాక్టర్స్ కు చూపించాను. వాళ్ళు చెప్పిన మందులు వాడాను. కాని తగ్గలేదు. మీ హస్తవాసి మంచిదని చాల మంది చెప్పారు అందుకే మీ దగ్గరకు వచ్చాను”అంది ఆ స్త్రీ. ఆవిడకు దాదాపు యాభై సంవత్సరాలు ఉంటాయి.
డాక్టర్ ప్రసాద్ సాభిప్రాయంగా ఆమె వైపు చూశాడు.
“ఏది మీ రిపోర్ట్స్ ఇవ్వండి”అన్నాడు.
ఆమె సంచిలోంచి రిపోర్ట్స్ తీసి ఇచ్చింది. వాటిన జాగ్రర్తగా చదివాడు ప్రసాద్. డాక్టర్స్ డయగ్నైస్ చేసింది కరెక్టు. వాళ్ళు రాసిన మందులు కూడా కరెక్ట్. అయిన ఆమె తలనొప్పి తగ్గలేదు. రిపోర్ట్స్ ఫైలు మూసి ఆమె వైపు క్యాజువల్ గా చూశాడు. అప్రయత్నంగా అతని చూపులు ఆమె వేసుకున్న ముక్కుపుడక మీద పడింది. దాన్న చూడగానే ఒక విషయం గుర్తుకు వచ్చింది అతనికి.
కొన్ని వజ్రాలు మనిషి శరీరం మీద ప్రభావం చూపిస్తాయని చదివాడు.
“మేడం మీరు నాకు రెండు రోజులు టైం ఇవ్వండి. తరువాత మీకు ట్రీట్ మెంట్ మొదలుపెడతాను. ఈ లోగా మీరు ఒక పని చెయ్యండి. మీ పుక్కు పడక తీసేయ్యండి. తరువాత ఏం జరిగిందో నాకు కాల్ చేసి చెప్పండి”అన్నాడు ప్రసాద్.
ఆమె అలాగే అని ఆశ్చర్యంగా తలూపింది. తరువాత ఆమె వెళ్ళిపోయింది. రెండు రోజుల తరువాత ఆమె దగ్గర నుంచి కాల్ వచ్చింది.
“మీరు చెప్పినట్టుగానే ముక్కు పుడక తీసేశాను. ఇప్పుడు నా తలనొప్పి పూర్తిగా తగ్గిపోయింది. నాకు చాల సంతోషంగా ఉంది. చాల ద్యాంక్స్ డాక్టర్. మీ ఫీజు ఎంతో చెప్పండి”అందామే ఆనందంతో.
“నేను మీకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వలేదు. కేవలం సలహ మాత్రం ఇచ్చాను. దానికి ఫీజ్ అవసరం లేదు. మీ తలకాయ నొప్పి తగ్గింది అది చాలు నాకు”అన్నాడు ప్రసాద్.
అతను సెల్ ఆఫ్ చెయ్యబోతుంటే అప్పుడే ఒక జూనియర్ డాక్టర్ వచ్చాడు.
“డాక్టర్ వార్డ్ నెంబర్ పదిలో ఉన్న పేషంట్ లో బాగా ఇంప్రూమెంట్ కనిపించింది. డిస్చార్జ్ చేసే సమయం వచ్చింది. మన వాళ్ళు బిల్ తయారుచేస్తున్నారు. ఇదిగో ఆమె కేసు ఫైలు అని ఒక ఫైలు ప్రసాద్ ముందు పెట్టాడు డాక్టర్.
“సరే మీరు వెళ్ళండి. నేను చూసి చెప్తాను”అన్నాడు ప్రసాద్.
డాక్టర్ వెళ్ళిపోయిన తరువాత మెల్లగా ఫైలు తెరిచాడు. లోపల ఉన్న ఫోటో చూసి ఉలిక్కిపడ్డాడు. ఆ ఫోటో ఎక్కడో చూసిన అనుభూతి కలిగింది. వెంటనే పర్స్ తీసి లోపల నుంచి ఒక ఫోటో తీశాడు. దాన్ని ఫైలు మీద ఉన్న ఫోటోను మార్చిమార్చి చూశాడు. సందేహం లేదు. రెండు ఒక స్త్రీవి. కాకపోతే ప్రసాద్ దగ్గర ఉన్న ఫోటో చాలా సంవత్సరాల ముందు తీసింది. ఫైలు మీద ఉన్న ఫోటో లో ఆమెకు కొంచం వయస్సు పెరిగింది. కాని రెండు ఒక్కటే. ఒక్కసారిగా ప్రసాద్ శరీరం రోమాచింతమైంది.
ఆమె ఎవరో కాదు కొన్ని సంవత్సరాలకు ముందు అతనికి వేడి పాలు ఇచ్చిన ఆమె.
వెంటనే అటెండర్ ను పిలిచాడు ప్రసాద్. చిన్న చీటి మీద ఏదో రాసి ఆమెకు ఇవ్వమని చెప్పాడు. అయిదు నిమిషాల తరువాత అటెండర్ ఒక చీటి తీసుకువచ్చి ప్రసాద్ కు ఇచ్చాడు. అందులో ఇలా ఉంది.
“మీ గురించి తెలిసి చాల ఆనందం కలిగింది. నాకు ట్రీట్ మెంట్ కు అయిన ఖర్చు మీరు భరిస్తున్నారని తెలిసి ఆశ్చర్యం వేసింది. ఆ రోజు నేను ఇచ్చిన ఒక గ్లాసు పాలు ఇంత మేలు చేస్తుందని ఊహించలేక పోయాను. మా అమ్మ ఎప్పుడు ఒకే మాట చెప్పుతుండేది. చేతనైనంత వరకు ఎదుటి మనిషికి సహయం చెయ్యి. ఆ సహయం తప్పకుండ నీకు మేలు చేస్తుంది అని. ఆమె చెప్పినట్టుగానే జరిగింది. ఆ రోజు నేను చేసిన చిన్న సహయం నాకు ఎంతో పెద్ద ఉపకారం చేసింది. ద్యాంక్యు డాక్టర్ ప్రసాద్”అని ఉంది.
ప్రసాద్ తృప్తిగా ఆ కాగితాన్ని తన పర్సులో పెట్టుకున్నాడు.