రగడ - - బివిడి.ప్రసాదరావు

ragada

సరళ బ్రతికే వీలు లేదని తెలిసి తల్లడిల్లిపోతున్నారు ఆమె వారంతా.

లా మాన్ మాట్లాడుతున్నారు సరళతో.పోలీస్ వారు అక్కడ నిశ్శబ్దంకు శ్రమిస్తున్నారు. మరి కొందరు పోలీస్ వారు వాకబులు చేపట్టారు, బయట సరళ తాలూకు వారి చెంత.

***

ఆ ఇంట పెళ్లి చూపుల తంతు తతంగం తారాడుతోంది. పెద్దల పెత్తనం ఫెళఫెళలాడుతోంది. యువతల ఉత్సాహం ఉరకలు పెడుతోంది.
పిల్లల పితలాటం పితపితలాడుతోంది. సరళ సరదా సంబరమవుతోంది. సదరు సరళని చూడడానికే మగ పెళ్లివారు విచ్చేస్తున్నారు కొత్త ఊరు నుండి.

సదరు ఆ పెళ్లివారు, ఆ ఇంటికి అర కిలోమీటర్ దూరాన్న గమ్మున ఆగి ఉన్నారు ప్రస్తుతం.దానికి ముందు, రివ్వున వస్తోన్న ఆ పెళ్లి వారి ముందు కారుకు ఆమడ దూరాన ఒక మోటర్ సైకిల్ మెఱుపులా వచ్చి ఆగింది. ఆ ముందు కారు జఱ్ఱుమంటూ ఆగిపోయింది. దానితో దాని వెనుక వస్తోన్న కారూ అంతేలా ఆగింది.

ఆ రెండు కార్లలోని సభ్యులు గందరగోళంలా బయట పడ్డారు. సదరు మోటర్ సైకిల్ మీది సురేష్ ను ఎగాదిగా చూస్తున్నారు.సదరు సురేష్ సదరు సరళని ప్రేమిస్తున్నాడు.మోటర్ సైకిల్ దిగి సదరు సురేష్ సదరు సభ్యుల ముందుకు వచ్చాడు. "వచ్చిన దారిన తిరిగి పొండి. ఆ సరళ నాది" అని అన్నాడు కాస్తా కటువుగానే. సదరు సభ్యులలోని ఒక యువకుడు, "ఎవడు నువ్వు" అని అడిగాడు కాస్తా విసురుగానే.

"ప్రేమికుడిని." చెప్పాడు సురేష్. "ఆ సరళ నిన్ను ప్రేమిస్తోందా" అడిగాడు యువకుడు.

"అదే కదా లేనిది. అందుకే ఈ తంటాలు" - సురేష్.

"వద్దన్నవారిని వదిలేయవచ్చుకదా. నీకు ఎందుకు ఈ తిప్పలు"- యువకుడు.

"ఆపు నీ సొల్లు. ఫో. ఆమె నాకే కావాలి"

"తను కావాలనుకోవడం లేదుగా"

"నేను కావాలనుకుంటున్నానుగా."

"అరె. పిచ్చిగా వ్యవహరించకు. ఆమె నాతో అన్నీ చెప్పి ఉంది. తను నిన్ను ప్రేమించడం లేదు. నువ్వు కోరి ఆమెని ఇబ్బంది పెట్టడం సరికాదు" - యువకుడు.

"హేయ్ ఫోబే." అంటూ తన జేబులోనించి విసురుగా ఒక బాటల్ తీశాడు సురేష్.

"హేయ్ ఏమిటది"

"యాసిడ్"

"ఎందుకు"

"నీ పై పోస్తాను. నిన్ను మరే పెళ్లికీ పనికిరానీయను. కనుక మర్యాదగా ఫో" అరిచాడు సురేష్. సదరు యువకుడు వెను తిరిగాడు గిర్రున.
సదరు అతడి మనుషులు అతడిని అనుసరించారు గమ్మున. రెండు కార్లూ వెనుతిరిగిపోయాయి.

***

సరళ ఇంట పెళ్లి చూపుల తంతు తతంగం మళ్లీ తారాడుతోంది. మగ పెళ్లి వారు వస్తున్నారు పొత్తు ఊరు నుండి. వారిని దార్లోనే అడ్డగించాడు సురేష్. సురేష్ నానా యాగీ చేశాడు.సదరు పెళ్లి వారు కంపించి పోయారు. వెను తిరిగి పోయారు.

***

సరళ ఇంట పెళ్లి చూపుల తంతు ... మొత్త ఊరు నుండి మగ పెళ్లి వారు ... వారూ దార్లోనే సురేష్ బారిన పడి, వెనుక్కు పారిపోయారు.

***

"ఇలా ఎన్నని. ఇంచు మించుగా ఇలాగే పసి కట్టలేని విధంగా మొత్తం అర డజన్ సంబంధాలు చెడ తీశాడు ఆ సురేష్ గాడు" చెప్పాడు ఒకాయన.

"వాడ్ని మీరు నిలతీశారా" ఒక పోలీస్ వారు ప్రశ్నించారు.

"బోల్డు మార్లు" చెప్పారు సరళ తాలూకు వారు.

"ఐనా మొదటే మాకు కంప్లెంట్ ఇవ్వవలసింది" అన్నారు ఒక పోలీస్ వారు.

ఎవరూ మాట్లాడలేదు వెంటనే.

"పొరపాటే. ఇంతగా జరుగుతోందని అనుకోలేదు."

"ఇప్పుడు చెప్తున్నాం. దీనికి కారణం ఆ సురేషే."

"వాడ్ని అరెస్టు చేయండి."

"వాడిని శిక్షించండి." ఇలా సాగుతున్నాయి సరళ తాలూకు వారి మాటలు, వెంట వెంటనే.

"మీరు కంప్లెంట్ ఇవ్వండి. ఐనా సరళ వాగ్మూలం తీసుకుంటున్నారుగా. అదీ రానీయండి" చెప్పారు పోలీస్ వారు.

"ఆ సురేష్ వైపు వారు చాలా పెద్దవారు." ఎవరో అన్నారు.

"ఐతే చావు క్కారణమవుతున్నాడు వాడు. ఎలా వదులుతాం." సరళ వైపు వారు ఎవరో అరుస్తున్నారు.

"ఐనా ఇంత వరకు తెచ్చుకోవడమే మీ తప్పు. మొదట్లోనే తేల్చుకోవలసింది." ఇంకెవరో అన్నారు.

"పరువు అని ఆగేరేమో" ఇంకొకరు అన్నారు.

"ఇప్పుడేం మిగులుతోంది. చావు తప్పా." మరొకరు అన్నారు. పోలీసులు కల్పించుకున్నారు. అక్కడ మాటలన్నీ ఆగాయి.
లోన, సరళ చెంత ...

"నా మాటలు వినిపిస్తున్నాయా" అడిగారు లా మాన్. సరళ తలాడించింది.

"చెప్పమ్మా. నీ చావుకు కారణం ఎవరు" అడిగారు లా మాన్. అక్కడ భయంకరమైన నిశ్శబ్దం. అక్కడున్న వారందరిలోనూ ఉత్కంఠ.
సరళ చూస్తోంది. పెదాలను నాలుకతో తడిచేసు కుంటుంది. లా మాన్ తలెత్తి డాక్టర్ల వంక చూశారు. వారు సరళనే చూస్తున్నారు.
లా మాన్ తిరిగి తల దించి సరళను చూస్తూ ఉండిపోయారు.

సరళ కళ్లు తిప్పి చూపును లా మాన్ వైపు నిలిపింది.

"చెప్పమ్మా" అన్నారు లా మాన్.

సరళ చెప్పింది, "నాన్న" అని. చలించారు లా మాన్. "వివరంగా చెప్పు" అన్నారు.

"నా వెంట పడే సురేష్ అనే వాడి మీది కోపం నా మీద చూపేవాడు నా నాన్న." సరళ మెల్లిగా చెప్పుతోంది.

"చెప్పమ్మా"

"వాడిని కలిసి నచ్చ చెప్పిండి లేదా వాడిని బెదిరించండి లేదా తగ్గ చర్యలు తీసుకోండి అని నేను పదే పదే అన్నందుకు..."

"చెప్పమ్మా"

"పైగా నా మూలంగానే ఇంటి పరువు పోతోందని నన్ను హింసించేవాడు"

"ఎవరమ్మా"

"నా నాన్న"

"ఐతే నీ మీద ఈ కత్తి దాడి చేసింది నీ నాన్నేనా, ఇంకా ఎవరెవరైనా..."

"సర్ ఈ కత్తి పోట్లుకి నా నాన్న ... ఎవరూ కారణం కాదు."

"మరెవరమ్మా"

అక్కడంతా అయోమయం ... చిక్కని కుతూహలం ...

"చెప్పమ్మా. మరి ఎవరు?"

"నేనే సర్. విసిగి నా అంతట నేనే ... తప్పనిసరై ... ఇలా ..."

అక్కడ వారు విస్తుపోతున్నారు.

"నేనే సార్ ... కత్తితో పొడుచు కొని, పొడు ... చు ... కొ ... ని ..." సరళ మాట ఆగిపోయింది.

అంతకు ముందునే ఆమె కొన ఊపిరి ఇగిరిపోయింది. అక్కడ వారు తలలు దించుకుంటున్నారు ...

ఆ పిమ్మట ... అర గంట లోపల ...

మెరుపు, పిడుగుల నడుమ వ్యవధి పాటులో సరళ తండ్రి హత్య చేయబడ్డాడు.

ఆ హాస్పిటల్ బయట ఆవరణలోని వారంతా నిర్ఘాంతంలోనే ఉన్నారింకా.

"నా సరళ చావుకు కారణమైన వాడు వీడు. అందుకే ఈ కిరాతకుడుని నేను చంపేశాను." చెప్పాడు ఆ హంతకుడు.

అక్కడే ఉన్న పోలీసులు తేరుకుంటూ తెములు తున్నారు.

ఆ హంతకుడు జాగు చేయక, "నా సరళ లేక నేనెందుకు" అంటూ తన చేతిలోని ఆ కత్తితో తన గుండె వైపు చకచకా పొడుచుకుంటూనే నేల మీదికి ఒరిగిపోతున్నాడు.

"హేయ్ హేయ్ ... ఆగాగు" అంటూ పోలీసులు వాడి దరి చేరారు. ఆ వెనువెంటనే, "ఎవరు నువ్వు" అడిగారు పోలీసు వారు. హంతకుడు వైపు నుండి సమాధానం లేదు. అతడు అప్పటికే చనిపోయాడు.

కానీ ఆ దరికి చేరిన వారి వైపు నుండి, "వీడే సురేష్ ..." అన్న మాటలు వినిపించాయి.

ఆ తర్వాత, ఆ గుంపు లో నుండి, "ఇంతటి రగడకు కారణం సంయమనం లోపమే" అన్న మాటలూ వినిపించాయి, సుస్పష్టంగా.

***

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న