నమ్మకం - దినవహి సత్యవతి

nammakam
ఉదయం నుండీ మబ్బులు కమ్మిన ఆకాశం ఏ నిముషంలో నైనా వర్షించేలా ఉంది. పని ముగించుకుని, భోజనం కానిచ్చి సోఫాలో కూలబడి టి.వి. ఆన్ చేసాను.

కళ్ళు స్క్రీన్ మీద ఉన్నా ఆలోచనలు మాత్రం విశ్వ చుట్టూ తిరుగుతున్నాయి.

ఇవాళ రెండు గంటలకి విశ్వకి ఒక కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్వ్యూ! ఉదయం పదకొండు గంటలకే బయలు దేరి వెళ్ళి పోయాడు.

గడియారం వైపు చుసాను. మధ్యాహ్నం మూడు కావొస్తోంది. ఇంకా ఇంటర్వ్యూ అయిందో లేదో? ఎలా జరిగిందో ఏమిటో ? కనీసం ఈసారైనా వాడి ప్రయత్నం ఫలిస్తే బాగుండు మనసులోనే వేయి దేవుళ్ళకి మ్రొక్కుకున్నాను.
మానవ యత్నం పరిపూర్ణంగా ఉంటే దైవానుగ్రహం తప్పక ఉంటుందన్నది నా నమ్మకం.

ఆలోచనలలో ఎప్పుడు కునుకు పట్టిందో తెలియనే లేదు!

‘నమః శివాయ ఓం నమః శివాయ....’ అన్న శివ పంచాక్షరీ మంత్రం ఉన్న కాలింగ్ బెల్ శబ్దానికి మెలకువ వచ్చి గబగబా వెళ్ళి తలుపు తీసాను.

అలసి పోయిన ముఖంతో నిలబడి ఉన్న విశ్వని చూసి పలకరింపుగా నవ్వాను.

‘ఇక్కడ నాకు టెన్షన్ గా ఉంటే నీకు నవ్వెలా వస్తోందమ్మా?’ రవంత విసుగుగా అని గది లోకి వెళ్ళి పోయాడు.
అనుకోని ఈ విసుర్లకి నివ్వెర పోయాను.

అమ్మా నాన్నలే దైవ స్వరూపాలని నమ్ముతాడు విశ్వ. ఇప్పటి వరకూ ఎన్నడూ మా ఇద్దరితో పరుషంగా మాట్లాడి ఎరుగడు. అలాంటిది ఇవాళ????

అర్థమైంది ఇంటర్వ్యూ బాగా జరగ లేదని వాడి మనసు ఆందోళనగా ఉన్నదనీ!!

భారంగా నిట్టూర్చి వంట గది వైపు నడిచాను టీ కలుపుదామని.

*********

మేముంటున్నది ఒక మహా నగరం. భరధ్వాజ్ ఉద్యోగరీత్యా ఇక్కడికి బదిలీ అయి వచ్చి మూడు సంవత్సరాలైంది.
మాకు మొదట ఒక అమ్మాయి ప్రభ అనంతరం ఒక అబ్బాయి విశ్వాస్. అమ్మాయి పెళ్ళయి గుజరాత్ లో స్థిరపడింది.
విశ్వ ఈ మధ్యనే ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాల వేటలో ఉన్నాడు. పై చదువులు చదువమని మేము ప్రోత్సహిస్తుండడం వలన ఆ వైపు కూడా ప్రయత్నం చేస్తున్నాడు.

డిగ్రీ ఆఖరు సంవత్సరంలో ఉండగా జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో అధికమైన కాంపిటీషన్ వలన ఉద్యోగ అవకాశాలు తృటిలో చేజారి పోవడంతో ఎంతో నిరుత్సాహానికి లోనయ్యాడు విశ్వ. నెమ్మదిగా వాడిని శాంత పరిచాము ఇంకా మంచి అవకాశాలు తప్పక వస్తాయని, నిరుత్సాహ పడవద్దని. ఎందుకో కానీ విశ్వకి అస్సలు కలిసి రావడం లేదు.

మాది ఆచార వ్యహారాలు పాటించే కుటుంబం. నాకూ భరధ్వాజ్ కీ కూడా దైవ భక్తి మెండు. అమ్మాయి కూడా మా కోవ లోనే కానీ విశ్వ మాత్రం వీటన్నిటికీ కొంచెం దూరం.

‘కంటికి కనిపించని ఆ దైవం కంటే కళ్ళ ఎదుట ఉన్న నిన్ను నాన్న గారిని, ఆ తరువాత నా స్వశక్తి..వీటినే నేను ఎక్కువగా నమ్ముతానమ్మా‘ అని తరచూ అంటూ ఉంటాడు.

దైవం పట్ల నమ్మకం ఎవరికైనా జన్మతః ఉండాలి లేదా వారికే సహజంగా ఏర్పడాలి గానీ బలవంతంగా ఆపాదించేది కాదుగా! అందుకే ఈ విషయాన్ని వాడి ఇష్టానికే వదిలేసాము.

రోజులు గడిచే కొద్దీ నిరాశా నిస్పృహల వైపు జారుతూ ధైర్యం కోల్పోతున్న విశ్వని చూస్తుంటే భయమేస్తోంది. ఆలోచించగా ఒక మార్గం కనిపించింది...పోనీ అలా చేస్తేనో?

కానీ అందుకు భరద్వాజ్ అంతకంటే ముఖ్యంగా విశ్వ అంగీకరిస్తారా అని సందేహం??

ముందుగా భరద్వాజ్ తో మట్లాడి చూస్తాను......

డైనింగ్ టేబుల్ వద్ద అలికిడికి ఆలోచనల లోంచి తేరుకున్నాను....

********

‘అమ్మా’ విశ్వ పిలుపులో పశ్చాత్తాపం

టీ తీసుకెళ్ళి వాడి ముందు పెట్టి మౌనంగా వెనుతిరుగుతుండగా నా చేయి పట్టుకుని చుట్టూ చేతులు వేసి నా పొట్టపై తల పెట్టి ‘అయాం సారీ అమ్మా అనవసరంగా నిన్ను విసుక్కున్నాను’ అన్నాడు. పిల్లలు ఎంత పెద్దయినా తల్లి దగ్గర చిన్న పిల్లలే అనుకుని నిట్టూర్చి వాడి బుగ్గలు నిమిరిన నా చేతికి వెచ్చగా కన్నీళ్ళు తగిలాయి

ప్రేమగా వాడి జుట్టు సవరిస్తూ ‘దిగులు పడకు నాన్నా అంతా సరవుతుంది’ ధైర్యం చెప్పాను.

పిచ్చితండ్రి ఉద్యోగం రావడం లేదని ఎంత వేదన అనుభవిస్తున్నాడో ! చదువుకున్నంత కాలం తల్లిదండ్రులని అన్నీ హక్కుతో అడిగి తీసుకునే పిల్లలు చదువవ్వగానే ఆ హక్కు కోల్పోయినట్లు తాము వాళ్ళపై భారమైనట్లు భావిస్తారెందుకో?

ఆ మర్నాడు ఆదివారం. ఉదయం ఫలహారాలయ్యాక నెమ్మదిగా భరద్వాజ్ ప్రక్కన చేరాను.

‘ఏమిటో ఇవాళ కళ్యాణి గారు ఇంత తీరుబడిగా ఉన్నారు?’

‘విశ్వ గురించే దిగులుగా ఉన్నదండీ’

‘ఏం ఏమైంది వాడికి?’

‘మీరు గమనించ లేదా ఈ మధ్య చాలా దిగులుగా ఉంటున్నాడు. ఏదీ కలిసి రావట్లేదని నిస్పృహ చెందుతున్నాడు’
‘ఊ......అవును నాకూ అనిపిస్తోంది’

‘అందుకే నాకో ఆలోచన వచ్చింది’

‘ఏమిటది?’

‘విశ్వకి ఉపనయనం చేస్తే దశ మారుతుందేమోనని..మీకు తెలుసుగా నాకెప్పటి నుంచో ఈ ఆలోచన ఉందని. మీరే పడనివ్వ లేదు?’

‘కానీ దీనికి వాడు ఒప్పుకుంటాడా అసలే ఇలాంటివి పెద్దగా నమ్మడు కూడానూ?’

‘అదంతా నాకు వదిలేయండి..మీకు సమ్మతమేనా?’

‘సరే అలాగే కానీ ఏ పుట్టలో ఏ పాముందో ఏం చెప్పగలం?’

‘ఆ మాత్రం అన్నారు చాలు.....ఇంక విశ్వని ఒప్పించాలి’ అనుకుని లేచాను .

ఆ రాత్రి భోజనాలయ్యాక విశ్వ గదిలోకి వెళ్ళాను. జి.ఆర్.ఇ. కి చదువుకుంటున్నాడు.....

నన్ను చూడగానే పుస్తకం ప్రక్కన పెట్టి ‘రామ్మా’ అన్నాడు

‘నిన్నొకటి అడుగుతాను కాదన కూడదు’

‘అడుగమ్మా’

‘నీకు ఉపనయనం చేద్దామనుకుంటున్నాము రా’

‘ఇప్పుడా? అసలు నా మనసేం బాగుండడం లేదమ్మా’

‘అందుకే రా ముఖ్యంగా అనుకుంటున్నది కూడా. ఆ తరువాత నీకు అంతా శుభమే జరుగుతుందన్నది నా నమ్మకం.’

‘కానీ .........’ సందేహంగా ఆగిపోయాడు

‘పోనీ ఒకటి చెప్పు , నేను నాన్నగారూ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తామని నమ్ముతావుగా ?’

‘అవునమ్మా’

‘అయితే ఈ సారికి మా మాట కాదనకు’

నేను చెప్పాల్సింది చెప్పాక వాడికి ఆలోచించుకోవడానికి సమయం ఇస్తే మంచిదనుకుని ఇవతలికి వచ్చేశాను.
నాలుగు రోజులైనా విశ్వ నుండి ఎటువంటి సమాధానమూ రాక పోయేటప్పటికి ఇంక ఉండ బట్టలేక ‘నేను అడిగిన దాని గురించి ఏమాలోచించావురా?’ అన్నాను

నా వైపు ఒకసారి చూసి ‘సరేనమ్మా మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి’ అని వెళ్ళిపోయాడు.

ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న నేను వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాను.

***********

విశ్వ ఉపనయనం మా స్వగ్రామంలో చేద్దామని నిర్ణయించుకుని మర్నాడే బయలుదేరి వెళ్ళి అక్కడి మా పురోహితులు శర్మ గారిని కలుసుకుని ముహూర్తం పెట్టమని కోరాను.

విశ్వ నక్షత్రం, పుట్టిన తేదీ, సమయం వగైరా వివరాలు అడిగి వేళ్లపై ఏదో లెక్కించి ‘బాబు జాతకం ప్రకారం ప్రస్తుతం గురుబలం ఉపనయనం చేయడానికి అనుకూలంగా లేదమ్మా’ అన్నారు

‘దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వనట్లు..... ఇదేమీటి ఇప్పుడూ’ అనుకుని ‘అలా అనకండి శర్మగారు. మరోసారి చూసి చెప్పండి. ఇప్పటి దాకా వద్దన్న బాబు ఈ సారి ఏ కళనున్నాడో అడగ్గానే ఎక్కువ తాత్సారం చేయక ఒప్పుకున్నాడు. ఇక్కడ స్వగ్రామంలో చేద్దామని ఎంతో దూరం నుండి వచ్చాక ఇప్పుడు మీరేమో ఇలా అంటున్నారు’
’అమ్మా ఇందులో నేను చేయగలిగినదేముంది? శాస్త్రం చెపుతోంది’

నిరాశతో వెనక్కి మళ్ళిన నాకు ’అమ్మా ఒక్క నిమిషం’ అన్న శర్మ గారి పిలుపు వినిపించింది.

‘ఇప్పుడు మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారు?’ చెప్పాను.‘ఆహా అలాగా! అయితే ఒక పని చేయండి. ఒక మార్గం చెప్తాను . ఇక్కడ మనం చంద్రమానం ప్రకారం జాతకాలు, ముహూర్తాలు చూస్తే మీరు ఉండే చోట సూర్యమానం ప్రకారం చూస్తారు . కనుక మీరు అక్కడ ఎవరికైనా చూపించి ముహూర్తం పెట్టించుకోండి’

‘మరి గురు బలం లేదన్నారు?’

‘అవునమ్మా. కానీ ఇక్కడికి అక్కడికి లెక్కలలో రాశుల తేడా ఉంటుంది. కనుక సరి పోవచ్చు’

‘అలా చెయ్య వచ్చునా?’

‘తప్పక చేయవచ్చమ్మా. అన్నిటికంటే శుభ శూచకం అబ్బాయి సానుకూలతను వ్యక్తపరిచాడు. అదే ముఖ్యం. ఆ గాయత్రీ అమ్మవారే అలా నిర్ణయించిందని నాకు అనిపిస్తోంది. మీరు నిస్సందేహంగా మీరుండే ఊళ్లో మీ స్వగృహంలో బాబుకి ఉపనయనం జరిపించుకోండి. శుభమస్తు’

‘చాలా సంతోషం శర్మగారు తరుణోపాయం చెప్పినందుకు’ అని ఆయనకు దక్షిణ సమర్పించుకుని ఊరికి తిరిగి వచ్చాను.

జరిగినదంతా భరద్వాజ్ కి వివరించాను. ఇరువురమూ కలిసి ఇక్కడి పండితుల చేత ముహూర్తం పెట్టించాము.
గురు బలం, ముహూర్త బలం రెండూ పుష్కలంగా కలిసొచ్చి విశ్వ ఉపనయనం బంధు మిత్రుల సమక్షంలో మా స్వగృహంలో నిర్విఘ్నంగా జరిపాము.

భక్తి శ్రధ్ధలతో చేసిన పూజలు ఎప్పుడూ మంచి ఫలితాలని ఇస్తాయని మరోసారి నిరూపణ అయింది. విశ్వ మనసు నెమ్మదిగా కుదుట పడసాగింది. ఉద్యోగ ప్రయత్నాలూ , పై చదువుల కోసం తయారీ సమాంతరంగా కొనసాగించాడు.
ఆ ప్రక్రియలో భాగంగా జరిగిన జి.ఆర్.ఇ. పరీక్షలో విశ్వకి మంచి మార్కులు వచ్చాయి. విదేశంలో, ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉన్న, ఒక యూనివర్సిటీలో పోష్టు గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశం దొరికింది.

*******

ఆ రోజు విశ్వ విదేశానికి బయలుదేరి వెళ్ళే రోజు. విమానాశ్రయానికి వెళ్ళాము వీడ్కోలు చెప్పడానికి. వెళ్ళే ముందు నా దగ్గరికి వచ్చి ’చాలా థ్యాంక్స్ అమ్మా. నీ నమ్మకం నిలిచింది. నువ్వన్నట్లుగానే నాకు అంతా మంచి జరిగింది. అమ్మగా నన్ను ప్రోత్సహించి గురువుగా మంచి సలహా చెప్పి నువ్వు ఇచ్చిన బలమే నా విజయానికి కారణం’ అంటూ వంగి మా కాళ్ళకి నమస్కరించాడు.

విశ్వని ఆప్యాయంగా లేవనెత్తి "దేవుడిపై నమ్మకం, శాస్త్రాలపట్ల గౌరవం, గ్రహబలం పై విశ్వాసం అనేవి నిరాధారమైనవి ఎన్నడూ కాదు నాయనా...మన ఆలోచనలకు, ఆచరణలకు అతీతమైన ఫలితాలకు కావాల్సిన అనంతమైన శక్తిని చేకూర్చేవి అవే....

నువ్వు మామీద ఉంచిన నమ్మకం, అలాగే మేము దైవం పైన ఉంచిన నమ్మకం ....రెండూ నిలిచాయి... గెలిచాయి. నీకు అన్నింటా విజయం కలుగుతుంది’ అని మనసారా ఆశీర్వదించాను.

భరద్వాజ్ కొడుకుని దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా కౌగలించుకున్నారు.

నవ్వుతూ మాకు వీడ్కోలు చెప్పి ఇనుమడించిన మనోబలం ఇచ్చిన నూతనోత్సాహం తో ముందడుగు వేశాడు విశ్వ.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు