చాలా ఏళ్ళ తర్వాత, అంటే దాదాపు పాతికేళ్ళ తర్వాత తన సొంత ఊరికి బదిలీ అవడంతో రామారావు చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ వార్త వినగానే అతని కాళ్ళు భూమి మీద నిలవడం లేదు. ఇంతకు ముందు చాలా సార్లు తన సొంత ఊరికి బదిలి కోసం ప్రయత్నం చేసాడు గాని అతనిని అదృష్టం వరించలేదు. అతని ఊరంటే చిన్న ఊరేమీ కాదు, ఓ మాదిరి పట్టణం కిందే లెక్క అక్కడే పుట్టి, పెరిగి పెద్దవాడయ్యాడు.
రామారావుకి అక్కడ చాలా మంది చిన్ననాటి స్నేహితులు ఉన్నారు. అందరికన్నా తన ప్రాణ మితృడైన కృష్ణమూర్తి అంటే రామారావుకి చాలా అభిమానం.
రామారావు, కృష్ణమూర్తి ఒకే స్కూల్లో చదువుకోవడమే కాకుండా, ఒకే కాలేజీలో డిగ్రీ వరకు కలసి చదువుకున్నారు. రామారావు మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడు. అతని తండ్రి హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. అతను తన కొడుకుని క్రమ శిక్షణలో పెంచడం వల్ల బాగా చదువుకొని మంచి మార్కులతో పాసయి డిగ్రీ అయిన తర్వాత ఎం.బి.యే చేసి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు.
ఐతే, కృష్ణమూర్తి మొదటి నుండీ చదువులో వెనకబడే ఉండేవాడు. ఎలాగోలాగ పాస్ మార్కులు తెచ్చుకొని డిగ్రీ వరకూ వెళ్ళగలిగాడు. అది కూడా రామారావు సహాయం వల్లే. కృష్ణమూర్తి తండ్రి రాఘవయ్య ఆ ఉళ్ళో పేరు పొందిన వ్యాపారస్తుడు. వ్యాపారంలో బాగా సంపాదించాడు. అతనికి చాలా రకాల వ్యాపారాలే కాక, ఓ ఐదు లారీలు కూడా ఉన్నాయి. హోల్‌సేల్ బిజినెస్ ఉంది. ఆ ఊళ్ళో ఓ మూడు మంచి ఇళ్ళున్నాయి. అతని కింద ఓ పదిహేను మంది ఉద్యోగస్తులు ఉండేవారు, వివిధ వ్యాపారాల్లో అతనికి సహాయ పడడానికి. ముగ్గురు అన్నదమ్ముల్లో కృష్ణమూర్తే చిన్నవాడు. అతని అన్నలిద్దరూ అప్పటికే వాళ్ళ నాన్నతో కలిసి వ్యాపారాలు చూసుకొనేవారు. కృష్ణమూర్తికి తమ వ్యాపారానికి పనికి వచ్చే చదువు ఉంటే చాలునని అతని తండ్రి రాఘవయ్య అభిప్రాయం.
ఇద్దరికీ అంతస్తుల్లో అంత తేడా ఉన్నా, అది వారి స్నేహానికి అడ్డు వచ్చేది కాదు. రామారావు తన తీరిక వేళలో కృష్ణమూర్తికి చదువు విషయంలో సహాయం చేసేవాడు. అలాగే కృష్ణమూర్తి రామారావుకి అవసరమైనప్పుడు, పుస్తకాలు కొనేవాడు. కాలేజి ఫీస్ కట్టవలసి వచ్చినప్పుడు డబ్బు సహాయం చేసేవాడు. రామారావు పై చదువులు చదవడంలో కృష్ణమూర్తి పాత్ర చాలా ఉంది. తన తండ్రి చేత ఆర్థిక సహాయం కూడా చేయించాడు. అందుకే కృష్ణమూర్తి అంటే రామారావుకి చాలా అభిమానం.
ఉద్యోగంలో చేరిన కొత్తలో ఏ ఊళ్ళో ఉన్నా ఏడాది కొకసారైనా వచ్చి అందరిని కలిసి వెళుతుండేవాడు. ఐతే ఈ మధ్యన ఐదారేళ్ళయింది ఊరికి రాలేక పోయాడు ఉద్యోగంలో పదోన్నతి, పదవీ బాధ్యతలు పెరగడం వల్ల. అందుకే ఎంత వేగం ఇక్కడ తన బాధ్యత కొత్త అధికారికి అప్పగించి, తన ఊరుకి రెక్కలు కట్టుకొని వాలుదామా అని ఉంది. ఎట్టకేలకు ఆఫీస్ నుంచి రిలీవై, తన ఊరికి బయలుదేరాడు. తన సొంత ఇంట్లో ఒక వాటా ఎలాగూ ఖాళీగానే ఉందని భార్య సరోజతో టాక్సీలో బయలుదేరాడు. సామాన్లవీ ముందుగా లారీలో పంపించేసాడు.
ఊర్లోకి చేరగానే కృష్ణమూర్తికి ఫోన్ చేసాడు రామారావు. రామారావు రాక విని సంతోషించాడు కృష్ణమూర్తి.
"నీవు ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయి వచ్చినందుకు నాకు చాలా అనందంగా ఉందిరా! అయితే, నేను ఓ పని మీద పక్క ఊరు వచ్చాను, సాయంకాలానికల్లా చేరతానులే! సాయంకాలం ఇంటికి వచ్చేయి! చాలా కబుర్లు చెప్పుకోవాలి. నీ కోసం ఎదురు చూస్తూంటాను." ఆనందంగా అన్నాడు కృష్ణమూర్తి.
ఉదయం పది గంటల కల్లా ఆఫీస్ చేరుకొని ఛార్జి తీసుకున్నాడు రామారావు. అక్కడ ఆఫీస్‌లో కూడా కొంతమంది తన ఊరి వాళ్ళే, తనకి తెలిసినవాళ్ళే ఉన్నారు. తన మిగతా స్నేహితుల గురించి వాకబు చేసాడు రామారావు. ఐతే, ఎంత వేగం సాయంకాలం అవుతుందా, ఎంత తొందరగా కృష్ణమూర్తిని కలుద్దామా అని తెగ ఆరాట పడుతున్నాడు రామారావు.
సాయం కాలం ఏడు గంటలకి కృష్ణమూర్తి ఇంటికి బయలుదేరే ముందు ఫోన్ చేసాడు.
కృష్ణమూర్తి ఫోనెత్తి, "హల్లో రామారావూ, సారీరా నీకు చెప్పడం మరిచాను. మేము ఇంతకుముందు ఉండే వీధిలో ఉండడం లేదు. ఆ వెనక వీధిలో ఉంటున్నాము. నువ్వక్కడే ఉండు. నేనిప్పుడే వస్తున్నాను." అన్నాడు.
అన్నట్లుగానే పది నిమిషాల్లో కృష్ణమూర్తి అక్కడికి బైక్‌లో వచ్చి రామారావుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. రామారావు ఆశ్చ్యర్యంగా చూసాడు ఆ ఇంటిని. ఇంతకు ముందు వాళ్ళు ఉండే ఇల్లు ఓ పెద్ద బంగళా, మరి ఇదేమో ఒకప్పుడు వాళ్ళు గోడౌన్‌లా వాడేవాళ్ళు. సందేహం వచ్చి అడిగాడు రామారావు, " అదేంటీ, మీరు ఇప్పుడు ఇక్కడుంటున్నారా? మరి ఆ ఇల్లేమైంది? ఇది మీ సరుకు ఉంచుకొనే గోడౌన్ కదా!"
నిరాసక్తంగా చిన్నగా నవ్వాడు కృష్ణమూర్తి.
"ఆ రోజులు పోయాయి రా! ఇప్పుడు మేముండేది ఇక్కడే! ఈ ఐదారేళ్ళలో చాలా జరిగిపోయాయి. నీకు తీరుబడిగా చెప్తానులే!" అన్నాడు లోపలికి దారి తీస్తూ.
కృష్ణమూర్తి సమాధానానికి నివ్వెరపోయిన రామారావు, 'వీడికి ఏమైంది? ' అనుకుంటూ అతని వెంట నడిచాడు.
ఇంట్లోకి వచ్చాక కృష్ణమూర్తి భార్య సరళ పలకరించింది, "ఏం అన్నయ్యగారు, బాగున్నారా! వదినగారిని తీసుకురాలేక పోయారా!' అని.
'ఇంకా ఇవాళే వచ్చాము కదా, సామాన్లు అవీ సర్దుకోవడంలో బిజీగా ఉంది. ఈ ఆదివారం తప్పకుండా తీసుకొస్తాను." అన్నాడు రామారావు. "మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి. నేను కాఫీ తీసుకొస్తాను" అందామె లోపలికి వెళ్తూ. సోఫాలో కూర్చొని చుట్టూ పరికించి చూసాడు రామారావు. చాలా సాధారణంగా ఉందా ఇల్లు. ఇంతకు ముందు వాళ్ళు ఉండే ఇల్లు వైభోగంతో తులతూగుతూ ఉండేది. 'ఆంత పెద్ద భవంతిలో ఉండే వాడికి ఇప్పుడు ఈ గోదాం లాంటి ఇంట్లో ఉండవలసిన అవసరం వచ్చిందేమిటి?' అనుకున్నాడు రామారావు.
కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది.
ఈ లోపున సరళ ఇద్దరికీ ఓ రెండు ప్లేట్లలో పకోడీలు, కాఫీ తెచ్చింది.
అప్పుడు గమనించాడు రామారావు, వాళ్ళిద్దరినీ. వాళ్ళిద్దరి మొహాల్లోనూ నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆమె ఒంటి మీద పూర్వంలాగా నగలు లేవు, ఒక్క మంగళ సూత్రం తప్ప. వాళ్ళ పూర్వ వైభవం ఏమైందో మరి?
'కృష్ణమూర్తి తండ్రి బాగానే ఆర్జించాడే! గతసారి తను వచ్చినప్పుడు బాగానే ఉండేవాడు. ఈ లోపునేమయింది? వ్యాపారాల్లో భారీ నష్టం వచ్చిందా! దివాలా తీసాడా?' ఇలా పలు ఆలోచనలు చుట్టుముట్టాయి రామారావుని.
ఇంక ఉండబట్టలేక, రామారావే ముందు మౌనం వీడాడు. "ఏమైందిరా! మీ బిజినెస్ సరిగ్గా నడుస్తున్నది కదా!" అని అడిగాడు.
"నీవేమిటి ఆలోచిస్తున్నావో అర్థమవుతున్నదిరా, అంతా కాలం మహిమ. అప్పుడప్పుడూ ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మా పరిస్థితీ అంతే! మా నాన్న గతించిన తర్వాత గానీ మాకు ఈ విషయం తెలీలేదు. మేము ముగ్గురు అన్నదమ్ములం వ్యాపారాలు మా చేతి లోకి తీసుకున్న తర్వాత గానీ మాకు బాధ్యత తెలియలేదు. మా నాన్నగారు బాగా ఆర్జించారు. అయితే, మాకు బాధ్యత అప్పగించడంలో విఫలమయ్యారు. మా నాన్నగారు మాకు ఒకొక్కరికి ఒక్కో పని పురమాయించేవారు. అది మేము పూర్తి చేసేవారం, అంతే! ఇలాగ ఏ పనిచెప్తే ఆ పని చేసేవారం, తప్పితే మాకు ఇంకేమీ తెలిసేది కాదు. సరిగ్గా బాధ్యత తీసుకోకపోవడంతో ఉన్న వ్యాపారాలన్నీ దివాలా తీసాయి. ఒక్కో వ్యాపారం బాధ్యత ఒకొక్కరికి ఇచ్చిఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండకపోను. నా సంగతెలా ఉన్నా అన్నలిద్దరూ బాధ్యతా రహితంగా ఉండడంతో పాటు విలాసాలు, జల్సాల వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మాకే బాధ్యత లేకపోతే మా కింద పనిచేసే ఉద్యోగులకెందుకుంటుంది? దాని ఫలితమే ఈ పరిస్థితి! దాంతో అప్పులు తీర్చడానికి ఇళ్ళూ, లారీలు అమ్ముకోవలసి వచ్చింది. ఈ లోపున మేము ముగ్గురం విడిపోయాము. ఇప్పుడు వ్యాపారంలో చాలా పోటీ పెరిగిపోయింది. హోల్‌సేల్ బిజినెస్ చేసిన చోట చిల్లర కొట్టు పెట్టుకోవలసి వచ్చింది. ఇప్పటి తరం వాళ్ళతో పోటీ పడలేకపోవడం ఒక ఎత్తైతే, కొత్తగా ఎక్కడ పడితే అక్కడే మాల్స్, సూపర్ బజార్లూ పుట్టుకొచ్చాయి. ఏదో మందకొడిగా వ్యాపారం సాగుతోంది. ఇప్పుడు పెట్టుబడికి కూడా సరిగ్గా డబ్బులు లేవు. " ఆవేదనగా అన్నాడు కృష్ణమూర్తి.
కృష్ణమూర్తి చెప్పింది విని అతని వైపు సానుభూతిగా చూసాడు రామారావు. "ఇంతకీ మీ అన్నయ్యలిద్దరూ ఎలా ఉన్నారు?" కుతూహలం కొద్దీ అడిగాడు రామారావు.
" వాళ్ళ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వాళ్ళూ, వాళ్ళ పిల్లలూ ఇతరుల దుకాణాల్లో పనికి కుదిరారు. ఆ విషయానికొస్తే నేనే కాస్త మెరుగు." అన్నాడు కృష్ణమూర్తి.
అప్పుడు హఠాత్తుగా గుర్తుకు వచ్చి అడిగాడు, "అవునూ, మీ అబ్బాయిలిద్దరూ ఏమి చేస్తున్నారురా?" అడిగాడు రామారావు.
"ఈ పరిస్థితిలో వాళ్ళ చదువు మానిపించి వాళ్ళని కూడా దుకాణంలో పెట్టాను." నిట్టూర్చుతూ అన్నాడు కృష్ణమూర్తి.
"ఇవేవి నాకు తెలియదు. మరి కిందటి సారి ఫోన్ చేసినప్పుడైనా నాకు చెప్పలేదేమిరా!" నిష్టూరంగా అడిగాడు రామారావు.
"ఈ విషయంలో నువ్వేమి సహాయం చేయగలవురా? అంతా మా ఖర్మ!" అన్నాడు కృష్ణమూర్తి.
"ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇప్పుడు ఇక్కడున్న బ్యాంక్ మేనేజర్ కూడా నా స్నేహితుడే! నీకు తగిన సహాయం అతను చేయగలడు. నేను అతనికి చెప్తాను సరేనా! మీ అబ్బాయిలనిద్దరినీ మళ్ళీ చదువులో చేర్పించు. నాకు వీలైనంత సహాయం నేను చేస్తాను." అనునయించాడు రామారావు.
"నీ మాటలు వింటూంటే నాకు ప్రాణం లేచొచ్చిందిరా! నీ మేలు ఈ జన్మకి మరువలేనురా!" అనందంగా అన్నాడు కృష్ణమూర్తి.
"అంత మాట అనొద్దురా! అది నా బాధ్యత." అన్నాడు రామారావు.