రంగారావు ఆయన భార్య మధ్యాహ్నం భోజనాలైన తరువాత హాల్లో కూర్చొని టి.వి.చూస్తున్నారు.
అప్పుడు రంగారావు స్నేహితుడు, ముద్రనణాలయపు యజమాని శ్రీహరి లోనికొచ్చి హాల్లో కూర్చొని తీరిగ్గా టి.వీ ని చూస్తున్న దంపతులను చూసి "భేష్ !ఇద్దరూ ఇక్కడే వున్నారన్నమాట.చెల్లెమ్మా..! మీ చిన్నబ్బాయి పెళ్ళి పత్రిక నమూనాను తెచ్చాను. మీరోమారు చూస్తే అచ్చుకు పంపిస్తాను"అంటూ బ్యాగులో వున్న పెళ్ళి పత్రిక నమూనాను రంగారావు చేతికిచ్చి సోఫాలో కూర్చొన్నాడు శ్రీహరి.
"ఎండన పడొచ్చారు.మొదట ఓ గ్లాసు మజ్జిగను తీసుకొండి.తరువాత మాట్లాడుకుందాం"అని రంగారావు అంటుండగానే ఆయన శ్రీమతి కిచ్చన్ లో కెళ్ళి మజ్జిగ తెచ్చి శ్రీహరికి ఇచ్చింది.ఆయన తాగి గ్లాసును ప్రక్క నుంచి కండువాతో ముఖం తుడుచుకున్నాడు.
పత్రికను ఓ మారు పూర్తిగా చదివాడు రంగారావు. పెన్ను తీసుకొని పత్రిక చివరి వరుసలో వున్న 'ప్రెసెంట్సు ఆర్ అవాయ్ డెడ్ 'అన్న అక్షరాలను తొలగించి శ్రీహరి చేతికిచ్చి అచ్చుకు పంపమన్నాడు.
శ్రీహరికి ఏమి అర్థం కాలేదు.రంగారావు చివరి వరుసను కొట్టివేసి చేతికిచ్చిన నమూనాను ఓ సారి పరిశీలనగా చూసుకొని"ఇదేంటండీ!ఇక్కడ పత్రిక చివరున్న'ప్రెసెంట్సు ఆర్ అవాయ్ డెడ్ 'అన్న అక్షరాలను తొలగించారు. క్రితంలో మీ పెద్దాడి పెళ్ళికి ఈ పదాన్ని ఎంతో స్ట్రెస్ చేసి చెప్పి మరీ వేయించారు.గుర్తుందా?ఓహో ...అర్థమైంది. అంటే...ఈసారి చదివింపుల ద్వారా పెళ్ళికయ్యే ఖర్చును కాస్తయినా రాబట్టుకోవాలని యిలా చేస్తున్నారన్న మాట"నవ్వాడు శ్రీహరి.
"మీరేమైనా అనుకొండి శ్రీహరి గారూ!.నేను బాధ పడను.పెద్దాడి పెళ్ళి ద్వారా నాక్కలిగిన అనుభవం దృష్ట్యా నేను చేసిన ఆ కరెక్షనుతో పత్రికను ప్రింటు కివ్వమంటున్నాను"అన్నాడు రంగారావు.
"అలాగేనండి! అయినా మీరేపని చేసినా అందులో ఏదో అంరార్థముంటుంది. ఇప్పుడు అదేమిటో నాకు అర్థం కాకుంది. చెప్పరూ?"అన్నాడు శ్రీహరి లేచి నిలబడి తన సహజ ధోరణితో.
"అయితే మళ్ళీ కూర్చొండి.నేను మీరడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెపుతాను.శ్రీహరి గారూ!మీరడిగిన ఈ ప్రశ్న ఎప్పుడైనా ఎవరైనా అడగక పోతారా...వాళ్ళకు సమాధానం చెప్పక పోతానా అని చాన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తూ వున్నాను . ఎవ్వరూ ఇంత వరకూ అడగలేదు.ఇవాళ మీరడిగారు కనక నాకు ఛాన్సు దొరికింది. చెపుతాను వినండి"అని గొంతు సవరించుకున్నాడు రంగారావు.చెవులు రిక్కించుకున్నాడు శ్రీహరి.
"మా పెద్దాడి పెళ్ళి 'విజయా మహాల్లో' జరిగిందని మీకు తెలుసు.ఆ మంటపానికి అద్దె మూడు లక్షలు. భోజనానికి పది లక్షలు ఖర్చు పెట్టాను. ఇక డెకరేషన్ , సన్నాయి మేళం, సంగీత విభావరి, నాట్యం, వీడియో వగైరాలకు ఓ ఏడు లక్షలు ఖర్చు పెట్టాను. ఇందులో నగలు, బట్టలకు పెట్టిన ఖర్చు చేర్చలేదు. ఏదైతేనేం మా హోదాకు తగినట్టు మా పెద్ద కొడుకు పెళ్ళి జరపాలన్నది మా భార్యా భర్తల ఆశయం కనుక ఆ పెళ్ళికి దాదాపు ముఫ్ఫై లక్షలు ఖర్చు పెట్టాం. అవునండి. నాటి రిసెప్షన్ లో విందు భోజనం మీరూ భోం చేశారుగా ! ఇరవై వెరైటీలతో పెట్టించాము. ఆ రోజు సాయంత్రం అల్పాహారం, సాప్టు డ్రిక్సు కని ఓ లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను. ఇక భోజనం ఒక్కింటికి నాలుగు వందల చొప్పున పదిహేను వందల మందికి ఏర్పాటు చేశాను. పెళ్ళికి వచ్చిన వారిలో కొందరు మా దంపతులను తెగ పొగిడి పారేసి అల్పాహారాన్ని ఆరగించిన తరువాత రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో డైనింగ్ హాల్లోకి వెళ్ళారు.
అక్కడే నాకు అసలు విషయం అర్థమైంది. ఏమిటయ్యా అంటే...అందరూ భోం చేస్తున్నారు. నేనూ నా శ్రీమతి అందర్ని పలకరిస్తూ భోజనాలు అందరికీ ఇబ్బంది లేకుండా వడ్డిస్తున్నారా ... వున్న వెరైటీలు అందరికి అందుతున్నాయా అని జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న తతంగం మా దంపతులకు బాధను కలిగించింది. అదేమిటంటే... ఏ ఒక్కరూ తృప్తిగా భోం చేసినట్టు కనబడలేదు. దాదాపు అందరూ విస్తర్లలో వున్న స్వీట్లు, పాయాసం మొదలుకొని వడ్డించిన వెరైటీలన్నిటిని అలా... అలా టచ్ చేసి విస్తర్ని మడిచి పెట్టి వెళ్ళి పోవడం గమనించాము. అలా ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. వెంటనే క్యాటరింగ్ మాస్టార్ ను పిలిపించి అడిగాను ఒక వేళ భోజనం రుచిగా లేదేమోనన్న సందేహం రాగా! అందుకు తనన్నాడూ.., 'సార్ ! మీరు పెళ్ళికొచ్చిన ఈ జనాలకు నాలుగ్గంటలకే ఓ రకమైన భోజనం లాంటి అల్పాహారాన్ని అందజేశారు.
అల్పాహారాన్ని ఆరగించిన వీళ్ళకు మరో రెండు మూడు గంటల్లోనే ఇలాంటి వెరైటీస్ తో కూడికొన్న భోజనం పెడితే ఎలా తినగలరూ?మనిషి కడుపు ఆకలితో నకనకలాడాలి. అప్పుడే బాగా భోంచేస్తాడు. రెండు గంటలకు ముందే అల్పాహారాన్ని ఆరగించిన ఈ జనానికి అప్పుడే అకలి ఎలా అవుతుంది? అందుకే భోజనానికి కూర్చున్న వీళ్ళు అన్నిటినీ అలా అలా టచ్ చేస్తూ ఏదో తిన్నామనిపించి చేతులు కడిగేసుకొంటున్నారు'అని చెప్పాడు.అతని మాటలతో ఖంగు తిన్నాను నేను. అంటే రెండు మూడు గంటల వ్యవధిలో భోజనాలు పెట్టడం ద్వారా ఇలాంటి ఇబ్బంది ఒకటి వుందని అప్పుడు గ్రహించాను. దీని వల్ల ఎవరికీ ఎలాంటి లాభం లేక పోగా నష్టాన్ని అస్సలు వూహించలేక పోయాను."అంటూ చెప్పడం ఆపాడు రంగారావు.
"అది కాదండీ! నేనడుగుతున్న ప్రశ్న ఆ 'ప్రెసెంట్సు ఆర్ అవాయ్ డెడ్ 'అన్న ఆ పదాన్ని ఎందుకు తొలగించారన్నదే!" అడిగాడు శ్రీహరి మళ్ళీ,
"అందుకూ కారణ ముందండీ!ఆ పాయింటుకే వస్తున్నాను.ఎస్ !మీరన్నట్టు పెళ్ళి ఆహ్వాన పత్రికలో ఆ మాటను చూసుకున్న మన బంధు మిత్రులంతా వూరికే ఒఠ్ఠి చేతులతో పెళ్ళికి రావడం బాగుండదని ఎంచక్కా మూడు నాలుగు వందలు ఖర్చుపెట్టి పూల గుఛ్ఛాలనూ, దండలను తెచ్చి వధూవరులకు దండలు వేసి, పూల గుఛ్ఛాలను చేతికిచ్చి వీడియోల్లో వాళ్ళ ముఖాలను చూపుకొని మొహమాటంతో ఏదో ఎంగిలి పడి వెళ్ళిపోయారే తప్ప అందులో తృప్తి ఎక్కడుందండి? మరుసటి రోజు ఆ పూల గుచ్చాలు, దండలు వాడి పోయి ఎందుకూ పనికి రాకుండా ఇంట్లో ఓ గదిలో ఓ రకమైన వాసనతో దర్శనమిస్తుంటే నేనే స్వయాన కార్పోరేషన్ వాళ్ళను పిలిపించి వాళ్ళకు డబ్బిచ్చి మరి డంపుయార్డుకు లారీలో పంపించాను. అంటే అటు పెళ్ళికొచ్చిన వాళ్ళు వాళ్ళ గౌరవం కోసం అలా చేశారు.
మేమూ మా గౌరవ మర్యాదలు,హోదాలకు తగ్గట్టుండాలని ఇలా చేశాము.చివరికి తేలిందేమిటంటే ఉభయులకు బోలెడు డబ్బు ఖర్చని, ఎవరికీ ఎలాంటి లాభం లేదనీనూ!" తన మనసులో వున్న అసలు విషయాన్ని బయట పెట్టాడు రంగారావు.
"సరే! ఇప్పుడు ' ప్రెసంట్స్ ఆర్ అవాయ్ డెడ్ 'అన్న మాటను తీసేసిన కారణాన చదివింపుల రూపంతో బోలెడు డబ్బు,వస్తువులొస్తాయే! వాటినీ..."అని ఇంకా ఏదో చెప్పబోతుండగా మధ్యలోనే అడ్డు తగిలి "చదివింపుల డబ్బు రావాలనేగా ఆ మాటను తీసివేశాను."అన్నాడు రంగారావు.
"అంటే..."తలగోక్కొంటూ అన్నాడు శ్రీహరి.
"చెపుతాను శ్రీహరీ! మా వూళ్ళో...అంటే...నేను పుట్టి పెరిగిన ఆ పల్లటూరిలో మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత యాభై ఏళ్ళ వరకూ బస్సులు లేవు. చాన్నాళ్ళకు వూరి పెద్ద మనుష్యులు,రాజకియ నాయకులు కొందరు ఒక్కటై ప్రభుత్వాన్ని సంప్రదించి పోరాటం సాగిస్తే కొంత కాలానికి టౌనుతో పాటు పది వూర్లను కలుపుతూ ఉదయం,సాయంత్రమంటూ రెండు పూటలకు కలిపి నాలుగు ట్రిప్పులు బస్సులు నడపడం ప్రారంభించారు. అవే ఈ రోజు వరకూ కొనసాగుతున్నాయి.
అయితే ఇవాళ అక్కడ ప్రయాణికులు నిలబడ్డానికి లేక ఓ నలుగురు కూర్చోటానికి బషెల్టర్ లేదు,బెంచీలు లేవు.అందుకని చదివింపు రూపంతో వచ్చే ఆ డబ్బుతో ప్రభుత్వాన్ని సంప్రదించి వాళ్ళ అనుమతితో ప్రయాణికుల సౌకర్యార్ఠం బస్ షెల్టరు నిర్మిస్తాను,చుట్టూ ప్రక్కల వున్న గ్రామాలనుంచి వచ్చి వెళ్ళే ప్రయాణికులు సేద తీరే నిమిత్తం ప్రక్కనే వున్న రావి చెట్టు దాపులో ఓ బోర్ వెల్ తీయిస్తాను."అన్నాడు రంగారావు సాధారణంగా.
భేషండీ!మీ ఆలోచన చాలా బాగుంది.పెళ్ళికొచ్చే బంధుమిత్రులు వాళ్ళ గౌరవార్థం పూల గుఛ్ఛాలు, దండల రూపంతో డబ్బును వృధా చేయకుండా చదివింపుల పేరుతో డబ్బుగా మీ చేతికొస్తే ఆ డబ్బును మీరు మరో మంచి కార్యానికి వుపయోగపడేలా చేయాలనుకొంటున్నారంటే అది ఎంతైనా శ్లాఘించాల్సిన విషయమే!అది మీకే కాదు మాలాంటి వాళ్ళకు కూడా స్ఫూర్తిని కలిగించే సంతోషకరమైన విషయమే!అందులో మీకెంత తృప్తి వుందో అంతే తృప్తి మాకూ వుంటుంది.పెళ్ళి పత్రికలను రేపు సాయంత్రానికల్లా డెలివరీ చేస్తాను.వస్తానండి రంగారావుగారూ"అంటూ లేచాడు ముద్రణాలయపు యజమాని శ్రీహరి.