గో- వేదన - దినవహి సత్యవతి

go vedana

భద్రయ్యది పేద కుటుంబం.అతడి కుటుంబంలోని సభ్యులు భార్య,కూతురు రాజ్యం,కొడుకు సుబ్బడు.భద్రయ్యకి చిన్నతనాన్నే కుటుంబ బాధ్యత తల పైకి రావడాన తాను చదువుకో లేక పోయినా కష్టపడి కొడుకుని కూతుర్ని చదివించాడు. రాజ్యం ఐదవ తరగతి కాగానే మరి చదవడానికి ఆసక్తి చూపించక ఇంట్లో పనులలో తల్లికి చేదోడు-వాదోడుగా ఉండిపోయింది . సర్లెమ్మని రాజ్యానికి పెళ్ళీడు రాగానే గంతకు తగ్గ బొంతను చూసి పెళ్ళి చేసి అత్త వారింటికి పంపించేసాడు భద్రయ్య.

కొడుకు పదవ తరగతి పాసయ్యాక పై చదువులకి పట్నం పంపించే స్తోమత లేక కౌలు పొలంలో పనికి పెట్టేసాడు. వయసు పైబడి అనారోగ్యం చేయడంతో కొంత కాలమై ఇంట్లోనే ఉంటున్నాడు భద్రయ్య.

ఆ రోజు ఉదయాన వేప పుల్లతో పళ్ళు తోముకుని ఇంట్లోకి వస్తూ ఆ వేళకి ఇంకా సుస్తుగా పడుకుని ఉన్న లక్ష్మిని చూసి బాధగా నిట్టూర్చి ‘ఒరే అబ్బాయ్ ’ అని పిలిచాడు

ఏంటి నాన్నా?’ అంటూ వచ్చాడు సుబ్బడు ఇక పై మనం లక్ష్మిని పోషించ లేమురా...."

"అదేంటి నాన్నా అలా అంటావు?"

" అవునురా, నాకా వయసైపోయి ఒళ్ళు బాగో లేక పని మానుకున్నాను. ఇప్పుడు ఇల్లంతా నీ ఒక్కడి మీద నడుస్తోంది. నీ సంపాదన అంతంత మాత్రమే. ఇంత మందినీ ఎలా పోషిస్తావురా?"

"ఫరవా లేదులే నాన్నా. ఇంకో రెండు చోట్ల చిన్న చిన్న పన్లు కుదుర్చుకుంటాను."

"అది కాదురా, నే చెప్పేది విను. ఈ వయసులో లక్ష్మికి జబ్బు చేస్తే వైద్యానికే బోలెడు ఖర్చవుతుంది."

"అయితే ఏం చెయ్యమంటావు నాన్నా?"

"రాజా బాబాయ్ ఉన్నాడు కదా! ఆయన ఇంట్లో దిగబెట్టి రా."

"ఏంటీ? అక్కడా? ఏమంటున్నావు నాన్నా?" బాధగా అరిచాడు సుబ్బడు.

అవునురా. నీ బాధ నాకు తెలుసు. నాకూ బాధగానే ఉంది. కాని తప్పదురా. మనసు రాయి చేసుకోవాలి మరి’ అని కాసిని కాఫీ నీళ్ళు తాగడానికి వంట గది వైపు కదిలాడు భద్రయ్య.

‘సరే నాన్నా నీ ఇష్టం’ అని లక్ష్మి పడుకున్న దిశగా చూసాడు సుబ్బడు.

ఎప్పుడు లేచిందో తెలియదు తమ మాటలు విని తమ వైపే దీనంగా చూస్తున్న లక్ష్మిని చూసి సుబ్బడికి దుఃఖం ముంచుకొచ్చింది.

‘ఇదేమిటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు నా గురించి? నన్ను ఆ రాజా గారి వద్దకు పంపించేస్తారా? ఇన్నాళ్ళూ ఈ కుటుంబం కోసం నా శక్తి నంతా ధార పోసాను. వాళ్ళ అవసరాలు తీరాక ఇప్పుడు పోషించలేమనే సాకుతో నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. ఇదేమైనా న్యాయంగా ఉందా?’ అనుకుని కన్నీళ్ళు కార్చింది లక్ష్మి

ఆ మర్నాడే లక్ష్మిని తీసుకుని రాజా గారి ఇంటికి వెళ్ళాడు సుబ్బడు......

‘బాబాయ్..బాబాయ్..’ తలుపు తట్టి పిలిచాడు

‘ఎవరూ?’ అంటూ కళ్ళద్దాలు సరిచేసుకుంటూ బయటకి వచ్చాడు సదరు రాజా బాబాయ్

‘ఓ నువ్వట్రా? ఏంటిలా వచ్చావు పొద్దునే?’

‘లక్ష్మిని మీ ఇంట్లో దిగబెట్టి రమ్మన్నాడు నాన్న’

‘అదేంటిరా? అలా చెప్పా పెట్టకుండా తీసుకొస్తే ఎలాగా? ఇలారా.... అటు చూడు’ అంటూ ఇంట్లోకి తీసుకెళ్ళి ఏదో చూపించాడు

అటుగా చూసిన సుబ్బడు అవాక్కై ’నన్ను మాత్రం ఏం చేయమంటావు బాబాయ్? నాన్న చెప్పాడు. మా ఇంటి పరిస్థితి కూడ నీకు తెలుసుగా?’ అన్నాడు దీనంగా ముఖం పెట్టి ‘బాగుందిరా నువ్వు చెప్పేది! మరి నన్ను మాత్రం ఏం చేయమంటావురా? రేపు లక్ష్మి ఇక్కడ దిక్కు లేని చావు చస్తే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. నా ప్రాణం మీదకొస్తుంది. నావల్ల కాదు ఈ బరువు మోయడం. అసలే నా జీవనాధారం పోయి నేనేడుస్తుంటే ఇప్పుడు నా మెడకి ఇలా మరో గుదిబండా? మీ తిప్పలేవో మీరు పడండి. నేను మాత్రం లక్ష్మిని అట్టే పెట్టుకోలేను ఇంక నువ్వెళ్ళచ్చు’ అని సుబ్బడిని బయటకి పంపేసి ధడాలున తలుపేసుకున్నాడు బాబాయ్. చేసేదేం లేక సుబ్బడు ఇంటికి తిరిగి వెళ్ళి జరిగినదంతా తండ్రికి చెప్పాడు.

‘సరే అయితే మరి ఇంక తప్పదు. వెంటనే లక్ష్మిని ఊరి చివరన ఉన్న పాడు పడిన దేవాలయంలో వదిలి పెట్టిరా’ అని ‘తల్లీ! నన్ను మన్నించు‘ అని లక్ష్మికి దణ్ణం పెట్టి ఉబికివస్తున్న కన్నీటిని అదిమి పెట్టి బయటకి వెళ్ళి పోయాడు భద్రయ్య...

తండ్రి మాటలకి మ్రాన్పడి నిలుచుండి పోయాడు సుబ్బడు!!!!

‘శక్తి ఉన్నన్నాళ్ళూ నన్ను ఉపయోగించుకుని ఇప్పుడు...ఎలాగైనా నన్ను వదిలించుకుందామనుకుంటున్న వీళ్ళసలు మనుషులేనా? వీళ్ళకి మనసంటూ ఒకటుందాని?

ప్రతి ప్రాణీ పుట్టాక గిట్టక మానదు. అందులో ఏ కొద్ది మందికో చని పోయాక కూడా మానవాళికి ఉపయోగపడే అవకాశం దొరుకుతుంది.
అలా ఇన్నాళ్ళుగా ఈ మనుషులకి సేవ చేసిన నేను, చని పోయాక కూడా మాంస రూపంలో ఆహారమై కొందరి కడుపులు నింపగలుతున్నాను అని తృప్తి పడ్డాను!

కానీ ఈనాడు ఈ మనుషులు గోవధ నిషేధం అంటూ ఆడుతున్న రాజకీయ చదరంగంలో మమ్మల్ని పావులుగా వాడుకుని మానుంచి ఆ భాగ్యాన్ని కూడా లాక్కున్నారు! అమ్మ పెట్టా పెట్టదు అడుక్కుతినానివ్వదన్నట్లు వాళ్ళు పోషించలేరు మా చావు మమ్మల్ని చావనివ్వరు!!!
అందుకే కాబోలు ఆఖరికి ఆ రాజా కసాయి వాడు నన్ను కబేళాలో కూడా చేర్చుకోను పొమ్మన్నాడు?? నాలాంటి వాళ్ళు ఎంత మందినో ఆ రాజా బాబాయ్ ఇంట్లో చూసాక మనుషులంటేనే అసహ్యం వేస్తోంది....!

నా వేదన ఎవ్వరితో చెప్పుకోను? ఓ భగవంతుడా కనీసం నువ్వైనా నా మొరాలకించి ఈ మనుషులకి కాస్త ఇంగిత జ్ఞానాన్ని, సద్భుద్ధిని ఇయ్యి. మా బ్రతుకులని రాజకీయం చేయొద్దని చెప్పు’ అని తల పైకెత్తి చూస్తూ కన్నీరు కార్చింది గోమాలక్ష్మి .........

(గోవధను సపోర్ట్ చెయ్యడం ఈ కథ ప్రధాన ఉద్దేశం కాదు....ఎవరి మనోభావాలనూ కించపర్చడం అసలే కాదు.....గోసమ్రక్షణ పేరుతో జరుగుతున్న దాడులను చూస్తుంటే అవి పూర్తిగా రాజకీయమని స్పష్టంగా అర్థమైపోతున్న వ్యధ ఈ కథ ప్రేరణ..పోనీ గోరక్షణ అంటూ ఎలుగెత్తి చాటుతున్న వారిలో ఎవరైనా కబేళాలకు తరలకుండా మళ్ళించిన తర్వాత వాటి పోషణ బాధ్యతను స్వీకరిస్తారా అంటే ప్రశ్నార్థకమే.....ఈ గోవేదన ఒకరకంగా బ్రతకలేక చావుతో పోరాడుతూ " మెర్సీ కిల్లింగ్ " కోరుకునే వ్యాధిగ్రస్తుల లాంటిదేనని గోమాతల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం - రచయిత్రి)

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు