‘మీల్స్ రెడీ’ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న ఆ బోర్డ్ కిందే స్వగృహ హోటల్ వైపు దారి చూపించే యారో మార్క్ ను ఫాలో అవుతూ జనాలు ఆకలితో తరలివస్తున్నారు!
హైదరాబాదులోని ఈ ఏరియా చుట్టుపక్కల ఎవరినైనా ‘హోటల్’ అని అడగంగానే వెంటనే వాళ్ళ చూపుడు వేలు చూపించేది స్వగృహ ఉన్న దిశ వైపే!
దగ్గరలో ఉన్న బ్యాచిలర్స్, ఎంప్లాయ్స్, స్టూడెంట్స్, ఒక్కరని కాదు, ఆకలితో ఉన్న ఎవరైనా స్వగృహ లో తినకపోతే అసలు తిన్నట్టే ఉండదని నమ్ముతారు.
ఆదివారం. మిట్టమధ్యాహ్నం.
ఇవాళైతే ఇంక చెప్పనక్కర్లేదు, హోటల్ నిండుగా అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేట్స్ తో కూర్చుని తింటూ ఉన్నారు. ప్లేట్ మీల్స్, ఫుల్ మీల్స్, స్వగృహ స్పెషల్ మీల్స్ (డెసర్ట్ గా డబుల్-కా-మీఠా/ఖుర్బానీ-కా-మీఠా కూడా కలిపి) చికెన్ బిరియాని, మటన్ బిరియాని.. ఇలా రక రకాల వంటల మధ్య కూర్చున్న బబ్లూ వీటన్నిటినీ చూస్తు నోరూరడంతో ఆపుకో లేక అప్పటి వరకూ ఆర్డర్ చేసిన కర్డ్ రైస్ ను క్యాన్సిల్ చేసి ఫుల్ మీల్స్ ఆర్డర్ చేద్దామనుకుని డిసైడ్ అయ్యాడు.
‘తమ్ముడూ...’ అని అక్కడ హడావిడిగా తిరుగుతున్న చోటూని పిలిచాడు.
‘చెప్పండన్నా..’ అంటూ తన చిన్న నోట్ ప్యాడ్, పెన్ పట్టుకుని వచ్చాడు చోటూ.
‘ఇందాక కర్డ్ రైస్ ఆర్డర్ చేసా కద, అది క్యాన్సిల్ చేసి ఫుల్ మీల్స్ తెప్పించు’ అన్నాడు బబ్లూ.
‘ఓ.కే. సార్..’ అని చోటూ అనే లోగా, ‘స్వీట్ తో సహా...’ అని బబ్లూ నొక్కి చెప్పగా అది విన్న అంకుష్ నవ్వాడు. ఆది గమనించిన బబ్లూని చూసి అంకుష్ వెంటనే ‘సారీ భయ్యా’ అని అన్నాడు.
‘పర్లేదులే భయ్యా.. అయినా నా పర్సనాలిటీకి కర్డ్ రైస్, నాకే కామెడీగా అనిపిస్తుంది’, అని తన లావు శరీరాన్ని సందేశిస్తూ వెటకారంగా అన్నాడు బబ్లూ.
‘హహ.. అయినా ఇలాంటి హోటల్లో కూర్చుని కర్డ్ రైస్ మీరేంటి, ఎవ్వరూ తినలేరు లేండి!’ అన్నాడు అంకుష్.
‘తిన గలమా లేదా అని కాదు భయ్యా, తినాలి! తప్పదు... ఏదో అప్పుడప్పుడూ ఇంక నన్ను నేను ఆపుకోలేక ఇలా ఫుల్ మీల్స్, బిరియాని అంటూ ఉంటాను..’
‘అదేంటి భయ్యా, ఎందుకు?’ అంటూ తన బ్యాగ్ నుంచి ఓ సిరప్ బాటిల్ తీసి దాని మూతని తీస్తూ అడిగాడు అంకుష్.
‘అదీ...’ అంటూ ఉండగానే తన వైపు కర్డ్ రైస్ తెస్తున్న చోటూ ని చూసి, ‘అదేంటి, నేను ఫుల్ మీల్స్ అని చెప్పాను కద!’ అని అడిగాడు.
‘తెలుసు అన్న, ఇదీ ఈ అన్న కోసం!’ అంటూ అంకుష్ వైపు చూపిస్తూ సైగ చేశాడు చోటూ.
అప్పుడే సిరప్పును మింగిన అంకుష్ చోటూ కి ‘థ్యాంక్స్’ చెప్పాడు.
‘ఇలాంటి హోటల్లో్ కూర్చుని కర్డ్ రైస్ ఎవ్వరూ తిన లేరని అన్న మీరే తింటున్నారు కదండి!’ అన్నాడు బబ్లూ.
‘ఇంక వేరే ఆప్షన్ లేదండి బాబు.. నాకు జీ.ఈ.ఆర్.డి’ అంటూ ఆ పక్కనే పెట్టి ఉన్న ఆవకాయ జాడి లోనుంచి ఓ ముక్క ని తన కర్డ్ రైస్ కటోరీ లో వేసుకుని తినడం మొదలు పెట్టాడు అంకుశ్.
‘అంటే?’
‘గ్యాస్ట్రో యూసోఫేగల్ రిఫ్లక్స్ డిజీజ్, ఇది ఉంటే, రోజూ తినే తిండితో పాటు ట్యాబ్లేట్లు సిరప్లున వేసుకోవడమే కాకుండా, స్పైసీ ఫుడ్ మొత్తానికి మానేసి, ఇదిగో ఇలా కర్డ్ రైస్ లాంటి చప్ప డిషస్ ని తింటూ ఉండాలి.’ అంటూ మరో చెంచా కర్డ్ రైస్ ను నోట్లో పెట్టుకుని, ‘ఇదొక్కటే కాదు... మెల్లగా తినాలి...తిన్నాక కనీసం మరో మూడు గంటల వరకూ అస్సలు పడుకోకూడదు. లేదంటే తిన్న ఫుడ్ మళ్ళీ కడుపు నుంచి రివర్స్ వచ్చి ఎసిడిటీ ని పెంచుతుంది..’ అన్నాడు అంకుష్.
ఇంత లోనే, పదిహేను రకాలతో ఘుమ ఘుమ లాడే సువాసన భరితమైన వంటకాలు పరిచి ఉన్న ప్లేట్ ను తీసుకొచ్చిన చోటూ, బబ్లూ ముందు పెట్టడంతో, తన ఎదుగుగా కర్డ్ రైస్ తింటూ ఉన్న అంకుశ్ ను చూసి తనకు ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపించింది.
‘సారి భయ్యా... మీ ముందు ఫుల్ మీల్స్ తింటున్నా..’ నొచ్చుకుంటూ అన్నాడు బబ్లూ.
‘పర్లేదండి బాబు... నేనెలాగో తిన లేను.. మీరైనా లాగించండి.’ అన్నాడు అంకుశ్.
‘అసలు మీకు ఆ రోగం ఎలా వచ్చింది భయ్యా?’ అని తన ప్లేట్లో ని ఫుల్ మీల్స్ ను పులిహోరతో ఆరగించడం మొదలు పెట్టిన బబ్లూ అడిగాడు.
‘నేను పుట్టుకతో వెజీటేరియన్ భయ్యా. కాని, ఓ నాలుగేళ్ళ క్రితం ఓ ఫ్రెండ్ నన్ను బలవంత పెట్టడంతో నాన్ వెజ్ తినడం మొదలు పెట్టాను. అది కూడా ఓ మోతాదులో అంటే అనుకోవచ్చు... కాని కుంభాలు కుంభాలుగా తినడంతో నా శరీరానికి ఇంత హెవీ ఫుడ్ అలావాటు లేని కారుణంగా తిప్పి కొట్టడం మొదలు పెట్టింది. ఇదంతా ఒక ఎత్తైతే, బ్యాచిలర్ గా ఉండడం వల్ల, నాకిష్టమొచ్చినప్పుడు తినే వాడిని. అందులోను, ప్రతి వారం చివరిలో ఆఫీస్ పని మీద ఎక్కడెక్కడికో వెళ్ళాల్సొచ్చేది. అక్కడి కెళ్ళి ఏది దొరికితే అది తినే వాడిని. కొన్ని సార్లైతే పొద్దున్న చెయ్యాల్సిన బ్రేక్ ఫాస్ట్ అర్థరాత్రి ఒంటి గంటకి.. మధ్యాహ్నం చెయ్యాల్సిన లంచ్ తెల్లవారు ఝామున నాలుగు గంటలకి చేసి పడుకోవడం.. ఎప్పుడు లేస్తే అప్పుడు డిన్నర్ చేసి మళ్ళీ నా పని నేను చేసుకోవడం. ఒక్క ముక్కలో చెప్పాలంటే- ఇష్టమొచ్చినట్టు చేశాను భయ్యా. మనం తినే ఫుడ్ ఎక్కడ తింటున్నాం... అసలు అది ఆరోగ్య కరమైనదేనా?.. ఏ నూనె వాడుతున్నాడు?... ఎన్ని రోజుల నుంచి నిలవున్నది?... ఇలా ఏదీ పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినేసా. అప్పుడప్పుడూ నా శరీరం నాకు జాగ్రత్త పడమని కొన్ని సిగ్నల్స్ ఇచ్చేవి... అయినా సరే, ‘ఏదైతే అది... చూస్కుందాం!’ అనుకున్నాను... ఇప్పుడు అయ్యింది, చూస్కుంటున్నాను!’ అన్నాడు అంకుశ్ బాధగా నవ్వుతూ.
‘ఆ తర్వాత?’ అని అప్పటికే వంకాయ ఆలుగడ్డ కూర, పప్పు కఠోరీలను ఖతం చేసి, సాంబార్ అన్నంలో అప్పడంతో తింటూ అడిగాడు బబ్లూ..
‘ఇంకేముంది... ఓ రోజు రాత్రి పడుకున్నా... సన్నగా గుండె మంట మొద్దలైంది. ‘హార్ట్ ఎటాక్ ఏమో’ అని గాబరా పడి వెంటనే హాస్పటల్ కి వెళితే జస్ట్ ఎసిడిటీ అని తెలిసింది.. ఇంటికొచ్చి ఈనో తాగి పడుకున్నా! అప్పటి నుంచి తిన్న ప్రతి సారి, గుండె మండడం, పైగా, రోజంతా త్రేంపులు రావడం మొదలయ్యాయి. బయటకి వెళ్ళ బుద్ధి కాక పోవడం... ఎవ్వరి తోనూ సవ్యంగా మాట్లాడ లేక పోవడం... ప్రశాంతంగా నిద్ర పోలేక పోవడం... ఇలా ఒకటని కాదు... ఒక్క ముక్కలో చెప్పాలంటే- నాలాగే నా శరీరం కూడ ఇష్టమొచ్చినట్టు చేసి నన్ను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది. ఎన్ని మందులు వాడినా తగ్గక పోయే సరికీ నన్ను ట్రీట్ చేసే జనరల్ ఫిజీషియన్ నన్ను గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కి చూపించుకోమని సజెస్ట్ చేశాడు. అసలు మెడిసిన్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి సంబంధించిన ఓ బ్రాంచ్ ఉందని నాకు అప్పుడే తెలిసింది. ఆయన అన్ని టెస్టులూ చేసి, నన్ను జీ.ఈ.ఆర్.డి. తో డైయాగ్నైజ్ చేశాడు.’
ఇంతలో బబ్లూ ప్లేట్లో రైస్ అయిపోవడం గమనించిన చోటూ తనకి రైస్ వడ్డించడానికి మళ్ళీ వచ్చాడు.
‘కర్రీస్ ఏమైనా కావాలా అన్నా?’ అని అడిగాడు చోటూ.
‘వంకాయ కర్రీ ఇంకో సారి వెయ్యి... అలానే నెయ్యి కూడా పట్టుకు రావా భయ్యా!’ అని అడిగాడు బబ్లూ.
అప్పుడే స్వగృహా లో ఎంటర్ అయ్యింది మాధవి. తన డ్రెస్, హ్యాండ్ బ్యాగ్, వాచ్, కళ్ళద్దాలు, అన్ని తను ఎంత డబ్బున్నదో చెప్పాయి. అంకుష్-బబ్లూలు కూర్చున్న టేబుల్ కి పక్క టేబుల్ లో, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న మాధవి, తను బ్లూ టూత్ డివైజ్ ద్వారా కాల్ మాట్లాడుతూ, చోటూని తన వైపు వచ్చి ఆర్డర్ తీసుకోమన్నట్టుగా సైగ చేసింది. వెంటనే తన వైపు నోట్ ప్యాడ్, పెన్ పట్టుకుని వచ్చాడు చోటూ. ఇంకా ఫోన్లోనే మాట్లాడుతున్న మాధవి, మెనూలో తనకి కావల్సిన డి తన వేలితో చూపి, వెంటనే తన కురులు సరి చేసుకోవడం మొదలు పెట్టింది. ఈ లోపల బబ్లూకి కూర వడ్డించి, రెండు చెంచాలు నెయ్యి వేసి మాధవి ఆర్డర్ తేవడానికి వెళ్ళాడు చోటూ.
‘అన్నట్టు ఇంతకీ... మీకేం ప్రాబ్లం అండి? ముందీ కర్డ్ రైస్ ఆర్డర్ చేశారు?, ఏదో తినక తప్పదు అని అన్నారు!’ అని అడిగాడు అంకుశ్, ఈ సారి నిమ్మకాయి ముక్క కర్డ్ రైస్ లో నంచుకుంటూ...
‘నాకున్న ఒకే ఒక్క ప్రాబ్లం...’ అంటూ తన పొట్టని మూడు సార్లు తన ఎడమ చెయ్యితో తడిమాడు బబ్లూ. ‘చిన్నప్పటి నుంచి నేను తిండి ప్రియుణ్ని భయ్యా! తినీ.. తినీ ఇదిగో, బాడీ ఇలా తయారయ్యింది. ఒక రెండు ఫ్లోర్లు ఎక్కితే ఆయాసం. దిగితే ఆయాసం. ఏ పనైనా చెయ్యాలంటే బద్దకం. పైగా, ఇదే గనక కొనసాగితే నాకు ముందు ముందు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని, హార్ట్ ఎటాక్ వచ్చే చాన్సెస్ కూడా పెరుగుతాయని చెప్పాడు మా ఫ్యామిలీ డాక్టర్.’
‘మరి వర్కవుట్ చెయ్యొచ్చు కదా?’ అన్నాడు అంకుశ్, తన కర్డ్ రైస్ లోని ఆఖరి స్పూన్ తింటూ. మనసులో మాత్రం ‘ఈ నిమ్మ కాయ ముక్క కర్డ్ రైస్ లో ముందర నుంచే ఎందుకు నంచుకో లేదు!’ అని చింతిస్తున్నాడు.
‘ఆ ముచ్చట కూడా తీరింది. జిమ్ లో ఎంత వర్కవుట్ చేసినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఉత్త వర్కవుట్ చేస్తే ఏం ఉపయోగం? డైట్ కూడా కరక్ట్ గా ఉండాలిగా?’
‘మరి ఒక హెల్తీ డైట్ పాటించచ్చుగా?’
‘నాకూ పాటించాలనే ఉంటుంది. ఓ రెండు సార్లు ట్రై చేసా కూడా. కాని మహా అయితే ఓ నాలుగు రోజులు ఉంటుంది అంతే. దాని తర్వాత మన ప్లేట్, కడుపు.. రెండూ నిండుగా ఉండల్సిందే!’ అంటూ తన కంచంలో రసం వేసుకున్నాడు బబ్లూ.
‘చూడు భయ్య... నేను కూడా నీ లాగే ముందు పట్టించుకో లేదు. కాని, నువ్వు గనకా ఇప్పుడు నీ శరీరానికి సరైన కేర్ తీసుకోక పోతే, ముందు ముందు అనవసరమైన రోగాలు చుట్టుకుంటాయి. అప్పుడు ఎలాగో చచ్చినట్టు డైట్ ఫాలో అవ్వక తప్పదు, దానికి తోడు రోజూ మందులేసుకోవాలి, వారనికో సారి టెస్టులు చెయ్యించుకోవాలి, నెలకో సారి డాక్టర్ ని సంప్రదించాలి. దాని బదులు కొంచెం కష్టమైనా సరే, ముందే మన బాడీపై సరైన దృష్టి పెట్టడం బెటర్ కద!’ అన్నాడు అంకుశ్.
‘నువ్వు చెప్పేది కరక్ట్ భయ్యా. ఇప్పటి నుంచి నేను జాగ్రత్త పడతా. స్ట్రిక్ట్ గా లైట్ ఫుడ్ ని తినడం పాటిస్తా... రేపటి నుంచి నో మసాలా.. నో బిర్యాని... నో ఫుల్ మీల్స్’ అంటూ తన కంచంలో పెరుగు వేసుకున్నాడు బబ్లూ.
‘గుడ్... కాని అంత స్ట్రిక్ట్ గా కూడా ఏం అక్కర్లేదు భయ్య.. వారమంతా లైట్ ఫుడ్ తిని వర్కవుట్ చేస్తూ, వీకెండ్స్ లో మాత్రం బిరియాని కుమ్మెయ్యి... అప్పుడైతేనే ఇదిగో, ఇలా అన్నిటితో పాటు పెరుగు తినగలవు, లేదంటే నా లాగా పెరుగు మాత్రమే తినాల్సొస్తుంది!’ అంటూ అంకుశ్ బబ్లూ ఇద్దరూ నవ్వ సాగారు.
ఇంతలో మాధవి టేబుల్ మీద వెజ్ బిరియాని పెట్టాడు చోటు. అసలు టేబుల్ మీద ఏవుందో కూడా పట్టించుకోని మాధవి రెండు చెంచాలు తిన్నాక, తను తింటుంది వెజ్ బిర్యాని అని, చికెన్ కాదని గమనించింది. వెంటనే తను తన ఫోన్ కాల్ ని హోల్డ్ లో పెట్టి... ‘హే యూ.....’ అని గట్టిగా చోటూ వైపు చూస్తూ అరిచింది.
‘చెప్పండి మ్యాడం’ అంటూ వచ్చాడు చోటూ.
‘నేను నిన్ను ఏం తెమ్మని చెప్పాను?’ కోపంగా అడిగింది మాధవి.
‘వె..జ్... బిర్యాని?’ అని తడబడుతూ చెప్పాడు చోటూ.
‘వెజ్ బిర్యాని తెమ్మని చెప్పానా నిన్ను? హా్ఁ?...’ అని అరుస్తూ టేబుల్ పై ఉన్న బిర్యానీని తోసింది. అది వెళ్ళి టేబుల్ నుంచి స్లిప్ అయ్యి నేల మీద బోర్లా పడి పోయింది.
అందరూ మధవి వైపు చూడ సాగారు. చోటూ మాత్రం నేల పాలై పోయిన బిర్యానిని చూస్తూ కంట తడి పెట్టుకున్నాడు. ‘సారి మ్యాడం... మీరు వెజ్ బిరియాని చూపించినట్టు అనుపించింది..’ అని భయం భయంగా అన్నాడు చోటూ. ఈ లోపల మేనేజర్ రామ్మూర్తి వచ్చి మాధవి ద్వారా ఏమైందో కనుక్కుని, చోటుని అందరి ముంది తిట్టి పోసాడు. కింద పడిన బిర్యానీని క్లీన్ చేసి, అర్జెంట్ గా మ్యాడంకి చికెన్ బిర్యాని సర్వ్ చెయ్యమని కేకలేశాడు. కాని మాధవి పొగరుగా అక్కడ నుంచి లేచి బయట కెళ్ళి పోయింది.
రామ్మూర్తి వెంటనే కోపంతో చోటూ జబ్బ పట్టుకుని బర్రున వంట శాల లోకి లాక్కెల్లాడు. అందరూ ఎవరి పని వాళ్ళు చూసుకో సాగారు, అంకుశ్ మరియూ బబ్లూ మాత్రం ఆందోళనగా వంట శాల వైపు చూశారు. గట్టిగా ఒక చెంప దెబ్బ శబ్దం వినబడగా, ఆ గది లోంచి రామ్మూర్తి తన చెయ్యి విదిలించుకుంటూ వెళ్ళాడు. కాససేపటికే అందులోంచి చోటూ వచ్చాడు. తన కళ్ళ నిండా నీళ్ళు, తన ముక్కు లోంచి కొద్దిగా రక్తం కారడం గమనించిన అంకుశ్-బబ్లూ చోటూని తన వద్దకి పిలిచారు. చోటూ వెంటనే వెళ్ళి కింద పడిన ఆ వెజ్ బిరియానిని తను ఎత్తి అక్కడున్న డస్ట్ బిన్ లో పడేసి, తన దెగ్గరున్న నోట్ ప్యాడ్, పెన్ పట్టుకుని అంకుశ్-బబ్లూ దగ్గరికి వచ్చాడు.
‘ఇక్కడ కూర్చో...’ అంటూ చోటూకి పక్కనున్న కుర్చీని చూపించాడు బబ్లూ.
‘హమ్మో... పని చెయ్యకుండా కూర్చున్నట్టు సార్ చూస్తే చంపేస్తాడు..’ అన్నాడు చోటూ భయ పడుతూ.
‘ఏం భయ పడకు... మేమున్నాంగా! కూర్చో..’ అన్నాడు అంకుశ్.
‘ఎప్పుడు రామ్మూర్తి తనని అలా చూస్తాడా’ అన్న భయంతో, వెంటనే లేచేందుకు వీలుగా కుర్చీ చివరకంటా కూర్చున్నాడు చోటూ. ‘ఇదిగో తిను..’ అంటూ తన స్పెషల్ మీల్స్ లో భాగమైన స్వీట్ ను చోటూకి ఇచ్చాడు బబ్లూ. మొహమాటపడినా, బబ్లూ బలవంత పెట్టే సరికీ కాదన లేక డబుల్-కా-మీఠాని తినసాగాడు చోటూ. ఎప్పుడూ ప్లేట్లలో చూడ్డమే తప్ప డబుల్-కా-మీఠా తిన్నది లేదు. చోటూ కొన్ని క్షణాల పాటు అన్ని మర్చి పోయి డబుల్-కా-మీఠా తినడంలోని మాధుర్యంలో మునిగి పోయాడు. ఈ లోపల తన కర్చీఫ్ తీసి చోటూ ముక్కు తుడుస్తూ, ‘నిన్ను మీ సార్ ఎందుకు కొట్టాడు?’ అని అడిగాడు బబ్లూ.
ఇంక చోటూ ఏడుపాపుకో లేక పోయాడు, ‘నా తప్పేం లేదు అన్న.. ఆవిడ ఫోన్ మాట్లాడుకుంటూ మెనూ వంక చూపించింది... నేను చూసినప్పుడు ఆవిడ వేలు వెజ్ బిరియాని మీద ఉందని అదే అనుకున్నానన్నా...’ అంటూ ఏడవ సాగాడు.
‘సరె.. సరె... ఏడవకు... అయినా తప్పు ఆర్డర్ వస్తే మార్చమని చెప్పాలి కాని, విసురుగా కింద పడేయడమేమిటి? ఛి ఛీ!’ అని కసురుకున్నాడు అంకుశ్.
‘తన సంగతి పక్కన పెట్టు... అసలే తప్పు చేయని వీడి మీద చెయ్యి చేసుకున్నాడు... పద వాడి సంగతి చూద్దాం..’ అంటూ ఆవేశంగా లేవ బోయాడు బబ్లూ.
‘వద్దన్నా.... వద్దు... మీరిప్పుడు ఏమైనా చేస్తే, తర్వాత నన్ను ఇంకా కొడతాడు...’ అంటూ బ్రతిమాలాడు చోటు.
‘అసలు చేయి జేసుకోవడమేంటి? మనిషేనా..? చోటూ... నీకిక్కడ ఎంతొస్తుంది?’ అడిగాడు అంకుశ్.
‘రెండు వేలన్నా..’, చోటూ తన స్వీట్ లాస్ట్ స్పూన్ తింటూ చెప్పాడు.
‘రెండు వేలేనా? అన్నీ ఇక్కడ సింగిల్ హ్యాండెడ్ గా సర్వ్ చేస్తున్నవ్... అంత తక్కువ ఇచ్చినా ఇక్కడ ఎందుకు పని చేస్తున్నావు?’ అడిగాడు అంకుశ్. చోటూ ఏం మాట్లడ లేదు. ‘హోటళ్లలో తక్కువిచ్చినా మిగిలి పోయిన ఫుడ్ పని చేసే వాళ్ళకి పెడతారు. అందుకేనా?!’ అడిగాడు బబ్లూ.
‘అవును అన్నా... కాని సారు మాకేం పెట్టడు. మొదటి వారం మాత్రమే మూడు పూట్లా ఏదో కొంచెం పెట్టేవాడు... ఆ తర్వాత ఏది మిగిలి పోయినా మా సారు అన్ని తన ఇంటికే తీసుకెళతాడు.. మాకేం పెట్టడు.’ అన్నాడు చోటు తన కళ్ళు తుడుచుకుంటూ.
‘అందుకే చూడడానికి ఇంత వీక్ గా ఉన్నావు...’ అన్నాడు బబ్లూ జాలిగా.
‘మరి... నువ్వు రోజూ ఎలా తింటున్నావు?’ అని అడిగాడు అంకుశ్.
కళ్ళ నీళ్ళతో పక్కనున్న డస్ట్ బిన్ ను చూపించాడు చోటు. వెంటనే అంకుశ్ బబ్లూల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
‘తినడానికి అన్నీ ఉన్న మనం సవ్యంగా తినకుండా మనకిష్టమొచ్చినట్టు చేసి హెల్త్ ని పాడు చేసుకుంటూ ఉంటే, తింటే చాలు అనుకునే వీడికి మాత్రం తిండే లేదు!’ అని చోటూ తల నిమురుతూ అన్నాడు అంకుశ్,
‘ఇంతకీ నీ పేరేంటి..?’
‘చోటూ..’
‘అన్న... ఇక్కడ రైస్...’, ‘ఇక్కడ సాంబార్..’ అంటూ అడగడం మొదలు పెట్టారు చుట్టు పక్కల కూర్చున్న కష్టమర్స్. ఇది విని లేవ బోయిన చోటూని మళ్ళీ బలవంతంగా కూర్చోపెట్టారు అంకుశ్-బబ్లూ.
‘చోటూ...ఇవాల్టి నుంచి నువ్వు ఇక్కడ పని చెయ్యట్లేదు.. సరేనా...?’ అని చెప్పాడు అంకుశ్.
‘అన్నా... నేను ఈ పని మాన లేను... ఇక్కడ అన్ని చూసుకునేది నేనే... వంట దగ్గరనుంచి సర్వింగ్ వరకూ చాలా పనులు చూసుకుంటాను... నేను ఒక్క రోజు పనికి రాలేక పోతేనే సారు నన్ను కొడతాడు... అలాంటిది ఎలా మానేస్తాను?’
‘నేను చెప్పేది అదే చోటూ... నిజానికి నీ సారు అవసరం నీకు లేదు... నీ అవసరమే నీ సారుకి ఉంది.. అవునూ, నీకు వంట చెయ్యడం వచ్చా?’ అడిగాడు అంకుశ్.
‘వచ్చన్నా... ఇందాక బబ్లూ అన్న తిన్న వంకాయ కూర, మీరు తిన్న ఈ నిమ్మకాయ పచ్చడి, చేసింది నేనే..!’ అన్నాడు గర్వంగా.
‘బేరర్....బిల్...’, ‘ఇక్కడ మజ్జిగ...’ మరి కొంత మంది కష్టమర్స్ గట్టి గట్టిగా పిలిచారు. లేవ బోతున్న చోటూని మళ్ళి ఆపాడు అంకుశ్.
‘కూర్చో చోటు... ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు.. ఈ మసాల వంటలు కాకుండా చప్ప పత్యం వంటలు చెయ్యడం వచ్చా?’ అడిగాడు అంకుశ్.
‘ఆనప కాయ కూర నుంచి చికెన్ బిర్యాని వరకూ ఏదైనా చేయ్య గలను అన్నా!’ చెప్పాడు చోటు, ఇంకా మ్యానేజర్ ఎక్కడ తనని చూస్తాడోనన్న భయంతో.
‘సూపర్... ఐతే రేపటి నుంచి నాకు వంట చేసి పెట్టు. మా రూం దగ్గర లోనే ఉంది. రోజు నాకు పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ రెడీ చెయ్యి, లంచ్ ప్యాక్ చెయ్యి. మళ్ళీ రాత్రి వచ్చి డిన్నర్ చెయ్యి. నాకొక చిన్న రోగముంది...అది తగ్గేంత వరకూ పత్యం కూరలే వండాలి...సరేనా? మనిద్దరం కలిసే తిందాం...ఉందాం! నీకు జీతం కూడా ఇస్తాను.. కాని, ప్రతి వారం చివరిలో నాకు సిటీ బయట కెళ్ళాల్సొస్తుంది...’ అన్నాడు అంకుశ్.
‘ఐతే, ప్రతి వీకెండ్ మా ఇంటి కొచ్చి నాకోసం బిర్యాని చెయ్యి... మనం కలిసి కుమ్మేద్దాం!’ అన్నాడు బబ్లూ.
ముగ్గురూ సంతోషంతో నవ్వ సాగారు.. ముఖ్యంగా చోటూకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది.
‘రైస్ చెప్పి గంటయ్యింది.... ఎవ్వడైనా ఉన్నాడా అసలు?’ అని కోపంతో అరిచాడు ఓ కష్టమర్. అప్పుడే రామ్మూర్తి కూడా కోపంగా చోటూని వెతుకుతూ వచ్చాడు.
‘ఏరా? చుట్టుపక్కల జనాల అరుపులు వినపడట్లేదా? కావల్సింది వడ్డించ కుండా ఏం చేస్తున్నావ్ రా ఇక్కడ?’ అని గట్టిగా చోటూ మీద అరిచాడు రామ్మూర్తి.
‘మీ చోటూ ఇక్కడ ఉద్యోగం మానేశాడు... మీరు బిల్ తీసుకొస్తే మేము కట్టి బయలు దేరతాం.’ అన్నాడు అంకుశ్. రామ్మూర్తికి ఏం అర్థం కాలేదు.
‘అలానే నాకు ఫింగర్ బౌల్ కూడా తీసుకు రండి...’ అన్నాడు బబ్లూ.
***
మూడు నెలల తర్వాత.
ఇంతకు ముందు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు స్వగృహకి లేక పోవడంతో చాలా వరకు జనాలు రావడం తగ్గించేశారు. చోటూ వదిలేయడంతో ఆ హోటల్ లోని చాలా మంది కూడా రామ్మూర్తి బాధ భరించడం కన్నా వదిలి వెళ్ళడం మేలు అని నిశ్చయించుకున్నారు. ఇప్పుడు స్వగృహా ఆ ఏరియా లోని అన్ని హోటల్స్ లో ఒకటి!
అప్పుడే ఆ హోటల్లోకి వచ్చింది మాధవి. ఇప్పుడు సర్వ్ చేయడానికి ఎవరూ లేకపోవడం వల్ల, ఎవరికి వారు టోకెన్ తీసుకుని సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి.
‘ఒక కర్డ్ రైస్...’ అంటూ టోకెన్ తీసుకున్న మాధవి, ఫస్ట్ స్పూన్ తినే ముందు తనకి ఇటీవల వచ్చిన స్టమక్ అల్సర్ ట్యాబ్లేట్ వేసుకుంది..
***
మనందరం చోటూలా కష్ట పడేది మన ఆకలి తీర్చుకోవడం కోసమే. సరైన మోతాదులో ఆరోగ్య కరమైన తిండి తింటే దానికి మించిన ఔషదం మరొకటి ఉండదు. కాని రుచి కోసమే తింటే బబ్లూ లా ఒళ్ళు తప్పదు, ఇష్టమొచ్చినట్టు తింటే అంకుశ్ లా రోగాలు, ఇబ్బందులూ తప్పవు. అన్నిటికీ మించి, మాధివిలా మన తిండిని అగౌరవ పర్చ కూడదు. అది మహాపాపం! తను కోపంతో తోసి పడేసిన ఆ వెజ్ బిర్యాని కనీసం ఇద్దరి ఆకలిని తీర్చుండేదేమో! అదే తిండి కోసం చోటూ లాంటి ఎంతో మంది చాలా తిప్పలు పడుతూ ఉంటారు... చాలా మందికి సరైన తిండి దొరకక అనేక రోగాల బారిన పడడమే కాకుండా, చనిపోతూ ఉంటారు కూడా!
ఇక నుంచైనా మనం హెల్తీ డైట్ ఫాలో అవుదాం... అది మరీ టైట్ గా ఏం ఉండనవసరం లేదు... అలా అని లైట్ తీసుకో కూడదు కూడా!
ముఖ్యంగా, మనం తినే ప్రతి ముద్దని ఆస్వాదిద్దాం... ఫోన్ మాట్లాడుతూ, టి.వీ. చూస్తూ, ఎక్కడో ఆలోచిస్తూ కాకుండా, మనం ఆకలితో పడుకోకుండా తినడానికి ఓ నాలుగు మెతుకులున్నందుకు సంతోషిస్తూ తిందాం! వీలైతే ఓ నలుగురికి అన్నం పెడదాం కాని, ఒక్క మెతుకు కూడా వృధా చెయ్య కూడదు.
గుర్తుంచుకోండి... ప్రపంచ వ్యాప్తంగా అందరూ కొత్త సంవత్సరం వేడుకలు ఎలా జరుపుకున్నా, మనం మాత్రం షడ్రుచులు కలిగున్న ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం!
రుచి, తిండి, ఆకలి యొక్క విలువలు మన ఇతిహాసాలు, పండగలు ఎన్నో సార్లు చాటి చెప్పాయి. మనకి తిండి కేవలం జీవితంలో భాగం కాదు... జీవితం!
ఓం అన్నపూర్ణాయై నమః