నాన్నమ్మ కోరిక - తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం

nanamma korika story

ద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని పరీక్షగా చూసుకుంటోంది నీలిమ. చిరునవ్వు నవ్వి కళ్ళ చివర ముడుతలు వచ్చాయేమో చూసింది. అబ్బే.. కనపడ లేదు. నుదుటి మీద పెదవులకు ఇరు వైపులా కూడా మరీ పరీక్షగా చూస్తే తప్ప కనబడ్డం లేదు. చెంపల పైన నెరుస్తున్న జుత్తు మాత్రం ఆమె వయసును దాచడం లేదు.

ఉదయం ఫోనులో ఆమాట విన్నప్పటి నుండి నీలిమ ఒక చోట నిలువ లేక పోతోంది. "నువ్వు నన్ను ఆట పట్టించడం లేదు కదా" అని కూడా అడిగేసింది నరేశ్ ని. నరేశ్ ఆమె ముద్దుల కొడుకు. ఒక్కగా నొక్కడు. వంశోద్ధారకుడు

ఎడాది కిందట నరేష్ పనిచేసే టిసిఎస్ కంపని వారు అతనిని అమెరికా పంపుతామని అన్నారు. తన కళ్ళ ముందర ఉంటాడనుకున్న కొడుకు వేల మైళ్ళ దూరంలో వున్న దేశానికి ఎగిరి వెళ్లి పోతున్నాడంటే నీలిమ తల్లి గుండె తపించి పోయింది. "నిన్ను చూడకుండా ఎలా ఉండేదిరా" అంది బేలగా. "ఎంత? రెండేళ్లలో వచ్చేయనా అమ్మా! ఆ లోగా ఇంచక్కా నువ్వు అమెరికా చూసేయ వచ్చును. "చిన్న పిల్లాడిలా అమ్మ ఒళ్లో పడుకుని కబుర్లు చెప్పి ఓదార్చాడు నరేష్. "అదేమిటోయ్ ఐదో క్లాసు నుండి వాడికి ఐ ఐ టి కోచింగు ఇప్పించింది అమెరికా వెళ్ళడం కోసమేగా!" అని నీలిమ భర్త నవ్వించాలని చూసాడు అదే నీలిమ కు ఉక్రోషం ముంచుకు వచ్చింది "అవును ఇప్పుడు వాడు ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నాడంటే అమెరికాకు వెళ్ళుతున్నా డంటే చిన్నప్పటి నుండి అలా చదివించాను కనుకనే." అంది "అమ్మయ్య! అమ్మ విషాద యోగం నుండి బయట పడింది నాన్నా!" నవ్వుతూ తండ్రితో అన్నాడు నరేష్. సారధి ఆప్యాయంగా కొడుకు భుజం తట్టాడు. నరేష్ పుట్టినప్పుడు వాడికి తన తండ్రి పేరు పెట్టుకోవాలని ఆశ పడ్డాడు సారధి. సారధి హై స్కూలులో ఉండగానే తండ్రిని కోల్పోయాడు. నరశింహం అన్న పేరును కాస్త ఆధునికంగా మార్చి నరేష్ అని పెట్టడానికి ఒప్పుకుంది నీలిమ.

తన వంశాంకురం', తన భర్త పేరు నిలిపే మనవడిని చూసి మురిసి పోయింది సారధి తల్లి భూలక్ష్మి. తనివి తీరా మనవడిని చేరదీసే అదృష్టం మాత్రం ఆమెకు దక్కలేదు.

నీలిమకు అత్త గారి పూజలు, ఉపవాసాలు చాదస్తలుగా కనిపించాయి. ఆవిడ సమయపాలన, క్రమశిక్షణ తన మీద పెత్తనంలా కనిపించింది. కల్లాకపటం లేని ఆమె మాటలు పల్లెటూరి మోటుతనంగా తోచాయి. మొదటి నుండి ఆమెను దూరం పెట్టింది నీలిమ. నరేష్ పుట్టినప్పుడు పుట్టింట్లోనే ఆరు నెలలు గడిపేసింది. తరువాత భూలక్ష్మి కొడుకు ఇంటికి వచ్చినా మనవడిని ఆమె చేతికి అందనిచ్చేది కాదు నీలిమ. పిల్లవాడిని కాళ్ళ మీద వేసుకుని నీళ్ళు పోయాలని, సాంబ్రాణి ధూపం వేసి పట్టు కుచ్చు లాటి వాడి జుట్టు ఘుమ ఘుమ లాడుతుంటే గుండెకు హత్తుకోవాలన్న ఆమె ఆశను మొదట్లోనే తుంచేసింది నీలిమ.

వాడి పనులు ఏవీ ఆమెను చేయ నిచ్చేది కాదు. నరేష్ కాస్త పెద్ద అయ్యాక కొడుకు చదువు పేరుతో అత్తగారింటికి వెళ్లడమే మానేసింది నీలిమ. ఆవిడ తమ దగ్గరికి వచ్చినా ఏదో ఒకటి అని ఆమెను పది రోజుల్లో పంపించేసేది. సంవత్సరాలు దొర్లి పోయి నరేష్ ఉద్యోగంలో చేరడం కూడా జరిగింది. ఉద్యోగంలో చేరిన రెండేళ్ళకంతా నరేష్ కు అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. అమెరికా వెళ్ళే ముందే మనవడికి పెళ్లి చేసి పంపించమని అంది భూలక్ష్మి. ఇరవై నాలుగేళ్ళకే పెళ్ళేమిటి అంటాడేమో నరేష్ అనుకున్నారు సారధి, నీలిమ. నాన్నమ్మ మనవడికి ఏమి చెప్పి నచ్చచెప్పిందో గాని నరేష్ పెళ్ళికి ఒప్పుకున్నదుకు సంతోష పడ్డారు దంపతులు.

ఆ ఉదయం నరేష్ ఫోనులో చెప్పిన వార్త విన్నప్పటి నుండి నీలిమకు కాళ్ళు నేల మీద ఆనడం లేదు. అద్దంలో తనని తాను చూసుకుని నాన్నమ్మలా ఉన్నానా అని పరిశీలించుకుని చూసుకుంటోంది. కొత్త హోదా ఏదో వచ్చినట్టు మురిసి పోతోంది. పుట్టబోయే బిడ్డ ఎవరి పోలికతో ఉంటాడో ఉహించు కుంటోంది. పెళ్లి అయిన ఏడాదికే తనని నాన్నమ్మని చేస్తున్న కొడుకును, కోడలిని అభినందనలతో ముంచెత్తింది నీలిమ. ఆ పిల్లకు ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. కోడలు పావని అసలే తల్లి లేని పిల్ల. పెళ్ళిలో ఆ అమ్మాయి చిన్నాన్న, పిన్ని పీటల మీద కుర్చుని కన్యాదానం చేసారు. "పావనికి అత్తగారు అయినా అమ్మ అయినా మీరే "అంటూ ఒప్పగింతల సమయంలో నీలిమకు పావని బాధ్యత ఒప్పగించారు. పెళ్లి అయిన వారానికే నరేష్ పావని అమెరికా వెళ్లి పోయారు. ఏడాది గడిచింది. మొన్న ఫోనులో చెప్పాడు నరేష్ పావని తల్లి కాబోతుందన్న శుభవార్త. అదిగో అప్పటి నుండి నీలిమ ఊహలలో తేలిపోతోంది. తల్లి లేని పావనికి సీమంతం జరిపినా , కాన్పు సమయంలో తోడుగా ఉన్నా, చంటిబిడ్డకు నీళ్ళు పోసి జోల పాడినా అన్నీ తానే చేయాలి" అనుకుంటే వయసుకు మించిన పెద్దరికం వచ్చినట్టు గర్వంగా వుంది నీలిమకు.

"ఎంత.. ఇంకో నాలుగయిదు నెలలలో తను, తన భర్త అమెరికాకు వెళ్లాల్సి వస్తుంది. కనీసం తొమ్మిదో నెల పడే సరికైనా తామిద్దరూ వాళ్ళ దగ్గర ఉండాలి. తల్లి, బిడ్డ క్షేమంగా ఇల్లు చేరాక సెలవు లేకపోతే ఈయన గారు వెనక్కి వచ్చేసినా తాను మాత్రం ఆరు నెలలు అక్కడే ఉంటుంది. ఇంకా మాట్లాడితే మరో ఆరు నెలలు పొడిగించుకోవచ్చునట" ఎన్నో ఆలోచనలు నీలిమ మనసులో.

ఈ మధ్య కాలంలో ప్రతి ఇంటి నుండి కొడుకో, కూతురో అమెరికాలో ఉండడం మామూలు అయి పోయాక అక్కడి వివరాలు, విశేషాలు అమెరికాలో అడుగు పెట్టని వాళ్ళకు కూడా తెలుస్తున్నాయి. అక్కడ పని వాళ్ళు వారానికో, నెలకో ఒక సారి వచ్చి ఇల్లు క్లీన్ చేసి పోతారుట అని, అక్కడ అపార్ట్ మెంట్ లలో ఉండేవాళ్ళు బట్టలు బయటకు కనబడేటట్టు ఆరేయ కూడదని, వాషింగ్ మెషిన్లో వేసినా ముడుతలు పడని సింథటిక్ చీరలే తీసుకు వెళ్ళాలని సలహాలు చెబుతున్నారు నీలిమకు.

కోడలికి కావలసిన సౌభాగ్య శొంటి', నడుము కట్టుగా వేసుకునే పట్టీ, సీమంతానికి బంగారు గాజులు, పుట్టబోయే బిడ్డకు మెడలోకి గొలుసు, చేతికి మురుగులు ఇలా పెద్ద చిట్టా తయారు చేసుకుని ఈ నాలుగు నెలల్లో సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేస్తోంది నీలిమ..

పావనికి ఐదో నెల వచ్చాక ఒకసారి కంప్యూటరులో స్కైప్ లో కొడుకును కోడలిని చూసి మాట్లాడారు సారధి, నీలిమ. వాళ్ళు కూడా పాపాయి కోసం ఊయల, స్నానానికి చిన్న బాత్ టబ్, పాపను బయటకు తీసుకు వెళ్ళడానికి స్త్రోల్ల్ర్ బండి కొనాలని చూస్తున్నట్టు చెప్పారు. అక్కడ పుట్టిన పాపాయిలకు అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేస్తుందని కూడా చెప్పాడు నరేష్.

డెబ్బై ఏళ్ళు వచ్చినా పత్తికొండలో ఒంటరిగా ఉంటోంది భూలక్ష్మి. భర్త పోయాక కొడుకే ప్రాణంగా బ్రతికింది. సారధికి డిగ్రీ రాగానే ఎ. జి ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. దూరపు బంధువుల పిల్ల నీలిమను సారధి ఇష్ట పడడం వలన ఆమెతో పెళ్లి జరిపింది. నీలిమకు తనంటే పొసగక పోవడం వలన పల్లెలో స్వంత ఇంట్లో భర్త పెన్షన్తో కాలం గడుపుతోంది. వారానికోసారి తల్లికి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటాడు సారధి. ఆ వారం తల్లితో చెప్పాడు కంప్యూటర్లో కొడుకుని, కోడలిని చూసి మాట్లాడినట్టు.

"నరేష్ తన స్నేహితుడితో నాకూ ఒక లాప్ టాప్ పంపించాడురా. అందులో ఆ అబ్బాయి నాకు మనవడిని, మనవరాలిని చూపించాడు. నేను వాళ్లతో మాట్లాడాను. "అంది భూలక్ష్మి. "ముసలి వయసులో తొలి సమర్త అన్నట్టు ముసలావిడకు రాజభోగం జరుగుతోంది."అక్కసుగా అంది నీలిమ. ఇంకోసారి నరేష్ తండ్రితో మాట్లాడినప్పుడు "మీతోబాటు నాన్నమ్మకు కూడా పాస్ పోర్ట్ కి ప్రయత్నించండి." అని చెప్పాడు. విషయం తెలిసి నీలిమ మొగుడి మీద విరుచుకు పడింది. "చిన్నా పిల్లాడు. వాడికి తెలియక పోతే మీకయినా మతి ఉండక్కర లేదా? ఈవయసులో ఆవిడకు పాస్ పోర్ట్ ఎందుకట?" అని.

"నాకు అదే అర్థం కాలేదు .. కాదనడం ఎందుకని చేశాను. "అన్నాడు సారధి నెమ్మదిగా.. మరుసటి నెలలో భూలక్ష్మి అమెరికాకు రావడానికి స్పాన్సర్ కాగితాలు పంపించాడు నరేష్.

"నాన్నమ్మ పెద్దదయి పోతోంది కదూ నాన్నా," నేను కళ్ళు మూసేలోగా ముని మనవడిని చూడాలని ఆశగా వుంది నాన్నా పెళ్లి చేసుకుని నా కోరిక తీర్చవూ" అని నన్ను ఒప్పించింది. నేను మరో మూడేళ్ళు ఇక్కడ ఉండాల్సి వస్తోంది. అందుకని పావని పురిటికి నాన్నమ్మని పిలిపించుకుంటాను నాన్నా. మీరు, అమ్మ ఇంకా చిన్న వయసులో వున్నారు. ఎప్పుడయినా ఇక్కడికి రాగలరు. ఇప్పటికి నాన్నమ్మ ఆరోగ్యం గానే వుంది. ప్రయాణము చేయ గలదు. పైనెలలో మా కొలీగ్ ఇక్కడికి వస్తున్నాడు. అదే రోజుకి నాన్నమ్మ వస్తే అయన తోడు వుంటాడు. ముని మనవడిని చూడాలన్న నాన్నమ్మ కోరిక, నాన్నమ్మని నాదగ్గర కనీసం ఆరు నెలలు వుంచుకోవాలన్న నా ఆశ తీరుతాయి." అన్నాడు .

నరేష్ మాటలు విని సారధి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "నిజమే! నరేష్ పుట్టాక తన తల్లి తన దగ్గరకు వచ్చి పట్టుమని నెల్లాళ్ళు ఎప్పుడూ ఉండలేదు. ఆవిడ మనవడిని చూడాలని వచ్చినా, కొడుకును ముద్దు చేసి చెడగొడుతున్నదని, వాడి చదువు పాడయి పోతున్నదని విసుక్కునేది నీలిమ. ఆవిడ చిన్నబుచ్చుకుని వారంలో తిరుగు ప్రయాణం కట్టేది. నరేష్ కాస్త పెద్ద తరగతిలోకి వచ్చాక ఎప్పుడూ వాడికి ప్రైవేటు క్లాసులని, పరీక్షలని పత్తికొండకు సారధితో పంపేది కాదు. నరేష్ కి నాన్నమ్మని చూడాలని వున్నా అమ్మ కోపానికి భయపడి వురుకునే వాడు.

కొడుకు నాన్నమ్మ గురించి ఆలోచించడం, పిలిపించుకోవడం సారధికి చాలా సంతోషంగా అనిపించింది. భూలక్ష్మికి కోడలి కోపం తెలిసి భయంగా వున్నా మనవడిని చూడడానికి వెళ్తున్నందుకు, ముని మనవడిని చూడబోతున్నందుకు సంబరంగా వుంది. అనుకున్నట్టుగానే అమెరికా చేరింది భూలక్ష్మి. అక్కడ నరేష్ స్నేహితులు పావనికి సర్ ప్రైస్ బేబీ షవర్ ఏర్పాటు చేస్తే, నాన్నమ్మ పావనికి సీమంతం జరిపించింది. పావనికి గంటకోసారి నొప్పులు వస్తుంటే ఆస్పత్రికిలో చేర్చారు. అక్కడి నర్సు భూలక్ష్మిని, "గ్రానీ" అంటూ కాఫీ అందించి, దుప్పటి కప్పి ప్రేమగా చూసింది. మునిమనవడిని ఇంటికి తీసుకొచ్చేరోజు నరేష్ స్నేహితులు ఇల్లంతా అలంకరించి తల్లి బిడ్డలకు హారతిచ్చి లోపలకు పిలుచుకు వచ్చారు. చంటివాడికి ఆస్పత్రిలోనే పేరు పెట్టేసారు అనిరుధ్ అని. వాడికి సోషల్ సెక్యురిటి నంబరు కూడా వచ్చేసింది.

భోజనాల బల్ల మీద బేబీ బాత్ టబ్ పెట్టి పసి వాడికి నీళ్ళు పోసి మురిసిపోయింది భూలక్ష్మి. సాంబ్రాణి పొగ వేసి వొళ్ళు కాచి, తువ్వాలులో చుట్టి పిల్లాడిని పావని చేతికందిస్తున్న ముసలావిడ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "నీ చిన్నప్పుడు నీకు లాల పోసి జోల పాడాలని ఆశ పడ్డాను. ఆ కోరిక ఇప్పుడు తీర్చావు." అంటూ నరేష్ తల నిమిరింది. ఆరు నెలలు గడిచి పోయాయి. నరేష్ ఆ రోజు అమ్మతో అన్నాడు. "అమ్మా! మా నాన్నమ్మ ఇండియాకు తిరిగి వస్తోంది. నీ మనవడు అడుగుతున్నాడు మరి "మా నాన్నమ్మ ఎప్పుడు వస్తుందని."

అనిరుద్ద్ కోసం కలవరిస్తోంది నీలిమ. మనవడిని ఎత్తుకోవాలని, గుండెకు హత్తుకోవాలని ఎదురు చూస్తోంది. నరేష్ కోసం అత్తగారు పడిన తపన ఆమెకు అర్థమయ్యింది. అందుకే మనస్పూర్తిగా అంది "నువ్వు మీ నాన్నమ్మ కోరిక తీర్చినందుకు నాకు చాలా సంతోషంగా వుందిరా. నేనూ నా మనవడిని ఎత్తుకోవాలని తహతహలాడుతున్నాను."అంది జీర బోతున్న గొంతుతో.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు