ఓ శ్రీవారి కథ... - వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాస మూర్తి

O Srivari Katha

నెళ్ళాళ్ల నుంచి వచ్చి ఇంట్లో తిష్ట వేసిన తన భార్య బంధువుల్ని చూసి చిర్రెత్తుకొచ్చింది శఠగోపానికి. రోజూ ఏ కుక్క మీదో, పిల్లి మీదో పెట్టి ఏదో అంటున్నా అక్కడ ఎవరికీ చీమ కుట్టినట్టైనా లేదు, అందరూ ఎవరికి వారే దులుపుకుపోతున్నారు. ఇంత వరకు బాగానే వుంది. కానీ చిక్కంతా ఏమిటంటే వచ్చిన దగ్గరనుంచి వెళతాం అన్నమాట అనకపోవడం. దాంతో ఇంట్లో చాకిరీ చెయ్యలేక, అవతల ఆఫీసర్ చేత తిట్లు తినలేక మధ్యలో నలిగిపోతున్నాడు.

నెళ్ళాళ్ల నుంచి శఠగోపం ఆఫీసుకు లేటుగా రావడాన్ని గమనించిన సూపర్నెంటు గుర్నాధం ఇవాళ ఎలాగైనా అతనికి క్లాసు పీకాలని నిశ్చయించుకొని కేబిన్ లోకి రమ్మని పిలిచాడు.

"ఏమయ్యా! శఠగోపం ఇదేమన్నా బావుందా? రోజూ అఫీసుకి లేటుగా వస్తున్నావ్, నిన్ను చూసి మిగతా సిబ్బంది కూడా ఆలస్యం గా రావడం మొదలెడితే నా పరిస్థితి ఏంటి? ఇక్కడ పనంతా ఎవరు చేస్తారు అంటూ రంకెలేసాడు." గుర్నాధం.

ఎప్పుడూ కూల్ కొలంబస్ లా నిదానంగా వుండే గుర్నాధం కేకలు వెయ్యడం చూసి ఖంగుతిన్నాడు శఠగోపం.

"సార్... వయసులో పెద్దవాడిని, గంపెడు సంసారం తో సాగరాన్ని ఈదుతున్న వాడ్ని, కాస్త దయ తలచండి." అంటూ ప్రాధేయపడ్డాడు.

"ఏమిటోనయ్యా... మీ ఉద్యోగులు, అందితే జుత్తు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. ఇంతకీ రోజూ ఆలస్యంగా తగలడడానికి గల రాచకార్యమేంటో కొంచెం శలవిస్తావా...?" అని అడిగాడు.

"ఏం చెప్పమంటారు సార్, నా పాట్లు, నా కష్టాలు ఎవరికీ వుండవు సార్ అంటూ బావురుమన్నాడు...

పొద్దున్నే నాలుగు గంటలకి లేవడం, ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, కాఫీ, టిఫిన్లు, వంట పూర్తిచేసి పిల్లగాళ్ళని నిద్రలేపడం, వాళ్ళకి స్నానం చేయించి, బాక్స్ లు సర్ది స్కూల్ కి తయారుచెయ్యడం, స్కూటర్ పై వాళ్ళను దించిరావడం, నా ఆఫీసు బాక్స్ సర్దుకోవడం లాంటి చిన్నా, చితకా పనులతోపాటు, పనులన్నీ అయ్యేసరికి తొమ్మిది దాటడం జరుగుతుంది.

తొమ్మిది గంటలకు మాశ్రీమతి గారు నిద్రలేవడం, ఆవిడ నిద్రలేచాక పేస్ట్, బ్రష్ అందించడం, కాఫీ, టిఫిన్ లు ఇవ్వడం... ఇలా చేసుకుంటూ పోయేసరికి పుణ్యకాలం గట్టెక్కడం, చివరికి మీతో చీవాట్లు తినడం... ఇది నిత్యకృత్యం అయిపోయింది. అప్పుడు బయలుదేరి చివరికి ఆఫీసుకు చేరేసరికి నవనాడులు తెగి కుయ్యో, మొర్రో మనే పరిస్థితి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అంటూ మళ్ళీ మొదలెట్టాడు.

ఈ మధ్య నా ప్రాణానికి మా బావమరిది పెళ్ళాం, పిల్లలతో సహా దిగాడు. మా బావమరిది పెళ్ళాం కూడా మా ఆవిడ టైపే. విప్పిన చీర కూడా మడతపెట్టదు. పైగా రోజుకో వెరైటీ వంట నేర్చుకొని చేసేసరికి నాకు ముత్తాతలు కనబడుతున్నారని చెబితే అది చిన్నమాట. నా బతుకు బస్టాండ్ చేసేస్తున్నారు. ఇల్లు దామెర్లపూడి సత్రం లా తయారయ్యింది.

పొద్దున్న నాలుగు గంటలకి లేచినా టైం సరిపోవడం లేదు. అందుకే సార్ లేటుగా వస్తున్నాను. కాస్త కనికరించండి సార్..." అని గుక్క తిప్పుకోకుండా వాయించేసాడు శఠగోపం.

ఎలాగైనా ఇవాళ మూడు చెరువులు నీళ్ళు తాగించాలనుకున్న గుర్నాధానికి, ఇదంతా విన్నాక ఆరు చెరువులు నీళ్ళు తాగిన వాడిలా అయిపోయాడు.

"అదంతా సరే గానీ, ఇంతకీ అంతలా ఎలా దాసోహమయిపోవయ్యా..." అడిగాడు గుర్నాథం.

"ఏముంది సార్... కుర్రతనంలో అమ్మాయి బాగుంది కదా అని, వెంటబడి ప్రేమించి పెళ్ళాడాను. ఇక అక్కడ నుంచి బుక్ అయిపోయాను. నా ప్రేమని అలుసుగా తీసుకొని నాతో ఆడుకుంటున్నారు. పోనీ ఏమైనా గట్టిగా అడుగుదామంటే, ఊ అంటే గృహహింస, ఆ అంటే గృహహింస కింద కేసులు పెడతామని బెదిరింపు. ఎవడికి చెప్పుకుంటాం సార్... ఎవడికీ చెప్పుకోలేక, మింగలేక, కక్కలేక చస్తున్నాం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అంటే ఇదే సార్..." అంటూ మరోసారి బావురుమన్నాడు.

"అమ్మాయి రంగు, హంగు చూసి బుట్టలో పడ్డావన్నమాట. తపన పడి పెళ్ళి చేసుకున్నందుకు పెళ్ళయ్యాక పనిమనిషిలా మారిపోయావన్నమాట. అంటూ నిట్టూర్చి సరేలే... వెళ్ళు..." అన్నాడు.

అమ్మయ్యా... బతుకు జీవుడా అంటూ కేబిన్ లోంచి బయటపడ్డాడు శఠగోపం.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ