తద్దినం - 2020 - గోవిందరాజుల నాగేశ్వరరావు

Taddinam 2020

ఆ రోజు సోమయాజులు ఇంట్లో తద్దినం. డాబా మీద కొంతమంది పైకి చూస్తూ... కొంతమంది చుట్టుపక్కల చూస్తూ... కా... కా... అంటూ అరుస్తున్నారు.

ఎందుకంటే కాకుల కోసం.

పంతులు, సోమయాజి ఇంట్లోంచి ఓ అరటి ఆకులో పిండాలు తెచ్చి పిట్ట గోడ మీద పెట్టి తను కూడా అరవటం మొదలు పెట్టారు.

కాని కాకులు రావటం మాట అటుంచి... అసలు కను చూపు మేరలో కాకి అన్నదే కనిపించలేదు. చివరకి ఆడాళ్ళూ... మగాళ్ళూ ... కూడా కలిసి అరవటం మొదలు పెట్టారు.
పిల్లలకి ఏమీ అర్ధం కాక వాళ్ళూ కూడా గొంతు కలిపారు. కానీ వాళ్ళు గొంతులు కలిపింది కాకులకోసం కాదు... ఆకలేసి.

‘బామ్మా... కాకులు రావడం లేదే... ఆకలేస్తోంది... అన్నాడు సోమయాజి కొడుకు రామ సోమయాజులు.

‘కాకి ముట్టుకోకుండా ఎవరూ మెతుకు ముట్టడానికి వీల్లేదు.’ అంది ఖరాఖండిగా బామ్మ.

అందరూ ముఖాలు చిన్నబుచ్చుకున్నారు.

రెండు గంటలు దాటింది.

పంతులు గారు కూడా ఆకలితో నక నకలాడుతున్నారు.

‘పంతులుగారు కాకులు కాదుకదా... కాకి ఈక కూడా కనబడటంలేదు... ఏం చేద్దాం?' అడిగాడు సోమయాజి.

‘మీరేం కంగారు పడకండి. ఓ పావు గంటలో కాకి వస్తుంది.’ అన్నాడు పంతులు.

అందరూ ఆశ్చర్యంగా చూసారు.

రెండు గంటలైనా రాని కాకులు. ఓ పావు గంటలో ఎలా వస్తాయండి? అడిగాడు మరో పెద్ద మనిషి.

డబ్బులుంటే కొండమీద కోతి దిగి వస్తుంది. ఈ కాకి ఓ లెక్కా?, అన్నాడు పంతులు.

‘డబ్బులు చూపిస్తే కాకులు వస్తాయా? అడిగాడు ఓ పెద్ద మనిషి.

‘చూపిస్తే కాదు... ఇస్తే...’ సోమయాజి గారు ఓ అయిదువందలు అన్నాడు పంతులు.

‘పావుగంట లోనా’ అడిగాడు సోమయాజి.

‘అవునండి కాకపొతే ఓ అయిదొందలు అవుతుంది.' అన్నాడు పంతులు తాపీగా.

‘అయిదొందలే' అంది సోమయాజి భార్య సోమిదమ్మ.

‘అయిదొందలు కాదు అయిదు వేలయినా సరే కాకి ముట్టిన తర్వాతే అందరూ అన్నాలు ముట్టేది’ అంది బామ్మ

‘విన్నారుగా’ అన్నాడు పంతులు ఆనందంగా.

‘అబ్బా నువ్వుండవే అమ్మా... ఆవిడ మాటలేం పట్టించుకోకండి. అయిదొందలు ఖాయం చేసుకొని అర్జెంట్ గా కాకి చేత కబురు పంపి... కాకి ని రప్పించండి... ఆకలితో అందరూ నక నక లాడుతూ వున్నారు.’ అన్నాడు సోమయాజి.

పంతులు సెల్ ఫోన్ తీసి ఓ నంబర్ డయల్ చేసి. 'హలో... కాకి కామేశం... నేను పిండాల పంతులు కాశీపతి ని... అర్జెంట్ గా ఓ కాకి' అంటూ ఆగి సోమయాజితో ‘ఒకటా... రెండా...’ అంటూ అడిగాడు.

సోమయాజికి అర్ధం కాలేదు. ‘అంటే’ అన్నాడు.

‘ఒక కాకయితే అయిదొందలు. రెండయితే ఏడు వందల యాభై. రానూ పోనూ ఖర్చులు ఇవ్వాలట.’ అన్నాడు పంతులు.

‘ఒకటి చాల్లెండి' అన్నాడు సోమయాజి.

‘ఒకటి చాలు. వెంటనే తీసుకురా. పది నిముషాల్లో కాకితో సహా నువ్విక్కడ వుండాలి. ఆ... ఆ... ఇక్కడే.’ అంటూ సెల్ ఫోన్ ఆపి ‘ఇంకో పావుగంటలో కాకి వస్తుంది. ఈ లోగా వడ్డించమని చెప్పండి.’ అన్నాడు పంతులు.

‘కాకి ముట్టిన తర్వాతే వడ్డన' అంది బామ్మ.

‘అమ్మా ఇరవయ్ నిముషాల్లో కాకి ముట్టుకుంటుంది. నాది గ్యారంటీ... కాకపోతే కాకి విషయంలో నా కమీషను యాభై రూపాయలు కాదనకూడదు.’ అన్నాడు పంతులు.

అందరూ అరవటం మానేసి రోడ్ మీద చూస్తున్నారు. కాకి కోసం.

పది నిముషాల్లో ఆటో వచ్చి ఆగింది.

అందులోంచి చేతిలో ముసుగు వేసిన వస్తువుతో దిగాడు కామేశం.

అందరూ కామేశం చేతిలో వున్న దాన్ని చూస్తున్నారు.

‘అదిగో కాకి కామేశం వచ్చాడు... కాకీ వచ్చింది.' అన్నాడు పంతులు.

కామేశం లోపలికి వచ్చాడు.

‘ఏమిటి ఆలస్యం’ అడిగాడు కామేశం పంతులుని.

‘నాదేం లేదు నీదే ఆలస్యం' అన్నాడు పంతులు.

‘అయితే కానీ’ అంటూ ముసుగు తీసాడు. ఓ పెద్ద పంజరం. రెండు అరలున్నాయి. ఓ అర ఖాళీగా వుంది మరో అరలో కాకి వుంది.

అందరూ ఆశ్చర్యపోయారు.

కామేశం పంజరం తలుపు తీసాడు.

‘సోమయాజిగారు... ఆ పిండాల్ని పంజరంలో పెట్టండి.’ అన్నాడు పంతులు.

సోమయాజి అరటాకుతో సహా పిండాల్ని పంజరం మొదటి అరలో పెట్టాడు.

కామేశం పంజరం తలుపు మూసేసి. రెండో అర తలుపుని పైకి లాగాడు.

అందరూ అలాగే చూస్తున్నారు.

కాకి కామేశం వంక చూసింది.

కామేశం తల అడ్డంగా వూపాడు.

కాకి పిండాలు ముట్టుకోలేదు.

అందరూ ఆశ్చర్యపోయారు.

బామ్మకూడా చూస్తోంది.

‘బామ్మా... ఏమయింది... కాకి ముట్టుకోవడంలేదు.’ అడిగాడు రామ సోమయాజి

‘మీ తాతకి కోపం వచ్చిందిరా.’ అంది బామ్మ.

‘తాతయ్యా... త్వరగా తిను... మా అందరికి ఆకలేస్తోంది' అన్నాడు రామ సోమయాజి

‘ఏంటి పంతులుగారు ఏమయింది కాకి ముట్టుకోవడం లేదు' అడిగాడు సోమయాజి

‘మీ అమ్మ గారన్నట్టు మీ నాన్న గారికి నీ మీద కోపం వచ్చి వుంటుంది.’ అన్నాడు పంతులు.

‘నాన్నా... ఏంటిది... ఏమైంది. నీ కోసం అయిదొందలు ఖర్చు పెట్టి పిలిపించాను. ఇంకా ఏంటి? అన్నాడు కాకితో సోమయాజి. కామేశాన్ని చూసి ‘ఏమయింది కామేశం గారు' అడిగాడు సోమయాజి

‘మీ నాన్న గారికి తీరని కోరికలేమన్నా వున్నాయేమో’ అన్నాడు కామేశం.

‘అవునండి... మా నాన్న గారికి ఓ కోరిక వుంది. ఆయనకి సావిత్రిని పెళ్లి చేసుకోవాలని వుండేది. లవ్ లెటర్ కూడా రాసానని నాకోసారి చెప్పారు. అలా ఆయన కోరిక తీరలేదు’ అన్నాడు సోమయాజి.

‘ఆ విషయం నాకెప్పుడూ చెప్ప లేదే' అన్నారు బామ్మ గారు ఆశ్చర్యంగా.

‘బావుందమ్మా ఆయన లవ్ స్టోరీ మీకెందుకు చెబుతారు. చెబితే మట్టుకు మీరు వూరుకుంటారా... అందుకే అబ్బాయికి చెప్పి వుంటారు. ఏం సోమయాజి గారు’ అన్నాడు పంతులు.

‘నాన్నా... నీ కోరిక తీరేది కాదు. ఎందుకంటే నువ్వూ పోయావు. ఆ సావిత్రి కూడా చనిపోయింది.’ అన్నాడు సోమయాజి కాకితో

‘వాళ్ళిద్దరూ పైన కలుసుకునే వుంటారు... అది కాదు గాని ఇంకోటి ఏదయినా వుందేమో ఆలోచించండి.’ అన్నాడు కామేశం.

‘నాకు తెలిసి ఏమీ లేవు. నాన్నా నీకేమన్నా కోరికలుంటే నాకు గాని, అమ్మకి గాని కలలోకనిపించి చెప్పు తీరుస్తాం. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. అందరూ ఆకలి తో కేకలు వేస్తున్నారు. తిను’ అన్నాడు సోమయాజి.

‘ఆ... ఈ ఎడ్జెస్ట్మెంటు బాగుంది. దోష నివారణార్ధం దక్షిణ ఇవ్వండి’ అన్నాడు కామేశం.

‘నాన్నా... కామేశం గారికి వెయ్యి రూపాయలు ఇస్తా తిను' అన్నాడు కాకితో సోమయాజి.

కాకి మళ్ళీ కామేశం వంక చూసింది.

కామేశం తల అడ్డంగా వూపాడు.

కాకి పిండాలు ముట్టుకోలేదు.

‘దోషానికి సరిపోలేదేమో' అన్నాడు పంతులు’.

నాన్నా పదిహేను వందలు ఇస్తాను. తిను అన్నాడు సోమయాజి

కాకి మళ్ళీ కామేశం వంక చూసింది.

కామేశం తల నిలువుగా వూపాడు.

ఆకలి మీద వున్న కాకి పిండాల్ని ఆబగా తినేసింది.

అందరూ ఆనంద పడ్డారు.

‘బామ్మా... తాతయ్య కోపం పోయిందే ... తినేసాడు' అన్నాడు రామ సోమయాజి బామ్మతో.

‘అవున్రా కన్నా’ అంది బామ్మ

‘కామేశం గారూ మీరు కూడా భోజనమే చేసి వెళ్ళండి' అన్నాడు సోమయాజి

‘అమ్మా ఇక బ్రాహ్మలకి వడ్డించండి' అన్నాడు పంతులు.

*****


బ్రాహ్మల భోజనాలు అయ్యాయి. మిగిలిన వాళ్ళు తింటున్నారు.

సోమయాజి పంతులుగారికి తాంబూలంలో అయిదువేల నూట పదహారులు ఇచ్చి కాళ్ళకి దండం పెట్టాడు.

‘అయ్యా మీ బోటి వాళ్ళు వుండబట్టి... ఇంకా ధర్మం నిలబడింది.’ అంటూ తీసుకుని దీవించి కాకి కమీషను యాభై ఇవ్వాలి.’ అన్నాడు పంతులు.

సోమయాజి పంతులుకి యాభై రూపాయలు ఇచ్చి,

‘కామేశం గారూ... ఇవిగో ఈ అయిదు వందలు ఈ కాకికి, ఈ పదిహేను వందలు మా నాన్న కోరికకి. ఈ రెండు వందలు మీ రాను పోను ఖర్చులు. ఈ మూడొందలు మీ సంభావన. అంటూ రెండు వేల ఐదు వందలు ఇచ్చాడు సోమయాజి.

‘మహా ప్రసాదం’ అంటూ తీసుకున్నాడు కామేశం.

కాకిని పంజరం లో సర్దుకుంటున్నాడు కామేశం.

కామేశం ‘అయ్యా ఎవరి తద్దినాని కయినా కాకి కావాలంటే నాకు ఫోన్ చెయ్యండి. ఇదిగో నా విజటింగు కార్డు’ అంటూ విజిటింగు కార్డు ఇచ్చాడు సోమయాజికి.

సోమయాజి చూసి చదివాడు. ‘కా కా సర్వీసెస్.’ అంటే అడిగాడు.

‘కా కా అంటే కానుపు నుంచి కాటి వరకు అంటే పురుడు, పుణ్యవచనం, బారసాల, అన్నప్రాసన, అక్షరాభ్యాం, వడుగు, పెళ్లి, చావు, మాసికం, తద్దినం వరకు ఎం కావాల్నా సామానులతో సహా సప్లయి చేస్తాం.’ అన్నాడు కామేశం.

‘మీ పని బాగుందండి’ అన్నాడు సోమయాజి పదిహేను వందలూ గుర్తుకువచ్చి.

‘నాదే ముందండి... అంతా ఈ కాకిదే కాకిని నమ్ముకుని బతుకుతున్నా’. అన్నాడు కామేశం.

‘కాకిని నమ్ముకుని కాదు. కాకిని అమ్ముకుని బతుకుతున్నారు. అవునూ... కాకి కామేశం అంటే మీ ఇంటిపేరు కాకివారా? అడిగాడు సోమయాజి.

‘కాదండి బాబూ... కూటి కోసం కోటి విద్యలని మంత్రాలు రాని నాకు మా అన్నయ్య కో ఐడియా వచ్చి, ఖాళీ గా వున్న నాకు ఇలా ఓ పంజరం, నాలుగు కాకులు ఇచ్చాడు. దాంతో నాపేరు కాసుల కామేశ్వరరావు కాస్తా... కాకి కామేశంగా మారిపోయింది. అన్నాడు కామేశం.

‘బాగుందండి... బ్రతకడానికో బ్రతుకు తెరువు కావాలిగా. ఇంతకీ మీ అన్నయ్య ఎవరు? అడిగాడు సోమయాజి.

‘ఇంకెవరు... ఇంతవరకు మీ తండ్రి గారి తద్దినం పెట్టించిన ఆ కాసుల కాశీపతే’ అంటూ పంతుల్ని చూపించాడు.

‘అవునండి... వాడికి మంత్రాలు సరిగ్గా అబ్బలేదు. ఇదివరకు హైదరాబాద్ నిండా ఫుల్ గా చెట్లు వుండేవి. ఇప్పడు ఆ చెట్లు అన్నీ నరికి కాకులకి కూడా చోటు లేకుండా కనిపించిన ఖాళీ స్థలాల్లో ఇళ్లు కట్టేశారు. దాంతో కాకులు వాలడానికి చెట్లెక్కడున్నాయి. ఎవడయినా పీనాసి వాడిని చూస్తే ఈ వెధవ ఎంగిలి చేత్తో కాని తోలడు... అనే వారు. అంటే కాకులు ఎంగిలి మెతుకులు తిని బతుకుతాయని కదా అర్ధం. మరి ఇప్పుడు వంటింట్లో మనం వాష్ బేసిన్ లో చెయ్యి కడగటం. దాంతో ఆ ఎంగిలి మెతుకులు కాస్తా డ్రైనేజి గోట్టాలలోకి పోయి అవికూడా వాటికి కరువయ్యాయి. దాంతో కాకులన్నీ సిటీ వదిలి పల్లెలకి పారిపోయాయి.

అందుకే తద్దినాలకి కాకులు దొరకటం లేదు. సిటీలో కాకులకి కరువొచ్చింది. కనబడకుండా పోయాయి’. అన్నాడు పంతులు.

అంతా విన్న బామ్మ గారు ‘ఇదిగో పంతులు పంజరం లో కాకిని పెట్టుకుని తద్దినాలు పెట్టించడం కాదు. ఇలా తద్దినాలు పెట్టించిన ప్రతీ చోట నాలుగు మొక్కలు నాటించు. రేపు నువ్వు పోయాకా... నీ పిండం తినడానికి నాలుగు కాకులయినా వస్తాయి.’ అన్నారు.

అందరూ నవ్వారు.

దాంతో పంతులు కళ్ళముందు కాకులు తిరిగాయి.

(చెట్లు నరికి ఇళ్ళూ... పెద్ద పెద్ద భవనాలు కట్టడంతో కొన్నాళ్ళకి పట్టాణాలన్నీ కాంక్రీట్ జంగిల్ గా మారి సిటీల్లో ఏ పక్షులు కనబడవు. పక్షులని చూడాలంటే ఏ జూ పార్క్ కో... పచ్చదనం... పంట పోలాలు వుండే పల్లెలకో వెళ్ళాలి. అందుకని చెట్లని పెంచుదాం. పక్షులని కాపాడుదాం.)

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ