పాపం పిన్నిగారు - కర్రా నాగలక్ష్మి

papam pinnigaru

"తెల్లారి బండెక్కే హడావుడి లో దిండు కిందవి తీసుకోడం మరిచానక్కయ్యా, కాస్త తీసి బీరువాలో దాయండేం, పై నెల వస్తా కదా, అప్పుడు తీసుకుంటాలెండి" ఆఖరు తోటి కోడలు సెల్ లో విన్నపం.

దీనికిదో మాయ రోగం రాత్రి పడుక్కునేటప్పుడు మంగళ సూత్రాల గొలుసు వాటితో పాటు సందర్బాన్ని బట్టి ఒకటో రెండో గొలుసులు వీటికి కాపలాగా ఉంగరాలు నిద్ర పోయే ముందు తీసి దిండు కిందన పెట్టుకొని నిద్ర పోవడం అలవాటు. తన యిల్లయినా వేరే వాళ్ల యిల్లయినా యిదే తంతు. యెన్ని సార్లు యెంత మంది చెప్పినా వినే రకం కాదని చెప్పడం మానేసాం.

పై నెలలో వస్తానన్న మాట మాత్రం నాకు చెవులలో అమృతం పోసినట్లయింది. ఈ సారి ముందుగా వస్తామని చెప్పింది కాబట్టి నాకు కావలసిన డ్రస్సులు తెప్పించుకోడానికి వీలవుతుంది.

ఎప్పుడూ అకస్మాత్తుగా దిగి పోవడం అనుకోలేదక్కయ్యా, బుజ్జి ముండ కలలో కనిపిస్తే తత్కాల్ లో టిక్కెట్టు తీసుకొని బయలుదేరాసా అనడం అలవాటు.

బుజ్జి ముండ అంటే పెళ్లీడు కొచ్చిన వాళ్ల మేన కోడలు లెండి. వెళ్లేటప్పుడు మాత్రం ఆవకాయలు, కందిపొడి, కరివేపాకు పొడి యిల్లంతా వెతికి మరీ పట్టుకు పోతుంది. ఈ సారి దాని వస్తువులకు కాపలా కాస్తున్నాను కాబట్టి తప్పకుండా నే చెప్పేవన్నీ తెస్తుంది అని నాకో పెద్ద నమ్మకం.

అందుకే ఓ పది రోజులు పోయేకా మా తోటి కోడలు ప్రయాణం వున్నట్లు నిర్ధారణ చేసుకొని నా లిస్టు చెప్పబోయేను.

"చావు కొస్తూ కొత్త బట్టలు అవీ తేకూడదుగా అక్కయ్యా" అన్న మాటతో ఆలోచనలో పడ్డా. నాకు తెలిసినంత వరకు యీ మధ్యన వారింట్లో యెలాంటి అశుభాలూ జరగ లేదు. అలాగని యివాళో రేపో అనే కేసులూ లేవు. మరి మా తోటి కోడలు అలా యెందుకందో తలకాయ బద్దలు కొట్టుకున్నా అర్ధం కాలే.

కొన్ని రోజుల తరవాత ఓ రోజు పొద్దున్నే ఫోను మధ్యాహ్నం బండిలో తిన్నగా వెళిపోతున్నదట, తన వస్తువులు పాత బట్టలో కట్టి స్టేషనులో అందజెయ్యమని సారాంశం. వచ్చినట్టుగా కూడా సమాచారం లేదు, అప్పుడే వెళ్లి పోతోంది కూడా. మధ్యాహ్నం బండి దగ్గరకి వెళ్లి ఆమె వస్తువులనందజేసి విషయం అడుగుదామనుకొనే లోపలే ఆమే "ఇప్పుడు మా అక్క నెల్లాళ్లు వుంటదండి, మా చెల్లి నెల్లాళ్లు వుంటదండి, ఆ పైన నెల్లాళ్లు నా డ్యూటీ అండి. కన్న తల్లికి ఆ పాటి సేవ చేసుకోవాలి గదండి. లేకపోతే తల్లి ఋణం యెట్టా తీరుద్దండి. అయ్యో పాపం, కిందటి నెలలో చూసినపుడు చుక్కలా వుంది కదా, యింతలోనే యేమయుందీ చెప్మా, అయినా వాన రాకడా ప్రాణం పోకడా యెవరు చెప్పగలరు.
యాభయ్యవ యేడు రాక ముందే రాత్రి నిద్దుర లోనే కన్ను మూసిన మా అమ్మ గుర్తొచ్చి కళ్లు చెమ్మగిల్లేయి. వంతులు వేసుకొని మరీ తల్లి కి సేవ చేసుకుంటున్న మా తోటి కోడలిని, ఆమె అక్క చెల్లెళ్ల ని చూస్తే ముచ్చటేసింది. ఇంతకు ముందు 'తింగరబుచ్చిలని' వారికి నామకరణం చేసిన నా సంస్కారాన్ని అసహ్యించుకున్నాను. నాలుగు స్వాంతన వాక్యాలు మాట్లాడి ఆవిడకి వచ్చిన జబ్బేమిటి? అని ఆరాగా అడిగేను.
"తెలీందండి" డిగ్రీ చదువుకున్న మా తోటికోడలి నోటి వెంట వచ్చిన మాట అది.

"డాక్టరు యే జబ్బన్నారూ" యీసారి ప్రశ్నని మార్చి అడిగేను.

"ఏ మనడానికీ మేం చూపించనిదే"

హయ్యో తింగరబుచ్చి యేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా అని మనసులోనే అనుకొని తింగరబుచ్చి అనే మాట వాడినందుకు లెంపలు వాయించుకొని, "ఒకరి తర్వాత వొకరు సేవ చేసుకోడం యేమిటీ" అని బయటికి అన్నాను.

"మూడు నెలల కంటే యెక్కవ బతకదు కదండీ మా అమ్మ "మా తోటికోడలి మాట యింకా పూర్తి కానేలేదు. బండి మెల్లగా కదలడం మొదలు పెట్టింది. మా తోటికోడలి చెయ్యి నా చేతిలోకి తీసుకొని గట్టిగా నొక్కి వీడ్కోలు చెప్పేను.

మూడు నెలల తరవాత మా తోటికోడలు అమ్మగారికి సేవ చేసుకోడానికి వచ్చింది. ఈ మధ్యలో వీలయినప్పుడల్లా ఆవిడకి వచ్చిన జబ్బేమిటో తెలుసుకోడానికి శత విధాలా ప్రయత్నించి విఫలమయేను.

జబ్బేమిటీ అంటే తెలీదంటుంది, డాక్టరుకి చూపించేరా అంటే లేదంటుంది, యెన్నాళ్ళో బతకదు కదా అంటుంది. నా కైతే యేమీ అర్ధం అయేది కాదు.

మా తోటి కోడలి సేవ పూర్తవగానే వాళ్ల అక్క తల్లి గారి సేవకి వచ్చింది.

నాకైతే ఆ అక్క చెల్లెళ్లని చూస్తుంటే మనసు నిండిపోయేది. ఆ తల్లి యే జన్మలోనో చేసుకున్న పుణ్యమే ఆమెకు యిలాంటి మాణిక్యాలని కూతుళ్లగా యిచ్చిందని పదేపదే అనిపించ సాగింది.

నేనైతే మా అమ్మకి యిలా సేవ చెయ్య గలిగి వుందునా? అని ప్రశ్నించుకుంటే, చెయ్య లేను అనే సమాధానం వచ్చేది. అందుకే నాకు మా తోటికోడలు వాళ్ల అక్క చెల్లెళ్లంటే అమాంతం గౌరవం పెరిగి పోయింది. భారతరత్న పురస్కారం నా చేతిలో కనక వుండుంటే వాళ్ల చేతుల్లో పెట్టెద్దును.

ఈ మధ్యన నేను యెవరితో మాట్లాడుతున్నా పది వాక్యాలైనా వీళ్ల గురించి వుండి తీరుతున్నాయి. మా మరిది పెళ్లిలో వారికి తింగరబుచ్చిలని బిరుదు ప్రదానం చేసిన మావారు మాత్రం నాతో యేకీభవించటం లేదు. నేను కూడా నా శక్తి వంచన లేకుండా మావారి అభిప్రాయం తప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తూనే వున్నాను.

మరో నెల గడిచింది. పాపం పెద్దామె యెలా వుందో అనే బెంగ నాకెక్కువ కాసాగింది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుక్కొని వరకు ఆమె ధ్యానమే కాసాగింది నాకు.

పదే పదే మా తోటికోడలుకి ఫోను చేసి పెద్దావిడ ఆరోగ్యం గురించి వాకబు చెయ్యసాగేను.

ఈ మధ్యన "పిన్నిగారు కులాసానా చెల్లాయ్" అనగానే, "యింకా బతికే వుందండి, మూడు నెలలలో పోవలసివ మనిషి, యేడాదయినా పోదేంటండి, యెప్పుడు పోతుందంటారూ?" అని నన్నే ప్రశ్నిస్తోంది.

"మందులు పనిచేసేయోమో, అస్తమానం యింకా పోలేదు అనకు" అంటున్న నన్ను అడ్డుకొని "యేంటండీ మీ కంటికి మా వంశం రోగిష్టి వంశంలా కనిపిస్తోందా? మాకేం రోగాలు లేవండి, మేమెందుకు మందులేసుకుంటామండీ" అని యేకధాటిన పది నిముషాలు చెరిగి పారేసి టక్కున ఫోను ఆఫ్ చేసింది.

పిన్నిగారి పరిస్థితి యెలా వుందో అని నాకు బెంగగా అనిపించ సాగింది.

నా బాధ చూడలేని మా ఆయన "పోనీ ఓ సారి చూసి రాకూడదూ? నీ బెంగా తీరుతుంది, పెద్ద తరహాగా పరమార్శించినట్లూ వుంటుంది" అనడం తో మర్నాడే ప్రయాణం కట్టేను.

మేమున్న వూరు నుంచి మా తోటికోడలు పుట్టిల్లు ఓ గంట ప్రయాణం, పొద్దున్న వెళ్లి సాయంత్రానికి వచ్చెయొచ్చు. మా వారు అన్నంత వరకు నాకు తట్టక పోయినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. అక్కడకి చేరేక యెందుకిక్కడకి వచ్చేనా అని విచారిస్తానని అప్పుడు నాకు తెలీదు, తెలిస్తే పొరపాటున కూడా వెళ్లక పోయుందును.

మా వారు ఆఫీసు నుంచి వచ్చేంత వరకు యెలా ఆపుకున్నానో నాకే తెలీదు. ఆయన్ని చూడగానే ఒక్కసారి బేర్ మన్నాను. మావారికి మరోలా అర్ధమైనట్టుంది, అందరికీ కబుర్లు వెళ్లాయా? అని ప్రశ్న మీద ప్రశ్న వెయ్యసాగేరు.

అతన్ని అడ్డుకోడం నా ప్రధమ కర్తవ్యం అని తెలిసింది అందుకే " పిన్నగారికేం నిక్షేపంలా వున్నారు, తింగరబుచ్చిలకే దాపురించింది మాయరోగం. గురువు గారి రూపంలో" అన్నాను.

"మణులూ మాణిక్యాలూ తింగరబుచ్చిలుగా మారిపోయారా? నేనంటే వొప్పుకొనే దానివి కాదుగానీ"

"ఇప్పుడు నాకళ్లతో నేను చూసేకా తెలిసొచ్చింది లెండి"

"ఆ కహానీ యేదో మాకూ వినిపిస్తె విని తరిస్తాం"

"సరే అయితే మహానుభావా వినండి" అని ఆ రోజు జరిగిన విషయం వివరించ సాగేను.

రెండు మూడు రకాల పళ్లు తీసుకొని వాళ్లింటికి బయలు దేరేను, మనసులో యింట్లో అడుగు పెట్టగానే యేమి చూడవలసి వస్తుందో అని భయపడుతూనే వున్నాను.

"అమ్మలూ ఇందిర తోటికోడలొచ్చిందే, కాఫీ కలుపు తల్లీ " అన్న పిన్నిగారి మాటలకి నాకు ప్రాణం లేచొచ్చింది, భయపడుతున్నట్టుగా యేమీ యెదురవలేదని" కాఫీ కలిపి తెచ్చింది ఇందిర అక్క.

తల్లి కిచ్చిన గ్లాసు మళ్లా లాక్కుని "చచ్చేదానికి నీకెందుకే యింత కాఫీ" అని సగం తన గ్లాసులో వంపుకు తాగేసింది. అమ్మలు అన్న మాటలకి నాకే యేదోగా అనిపించింది, అలాంటిది పెద్దావిడకి యెలా అనిపించిందో అని ఆమె వైపు చూసేను.

"మాయాదారి కూతుళ్లమ్మా, బతికుండగా పిడికెడు ముద్ద పెట్టడానికి దిక్కు లేదుగాని చచ్చేకా పిండివంటలు చాకలాడికి పెడతానన్నాడుట వెనుకటికి వొకడు , అలా వుందమ్మా వీళ్ల తంతు, చచ్చేదానికి నీకెందుకు చీరలూ అని నీ తోటికోడలు అన్ని చీరలూ చక్కా పట్టుకు పోయిందమ్మా" అందుకా యీసారి తిన్నగా ప్రయాణం అయింది.

"ఏదో పెద్దదాన్ని చూడ్డానికి వచ్చిన వాళ్లు కాయో పండో తెచ్చేరే అనుకో, నా చెతిలో ఒక బద్ద వేస్తే ఒట్టు, చచ్చి పోయేదానివి నీకెందుకే పళ్లు అని వాళ్లే తినేస్తున్నారే"

పిన్నిగారి మాటలతో ఊహకి వాస్తవానికి వున్న వ్యత్యాసం తెలుస్తోంది. పెద్దవయసు కదా, తమ సంసారాన్ని, పిల్లలని పక్కన పెట్టి తనని కనిపెట్టుకొని వున్న కూతుళ్లని సరిగ్గా అర్ధం చేసుకోలేదని అనిపించి" అది కాదు పిన్ని గారూ, డాక్టరు యివన్నీ తినకూడదన్నాడేమో.... " నా మాట యింకా పూర్తి కానేలేదు.

"ఏ డాక్టరు, యెవరు తీసుకెళ్లారు, గుండ్రాయిలా వున్నాను, నాకేం రోగం, మాయరోగం పట్టింది వీళ్లకి, యీ వయసులో పగలు యేదో కాస్త యెక్కువ నిద్ర వస్తోందమ్మా, రాత్రయితే సరేసరి . నేను నిద్రపోవడం ఆలస్యం ప్రతీ గంటకో అరగంటకో కుదిపి కుదిపి లేపి 'యింకా బతికే వున్నావూ' అని అంటున్నారే అమ్మలూ. అంతే కాదు ఫోనులో యింకా బతికే వుందే, రేపు చచ్చిపోతుందేమో' అని మాట్లాడుకోడం, యేమైనా బావుందా? ఆ మధ్యన ముగ్గురు కూడి నా నగలు నేను బతికుండగానే పంచేసుకున్నారే, పెద్దింట్లో పుట్టినదాన్ని జ్ఞానం వచ్చినప్పటినుంచి యెప్పుడూ బోసి మెడతో గాని బోసి చేతులతో గాని వుండలేదమ్మా యిప్పుడు వీరి ధర్మమా అని యిదిగో యిలా ముష్టిదానిలా బతుకుతున్నానమ్మా"

ఔను నిజమే యెప్పుడూ వొంటినిండా నగలు పెట్టుకొని, పట్టు బట్టలు కట్టుకొనే తిరిగేది. ఇప్పుడు యీస్థితిలో ఆవిడని చూడలేక పోయేను.
మనిషి కాస్త వాడినట్లు వుంది గాని ప్రాణం పోయేంత జబ్బేమీ వున్నట్లుగా లేదు. అడిగితే నాకేం రోగం అంటుంది యీవిడ, వాళ్లనడిగితే యెక్కువ కాలం బతకదు కదా? అంటారు, జబ్బేవిటీ అంటే యేమీలేదంటారు. ఇంక నోరు మూసుకొని వుండడం నావల్ల కాలేదు.

"పదండి పిన్నిగారూ, మా మరిది ఫ్రెండు పక్క టౌనులో డాక్టరుగా సొంత నర్సింగ్ హోమ్ నడుపుతున్నాడు. మంచి హస్తవాసి గలవాడని పేరు తెచ్చుకున్నాడు" అని కారులో యెక్కించుకున్నాను.

"అమ్మా వెళ్లకే, యేక్సిడెంటయి చచ్చిపోతావే" అని అమ్మలు తల్లికి అడ్డం పడి శోకాలు పెట్టసాగింది.

"ఇదమ్మా వరస, స్నానం చెయ్యడానికి వెళితే లోన గడియ వెయ్యకూ, లోన చచ్చిపోతే నిన్ను బయటకు తియ్యడం కష్టం అంటారు, యెక్కిళ్లొస్తే యీ యెక్కిళ్లతో పోతావేమో అంటారు. పవర్ కట్టయి చెమట పడితే వెంటనే మిగతా వాళ్లకి ఫోను చేసి 'అమ్మకి చెమట పోసిందే హార్ట్ ఎటాక్ వచ్చిందేమో' యేమైనా అయితే నేను మళ్లా ఫోను చేస్తా అంటుంది. పెరట్లో చెట్టుకింద చాప పరుచుకుని కూర్చోడం అలవాటే అమ్మా, చెట్టు కొమ్మ విరిగి పడి చస్తావు వెళ్లకు అంటారు. గుడికి పోయి రామా కృష్ణా అనుకుందాం అంటే యిదిగో చూసావుగా యిదీ తంతు. ముగ్గురక్క చెల్లెళ్లకూ యేదో పిచ్చి పట్టినట్టుంది, క్షణ క్షణం నన్ను చంపుతున్నారు"

మాటలలోనే రమేష్ నర్సింగ్ హోమ్ చేరుకున్నాం, పరీక్షలు చేసిన రమేష్ పిన్ని గారికి మరో పదేళ్ళ వరకు యెటువంటి ఢోకా లేదని చెప్పేడు.
మేం యిల్లు చేరే సరికి యిరుగు పొరుగు శోకాలు పెడుతున్న అమ్మలుకి సపర్యలు చేస్తున్నారు.

నా వెనకాలే దిగుతున్న పిన్నిగారిని పలకరించి ఆమెకేమీ కాలేదని తెలుసుకుని యెవరింటికి వారు వెళ్లేరు. అమ్మలు గబగబా సెల్ లో యెవరితోనో "అమ్మ బతికేవుందేవ్, చావలే....." అని చెప్తోంది.

ఆ మాటలు నా చెవిన పడగానే కోపం కట్టలు తెంచుకుంది ఆమె చేతిలో ఫోను లాక్కొని ఛడామడా తిట్టిపారేసేను, డాక్టర్ రమేష్ మాటలు యధాతథం గా చెప్పి మీ అమ్మ పోతారని మీకే డాక్టరు చెప్పేడో చెప్పండి వాడి సర్టిఫికేట్ కేన్సిల్ చేయిస్తానని గట్టిగా అరిచేను.

"డాక్టరు చెప్పేడని మీకెవరు చెప్పారూ" దీర్ఘం తీస్తూ తాపీగా అంది అమ్మలు.

"చిలక జోస్యంవాడు చెప్పేడా?"

"అదేంటండీ మా గురువు గారిని చిలక జోస్యం వాడు అంటారూ, యింత వరకు మా యింట్లో అతను చెప్పిందల్లా జరిగిందండి. మరలాంటప్పుడు యిది కూడా జరుగుతుంది కదండి"

వీధికొక బాబా, రోడ్డుకొక గురువు పుట్టుకొస్తున్న యీ కాలంలో యిలాంటి అమాయకులని వాళ్ల బారి నుంచి కాపాడడం యెవరితరం?
నాకు మళ్లా పిచ్చి కోపం వచ్చింది "గురువంటే యేదో నలుగురికీ పనికొచ్చే మాటలు చెప్పాలిగాని, యెన్నాళ్లలో చావొస్తుందో చెప్పే గురువులు కూడా వున్నారా? యిలా రోజూ మీ అమ్మని టార్చర్ పెట్టేబదులు తారీఖు సమయం కూడా అతనినే అడగవలసింది కదా?" అన్నాను.
నా కోపం చూసి భయపడిందో యేమో నీళ్లు నములుతూ నంగి నంగి గా " అంటే గురువు గారు డైరెక్ట్ గా అనలేదు గాని....."
ఆ నంగితనం చూస్తే గురువు గారు మరేదో చెప్తే యీ తింగరమేళం యింకోలా అర్ధం చేసుకుందేమో అనే అనుమానం నాకు మొదటి సారి కలిగింది. అది నిజమేనని ఋజువు పరిచేయి అమ్మలు మాటలు. విషయం యేంటంటే యీ మధ్య చాలా మందికి పట్టుకున్నట్లే వీళ్లకి కూడా పట్టుకుంది బాబాల పిచ్చి. నయాపైసా పెట్టుబడి లేని వ్యాపారం కోట్లలో ఆర్జన, అందుకే ప్రతీ పనికి మాలిన వాడూ కాషాయం కట్టేయడం, మూర్ఖ జనాలకి మూడు నామాలు పెట్టేయడం అలవాటుగా చేసుకున్న బాబాలు ఆహార్యం లో వైవిధ్యం చూపించడమే కాదు మాటలలో కూడా చూపిస్తూ వుంటారు. దీవెనల విషయం లో అయితే మరీనూ, పౌరాణిక సినిమాల లోని భాషను అనుకరిస్తూ వయసును బట్టి ఓ దీవెన ఫిక్స్ చేసుకొని ఉపయోగించేస్తూ జనాలను బురిడీ కొట్టిస్తారు.

ఆ బాబా గారి వైవిధ్యం చూపాలనే అత్యుత్సాహమే పిన్నిగారి కొంప ముంచింది. అదే ..... పిన్నిగారిని బాబాగారు పెద్దావిడ అనే వుద్దేశ్యం తోనో లేక తన భాషా పటిమని చూపించాలనే దుగ్ధ తోనో 'కైవల్య ప్రాప్తి రస్తు' అని దీవించేరు.

చని పోతేనే కదా కైవల్యం ప్రాప్తిస్తుంది కాబట్టి మా అమ్మ చని పోతుంది అనేది వీళ్లు యిచ్చుకున్న నిర్వచనం. చని పోతే కైవల్యం ప్రాప్తిస్తుందో లేదో నాకు తెలీదు గాని బతికుండగా క్షణక్షణం నరకం మాత్రం యిల లోనే అనుభవిస్తోంది పాపం పిన్ని గారు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న