బ్యాంకులో డబ్బు డ్రా చేసుకొని బ్యాంకుకు ఎదురుగా వున్నా టీ కొట్టు లోకి వచ్చాడు ప్రభాకర్.
“ఒక టీ ఇవ్వు” అన్నాడు టీ కొట్టు రాజయ్యతో. “బాబు, ఇప్పుడే ఆకు వేసాను, ఒక్క రెండు నిముషాలు ఆగండి” అన్నాడు రాజయ్య.
ఇంతలో ఫ్లాస్క్ రాజయ్య చేతికిస్తూ ఆరు కప్పుల టీ పోయమన్నాడు ఎదురుగా వుండే బ్యాంకు అటెండర్ మోహన్. ఒక్క నిముషం బాబు టీ ఇప్పుడే మరుగుతుంది అన్నాడు రాజయ్య. “ఏంటి రాజయ్య మీ అబ్బాయి శేఖరం వచ్చినట్టున్నాడే?” అన్నాడు మోహన్.
“అవును అంకుల్ నిన్ననే వచ్చాను. నాకు క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ వచ్చింది. వచ్చే వారమే హైదరాబాద్ వెళ్లి జాబ్ లో చేరాలి. అందుకే ఒక వారం అమ్మా నాన్నల దగ్గర ఉండి పోదామని వచ్చాను” అన్నాడు శేఖరం.
“చాలా సంతోషం బాబు నీవు చేతికి వస్తే మీ నాన్న కష్టాలు తీరుతాయి. ఇక మీ అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి. ఇక పై నీవే నీ చదువు కోసం మీ నాన్న బ్యాంకులో చేసిన అప్పు తీర్చాలి అది నీ భాద్యత.” అన్నాడు మోహన్. “అలాగే అంకుల్..” అన్నాడు శేఖరం.
“ బాబు ఆ రోజు బ్యాంకు మేనేజర్ గారు, మీరు పూనుకొని మా వాడికి చదువుకోవటానికి అప్పు ఇచ్చారు కాబట్టే మా వాడు ఈ రోజు ప్రయోజకుడు అయ్యాడు. వాణ్ణి చదివించడం తండ్రిగా నా బాధ్యత, కానీ అందుకు తగిన ఆర్థిక స్తోమత నాకు లేక పొతే బ్యాంకు వారు సరైన సమయంలో ఆదుకున్నారు. మా వాడి చదువు కోసం చేసిన అప్పు నా శరీరం సహకరించే వరకు నేనే తీరుస్తాను” అన్నాడు రాజయ్య.
“ మీలో మీ మాటలేనా టీ ఇచ్చేదేమైన వుందా?” కాస్త అసహనంతో అన్నాడు ప్రభాకర్. “అయ్యో మాటల్లో పడి మరిచి పోయాను...” అంటూ టీని కప్పులో పోసి ప్రభాకర్ కు అందిస్తుంటే రాజయ్య చెయ్యి జారి కప్పులో టీ ప్రభాకర్ బట్టలపై పడింది.
“ ఛీ... ఛీ... కొడుకు చేతికోచ్చాడో లేదో కళ్ళు నెత్తికి వచ్చేసాయి, బంగారం లాంటి చొక్కా నాశనం చేసాడు” అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు ప్రభాకర్.
“ ఏంటి రాజయ్య ఆయన అన్ని మాటలంటే వురుకున్నావు.. ఇందాక డబ్బులివ్వడంలో కాస్త ఆలస్యం అయ్యిందని బ్యాంకు మేనేజర్ గారితో కూడా చాలా కోపంగా మాట్లాడాడు. మా మేనేజర్ గారు కూడా నీలానే మౌనంగా నవ్వేసి ఊరుకున్నాడు” అన్నాడు మోహన్.
“అవును నాన్న ఆయన అలా మాట్లాడి వెళుతుంటే నీవు సైలెంట్ గా వుండటం నాకు కూడా నచ్చలేదు.” అన్నాడు శేఖరం.
రాజయ్య మాత్రం నవ్వుతూనే మౌనంగా టీ వలికిపోయిన చోట బట్టతో శుభ్రం చేస్తున్నాడు. ఇంతలో ప్రభాకర్ కుర్చోన్న చోట ఒక సంచి కనపడింది రాజయ్యకు.
“అరెరె పాపం ఆ పెద్దాయన ఖంగారులో సంచి మరిచిపోయినట్టున్నాడే” అన్నాడు రాజయ్య. మోహన్, శేఖరం ఇద్దరు రాజయ్య దగ్గరకు వచ్చి సంచి తెరచి చూసారు. సంచిలో బ్యాంకు పాస్ పుస్తకం, పెళ్లి శుభలేఖలు, 6 లక్షల డబ్బులున్నాయి.
“ ఆ పెద్దాయనకు తగిన శాస్తి జరిగింది. లేకపోతే మేనేజర్ గారిని, నిన్ను అన్ని మాటలంటాడ!. భగవంతుడు బాగానే శిక్ష వేసాడు. రాజయ్య నీవు మారు ఆలోచించకుండా ఈ డబ్బు తీసుకొని వెళ్లి మీ వాడి అప్పు తీర్చేసెయ్.” అన్నాడు మోహన్.
“ చూడు బాబు నీకు ఈ డబ్బుతో నాకు తీరిపోయే అప్పు కనపడుతుంది. నాకు మాత్రం ఒక అమ్మాయి జీవితం కనపడుతుంది. ఈ సంచిలో వున్న శుభలేఖలను బట్టి చుస్తే ఆ పెద్దాయన వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం డబ్బులు తీసినట్టుగా వుంది. రేపు అమ్మాయి పెళ్లి డబ్బు లేక ఆగిపోతే ఆ పాపం నాకు, నా కుటుంబానికి చుట్టుకొంటుంది. నేను కేవలం నా శరీర కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటాను అంతే కానీ అన్యక్రాంతంగా వచ్చేది ఏది నాకు అవసరంలేదు.” అని చెప్పి ఆ పెద్దాయన బ్యాగు తీసుకొని తన సైకిల్ పై వెళ్ళిపోయాడు రాజయ్య.
బ్యాంకు పాసు బుక్కులో వున్న అడ్రస్ ఆధారంగా ప్రభాకర్ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు రాజయ్య. లోపలి నుంచి వచ్చి తలుపు తీసిన అమ్మాయి కళ్ళు తుడుచుకుంటూ ఎవరు కావాలని అడిగింది.
“ప్రభాకర్ బాబు గారు వున్నారా?” అని అడిగాడు రాజయ్య.
“లేడు బయటకు వెళ్ళాడు?” అని చెప్పింది ఆ అమ్మాయి. “ఇదిగోమ్మ ఇందాక మీ నాన్నగారు నా టీకొట్టులో ఈ బ్యాగు మరిచిపోయాడు” అంటూ బ్యాగు ఆ అమ్మాయికి ఇచ్చేసి తన సైకిల్ పై తిరుగు ప్రయాణం అయ్యాడు రాజయ్య.
****
మరుసటి రోజు టీ కొట్టులో టీ కలుపుతున్న రాజయ్య తన కొట్టు ముందు ఆటో ఆగడంతో దగ్గరకు వెళ్లి చూసాడు. అటో లోనుంచి ప్రభాకర్, అతని భార్య, అతని కూతురు దిగారు. “ రాజయ్య, నీవు చేసిన మేలు ఈ జన్మలో మరిచిపోలేము. నీవుగాని డబ్బు ఇవ్వకుంటే మా అమ్మాయి పెళ్లి ఆగి పోయేది . మెదటి శుభలేఖ భగవంతుడికి ఇవ్వటం ఆనవాయితీ. మా కుటుంబానికి నీవే భగవంతుడివి. అందుకే కుటుంబమంతా కలిసి మొదటి శుభలేఖను నీకే ఇస్తున్నాము అంటూ పత్రికను అందచేసి నమస్కారం చేసాడు ప్రభాకర్.
“బాబు నేను అంత గొప్ప వాడిని కాదు” అంటూ అందుకున్న శుభలేఖను రాజయ్య ఏడుకొండల వాని ఫోటో దగ్గర ఉంచాడు.