అద్దె గర్భం - పోడూరి వెంకటరమణ శర్మ

addegarbham

పెళ్లి హడావిడి అయిపోయి అన్ని తతంగాలూ పూర్తి అయి ఆఖరి ఘట్టం అప్పగింతలు జరుగుతోంది. దూరంగా కూర్చుని నారాయణ అందరినీ గమనిస్తున్నాడు. అతని స్నేహితుడు కళ్యాణ్ కూతురు జలజ పెళ్లికి అతను రావడం అనుకోకుండా జరిగింది. అతను గత ఇరవయి సంవత్సరాల నుంచీ ఆస్ట్రేలియా లోనే ఉంటున్నాడు . స్వగ్రామం లో ఉన్న ఆస్తులు అమ్మేయడానికి అతని అన్నలిద్దరూ నిర్ణయించి రెజిస్ట్రేషన్ కోసం అతన్ని రమ్మన్నారు. కాకతాళీయంగా అతని స్నేహితుడు కళ్యాణ్ కూతురు పెళ్లి కూడా అదే సమయం లో జరుపుతూ ఉండడంతో పెళ్ళికి వచ్చాడు.

అతనికి కళ్యాణ్ కుటుంబంతో ఒక ప్రత్యేకమయిన అనుబంధం ఉంది. అందుకే పెళ్ళికి వచ్చి, వాళ్ళతో రెండు రోజులు గడపడానికి కూడా అదే కారణం.

జలజ విషయం కళ్యాణ్ భార్య నీరజకి ఇప్పుడయినా చెప్పడం మంచిదా కాదా అన్న ద్వైదీభావనలో అతని మనసు కొట్టుకులాడుతోంది.
అప్పగింతలు కార్యక్రమం మీద కళ్ళు ఉన్నా, అతని మనసు గతం లోకి వెళ్లి పోయింది

*****

కళ్యాణ్, నారాయణ చిన్నప్పటి నుంచీ స్నేహితులు. కాలేజీ తరువాత యూనివర్సిటీ లో కూడా కలిసి చదివారు. మనస్తత్వాలలో భిన్న ధృవాలయినా వారి మధ్య స్నేహానికి మాత్రం ఆటంకం లేదు. కళ్యాణ్ చదువుకునే రోజుల నుంచీ అమ్మాయిల విషయం లో అనవసరమయిన చొరవ ఎక్కువ చూపుతూ ఉండేవాడు. సందర్భాన్ని కల్పించుకుని అమ్మాయిలతో మాట్లాడడం, పరిచయాలు పెంచుకోవడం జరుగుతూ ఉండేది. నారాయణ అతనికి చెబుతూనే ఉండేవాడు. అప్పుడప్పుడు అవి బెడిసి కొడతాయని. అతని సలహా కళ్యాణ్ మీద ఏమీ ప్రభావం చూపక పోగా, ప్రతి బుధవారం యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ కు హాజరయి ఎవరో ఒకరితో బీచ్ షికార్లు చేసే వాడు. పెళ్లి చేసుకుని సెటిల్ అయితే అది తగ్గుతుందేమొ అని సరిపెట్టుకున్నాడు నారాయణ.

ఇద్దరూ కెమిస్త్రీ లో డాక్టరేట్లు కాబట్టి, హైదరాబాద్ లో స్టాండర్డ్ డ్రగ్స్ అనే ఓక ప్రముఖ మందుల కంపెనీ లో రిసెర్చి భాగం లో పెద్ద జీతాలతోనే చేరారు. అమ్మాయిల విషయం లో చూపే చొరవ కారణం గానే ఒక సైన్సు కాన్ఫరెన్సులో నీరజ తో పరిచయం, కళ్యాణ్ కు ఆమెతో పేళ్ళి దాకా దారితీసింది. నారాయణకి వనజ తో పెళ్లి తరువాత ఇరు కుటుంబాలు పక్క పక్కనే ఉండేవారు. నారాయణకు ఇద్దరు పిల్లలు వెంట వెంటనే కలగడం మామూలు గా జరిగి పోయినా, కళ్యాణ్ మాత్రం పిల్లలు కలగడం విషయం లో పెద్ద సమస్య ఎదుర్కోవలిసి వచ్చింది. చిన్న శారీరక లోపం వల్ల, నీరజ గర్భం ధరించినా నిలవడం కష్టమయి పోయేది. పెద్ద పెద్ద డాక్టర్లు పర్యవేక్షించినా అయిదు సంవత్సరాలలో నాలుగు విఫలమవడంతో, నీరజ ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్ల సలహా మేరకు ప్రయత్నాలు విరమించుకున్నారు. నీరజకి పిల్లలంటే ఉన్న ఇష్టం తలుచుకుని , నారాయణ అతని భార్య వనజ తరుచు విచారిస్తూ ఉండేవారు.

కళ్యాణ్, నారాయణ లు పని చేసే కంపెనీకి ఒక ఇంటర్నేషనల్ సంస్థ నుంచి గంజాయి యొక్క కేన్సర్ నిరోధక శక్తి పరిశోదించే నిమిత్తం ఢిల్లీ లో ఇంకో కంపెనీతో కలిసి ఫండింగ్ లభిస్తే , వీళ్ళిద్దరినే ఢిల్లీ కంపెనీకి రెండు సంవత్సరాలు డిప్యూటేషన్ మీద వెళ్ళ మన్నారు. సరిగ్గా అదే సమయంలో నీరజ తల్లికి కేన్సర్ అని ధ్రువీకరించడం జరిగింది. తల్లి తండ్రులకి నీరజ ఒక్కత్తే కూతురు. తల్లికి సహాయం కోసం, అవసరమయితే హైదరాబాద్ ట్రీట్మెంట్ కి తీసుకురావడానికి ఆమె వైజాగ్ వెళ్ళింది. కళ్యాణ్ ఒక్కడే నారాయణ వాళ్లతో ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ కూడా కంపెనీ ఇచ్చిన అపార్టుమెంట్లలో పక్క పక్కనే ఉండేవారు.

ఢిల్లీ కంపెనీ లో పని చేస్తున్న రీసెర్చ్ అసిస్టెంట్ పంజాబీ అమ్మాయి అంకిత తో కళ్యాణ్ పరిచయం పెంచుకున్నాడు. అతనికి ఉన్న బలహీనతకి ఒంటరితనం తోడయి ఆమె అతని అపార్ట్మెంట్ కి తరుచు రావడం గమనించారు నారాయణ దంపతులు. నీరజ తల్లిని తీసుకుని ట్రీట్మెంట్ కు వెల్లూరు వెళ్లడంతో ఢిల్లీకి రావడం కుదరలేదు.

ఇంచుమించు ఏడాది అయిన తరువాత ఒక రోజు కళ్యాణ్ అపార్టుమెంట్లో పెద్దగా గొడవ ఎదో అవుతుంటే నారాయణ హడావిడి గా వెళ్ళాడు. అక్కడ నలుగురు అయిదుగురు పంజాబీలు కళ్యాణ్ తో గట్టిగా గొడవ పడడం జరుగుతోంది. ఒక పక్క అంకిత ఏడుస్తూ కూర్చుంది. వాళ్ళు చాలా వయొలెంట్ గా ఉన్నారు. కళ్యాణ్ తోనూ, వాళ్ళతోనూ మాట్లాడి నారాయణ విషయం తెలుసు కున్నాడు. అంకిత గర్భవతి అయింది. వాళ్ళ వాళ్ళకి తెలిసి కళ్యాణ్ ని నిలదీశారు. ఆమెని వివాహం చేసుకు తీరాలని, లేక పోతే కళ్యాణ్ కి ఎటువంటి హాని జరుగుతుందో చెప్పం అన్నారు. కళ్యాణ్ వివాహితుడని వాళ్ళకి వివరించినా వాళ్ళు విన లేదు. అంకిత కానీ, వాళ్ళు కానీ అబార్షన్ కి ఒప్పుకోలేదు. ఆ స్టేజి దాటి పోయిందని డాక్టర్లు చెప్పడం కూడా కొంత కారణం. చట్ట పరమయిన సమస్యలు వస్తే తరువాత చూసుకోవచ్చని నారాయణ, కళ్యాణ్ కు అంకితని పెళ్లి చేసుకోవడం తప్ప గత్యంతరం లేదని గ్రహించి , రిజిస్టర్డ్ మ్యారేజ్ కి ఏర్పాటు చేస్తానని వాళ్లకి మాట ఇచ్చి సర్ది చెప్పాడు. ఆ తరువాత అలాగే చేయ వలిసి వచ్చింది. ఈ సంగతి నీరజకి ఎలా చెప్పా లా అన్న విషయం అప్పట్లో వాళ్ళు ఆలోచించ లేదు. ఆమె కూడా తల్లితో ఉండి పోవడంతో అప్పటికి ఆ సమస్యని వాయిదా వేశారు. ఈ మధ్యలో ఇవేమీ జరగనట్టు , కళ్యాణ్ వెల్లూరు వెళ్లి అత్త గారిని, భార్యనీ చూసి వచ్చాడు.

అయిదు నెలల తరువాత ఆ సమస్యని భగవంతుడు మరోలా తీర్చాడు. ఒక ఆడ బిడ్డకి జన్మనిచ్చి అంకిత కళ్ళు మూసింది. అంకిత తాలూకు పంజాబీ వాళ్ళు ఆ పసి గుడ్డు గురించి పట్టించుకోలేదు. ఒక నర్సు ని పెట్టుకుని నారాయణ దంపతుల సహాయంతో కళ్యాణ్ నెట్టుకు వస్తున్నాడు.. అంకిత డెలివరీకి ఒక నెల ముందు, కళ్యాణ్ అత్తగారు చనిపోవడం తో , నీరజ తన తండ్రిని తీసుకుని హైదెరాబాదు వచ్చేసింది.

నారాయణ, తన భార్య వనజ తో కళ్యాణ్ కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటె అతనికి ఒక ఆలోచన మెరిసింది. ఆమెకి చెప్పడంతో ఆమె కూడా అదే మంచిదని సలహా ఇచ్చింది. అది ఆచరణ లో పెట్టాలంటే రెండు విషయాలు జరగాలి అని అనుకున్నాడు నారాయణ. కళ్యాణ్ తో ఏమీ చెప్పకుండా స్వంత పని ఉందని చెప్పి అతను హైదరాబాద్ వచ్చాడు. మొదట తాము పనిచేస్తున్న స్టాండర్డ్ డ్రగ్స్ కు వెళ్లి, హెచ్ ఆర్ హెడ్ ని కలిసి కళ్యాణ్ వ్యక్తి గత సమస్యలలో ఉన్నాడని, చెప్ప వలసిన మటుకు చెప్పి అతనిని వెనక్కి రప్పించి అతనికి బదులుగా ఇంకొకరిని పంపమన్నాడు.

అందుకు ఆయన అంగీకరించాడు. వెంఠనే కళ్యాణ్ అపార్ట్ మెంట్ కి వచ్చాడు నీరజని కలవడానికి . అనుకోకుండా వచ్చిన నారాయణ ని చూసి నీరజ ఆశ్చర్య పోయింది.

ఆమె తల్లి మరణానికి సానుభూతి తెలిపాడు నారాయణ. పలకరింపులు అవీ అయిన తరువాత నీరజ అడిగింది. కళ్యాణ్ రాలేదేమని?
అప్పుడెప్పుడో కొన్న స్థలాలకి లే అవుట్ అప్రూవల్స్ తీసుకో లేదనీ, గడువు లోపల ధరఖాస్తులు ఇవ్వడానికి ఒక్క రోజుకు తానొక్కడినే వచ్చానని చెప్పాడు.

' ఆమె తెచ్చి ఇచ్చిన కాఫీ తాగుతూ " మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. మీ అభిప్రాయం తెలుసుకున్న తరువాతే కళ్యాణ్ తో మాట్లాడుతాను '' అన్నాడు

" ఏ విషయం ? ఆయనతో కాకుండా నాతో మాట్లాడేది ?" ఆమె కొంచెం ఆశ్చర్య పోయి అంది

" విషయం అలాంటిది లెండి. వివరిస్తాను. . రెండు నెలల క్రితం నేను మంగళూరు వెళ్ళాను. మాకంపెనీ కి సంబంధించిన కొన్ని రసాయనాలు అక్కడ పోర్ట్ నుంచి కలెక్ట్ చేసుకోవడానికి. వాటిని అక్కడకక్కడ పరీక్షించి తీసుకోవాలి కాబట్టి నన్ను పంపారు. అక్కడ రెండు రోజులు ఉండ వలిసి వచ్చింది. నాకు వసతి అదీ చూడడానికి అక్కడ పోర్టులో పని చేసే ఒక అసిస్టెంట్ కి అప్ప చెప్పారు. రెండు రోజులలోఅతను బాగా దగ్గర అయ్యాడు. దాని ఫలితంగా అతను వ్యక్తిగత విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అతనికి వరుసగా నలుగురు పిల్లలు. ఇద్దరు మగా ఇద్దరు ఆడ. ఇక ఆపేద్దామనుకుంటూ ఉంటె మళ్ళీ అతని భార్య గర్భం దాల్చింది. అప్పటికే ఆర్థికంగా చాలా కష్టం గా ఉండడం వల్ల, ఈ మాటు పుట్టబోయే బిడ్డని ఎవరయినా పెంచుకుంటే ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నారు. ఎక్కడయినా ఆ బిడ్డ సుఖంగా ఉంటె చాలు అనుకుని అలా నిర్ణయించుకున్నారట. నాతో కూడా ఆ విషయం చెప్పి ఎవరయినా కావలసిన వాళ్ళు ఉంటె నన్ను చెప్ప మన్నాడు. నాకు అప్పుడు ఏమీ తట్టక అలాగే అని చెప్పి వచ్చేశాను.

రెండు నెలల తరవాత రెండో విడత సరుకు కోసం మళ్ళీ వెళ్ళినప్పుడు అతను మళ్ళీ చెప్పాడు. ఓక నెల అయిందనీ ఆడ పిల్ల పుట్టిందనీ. ఆడ అయినా మగ అయినా ఇద్దామనుకున్న విషయం చెప్పి ఒక కోరిక కోరాడు. తాము మధ్వులమనీ, ఎవరైనా బ్రాహ్మణులకి ఇవ్వాలని తన భార్య కోరుతోందని చెప్పాడు. పిల్ల పుట్టక ముందు ఒప్పుకున్నా, పుట్టిన తరువాత ఆమె చాలా వెనకాడిందట నిర్ణయం అమలు చేయడానికి. కానీ తమకి ఉన్న పరిస్థితులలో, ఎక్కడయినా ఆ పిల్ల ఆనందంగా పెరిగితే ఆనందమే కదా అని నచ్చ చెబితే ఒప్పుకుందని చెప్పాడు. మొదట సారి మంగళూరు వెళ్ళినప్పుడు అతను చెప్పినవిషయం నాకు పెద్దగా బుర్రకి ఎక్క లేదు. కానీ రెండో మాటు వెళ్ళినప్పుడు అతను, తాము మధ్వులమని చెప్పిన వెంఠనే మీరు నా మనసులో మెదిలారు. మీరు కూడా మధ్వులే కదా. కానీ మీతో మాట్లాడకుండా కళ్యాణ్ తో నేను మాట్లాడదలుచుకోలేదు. అందుకే అక్కడి నుంచి రాగానే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తున్నాను. మీరు ఒప్పుకుంటే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. కళ్యాణ్ కి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేక పోతే కళ్యాణ్ తో మాట్లాడండి. ఆ తరువాత వ్యవహారం నేను చూస్తాను" అని ముగించాడు నారాయణ

అతను ఒక్క మాటు అలా అడిగేటప్పటికీ నీరజకి ఏమి చెప్పాలో తెలియలేదు. అంత వరకూ అటువంటి ఆలోచన ఆమెలో ఎప్పుడూ కలగలేదు. అతని మాటలు వినగానే ఆమె లో రెండు పరస్పర విరుద్ధ భావాలు ఒక్క మాటు దాడి చేశాయి. తనకి పిల్లలు వద్దు అన్నవిషయం అదివరకే నిర్ణయించుకున్నా, ఆ విషయం మరొక్క మారు మనసులో రేగి బాధించింది, కానీ ఆ భావాన్ని ఒక పసి గుడ్డు తన పాలనకు ఎక్కడో రెడీ గా ఉంది అన్న భావన ఆమెని ఆనందం తో ఉక్కిరి బిక్కిరి చేసింది.

" చాలా పెద్ద నిర్ణయం కదా, రాత్రే ఆయన తో మాట్లాడతాను. మీకు ఆలోచించి చెబుతాము' అంది అతని తో పైకి.
ఎప్పటికీ అసలు తల్లి తండ్రులకి పిల్లని ఎవరికీ ఇచ్చినది తెలియదనీ. అటువంటి ఒప్పందంతోనే పిల్లని తీసుకోవడం జరుగుతుందనీ వివరించాడు నారాయణ.

సాయంత్రానికి ఢిల్లీ వెళ్లిన వెంఠనే నారాయణ, కళ్యాణ్ ని కలిసి తాను చేసిన రెండు పనులూ చెప్పి, రాత్రి నీరజ మాట్లాడినప్పుడు అంగీకారం తెలిపితే. అతని సమస్య పరిష్కార మైనట్టేనని చెప్పాడు.

నారాయణ హైద్రాబాద్ వెళ్లి చేసిన రెండు పనుల ప్రభావం పూర్త్తి గా అవగాహన లోకి రాగానే, కళ్యాణ్ మనసులో నారాయణ పట్ల కృతజ్ఞతా భావం నిండి పోయింది. సరయిన మిత్రుడు ఎటువంటి సహాయం చేయగలడో అతనికి అవగత మయింది.

ఆ తరువాత పిల్లని తీసుకుని కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లి పోవడం, ఇంటర్నేషనల్ కోలాబొరేటర్, నారాయణ ని ఆస్ట్రేలియాలో వేరే ప్రోజక్ట్ కి రీసెర్చ్ హెడ్ గా తీసుకోవడం తో అతను అక్కడికి వెళ్లి పోవడం వెంట వెంట నే జరిగి పోయాయి. కళ్యాణ్ పిల్లకి జలజ అని నామకరణం చేసుకున్నామని, నీరజ కి జలజ తోనే ప్రపంచంగా ఉందనీ మొదలయిన విషయాలు మెయిల్ లో చెబుతూ ఉండేవాడు. ఎప్పుడయినా ఇండియా వచ్చినప్పుడు కళ్యాణ్ దంపతులని కలిసి, వెళ్లడం జరుగుతూ ఉండేది.

****

జలజని అత్త వారింటికి పంపించి నారాయణ కూర్చున్న చోటికి వచ్చింది నీరజ. ఆలోచనలో పడి ఆమె రావడం గుర్తించనే లేదు నారాయణ.
'కళ్యాణ్ ఏడీ" అన్నాడు ఆమె విచార వదనం కేసి చూస్తూ

"వాళ్ళని దించడానికి స్టేషన్ కి వెళ్లారు. నా కంటే ఆయనే ఎక్కువ ఫీల్ అవుతున్నారు అది పెళ్లయి వెడుతోంటే " అంది ఆమె కళ్ళు తుడుచుకుంటూ.

"మీకో విషయం చెప్పాలని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. విషయం విని మీరు నన్ను క్షమించాలి" అన్నాడు ఉపోద్ఘాతంగా..

" ఏ విషయం" అంది ఆమె

"అదే జలజ పుట్టుక విషయం"

" తల్లి తండ్రులు మంగుళూరు లో ఉంటారు అన్నారు గదా ?"

" తల్లి విషయం అటుంచండి. తండ్రి మాత్రం కళ్యాణె" అన్నాడు పెద్ద రహస్యాన్ని బయట పెట్టె స్వరం తో ఆమె గ్రహించిందా అన్నట్టు చూస్తూ..
అతను అనుకున్నట్టు ఆమె పెద్దగా ఆశ్చర్యం కనపరచక పోవడంతో ఆమె కి అర్థం కాలేదేమో అనుకున్నాడు.

" మళ్ళీ చెప్పాడు.. నేను మీకు చెప్పినట్టు జలజ తల్లి తండ్రులు మంగుళూరు లో ఎవరూ లేరు. జలజ అసలు తండ్రి కళ్యాణే. " అన్నాడు ఇంకొంచెం వివరించి..

" మీరు కథ బాగానే అల్లారు. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు". అంది ఆమె నవ్వుతూ..

" అదేమిటి కళ్యాణ్ చెప్పాడా?" అన్నాడు ఆశ్చర్య పోతూ..

" ఆయన ఏమీ చెప్ప లేదు. దానికి నాలుగు ఏళ్ళు వచ్చేటప్పటికి నేను దాని అసలు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి నాకు అట్టే సమయం పట్టలేదు. చాలా విషయాలలో అది వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడి పడింది" అప్పుడే నిలతీద్దామను కున్నాను. కానీ ఎందుకో నాకు అలా అనిపించ లేదు. ఎందుకంటే జలజ ని తెచ్చుకున్న తరువాత కళ్యాణ్ లో చాలా మార్పు వచ్చింది. అతని కి లేడీస్ విషయం లో ఉన్న చపలత్వం నాకు తెలుసు. మా పెళ్ళికి కూడా అదే కారణం కదా? కానీ జలజ వచ్చిన తరువాత అతనిలో ఆ విషయం లో చాలా మార్పు వచ్చింది. ఆ విషయం లో అంత క్రితం నాకున్న ఇన్ సెక్యూరిటీ పోయింది. అందుకని ఎందుకో నాకు జలజ విషయంలో అతనిని నిలతీయాలని అనిపించలేదు. మీరు అద్దె గర్భం సంగతి దాచి మీరు కథ అల్లారని నేను ఎప్పుడో గ్రహించాను.

నారాయణ ఇది ఊహించ లేదు. ఆమె జలజ అద్దె గర్భం ద్వారా పుట్టిందని అనుకుంటోంది. ఇది బాగానే ఉంది ఇప్పుడు మాత్రం స్నేహితుడిని బయట పెట్టడం ఎందుకు అనుకున్నాడు. తండ్రి అతడే అని గ్రహించింది. చాలు అనుకున్నాడు "

" నువ్వు భలే పట్టేశావే" అని న్వవ్వి, వెళ్ళే ముందు మళ్ళీ వస్తానని చెప్పి వచ్చేశాడు..

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న