బస్సులో వృద్ధులు,ముసలివారు మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు .అప్పటికే కొంత మంది ఫుట్ బోర్డు మీద వ్రేలాడుతున్నారు. బస్సు నడుపుతున్న డ్రైవర్ మధు ఒక్క సారిగా బ్రేక్ వేసి నిలిపాడు."అందరూ లోనికి వస్తేనే బస్సు నడుపుతాను .ఏదైనా ప్రమాదం జరిగిందంటే మమ్మల్ని ప్రశ్నిస్తారు " అన్నాడు డ్రైవర్ మధు.
"కాస్తా సర్దుకొని వెళ్లారంటే లోనికి వస్తాము"ఫుట్ బోర్డు మీద నిలుచున్న వ్యక్తి గట్టిగా అన్నాడు.ఒక్కరిలోనూ చలనం లేదు .
"ఎక్కడ స్థలం ఉంది. ఇప్పటికే ఒక కాలు మీద నిలబడి ప్రయాణం చేయవలసి వస్తోంది"చిరాకుతో ఒక మహిళా గట్టిగా అంది
"బాబూ డ్రైవర్ ప్రభుత్వం ఎన్ని బస్సులు వేసినా దానికి తగ్గట్టే ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మీరెంత చెప్పినా ఎవరూ వినే స్థితిలో లేరు. వచ్చే స్టాపింగ్ నందు చాలా వరకు దిగిపోతారు, బస్సు బయలు దేరితే బాగుంటుందనుకొంటాను "మర్యాద పూర్వకంగా అంటున్న అతని మాటలు మధు నందు ఆలోచింపచేసింది..అతను చెప్పింది న్యాయమే అనుకొంటూ బస్సు మెల్లగా నడుపుతూ వేగం పెంచాడు.
ఆ స్టాపింగ్ నందు బస్సు నిలబడగానే చాలా మంది దిగడం ప్రారంభించారు.
"బాబూ డ్రైవర్,చాలా థాంక్స్ అండీ నా మాటకు విలువ ఇచ్చి బండిఅక్కడే నిలపకుండా నడిపారు. ప్రయాణికులు సర్దుబాటు చేసుకొంటే ఫుట్ బోర్డు మీద నిలబడే పనే ఉండదు. కొందరు కష్టపడి నిలబడి ఉండటం చూసాను, మరికొందరు సుఖంగా నిలబడిఉండటం గమనించాను. వీళ్ళలో మార్పు ఎప్పుడు వస్తుందో. వస్తాను బాబూ..."అంతో మరొక్కసారి చేతులు జోడించి వెళ్ళాడు.
‘డ్రైవర్ల ఒత్తిడి తగ్గగించడానికి ఇలాంటి ప్రయాణికులు చల్లని మాటలతో సహాయం చేస్తారు 'మనసులో అనుకూన్నాడు మధుసూదన్.
అతను చెప్పిన విధంగానే బుస్సునందు ప్రయాణికులు చాలా మంది దిగిపోయారు.మొత్తం మీద ఇద్దరే నిలబడి ఉన్నారు.కండక్టర్ విజిల్ ఊదగానే బస్సు నడపసాగాడు.మరి కొంతదూరంలో ఒక వృద్ధుడు చేయి ఊపడంతో బస్సు నిలిపాడు.ఇక్కడ ఎందుకు నిలిపాడా అని కిటికీ నుండి తొంగి చూసి ఆ వృద్ధుణ్ని చూడగానే కండక్టర్ ఏమీ మాట్లాడ లేదు. ఆ వృద్ధుడు బస్సులోకి ప్రవేశించి కంబీ పట్టుకొని నిలబడి ఎవరైనా కూర్చొనడానికి సీటు ఇస్తారా అని వృద్ధుడు చూడసాగాడు. ఎవరూ పట్టించుకోలేదు. డ్రైవర్ మధు బస్సు వేగం తగ్గించి వెనుక వైపు చూస్తూ “ఎవరైనా ఆ పెద్దాయనకు సీటు ఇవ్వండి” అన్నాడు.
అతని మాటలు ఎవరూ లెక్క చెయ్యలేదు.కూర్చొన్న వారిలో సగం మంది మధ్యవయస్కులు. అందులో చాలామంది డ్రైవర్ మాటలు వినపడనట్లు సెల్ ఫోన్ వీడియో నందు లీనమైనట్లు నటించసాగారు.
మధు ఒక్క సారిగా బస్సు నిలిపి తన సీటు నుండి లేచి నిలబడి అందరి వైపు కోపంగా చూడసాగాడు.జరుగుతున్నదంతా గమనిస్తున్న కండక్టర్ "మధూ ,మనం ఎవరినీ లేచి సీటు ఇవ్వు అని అడగడానికి రూల్స్ లేక పోవచ్చు. కానీ ప్రయాణికులతో మానవత్వం కరువైనప్పుడు మనమేమి చేయలేము.ఇప్పటికే నా సీటులో ఒక వృద్ధుడు కూర్చొన్నాడు."అన్నాడు.“అంటే బస్సులో కండక్టర్ కేనా మానవత్వం ఉన్నది.నాలోనూ మానవత్వం ఉంది."కోపంగా అంటూ ఆ వృద్ధుడి వైపు చూస్తూ "అన్నా, మీరు నా సీటులో కూర్చొని బస్సు నడపండి.ఏమి జరిగినా నేను బాధ్యత వహిస్తాను."అంటూ ఆ వృద్ధుణ్ని మెల్లగా నడిపించుకొంటూ కూర్చొనబెట్టబోతుంటే ప్రయాణికులతో ఒక్కసారిగా అలజడి కలిగింది.
"ఏయ్ ఏమిటి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేయవలసిన పని ఇదేనా….. వీడియో తీసి మీ అధికారులకు పంపితే మరుక్షణమే నీ ఉద్యోగం పోతుంది తెలుసా..."
“ఇద్దరు ప్రయాణికులు వీడియో తీస్తున్న సంగతి గమనించాను.కానీ ఎప్పటినుంచో మా కండక్టర్ కూడా వీడియో తీస్తున్నాడు.నేనే ఆ వీడియోను మా అధికారులకు వాట్స్ అప్ లో పంపుతాను."
"నువ్వ్వు బస్సు నడిపించాలనుకొంటే మమ్మల్ని దించవలసిన చోటు దించాక ఖాళీగా ఉన్న బస్సులో అయన చేత నడిపించుమానవత్వం మరచి .మా ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు."
"మీరందరూ అదే మానవత్వం మరచి ఆయన ప్రాణాలతో చెలగాటమాడవచ్చా ...అయన నిలబడటానికి కూడా శక్తీ లేకుండా ఉన్నారు.మెల్లగా బ్రేక్ వేసినా పడతారు . ఒక్కరికైనా సీటు ఇవ్వాలన్న ఆలోచన కలగలేదా….. ఆయన కూడా ఒకప్పుడు అంటే పదిహేను సంవత్సరాలక్రితం డ్రైవర్ పని నుండి పదవీ విరమణ పొందినవ్యక్తి.అలవాటు లేదు కాబట్టి మెల్లగా నడపమంటాను. అయన నిలబడటంకన్నా నా సీటులోకూర్చొని నడపడం వల్ల మనకు భద్రతా ఉంటుందో ఉండదో తెలీదుకానీ ఆయనకు భద్రత ఉంటుంది." అన్నాడు డ్రైవర్ మధు "మాసీటులో కూర్చో మనండి"కొందరు తలలు వంచుకొని సిగ్గుతో చెప్పారు.